నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: చావు వేళ నిజం చెబుతారన్న నమ్మకాన్ని వమ్ము చేసిందావిడ. కొనప్రాణంతో ఉన్నా నిప్పులాంటి నిజాన్ని దాచిపెట్టి మరణించింది. అయితే పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగుచూశాయి.
నాగర్‌కర్నూల్ మండలం దేశియిటిక్యాలలో గురువారం అర్థరాత్రి లక్ష్మి(30) అనుమానాస్పద స్థితిలో ఒంటికి నిప్పంటుకుని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా చికిత్స స్థానికులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పోలీసులు, మెజిస్ట్రేట్‌కు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో తన ఆడబిడ్డ భర్త (వరుసకు సోదరుడు) కోరిక తీర్చలేదని, తనకు నిప్పంటించి కాల్చాడని తెలిపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో శనివారం మృతిచెందింది. అయితే పోలీసుల విచారణలో మాత్రం అసలు నిజం తేలింది. తమతో తరుచూ గొడవ పడుతున్నవారిని బెదిరించేందుకు, ఈ నెపన్ని వారిపై నెట్టేందుకు మృతురాలు లక్ష్మి ఒంటిపై భర్తే కిరోసిన్‌పోసి నిప్పంటించాడు. పోలీసుల విచారణలో భర్తే నిందితుడని తేలింది.
ఇదీ భార్యాభర్తల పథకం
ఈ ఘటనపై భర్త చెన్నయ్యపై అనుమానం వచ్చిన పోలీసులు అతన్ని విచారించారు. కంటతడి పెట్టుకుంటూ భర్త చెప్పిన విషయాలు అందరినీ నివ్వెరపరిచాయి. సీఐ శేఖర్‌రెడ్డి కథనం మేరకు.. మృతురాలితో ఇంటిఎదురుగా ఉండే మామ, ఆడబిడ్డ, ఆమె భర్త భర్త తరుచూ గొడవపడేవారు. కొద్దిరోజుల క్రితం జరిగిన గొడవకు సంబంధించి భర్తకు లక్ష్మి చెప్పింది.
హైదరాబాద్‌లో కూలిపనులు చేసుకునే మృతురాలి భర్త చెన్నయ్య ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మామ, తదితరులను స్టేషన్‌కు పిలిపించి మందలించి వదిలేశారు. కొద్దిరోజుల క్రితం ఎలాగైనా మామ, ఆడపడుచులను తనవద్ద గొడవకు రాకుండా భయపెట్టాలని హైదరాబాద్‌కు వెళ్తున్న భర్తను లక్ష్మి కోరింది. భార్యాభర్తలు పథకం వేసుకుని కిరోసిన్ డబ్బాతో ఇంటికి కొద్ది దూరంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వల వద్దకు వెళ్లారు. కిరోసిన్ వాసనరాకుండా మూతికి గుడ్డ కట్టుకుంది. భార్యను కింద పడుకోబెట్టి చీర చెంగులపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆ నేరం తండ్రి, చెల్లి, బావమరిదిపై నెట్టేందుకు అవసరమైన సాక్షాలు సృష్టించేందుకు వారి చెప్పులను ఘటనస్థలానికి సమీపంలో పడేశారు.
అయితే మృతురాలు లక్ష్మి ఒంటిపై సిల్క్ చీర ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి అంటుకున్నాయి. వాటిని ఆర్పే అవకాశం లేకపోవడంతో ఊర్లోకి పరుగెత్తుకొచ్చి బంధువులను నిద్రలేపాడు. తన భార్య కనపడటం లేదని చెప్పాడు. వెతుకుతూ సంఘటన స్థలానికి వెళ్లారు. కాలిన పరిస్థితుల్లో లక్ష్మిని ఆస్పత్రికి తరలించారు. కాగా, తన భార్య ఎంతో అమాయకురాలని, తాను ఎలా చెబితే అలా వినేదని చెన్నయ్య చెప్పాడని, కేవలం అగ్ని ప్రమాదం సృష్టించి తమ వారిపై నెట్టి మరోసారి తన భార్యతో గొడవపడకుండా భయపెట్టాలని మాత్రమే అలా చేశానని తెలిపినట్లు సీఐ వెల్లడించారు. భర్తపై హత్యానేరం కింద కేసునమోదు చేశామని, సీఆర్‌పీఎస్ 164 కింద న్యాయమూర్తి వాంగ్మూలం నమోదు చేయించనున్నట్లు తెలిపారు.
బెదిరింపు బెడిసికొట్టింది
Published Sun, Nov 10 2013 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM
Advertisement
Advertisement