Magistrate
-
బద్లాపూర్ కస్టడీ డెత్.. ఆ ఐదుగురే కారణం
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్‌కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్కౌంటర్లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్‌ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది. థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్‌ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్ఎస్ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది. ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు. -
సాక్షి కథనం: మానవత్వం చాటుకున్న మెజిస్ట్రేట్
సాక్షి, మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన చిట్టితల్లి నవనీత దీనస్థితికి చలించిపోయారు కోరుట్ల మెజిస్ట్రేట్ జె.శ్యామ్‌కుమార్. గురువారం చిట్టితల్లి ఇంటికి వచ్చి నోట్‌పుస్తకాలు, పెన్నులు, బ్యాగ్‌లు, పండ్లు, దుస్తులతోపాటు ఆర్థికసాయం అందించి మానవత్వం చాటుకున్నారు. దమ్మన్నపేటకు చెందిన పడకంటి నవనీత తల్లిదండ్రులను కోల్పోయింది. జూన్ 16న సాక్షి దినపత్రికలో ‘చిట్టితల్లికి ఎంతకష్టం’శీర్షికన కథనం ప్రచురితమైంది. ప్రభుత్వ న్యాయవాది కట్కం రాజేంద్రప్రసాద్ కోరుట్ల మెజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లగా చలించిన ఆయన స్వయంగా చిట్టితల్లి దగ్గరకు వచ్చి సాయం అందజేశారు. అదైర్య పడొద్దని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని చదివి ఉన్నతంగా ఎదగాలని సూచించారు. అనాథ పిల్లలకు కోర్టులు కూడా అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు. అనంతరం గ్రామానికి వచ్చిన జడ్జిని గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ కాచర్ల సురేశ్, హెచ్ఎం రాజు, పంచాయతీ కార్యదర్శి రవిరాజ్, ఉపాధ్యాయులు మురళీకృష్ణ, సత్యనారాయణ, శంకర్, అడ్లగట్ట ప్రకాశ్, బండ్ల గజానందం, బండ్ల నరేశ్ ఉన్నారు. చదవండి: చనిపోయాడనుకున్న వ్యక్తి ప్రత్యక్షమవడంతో.. -
Mariyamma Lockup Death : సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదిక
అడ్డగూడూరు/చౌటుప్పల్: మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై ఏసీపీ శ్యామ్‌ప్రసాద్ దర్యాప్తులో భాగంగా ఓఎస్డీ మల్లారెడ్డి శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. స్టేషన్లో ఉన్న లాకప్ గదులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాలు పనిచేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రెండింటిని మరమ్మతు చేయించినా ఒకటే పనిచేస్తున్నట్లు ఇన్చార్జ్ ఎస్ఐ ఉదయ్‌కిరణ్ తెలిపారు. అలాగే.. హైకోర్టు ఆదేశాల మేరకు ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎం.మణికంఠ శనివారం రాత్రి అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపారు. సీల్డ్ కవర్లో తన నివేదికను హైకోర్టుకు అందజేయనున్నారు. మరోవైపు.. చౌటుప్పల్ పోలీస్ సబ్ డివిజన్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ కమిషనర్ మహేశ్ భగవత్ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. చదవండి: వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట శాపాలు -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గాప్రసాద్‌పై హత్యాయత్నం కేసు విచారణ నిమిత్తం సోమవారం టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డిని వర్చువల్ ద్వారా ఆళ్లగడ్డ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరు పరిచారు. జనార్ధన్‌రెడ్డికి14 రోజుల రిమాండ్ విధిస్తూ కర్నూలు సబ్‌జైలుకు తరలించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. కాగా బనగానపల్లె పాత బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్‌పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్‌పై రాడ్లతో జనార్ధన్‌రెడ్డి దాడికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడైన జనార్ధన్‌రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్రగాయాల పాలైన దుర్గా ప్రసాద్ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చదవండి: Munna Gang: హైవే కిల్లర్‌తో పాటు 10 మందికి ఉరిశిక్ష -
వైరల్: జనాలపై విచక్షణారహితంగా దాడి
లక్నో: మాస్క్ డ్రైవ్ చెకింగ్‌లో భాగంగా ఓ సీనియర్ ఉద్యోగి, అతడి బృందం జనాలపై విచక్షణారహితంగా దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దాంతో సదరు సీనియర్ అధికారిపై వేటు వేశారు. ఉత్తరప్రదేశ్ బల్లియా జిల్లాలో ఈ సంఘటన జరగింది. వివరాలు.. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌదరి, అతని బృందం మాస్క్ ధరించిన ఇద్దరు వ్యక్తులను ఒక దుకాణం నుంచి బలవంతంగా బయటకు నెట్టి, కర్రలతో కొట్లారు. ఆ వ్యక్తులు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూనే.. కొట్టడానికి గల కారణం తెలపాల్సిందిగా హోం గార్డులను కోరారు. కానీ వారు ఇదేమి పట్టించుకోకుండా వ్యక్తుల మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అధికారులు బల్లియా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ చౌద్రేను పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వలు జారీ చేశారు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ వృద్ధురాలిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అధికారులు అతడిని విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. (80 ఏళ్ల వృద్ధురాలిపై దాష్టీకం) -
నేడు మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి
సాక్షి, అనంతపురం: దివాకర్ రోడ్‌లైన్స్, బీఎస్ 3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలను వన్‌టౌన్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆదివారం వన్‌టౌన్‌లో సీఐ ప్రతాప్‌రెడ్డి దాదాపుగా 40 వాహనాలకు సంబంధిన రిజిస్ట్రేషన్లపై లోతుగా విచారణ చేపట్టారు. వాహనాలను ఎక్కడ కొనుగోలు చేశారు? నాగాలాండ్‌లో ట్రక్కు వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు, తదితరాలపై తండ్రీకొడుకులపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం మెజిస్ట్రేట్ ముందు మరోసారి వీరిద్దరినీ వన్‌టౌన్ పోలీసులు హాజరుపర్చనున్నారు. కస్టడీని పొడిగించాలని కోరనున్నట్లు సమాచారం. చదవండి: కస్టడీకి జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి -
ఏడేళ్ల పోరాటానికి రూ.25 పరిహారం
ఆమె ఏడేళ్లు పోరాడింది. నష్టపరిహారంగా 25 రూపాయలు మాత్రమే కోరుకుంది! ఇంతకీ ఆమె గెలిచిందా? ఇంకెవర్నైనా గెలిపించిందా?! చీకటి పడ్డాక మన దేశంలో స్త్రీలను అరెస్ట్ చెయ్యకూడదు. అది చట్టం. చీకటి పడడం అనే మాటనే చట్టం ‘సూర్యాస్తమయం’ అంది. సూర్యాస్తమయం అయ్యాక స్త్రీలను అరెస్ట్ చెయ్యడం నేరం. పోలీసులు చేసిన అలాంటి ఒక నేరం మీద ఏడేళ్లుగా గుజరాత్ హైకోర్టులో ఒక కేసు నడుస్తోంది. చివరికి మొన్న సోమవారం తీర్పు వెలువడింది. సూర్యాస్తమయం తర్వాత అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఆ మహిళకు (కేసు వేసిన మహిళ) పోలీసులు కోర్టు ఖర్చుల నిమిత్తం 2,500 రూపాయలను పరిహారంగా చెల్లించాలని జడ్జి తీర్పు ఇచ్చారు. తర్వాత ఆ మహిళ వైపు చూసి, ‘అమ్మా.. మీకు ఆ మొత్తం సరిపోకపోతే, మరికొంత మొత్తం కోరవచ్చు’ అని సూచించారు. ‘25 రూపాయలు చాలు న్యాయమూర్తి గారూ’ అన్నారు ఆవిడ! కోర్టు హాల్లో అంతా అమెను మెచ్చుకోలుగా చూశారు. ‘సొంత ఖర్చులు పెట్టుకుని ఇంతకాలం ఆమె కేసు నడిపింది పరిహారం కోసం కాదనీ, పోలీసులైనా సరే చట్ట విరుద్ధంగా ప్రవర్తించకూడదని చెప్పడానికేనని’ తెలిసి అంతా ఆమెను అభినందించారు. ఆమె పేరు వర్షాబెన్ పటేల్. ఉంటున్నది గుజరాత్‌లోని వడోదరలో. 2012 నవంబర్ 5 రాత్రి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ ఆమె ఇంటికి వచ్చి, చీటింగ్, ఫోర్జరీ నేరారోపణలపై ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లాడు. ‘చట్ట విరుద్ధంగా (మేజిస్ట్రేట్‌కు అనుమతి తీసుకోకుండా) ఆ మహిళను అరెస్ట్ చెయ్యవలసి అవసరం ఏమిటి?’ అని దిగువ కోర్టు న్యాయమూర్తి అడిగినప్పుడు, ‘మేజిస్ట్రేట్ అందుబాటులో లేరు. వెంటనే అరెస్ట్ చెయ్యకుంటే సాక్ష్యాధారాలను ఆమె నిర్మూలించే అవకాశం ఉండడంతో అప్పటికప్పుడు ఆమెను అరెస్ట్ చెయ్యక తప్పలేదు’ అని ఇన్స్పెక్టర్ వివరణ ఇచ్చాడు. దీనిపై వర్షాబెన్ పటేల్ హైకోర్టును ఆశ్రయించారు. కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా నిరుత్సాహపడకుండా, నీరసించి పోకుండా పోరాడుతూనే ఉన్నారు. చివరికి విజయం సాధించారు. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 46(4) నిషే«ధాజ్ఞల ప్రకారం ఒక మహిళను సూర్యాస్తమయం తర్వాత గానీ, సూర్యోదయానికి ముందు గానీ.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప, అది కూడా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అరెస్ట్ చెయ్యకూడదు. ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో తను గెలవడం కన్నా, చట్టాన్ని ఓడిపోకుండా నిలబెట్టగలిగానని వర్షాబెన్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
రేప్ చేశాడని ఫిర్యాదు చేసి.. జడ్జీ ముందు..
సాక్షి, న్యూఢిల్లీ: తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేసిన ఎన్నారై మహిళ మేజిస్టేట్ ముందు మాట మార్చింది. న్యూజిల్యాండ్‌కు చెందిన ఎన్నారై మహిళ ఈశాన్య ఢిల్లీలోని మహరాణి బాగ్‌లో తనపై ఓ వ్యక్తి లైంగిక దాడి చేసిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెల 29న వ్యాపార కారణాలతో తాను అతన్ని కలిసి సమయంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని పేర్కొంది. వ్యాపార వ్యవహారాల నిమిత్తం తాను ఢిల్లీకి వచ్చానని, గత నెల 27న తాను, తన భర్త అతన్ని కలిసి డిన్నర్ చేశాడని ఫిర్యాదులో తెలిపింది. గత నెల 29న తన మహరాణి బాగ్‌లోని తన నివాసానికి డిన్నర్‌కు ఆహ్వానించాడని, హోటల్ నుంచి తనను పికప్ చేసుకొని తీసుకువెళ్లాడని, ఇంటికి వెళ్లాక డ్రింక్స్ ఇచ్చి.. ఆ తర్వాత తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. హోటల్‌కు వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి భర్తకు తెలుపడంతో ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆమె తాజాగా మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇస్తూ తనపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలను తోసిపుచ్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశామని, ఇంకా నిందితుడిని అరెస్టు చేయలేదని పోలీసులు చెప్పారు. -
ఆడపిల్ల పుట్టిందని..
భార్యకు నిప్పంటించాడు.. వారిది ప్రేమవివాహం. అమ్మాయి తరఫు వారు పెళ్లికి అంగీకరించలేదు. అయినా సరే అతడే కావాలనుకుంది ఆ యువతి. ఆ యువకుడ్నే పెళ్లి చేసుకుని తన ప్రేమను బతికించుకుంది. వారి ప్రేమకు గుర్తుగా ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. అయితే మూడో కాన్పులోనూ ఆడపిల్లకే జన్మనివ్వడంతో ఆ మృగాడు.. ఆమెను అంత మొందించాలనుకున్నాడు. గురువారం మద్యం తాగి ఇంటికొచ్చి.. తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ప్రస్తుతం ఆ మహిళ కాలిన గాయాలతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. గోరంట్ల/ హిందూపురం అర్బన్ : మూడో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చిందన్న అక్కసుతో తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించి తగలబెట్టాడో ప్రబుద్ధుడు. గోరంట్ల మండలం కళ్లితండాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలిలా ఉన్నాయి. పాలసముద్రం పంచాయతీ పుత్తూరు తండాకు చెందిన సుస్మితాబాయి కళ్లితండాకు చెందిన తిరుపాల్‌నాయక్ ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదురించి ప్రేమవివాహం చేసుకున్నారు. ఇద్దరూ కూలి పనులు చేసుకుంటూ అన్యోన్యంగా కాపురం చేసుకునేవారు. ఈ క్రమంలో వీరికి ఇద్దరు కుమార్తెలు త్రివేణిబాయి(5), కల్పనాబాయి(3) పుట్టారు. అయితే ఆడపిల్లలంటేనే గిట్టని తిరుపాల్‌నాయక్ ఆమెతో గొడవపడేవాడు. రెండు నెలల క్రితం సుస్మితాబాయి మూడో కాన్పులో కూడా ఆడపిల్లకు జన్మనిచ్చింది. నాటి నుంచి ఆ పసికందును చంపేయాలని తిరుపాల్‌నాయక్ నిత్యం పోరుపెట్టేవాడు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో భార్యను చంపాలని పథకం రూపొందించుకున్నాడు. గురువారం సాయంత్రం మద్యం సేవించి ఇంటికి వచ్చిన తిరుపాల్‌నాయక్ తన భార్యతో ఇదే విషయమై మళ్లీ గొడవపడ్డాడు. చివరికి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు మంటలు ఆర్పివేసి సుస్మితాబాయిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె శరీరం 70 శాతం కాలిపోవడంతో వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి 108లో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మెజిస్ట్రేట్ ఆమె వాగ్మూలాన్ని రికార్డు చేశారు. బాధితురాలి వివరాల మేరకు గోరంట్ల ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బెదిరింపు బెడిసికొట్టింది
నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: చావు వేళ నిజం చెబుతారన్న నమ్మకాన్ని వమ్ము చేసిందావిడ. కొనప్రాణంతో ఉన్నా నిప్పులాంటి నిజాన్ని దాచిపెట్టి మరణించింది. అయితే పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూశాయి. నాగర్‌కర్నూల్ మండలం దేశియిటిక్యాలలో గురువారం అర్థరాత్రి లక్ష్మి(30) అనుమానాస్పద స్థితిలో ఒంటికి నిప్పంటుకుని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా చికిత్స స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పోలీసులు, మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో తన ఆడబిడ్డ భర్త (వరుసకు సోదరుడు) కోరిక తీర్చలేదని, తనకు నిప్పంటించి కాల్చాడని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందింది. అయితే పోలీసుల విచారణలో మాత్రం అసలు నిజం తేలింది. తమతో తరుచూ గొడవ పడుతున్నవారిని బెదిరించేందుకు, ఈ నెపన్ని వారిపై నెట్టేందుకు మృతురాలు లక్ష్మి ఒంటిపై భర్తే కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. పోలీసుల విచారణలో భర్తే నిందితుడని తేలింది. ఇదీ భార్యాభర్తల పథకం ఈ ఘటనపై భర్త చెన్నయ్యపై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని విచారించారు. కంటతడి పెట్టుకుంటూ భర్త చెప్పిన విషయాలు అందరినీ నివ్వెరపరిచాయి. సీఐ శేఖర్‌రెడ్డి కథనం మేరకు.. మృతురాలితో ఇంటిఎదురుగా ఉండే మామ, ఆడబిడ్డ, ఆమె భర్త భర్త తరుచూ గొడవపడేవారు. కొద్దిరోజుల క్రితం జరిగిన గొడవకు సంబంధించి భర్తకు లక్ష్మి చెప్పింది. హైదరాబాద్‌లో కూలిపనులు చేసుకునే మృతురాలి భర్త చెన్నయ్య ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మామ, తదితరులను స్టేషన్‌కు పిలిపించి మందలించి వదిలేశారు. కొద్దిరోజుల క్రితం ఎలాగైనా మామ, ఆడపడుచులను తనవద్ద గొడవకు రాకుండా భయపెట్టాలని హైదరాబాద్‌కు వెళ్తున్న భర్తను లక్ష్మి కోరింది. భార్యాభర్తలు పథకం వేసుకుని కిరోసిన్ డబ్బాతో ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కేఎల్ఐ కాల్వల వద్దకు వెళ్లారు. కిరోసిన్ వాసనరాకుండా మూతికి గుడ్డ కట్టుకుంది. భార్యను కింద పడుకోబెట్టి చీర చెంగులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ నేరం తండ్రి, చెల్లి, బావమరిదిపై నెట్టేందుకు అవసరమైన సాక్షాలు సృష్టించేందుకు వారి చెప్పులను ఘటనస్థలానికి సమీపంలో పడేశారు. అయితే మృతురాలు లక్ష్మి ఒంటిపై సిల్క్ చీర ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి అంటుకున్నాయి. వాటిని ఆర్పే అవకాశం లేకపోవడంతో ఊర్లోకి పరుగెత్తుకొచ్చి బంధువులను నిద్రలేపాడు. తన భార్య కనపడటం లేదని చెప్పాడు. వెతుకుతూ సంఘటన స్థలానికి వెళ్లారు. కాలిన పరిస్థితుల్లో లక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. కాగా, తన భార్య ఎంతో అమాయకురాలని, తాను ఎలా చెబితే అలా వినేదని చెన్నయ్య చెప్పాడని, కేవలం అగ్ని ప్రమాదం సృష్టించి తమ వారిపై నెట్టి మరోసారి తన భార్యతో గొడవపడకుండా భయపెట్టాలని మాత్రమే అలా చేశానని తెలిపినట్లు సీఐ వెల్లడించారు. భర్తపై హత్యానేరం కింద కేసునమోదు చేశామని, సీఆర్పీఎస్ 164 కింద న్యాయమూర్తి వాంగ్మూలం నమోదు చేయించనున్నట్లు తెలిపారు.