
సాక్షి, గుంటూరు: పోసాని కృష్ణమురళిని మేజిస్ట్రేట్ ముందు సీఐడీ హాజరుపరిచింది. మేజిస్ట్రేట్ ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు. మేజిస్ట్రేట్ ముందే న్యాయవాదులతో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు.. రానన్నా. నాకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు పెడతారా?. నా మీద ఎని కేసులు పెట్టారో నాకే తెలియదు’’ అంటూ పోసాని వాపోయారు.
‘‘నన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. నేను తప్పు చేస్తే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం’’ అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పోసాని కృష్ణమురళిపై కూటమి సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ బాపట్ల పోలీస్‌స్టేషన్‌లో పోసానిపై కేసు నమోదు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను అనుమతించాలంటూ తెనాలి కోర్టులో బాపట్ల పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోసాని పీటీ వారెంట్‌ను తెనాలి కోర్టు అనుమతించింది.
కాగా, పోసాని కృష్ణమురళిపై నమోదైన అన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించింది. ఈ తరుణంలో ఆయన ఇవాళ ఆయన కర్నూలు జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో రిలీజ్‌కు బ్రేక్ పడింది. సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారంటూ పోసానిపై మరో కేసు తెరపైకి తెచ్చారు.
పోసాని కృష్ణమురళిపై మొత్తం ఏపీ వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే న్యాయస్థానాల్లో ఊరట దక్కవచ్చనే ఉద్దేశంతోనే.. వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసుకుగానూ ఆయన్ని తరలిస్తూ వచ్చారు. అలా 2 వేల కిలోమీటర్లకుపైగా తిప్పి పోసానిని హింసించారు.
అక్రమ కేసులతో వేధిస్తున్న చంద్రబాబు సర్కారు అదే రీతిలో రెడ్‌బుక్ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది.. తాము బనాయిస్తున్న అక్రమ కేసులు ఎలాగూ న్యాయస్థానాల్లో నిలబడవు కాబట్టి విచారణ పేరుతో వేధించాలని పోలీసులను పురిగొల్పుతోంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై లెక్కకు మించి అక్రమ కేసులు బనాయించింది. 67 ఏళ్ల వయసున్న పోసాని కృష్ణ మురళికి కొంతకాలం క్రితమే గుండెకు శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకు ఇతరత్రా తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment