మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Key Comments At Ysrcp Pac Meeting | Sakshi
Sakshi News home page

మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా: వైఎస్‌ జగన్‌

Published Tue, Apr 22 2025 10:26 AM | Last Updated on Tue, Apr 22 2025 3:19 PM

Ys Jagan Key Comments At Ysrcp Pac Meeting

గుంటూరు, సాక్షి: రాష్ట్రంలో కూటమి పాలనలో వ్యవస్థలన్నీ దిగజారుస్తున్నారని.. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ పీఏసీ సమావేశంలో కూటమి ప్రభుత్వ కక్ష రాజకీయాలపై వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. 

ముంబై నటి జత్వానీని వేధించారంటూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయుల్ని కూటమి ప్రభుత్వం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై వైఎస్‌ జగన్‌ వైఎస్సార్‌సీపీ పీఏసీ మీటింగ్‌లో స్పందించారు. ‘‘రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రజా సమస్యలు, అన్యాయాలు, అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్‌ చేస్తున్నారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఆంజనేయులును అరెస్ట్‌ చేయడం కూటమి కక్ష రాజకీయాలకు పరాకాష్ట. ఇదే కేసులో మరో ఇద్దరు పోలీస్‌ అధికారుల పట​ ప్రభుత్వ తీరును కోర్టు తప్పుబట్టింది. 

.. మొదటి సారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా. ఒక వ్యక్తిని ఇరికించడానికి కేసులు క్రియేట్‌ చేస్తున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో అర్థం కావడం లేదు. రాష్ట్రంలోని వ్యవస్థలను దిగజారస్తున్నారు. దుష్ట సంప్రదాయాలకు తెర లేపుతున్నారు. ప్రభుత్వం ఇలా పోతే రాష్ట్రంలో అరాచకం తప్ప ఏం మిగలదు. 

.. ఎంపీ మిథున్‌ రెడ్డిని(MP Mithun Reddy) కూడా టార్గెట్‌ చేశారు. ఎలాగైనా మిథున్‌రెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు. కాలేజీ రోజుల్లో చంద్రబాబును పెద్దిరెడ్డి ఎదురించారు. కాబట్టే పెద్దిరెడ్డి కుటుంబంపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారు. లేని ఆరోపణలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు. బాబు హయాంలో లిక్కర్‌ స్కాంపైనా గతంలో సీఐడీ కేసు పెట్టింది. మనం తెచ్చిన లిక్కర్‌ పాలసీ(YSRCP Liquor Policy) విప్లవాత్మకమైంది. ప్రైవేట్‌ దుకాణాలు తీసేసి ప్రభుత్వమే నిర్వహించింది.  లిక్కర్‌ అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? అమ్మకాలు పెంచితే లంచాలు ఇస్తారా? ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి..’’ అని పీఏసీ సభ్యులను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు.

‘‘విశాఖలో రూ.3వేల కోట్ల భూమిని ఊరు పేరులేని కంపెనీకి రూపాయికే కట్టబెట్టారు. లులూ గ్రూపునకు రూ.1500-2000 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టారు. రాజధానిలో నిర్మాణపు పనుల అంచనాలను విపరీతంగా పెంచి దోచేస్తున్నారు. అప్పటి రేట్లతో పోలిస్తే సిమెంటు, స్టీల్‌ రేట్లు పెరిగాయి. రూ.36వేల కోట్ల పనులను ఇప్పుడు రూ.77 వేలకు పెంచారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ తీసేశారు. మొబలైజేషన్‌ అడ్వాన్స్‌లు తీసుకు వచ్చారు. ఇంత దోపిడీని గతంలో ఎప్పుడూ చూడలేదు. గతంలో అనేకసార్లు నేను చెప్పాను. గతంలో మనం చేసినట్టుగా ఎందుకు బటన్‌లు నొక్కలేదు అని అడిగాను. బటన్‌లు నొక్కితే చంద్రబాబు లాంటివారికి ఏమీ రాదు. ప్రజల ఖాతాలకే నేరుగా వెళ్తోంది. అందుకనే చంద్రబాబు బటన్‌లు నొక్కడంలేదు.

..రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాని, దేశవ్యాప్తంగా ఆదాయాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి ఆదాయాలు పెరుగుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన ప్రజలకు సంబంధించిన సమస్య బయటకు వచ్చిందంటే, వెంటనే చంద్రబాబు డైవర్ట్‌ చేస్తున్నాడు. ఏమీలేకపోతే.. జగన్‌ మీద ఎవరో ఒకర్ని తీసుకు వచ్చి మాట్లాడిస్తున్నాడు. లేకపోతే ఎవరో ఒకర్ని అరెస్టు చేస్తున్నాడు. ప్రజల నోటిలోకి నాలుగేళ్లు ఇప్పుడు ఎందుకు పోవడంలేదు? మన ప్రభుత్వ పథకాలన్నీ ఎందుకు రద్దుచేశారు. సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ హామీలు ఏమయ్యాయి. ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తివేశారు. రూ.3500 కోట్ల బకాయిలు ఎందుకు పెట్టారు?

..ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడంలేదు. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు ఇవ్వాలి. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, వసతి దీవెన కింద రూ.3900 కోట్లు బకాయి గత ఏడాది పెట్టారు. ఇప్పుడు ఈ ఏడాది ప్రారంభమైంది. మళ్లీ ఈ ఏడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కలుపుకుంటే రూ.7వేల కోట్లకు గాను రూ.700 కోట్లు ఇచ్చాడు. ఏ రైతుకు గిట్టుబాటు ధరలేదు. పెట్టుబడి సహాయం లేదు. ఉచిత పంటల బీమా లేదు. వ్యవస్థల్లో పారదర్శకత లేదు. పెన్షన్లు నాలుగు లక్షలు తగ్గించాడు. కొత్తగా ఒక్క పెన్షన్‌ ఇచ్చింది లేదు. ఎక్కడ చూసినా రెడ్‌బుక్‌ పాలనే కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో PAC గణనీయమైన పాత్ర పోషించాల్సి ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసుకోవాలి. పార్టీ నిర్మాణంలో భాగస్వామ్యాన్ని అందించాలి. 

మొదటిసారి ఇలాంటి దుర్మార్గాలు చూస్తున్నా:  వైఎస్ జగన్

..పార్టీ అధికారంలోకి వస్తుంది.. మరింతగా ప్రజలకు సేవలందిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. పార్టీకి చెందిన ప్రతీ కార్యక్రమాన్ని మనది అనుకుని చేసుకోవాలి. అందర్నీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలి. మన పార్టీకి పెద్దగా మీడియా లేదు. టీడీపీకి పత్రికలు, అనేక ఛానళ్లు ఉన్నారు. సోషల్‌ మీడియాలో వారికి ఉన్మాదులు ఉన్నారు. అందుకనే గ్రామస్థాయిలో కార్యకర్తను తయారు చేయాలి. అన్యాయాలను ఎదిరించడానికి, ప్రజల ముందు పెట్టడానికి ఫోన్‌ అనే ఒక బ్రహ్మాండమైన సాధనాన్ని వాడుకోవాలి. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలి.

..కాంగ్రెస్‌ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు మనపై ఇప్పటి మాదిరిగానే మనపై తప్పుడు ప్రచారాలు, దుర్మార్గపు ప్రచారాలు చేశారు. కాని ప్రజలు మనల్ని నమ్మారు, ఆశీర్వదించారు. ఇప్పుడు కూడా చంద్రబాబుపై వ్యతిరేకతను మూసేయడానికి వాళ్ల మీడియా ప్రయత్నిస్తుంది. కాని ప్రజల తీర్పే అంతిమం. వాళ్లిచ్చే నిర్ణయాన్ని ఎవ్వరూ మార్చలేరు. రాష్ట్రాన్ని ఒక భయంలో పెట్టి, పాలన కొనసాగించాలన్న చంద్రబాబు నాయుడి ధోరణిపై కచ్చితంగా ప్రజలు తగిన రీతిలో స్పందిస్తారు. చంద్రబాబు పెడుతున్న కేసులకు ఏమవుతుంది? జైలుకు పంపినంత మాత్రాన ప్రజా వ్యతిరేకతను అణచివేయలేరు. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పార్టీని నడిపే పరిస్థితులు లేకుండా చేశారు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ప్రతి గ్రామంలో మన పార్టీ ఉంది. ఎవ్వరూ ఆపలేరు. ఈ ప్రభుత్వం ఎన్నికేసులు పెడితే, ప్రజలు అంతా స్పందిస్తారు.

..కలియుగంలో రాజకీయాలు ఈ రీతిలోనే ఉంటున్నాయి. కాని, భయపడి రాజకీయాలు మానుకుంటారు అనుకోవడం పొరపాటు. ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు, పన్నాగాలు తాత్కాలికం. మన పార్టీకి ఉన్న విలువలు, విశ్వసనీయత మనల్ని ముందుండి నడిపిస్తాయి. ప్రజలకు చేసిన మంచి ఇంకా ఆయా కుటుంబాల్లో బతికే ఉంది. ఈ మేరకు పీఏసీ సభ్యులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. వారిలో స్ఫూర్తిని నింపాలి. కష్టాలనుంచే నాయకులు ఎదుగుతారు. ప్రతిపక్షంలో మనం చేసే పోరాటాలను ప్రజలు గుర్తిస్తారు. ఆశీర్వదిస్తారు.  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన చేసే పోరాటాలు, ప్రజా సమస్యలపట్ల స్పందిస్తున్న తీరును ప్రజలు గుర్తిస్తారు. ఒక పార్టీకి నాయకుడిగా వారి పనితీరు కూడా నా దృష్టికి వస్తుంది. ఇంకా టైముందిలే, తర్వాత చూద్దాంలే అన్న ధోరణి వద్దు.

..పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు  స్పందిస్తే, ఆ సంకేతం పార్టీ శ్రేణులకూ వెళ్తుంది, ప్రజల్లోకి వెళ్తుంది. ఈ మూడు సంవత్సరాలు కూడా ప్రజల్లోకి ఉద్ధృతంగా వెళ్లాలి. ప్రజల తరఫున గట్టిగా ప్రశ్నించాలి.. పోరాటం చేయాలి. ఎలాంటి రాజీపడొద్దు. ప్రతి సమావేశంలోనూ అజెండాను నిర్దేశించుకుని దానిపైన డిస్కషన్‌ చేయాలి. పార్టీకి సూచనలు చేయాలి. పార్టీ ఐక్యంగా ఉండి, పార్టీ కార్యక్రమాలను బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలి. ఏ జిల్లాలో ఏ సమస్య వచ్చినా, ఆ సమస్య మనది అనుకుని దాని పరిష్కారం కోసం ప్రయత్నించాలి.  వెంటనే కమిటీలు ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి.  ఎవరో ఏదో ఆదేశాలు ఇస్తారని వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదు, ప్రజలకు అండగా ఉండడం, పార్టీని బలోపేతం చేయడం అన్నది ముఖ్యం’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement