మేజిస్ట్రేట్ విచారణలో వెల్లడి
ముంబై హైకోర్టుకు అందిన నివేదిక
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్‌కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్‌కౌంటర్‌లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్‌ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్‌లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది.
థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్‌ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్‌ఎస్‌ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది.
ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్‌లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్‌స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment