Fake encounter
-
బద్లాపూర్ కస్టడీ డెత్.. ఆ ఐదుగురే కారణం
ముంబై: మహారాష్ట్రలో సంచలన రేపిన బద్లాపూర్ స్కూల్ లైంగికదాడి ఘటనలో నిందితుడి లాకప్ మరణంపై మేజిస్ట్రేట్ విచారణ పూర్తయింది. నిందితుడు అక్షయ్ షిండే లాకప్ డెత్‌కు ఐదుగురు పోలీసు అధికారులు బాధ్యులని తేలింది. నకిలీ ఎన్కౌంటర్లో పోలీసులే తమ కుమారుడు అక్షయ్‌ను చంపేశారని తండ్రి అన్నా షిండే ఫిర్యాదుపై ముంబై హైకోర్టు జస్టిస్ రేవతి మొహితె డెరె, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనానికి సోమవారం సీల్డు కవర్లో దర్యాప్తు నివేదికను మేజిస్ట్రేట్ సమర్పించారు. నివేదిక తమకు అందిందని ధర్మాసనం తెలిపింది. థానె క్రైం బ్రాంచి సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరె, హెడ్ కానిస్టేబుళ్లు అభిజీత్ మోరె, హరీశ్ తావడెతోపాటు ఒక పోలీస్ డ్రైవర్‌ను కూడా కస్టడీ మరణానికి కారణమని అందులో పేర్కొన్నారని చెప్పింది. దీని ఆధారంగా ఈ ఐదుగురిపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక(ఎఫ్ఎస్ఎల్) నివేదికను బట్టి చూస్తే మృతుడి తండ్రి ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయ పడింది. ఈ నివేదిక ప్రతిని అన్నా షిండేకు, ప్రభుత్వానికి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. అసలు ప్రతి, ఆధారాల పత్రాలు, సాక్ష్యుల వాంగ్మూలాలు తమ వద్దే ఉంటాయని స్పష్టం చేశారు. విచారణ చేపట్టేదెవరో రెండు వారాల్లో తమకు తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బద్లాపూర్ స్కూల్లో అటెండర్‌గా పనిచేసే అక్షయ్ షిండే(24)స్కూల్ టాయిలెట్లో ఇద్దరు బాలికపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపణలు రావడంతో గతేడాది ఆగస్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 23న అతడు చనిపోయాడు. అక్షయ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుపై ప్రశ్నించేందుకు తలోజా జైలు నుంచి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడని, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండే జరిపిన ఎదురు కాల్పుల్లో అతడు మృతి చెందాడని పోలీసులు ప్రకటించారు. ఆ సమయంలో వీరితోపాటు నీలేశ్ మోరె, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, డ్రైవర్ ఉన్నారు. -
బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు
పట్నా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో 26 ఏళ్ల క్రితం జరిగిన బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఇద్దరు పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఒక హత్యను ఎన్‌కౌంటర్‌గా చిత్రించిన నాటి పోలీస్‌స్టేషన్ ఇన్ఛార్జ్కి ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసు దర్యాప్తు సీఐడీకి, అనంతరం సీబీఐకి వెళ్లడంతో ఈ కేసులో చిక్కుముడి వీడింది.ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో బర్హారా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్ఛార్జికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ఇటీవలే ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఇదే కేసులో బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్‌కు పట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనితోపాటు రూ.3 లక్షల ఒక వేయి రూపాయల జరిమానా విధించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అవినాష్ కుమార్ విచారణ అనంతరం పూర్నియా మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్ ముఖ్లాల్ పాశ్వాన్‌ను ఐపీసీ సెక్షన్లు 302, 201, 193, 182 కింద దోషిగా పేర్కొంటూ ఈ శిక్షను విధించారు.జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నాడు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ముఖ్లాల్ పాశ్వాన్ ఇటీవలే పదోన్నతి పొంది డీఎస్పీగా నియమితులయ్యారు. ఇదే కేసులో మరో నిందితుడైన బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ ఝాకు ఐపీసీ సెక్షన్ 193 కింద కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు కోర్టు రూ.50,000 జరిమానా విధించింది. జరిమానా మొత్తం చెల్లించని పక్షంలో, ఇతను అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఈ కేసు 1998 నాటిదని సీబీఐకి చెందిన ఢిల్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్రేష్ కుమార్ తివారీ తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఒక నేరస్తుడిని వెదికేందుకు పోలీసులు పూర్నియాలోని బిహారీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని జగదీష్ ఝా ఇంటిని చుట్టుముట్టి, సంతోష్ కుమార్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంతోష్ కుమార్ సింగ్ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిపై తొలుత స్థానిక పోలీసు అధికారుల స్థాయిలో విచారణ జరిగింది. అనంతరం దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. అక్కడి నుంచి కేసు సీబీఐకి చేరింది. ఈ కేసులో ఆరోపణలను రుజువు చేసేందుకు సీబీఐ కోర్టు 45 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.ఇది కూడా చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరం -
వరంగల్ లో ఫేక్ ఎన్ కౌంటర్ కుట్ర
-
20 లక్షల కోసం ఆర్మీ కెప్టెన్ దురాగతం
శ్రీనగర్: గత ఏడాది జూలై 18న కశ్మీర్‌లోని అంషిపొరాలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై సిట్ దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. నగదు రివార్డు రూ.20 లక్షల కోసం ఆశపడిన 62–రాష్ట్రీయ రైఫిల్స్ రెజిమెంట్ కెప్టెన్ భూపేందర్ సింగ్ ముగ్గురు అమాయకులను బూటకపు ఎన్కౌంటర్లో చంపేసినట్లు తేలింది. ఈ ఘటనలో అతడికి ఇద్దరు స్థానికులు సాయపడినట్లు కూడా సిట్ గుర్తించింది. ఈ మేరకు 300 పేజీల చార్జిషీటును షోపియాన్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సికందర్ అజామ్‌కు గత డిసెంబర్ 26న సమర్పించింది. ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న షోపియాన్‌కు చెందిన తబిష్ నాజిర్, పుల్వామా వాసి బిలాల్ అహ్మద్‌లతో కలిసి కెప్టెన్ భూపేందర్ సింగ్ పథకం వేశాడు. ఉగ్రవాదులు సంచరిస్తున్నారంటూ మరో నలుగురు జవాన్లను తీసుకుని అంషిపొరా వెళ్లారు. నలుగురు జవాన్లు కార్డాన్ సెర్చ్ చేపడుతున్న సమయంలో తుపాకీ కాల్పుల శబ్దం వారికి వినిపించింది. ఆ ఉగ్రవాదులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా కాల్చినట్లు అనంతరం సింగ్ వారితో నమ్మబలికాడు. ముగ్గురినీ కాల్చి చంపిన అనంతరం వారిని గుర్తు పట్టకుండా చేసి, ఆయుధాలు ఉంచాడు. మృతులు అబ్రార్ అహ్మద్(25), ఇంతియాజ్ అహ్మద్(20), మొహమ్మద్ ఇబ్రార్(16)ల ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. ఆపిల్ తోటల్లో పనిచేసేందుకు వచ్చిన కూలీలుగా వారిని గుర్తించారు. ఖననం చేసిన మృతదేహాలను అక్టోబర్ 3వ తేదీన కుటుంబసభ్యులకు అందజేశారు. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఆర్మీ కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ చేపట్టింది. దీనిపై ఏర్పాటైన సిట్ 75 మందిని ప్రశ్నించింది. అనుమానితుల కాల్ రికార్డును పరిశీలించింది. నగదు రివార్డు కోసమే భూపేందర్ సింగ్, స్థానిక ఇన్ఫార్మర్లు కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకు గాను వారికి కొన్ని వేల రూపాయలు ముట్టినట్లు కూడా తేలింది. రూ.20 లక్షల రివార్డు కోసం తమ అధికారి బూటకపు ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్లు వస్తున్న వార్తలపై సైన్యం స్పందించింది. అవి సైనిక వ్యవస్థలోని వాస్తవాల ఆధారంగా వస్తున్న వార్తలు కావని పేర్కొంది. ‘యుద్ధ క్షేత్రంలో గానీ, ఇతర విధుల్లో గానీ పాల్గొన్న అధికారులు, సిబ్బందికి ఎటువంటి నగదు రివార్డులు అందజేసే విధానం లేదని శ్రీనగర్‌లోని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ రాజేశ్ కాలియా తెలిపారు. -
యోగికి షాకిచ్చిన బీజేపీ నేత
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వానికి సొంత పార్టీ నేతే షాక్ ఇచ్చారు. ఝాన్సీలో ఇటీవల జరిగిన పుష్పేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ కేసు సీబీఐ దర్యాప్తుకు అప్పగించాలని ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ట్విటర్లో కోరారు. పుష్పేంద్ర యాదవ్‌ను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న వేళ, యూపీ బీజేపీ నాయకుడు, భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్ నిరాహువా వారితో గొంతు కలిపారు. పుష్పేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ ఘటన వెనుక నిజానిజాలను వెలికి తీయడానికి సీబీఐ దర్యాప్తు జరపాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను దినేశ్‌లాల్ ట్విటర్లో కోరారు. ఈ ట్వీట్ ఆదిత్యానాథ్ సర్కార్‌ను ఇరకాటంలో పడేసింది. పుష్పేంద్రయాదవ్ ఎన్కౌంటర్ బూటకం కాదని, కరుడుగట్టిన నేరగాడైన అతను పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించాడని సీఎం యోగి ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించారు. ఈ నెల 6వ తేదీన ఝాన్సీలో స్థానిక మోతే ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర సింగ్ జరిపిన కాల్పుల్లో పుష్పేంద్ర యాదవ్ మృతి చెందారు. పోలీసులను చూడగానే మొదట పుష్పేంద్ర కాల్పులు జరిపాడని, దీంతో తాము జరిపిన ప్రతి కాల్పుల్లో అతను మరణించాడని ఇన్స్పెక్టర్ చెప్తున్నారు. పుష్పేంద్ర కుటుంబసభ్యులు మాత్రం పోలీసులు ఉద్దేశపూరితంగానే హతమార్చారని ఆరోపిస్తున్నారు. పుష్పేంద్ర కుటుంబసభ్యులను ఇటీవల పరామర్శించిన ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్.. తాము అధికారంలోకి వచ్చాక ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతామని ప్రకటించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో అలీగఢ్ నుంచి పోటీచేసిన దినేశ్‌లాల్ యాదవ సామాజికవర్గం ఒత్తిడి మేరకే ఈ ట్వీట్ చేసినట్టు భావిస్తున్నారు. -
‘ఇష్రాత్’ కేసులో మాజీ పోలీసులకు విముక్తి
అహ్మదాబాద్: ఇష్రాత్ జహన్‌ను బూటకపు ఎన్కౌంటర్ చేశారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో మాజీ పోలీసు అధికారులు డీజీ వంజరా, ఎన్కే అమిన్‌లకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసు విచారణను నుంచి తమను తప్పించాలంటూ వంజరా, అమిన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు అనుమతించింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు గానూ సీబీఐకి గుజరాత్ ప్రభుత్వం అనుమతివ్వని నేపథ్యంలో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీబీఐ విచారణకు ప్రభుత్వం అనుమతినివ్వలేదని.. దీంతో మాజీ పోలీసు అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు అనుమతిస్తున్నామని.. ఈ కేసులో వారికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకోరాదని ప్రత్యేక సీబీఐ కోర్టు న్యాయమూర్తి జేకే పాండ్యా చెప్పారు. -
దోపిడీలను అడ్డుకున్నందుకే బూటకపు ఎన్కౌంటర్లు
సీలేరు(పాడేరు): దోపిడీలపై ఉద్యమిస్తున్నందునే ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల పాలకులు బూటకపు ఎన్కౌంటర్లు, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల పౌరహక్కుల సంఘం నేతలు తెలిపారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు చిత్రకొండ బ్లాక్‌లోని ఆండ్రపల్లి వద్ద అక్టోబర్ 12న జరిగిన ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలు తెలుసుకునేందుకు రెండు రాష్ట్రాలకు చెందిన ఆరుగురు పౌరహక్కుల నేతలు ఆండ్రపల్లి, పరిసర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామస్తులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు ఆదివారం సీలేరులో విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 12న జరిగిన ఎన్కౌంటర్ పచ్చి బూటకమని, పోలీసు బలగాలు ఆమెను పట్టుకుని కాల్చి చంపాయని తెలిపారు. ఆండ్రపల్లిలో ప్రజలతో కలసి వివరాలు సేకరించామని చెప్పారు. చిత్రకొండ బ్లాక్‌లో అనారోగ్యంతో ఉన్న మీనా, తోటి సభ్యులను అక్టోబర్ 10న సాయుధ పోలీసు బలగాలు గుర్తించి వెంబడించాయని చెప్పారు. వారు నుంచి తప్పించుకుని ఆండ్రపల్లి అటవీ ప్రాంతానికి చేరుకున్నారని తెలిపారు. అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం మీనా, సహచరులు షెల్టర్ ఏర్పాటు చేసుకున్నారని, ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు 12వ తేదీ ఉదయం 5.30 గంటల ప్రాంతంలో చుట్టుముట్టి కాల్పులు జరిపారని తెలిపారు. ఈ సంఘటనలో గాయపడిన మీనాను చిత్రహింసలకు గురి చేసి, చంపేశారని తమ విచారణలో తేలిందన్నారు. ఆంధ్రా సీఎం చంద్రబాబు నాయుడు, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కనుసన్నల్లో బాక్సైట్ అక్రమ మైనింగ్ జరుగుతోందని తెలిపారు. ఆంధ్రా, ఒడిశా, ఛతీస్‌గఢ్, తెలంగాణా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసాన్ని, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, దోపిడీ విధానాలపై ఆదివాసీలు ఉద్యమిస్తున్నారని, వారిని అణిచివేయడానికే అక్రమ అరెస్టులు, బూటకపు ఎన్కౌంటర్లను నిరంతరం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ పర్యటనలో ఏపీ పౌరహక్కుల సంఘ అధ్యక్షుడు చిట్టిబాబు, ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి శ్రీమన్నారాయణ, ఏపీఈసీ సభ్యుడు బాలాజీరావు, తెలంగాణ నుంచి నారాయణరావు, మదన కుమారస్వామి పాల్గొన్నారు. -
కోవర్టు ద్వారా పెళ్లి భోజనంలో విషం పెట్టి..
కరీంనగర్ జిల్లా : మహరాష్ట్రలో జరిగిన మావోయిస్టుల ఎన్కౌంటర్ పచ్చిభూటకమని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఎటపల్లి తాలూకాలోని సింలి గ్రామంలో కోవర్టు ద్వారా పెళ్లి భోజనంలో విషం పెట్టి 33 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపించారు. ఇది పూర్తిగా బీజేపీ ప్రభుత్వ దుర్మార్గానికి పరాకాష్ట అని విమర్శించారు. దీనిని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. -
ఫేక్ ఎన్కౌంటర్ చేస్తారనే... :తొగాడియా
అహ్మదాబాద్ : అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌పీ చీఫ్ ప్రవీణ్ తొగాడియా హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన గుజరాత్, రాజస్థాన్ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై తప్పుడు కేసులు బనాయించి ఫేక్ ఎన్కౌంటర్లో చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘‘ పదేళ్ల క్రితం కేసును ఇప్పుడు తిరగదోడుతున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు నన్ను వేధిస్తున్నారు. ఎన్కౌంటర్లో నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే నా ప్రయత్నం. చట్టాన్ని గౌరవిస్తా.. త్వరలోనే పోలీసుల ముందు లొంగిపోతాను’ అని తొగాడియా ప్రకటించారు. తనకేం జరిగినా ప్రభుత్వాలదే బాధ్యతని ఆయన పేర్కొన్నారు. అయోధ్య రామ మందిరం, గో వధ నిషేధ చట్టం తదితర అంశాలపై మాట్లాడుతున్నందుకే కొందరు తనపై కక్ష గట్టారని ఆయన చెప్పారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా హిందు సమాజ శ్రేయస్సు కోసం తాను చేసే కృషిని ఎవరూ అడ్డుకోలేరని తొగాడియా వ్యాఖ్యానించారు. సోమవారం మధ్యాహ్నాం నుంచి ఆయన కనిపించకుండా పోయే సరికి.. రాజస్థాన్ పోలీసులే ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటారని కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అయితే అనూహ్యంగా ఆయన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రత్యక్షం కావటం విశేషం. షుగర్ లెవల్స్ పడిపోవటంతో షాహిబాగ్‌లోని ఓ పార్క్‌లో స్పృహ కోల్పోయి పడిపోగా.. స్థానికులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు వైద్యులు వెల్లడించారు. -
ఆర్కే, రవిలను విడుదల చేయాలి
వరవరరావు డిమాండ్ హైదరాబాద్: పోలీసుల అదుపులో ఉన్న సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రామకృష్ణ (ఆర్కే) అలియాస్ సాకేత్ అలియాస్ రాజన్న, గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్, దుబాషి శంకర్ అలియాస్ అంకమ్బాబురావు అలియాస్ మహేందర్ తదితరులను వెంటనే విడుదల చేయాలని విరసం నేత వరవరరావు డిమాండ్ చేశారు. వీరందరినీ బూటకపు ఎన్‌కౌంటర్‌తో హత్య చేసి కట్టు కథలు అల్లడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వారిని కోర్టులో హాజరు పరచాలన్నారు. మల్కన్‌గిరి ఎన్కౌంటర్లో మృతిచెందిన ప్రభాకర్ మృతదేహానికి గురువారం యాప్రాల్‌లో వరవరరావు జోహార్లు అర్పించారు. అడవి సంపదను దోచుకోవడానికే... ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ప్రపంచ బ్యాంక్ ఎజెండాగా పనిచేస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో అడవి సంపదను దోచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్‌హంట్‌ను ప్రవేశపెట్టాయని, అందులో భాగంగానే ప్రజల కోసం పోరాడుతున్న విప్లవకారులపై ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. మల్కన్‌గిరి జిల్లాలో ఎన్‌కౌంటర్‌ను కుట్రగా అభివర్ణించారు. మావోయిస్టులు కాలిస్తే పోలీసులకు గాయాలయ్యాయని, పోలీసుల కాల్పుల్లో మావోయిస్టుల ప్రాణాలు పోయాయన్నారు. మల్కన్‌గిరి ఘటనలో కాల్పులు ఏకపక్షంగా జరిగాయని ఆరోపించారు. ఇందులో కానిస్టేబుల్ మృతికి కాల్పులు కారణం కాదని.. కాలువలో పడి చనిపోయాడన్నారు. ఆదివాసీలపై ఎలాంటి కేసులూ పెట్టే అర్హత ప్రభుత్వాలకు లేదని, ఇప్పటికై నా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు కూంబింగ్లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పీడిత ప్రజలున్నంతకాలం విప్లవం... పీడిత తాడిత ప్రజలున్నంత వరకు విప్లవ ఉద్యమాలు ఆగవని వరవరరావు స్పష్టం చేశారు. ఆదివాసీల దీర్ఘకాలిక సమస్యలపై మావోయిస్టు పార్టీ 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోందన్నారు. కేసీఆర్ ప్రకటన చేయాలి: గద్దర్ విప్లవకారుల ఎన్కౌంటర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన ప్రకటన చేయాలని ప్రజాగాయకుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అరుణోదయ సాం స్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క, తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణరావు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కుమారస్వామి తదితరులు ప్రభాకర్ మృతదేహానికి జోహార్లు అర్పిం చారు. బూటకపు ఎన్కౌంటర్లతో నక్సలిజాన్ని ఆపలేరని, మావోయిస్టుల అడ్డుతొలిగితే మార్గం సులువు చేసుకోవచ్చని చంద్రబాబునాయుడు కలలు కంటున్నాడని విమలక్క అన్నారు. సమస్యలు పరిష్కరించేవరకు పోరాటాలను ఆపేదిలేదన్నారు. ఈ ఎన్కౌంటర్ వట్టి బూట కమని, పోలీసుల నాటకమని ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అత్యంత క్రూరం గా వ్యవహరిస్తోందన్నారు. ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని నారాయణరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నం మన్యం గిరి జనుల కడుపు నింపే అడవుల కింద కోట్లాది రూపాయల విలువచేసే బాకై ్సట్ ఖనిజం తవ్వకాల కోసమే బడా వ్యాపారవేత్తలతో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు, ఒడిశా, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఎన్‌కౌంటర్‌కు పాల్పడ్డాయని రాజు ఆరోపించారు. ప్రొఫెసర్ కాశీం, స్నేహలత, చంద్రమౌళి, అంద్శై నలమాస కృష్ణ తదితరులు ప్రభాకర్‌కు నివాళులర్పించారు. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి ‘దోపిడి రాజ్యాన్ని కూల్చడానికి అడవిబాట పట్టి పేద ప్రజల హృదయాల్లో నిలిచిపోతివా... కొడుకా ప్రభాకరా.. ఎంత పని చేస్తిరి... నీ పాట ఎటుపోయె కొడుకా... తెలంగాణ కోసం మధనపడితివి. నా ప్రాణం అంటివి. తెలంగాణ వస్తే మన బతుకులు మారతాయంటివి. దోపిడి రాజ్యాన్ని మారుద్దామంటివి. ఆశలన్నీ నీ మీదనే పెట్టుకుంటిమి. మీ నాయన పోయినా రాకపోతివి. మాకు ఎవరు తోడుంటరు కొడుకా’ అంటూ ప్రభాకర్ తల్లి రత్నమ్మ గుండెలవిసేలా రోదించారు. కూంబింగ్ నిలిపివేయాలి... దండకారణ్యంలో కూంబింగ్‌ను నిలిపివేయాలి. సమాజంలో ఆర్థిక అసమానతలున్నంత కాలం నక్సలిజం ఉంటుంది. - ప్రభాకర్ సహచరి దేవేంద్ర -
ఈసారి బాబు తప్పించుకోలేరు: మావోయిస్టులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేనెపూసిన కత్తి అని, ఆయన ఇంతకింత ఫలితం అనుభవించి తీరుతారని మావోయిస్టు ఏపీ అధికార ప్రతినిధి శ్యామ్ అన్నారు. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల కుట్ర ఫలితంగానే ఏఓబీ ఎన్కౌంటర్ జరిగిందని అన్నారు. కోవర్టుల ద్వారా అన్నంలో విషం కలిపించి, పడిపోయిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపారని ఈ విషయమై బుధవారం విడుదల చేసిన ఒక లేఖలో పేర్కొన్నారు. కోవర్టు హత్యల సృష్టికర్త చంద్రబాబు, అతని హంతక పోలీసు ముఠా ద్వారానే ఏఓబీ దారుణ హత్యాకాండ కూడా జరిగిందన్నారు. చడీప్పుడు లేకుండా చంద్రబాబు జరిపించిన దారుణ మారణకాండ అని అభివర్ణించారు. నయీంను మనిషిరూపంలో ఉన్న రాక్షసుడిగా తయారుచేసి, 15 ఏళ్ల పాటు వందలాది హత్యలు చేయించిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. తొమ్మిదేళ్లు రక్తం వాసనకు దూరంగా ఉన్న చంద్రబాబు గద్దె ఎక్కిన మర్నాడే 21 మంది ఎర్రచందనం కూలీలను దుర్మార్గంగా తన పోలీసులతో హత్య చేయించారని ఆరోపించారు. కోవర్టు పేరుతో పోలీసులతో వేలాదిమందిని బలితీసుకుని నిత్యం హత్యలతో రక్తం పారిస్తున్నారని అన్నారు. అలిపిరిలో తప్పించుకున్నావు గానీ.. ఈసారి నీవు, నీ కొడుకు తప్పించుకోలేరని ఆ లేఖలో హెచ్చరించారు. అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేస్తామని, పోలీసులు - మిలటరీ ఎల్లకాలం ఆయనను కాపాడలేవని అన్నారు. అయితే, మావోయిస్టుల పేరుతో విడుదలైన ఈ లేఖలో ఉపయోగించిన భాష మాత్రం మావోయిస్టులు తరచుగా ఉపయోగించే భాషలా లేదు. దానికి పూర్తి భిన్నంగా ఉంది. దాంతో అసలు ఈ లేఖ నిజమైన మావోయిస్టులు విడుదల చేసిందేనా, లేదా ఏదైనా ఫేక్ లేఖనా అనే అనుమానాలు సైతం తలెత్తుతున్నాయి. -
47 మంది పోలీసులకు జీవితఖైదు!
లక్నో: నకిలీ ఎన్కౌటర్కు పాల్పడిన 47 మంది పోలీసులకు జీవితఖైదు విధిస్తూ లక్నో సీబీఐ కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. 1991లో జరిగిన ఈ ఘటనలో.. పవిత్రమైన ప్రదేశాలను సందర్శించుకొని తిరిగొస్తున్న 11 మంది సిక్కు పర్యాటకులను ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్ జిల్లాలో అడ్డుకున్న పోలీసులు మూడు వేరు వేరు ప్రాంతాల్లో నకిలీ ఎన్కౌంటర్ చేశారు. అయితే వారంతా ఉగ్రవాదులనీ, అందుకే వారిని ఎన్కౌంటర్ చేశామని పోలీసులు తమ చర్యను సమర్థించుకున్నారు. ఈ ఘటనపై న్యాయవాది ఆర్ఎస్ సోధి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయడంతో.. న్యాయస్థానం ఈ కేసును సీబీఐచే విచారణ జరిపించాలని ఆదేశించింది. విచారణ చేపట్టిన సీబీఐ.. ఈ కేసులో 57 మంది పోలీసులను నిందితులుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేసింది. అయితే ఈ 25 ఏళ్ల కాలంలో ఇప్పటికే అందులో 10 మంది పోలీసులు మృతి చెందడంతో మిగిలిన 47 మందికి జీవితఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
ఎన్‌కౌంటర్‌పై హెడ్ కానిస్టేబుల్ సంచలన ప్రకటన
ఇఫాంల్: ఆరు సంవత్సరాల కిందట జరిగిన పీఎల్ఏ మాజీ ఉగ్రవాది ఎన్కౌంటర్ ఘటనపై మణిపూర్ పోలీసు హెడ్ కానిస్టేబుల్ సంచలన ప్రకటన చేశాడు. తనపై అధికారి ఆదేశించడంతో ఉగ్రవాది సంజిత్ మెయితీని నకిలీ ఎన్కౌంటర్లో హతమార్చినట్టు అతను అంగీకరించాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెడ్ కానిస్టేబుల్ హిరోజిత్ సింగ్ ఈ మేరకు వెల్లడించాడు. 2009లో నిరాయుధుడైన మెయితీపై 9ఎంఎం పిస్తోల్‌తో బుల్లెట్ల వర్షం కురిపించానని, ఛాతిలోకి బుల్లెట్లు దిగడంతో అతను కుప్పకూలాడని హిరోజిత్ చెప్పాడు. ఇంఫాల్ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకే తాను ఈ నకిలీ ఎన్‌కౌంటర్‌కు పాల్పడినట్టు తెలిపాడు. ఈ ఘటన గురించి మణిపూర్ డీజీపీ, ముఖ్యమంత్రికి కూడా తెలుసనని చెప్పాడు. ఇప్పుడు తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. హిరోజిత్ వ్యాఖ్యలపై సంజిత్ మెయితీ తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. హిరోజిత్ను కఠినంగా శిక్షించాలని, లేదా తన కొడుకు మరణంపై ప్రతీకారం తీర్చుకోవడానికి అతన్ని తనకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేసింది. 2009లో అనుమానిత ఉగ్రవాదిగా అరెస్టైన సంజిత్ మెయితీని పోలీసులు చంపడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తలు రేపింది. యువకుడిని అన్యాయంగా పోలీసులు పొట్టనబెట్టుకున్నారని మణిపూర్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. -
'మేం చూశాం.. అరెస్టు చేసి.. చంపేశారు'
న్యూఢిల్లీ: చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో జరిగిన ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. ఈ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఉన్న ప్రత్యక్ష సాక్షులు శేఖర్, బాలచంద్రన్‌ను ఓ స్వచ్ఛంద సంస్థ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్చార్సీ) ముందు ప్రవేశ పెట్టింది. ఎన్‌కౌంటర్‌కు ముందు ఎర్ర చందనం కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వీరు కమిషన్ కు వివరించారు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగే అవకాశం ఉంది. -
'ఎక్కడి నుంచో తెచ్చి కాల్చిచంపారు'
తిరుపతి : చిత్తూరు జిల్లాలోని తిరుపతి శ్రీవారి మెట్ల వద్ద మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్లో మరణించిన ఎర్రచందనం కూలీలను వేరొక ప్రాంతం నుంచి తీసుకొచ్చి కాల్చి చంపారని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య ఆరోపించారు. మృతదేహాల మీద బుల్లెట్ గాయాలను చూస్తే.. ఇది పక్కా బూటకపు ఎన్‌కౌంటరేనని తేలుతోందని గురువారం ఆయన చెప్పారు. మృతదేహాలలో ఎక్కడా బుల్లెట్లు లేవు, కేవలం అవి వారి శరీరాల నుంచి దూసుకెళ్లాయని చెప్పారు. కేవలం 5 నుంచి 10 మీటర్ల దూరం నుంచే కాల్పులు జరిగాయని అందువల్లే బుల్లెట్లు ఎర్రచందనం కూలీల శరీరాల నుంచి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. కూలీల శవాల పక్కన పిడిలేని గొడ్డళ్లను పోలీసులు పడేయటాన్ని గమనించినట్లయితే వాటిని అప్పుడే కొనుక్కొచ్చిన విషయం తెలుస్తోందన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో రాళ్లు కూడాలేవని, మరి రాళ్లతో ఎర్రచందనం కూలీలు ఎలా దాడి చేశారో పోలీసులే చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు పిట్టకథ అల్లుతున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదని పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్య వెల్లడించారు. -
ఇదో బూటకపు ఎన్కౌంటర్
ఎన్‌కౌంటర్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి క్రాంతిచైతన్య తిరుపతి కార్పొరేషన్: శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం కూలీలపై జరిగిన ఎన్కౌంటర్ ముమ్మాటికీ పోలీసుల హత్యేనని, తక్షణమే సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి క్రాంతి చైతన్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్కౌంటర్లో 20 మంది ఎర్రచందనం కూలీలు హతమైన విషయం విదితమే. బుధవారం ఉదయం మృతదేహాలకు రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో పౌరహక్కుల సంఘం నాయకులు మార్చురీ వద్దకు చేరుకుని పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రాంతి చైతన్య మాట్లాడుతూ శ్రీవారి మెట్టు వద్ద జరిగిన ఎన్కౌంటర్ బూటకం అన్నారు. మూడు రోజుల క్రితం పట్టుకున్న కూలీలను చిత్రహింసలు పెట్టారని, ఆఖరికి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. తమపై రాళ్లు రువ్వారని చెబుతున్న పోలీసుల మాటలు కట్టుకథలుగా అభివర్ణించారు. తక్షణమే సిట్టింగ్ జడ్జీతో న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. జాతీయ మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నామన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం జిల్లా కోశాధికారి లత, హేమాద్రి, రఘు పాల్గొన్నారు. -
ఫేక్ ఎన్కౌంటర్ కేసులో రిటైర్డ్ పోలీసులకు జీవితఖైదు
పోలీసులే తోటి పోలీసుల్ని అత్యంత కిరాతకంగా మట్టుబెట్టి.. ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారు. అయితే అది నకిలీ ఎన్కౌంటర్ అని మృతుల కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి పూనుకున్నారు. 23 ఏళ్లు గడిచింది.. నిందితులు రిటైరయ్యారు కూడా. అయితేనేం.. చేసిన ఘోర నేరానికి శిక్ష పడాల్సిందే అంటూ విశ్రాంత ఎస్పీ సహా ఎనిమిది మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదును విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది. 1992.. పంజాబ్ రాష్ట్రమంతా అల్లలర్లతో అట్టుడుకుతోంది.. చాలా చోట్ల ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు.. జలంధర్ జిల్లా లంబ్రా పోలీస్ స్టేషన్లో ఎస్‌హెచ్ వోగా విధులు నిర్వహింస్తున్న రాంసింగ్.. తన సిబ్బంది అజిత్ సింగ్, అజైబ్ సింగ్, అమృత్ సింగ్, హర్భజన్ సింగ్ సహాయంతో సెప్టెంబర్ 1న బల్జీత్ సింగ్ అనే ట్రైనీ కానిస్టేబుల్‌ను ఎన్కౌంటర్ చేశారు. సెప్టెంబర్ 6 న ఇలాంటిదే మరో ఘటన జరిగింది. సుఖ్వంత్ సింగ్, నందర్ సింగ్, రాజిందర్ సింగ్ అనే పోలీసు అధికారులు.. రాజ్విందర్ సింగ్, ముఖ్తియార్ సింగ్ అనే మరో ఇద్దరు ట్రైనీ కానిస్టేబుళ్లను కిరాతకంగా హతమార్చి శవాల్ని నామరూపాలు లేకుండా చేశారు. ఆ తర్వాతికాలంలో వాళ్లకు ప్రమోషన్లు వచ్చాయి. అప్పట్లో సంచలనం కలిగించిన ఈ రెండు కేసుల్ని సీబీఐ దర్యాప్తు చేయగా.. అవి రెండూ నకిలీ ఎన్కౌంటర్లేనని తేల్చింది. సారూప్యత దృష్ట్యా రెండు కేసుల్ని కలిపి విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఎస్పీగా రిటైర్ అయిన రాంసింగ్ సహా ఎనిమిది మందికి జీవిత ఖైదును విధించింది. -
‘ఇష్రాత్’ కేసులో ఐపీఎస్‌లకు బెయిలు
డీజీ వంజర, పీపీ పాండేలకు బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు అహ్మదాబాద్: ఇష్రాత్ జహా నకిలీ ఎన్కౌంటర్ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు డీజీ వంజర, పీపీ పాండేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. అహ్మదాబాద్ సిటీ క్రైమ్‌బ్రాంచ్‌లో, ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్)లో వంజర కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో.. చట్టాల్ని చేతుల్లోకి తీసుకుని చేసిన హత్యల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని, ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం సమాజానికి హానికరమని, కేసు విచారణను ఆయన ప్రభావితం చేయగలరని ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు. ఇష్రాత్ జహా, సోహ్రాబుద్దీన్ షేక్, తులసీరామ్ ప్రజాపతిల నకిలీ ఎన్కౌంటర్ కేసులకు సంబంధించి డీజీ వంజర 2007 ఏప్రిల్ నుంచి.. దాదాపు గత 8 ఏళ్లుగా ఆయన జైళ్లోనే ఉన్నారు. డీజీ వంజరకు బెయిల్ మంజూరు చేస్తూ.. దేశం విడిచివెళ్లరాదని, గుజరాత్లో ఉండకూడదని, ప్రతీ శనివారం కోర్టుకు హాజరుకావాలని కోర్టు షరతులు విధించింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచికత్తును సమర్పించాలని ఆదేశించింది. అలాగే, గత 18 నెలలుగా జైళ్లో ఉంటున్న అదనపు డీజీపీ ర్యాంక్ అధికారి పాండేకు కూడా బెయిలు మంజూరుచేసింది -
ఏడుగురు ఆర్మీ అధికారులకు జీవిత ఖైదు
బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఏడుగురు ఆర్మీ అధికారులకు జీవిత ఖైదు శిక్ష పడింది. 2010 సంవత్సరంలో జమ్ము కాశ్మీర్‌లోని మాచిల్ ప్రాంతంలో ముగ్గురు పౌరులను ఉగ్రవాదులని ముద్ర వేసి ఎన్కౌంటర్లో హతమార్చినట్లు వీళ్లపై తొలుత ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇద్దరు అధికారులతో సహా మొత్తం ఏడుగురు సిబ్బందిపై నేరం రుజువైంది. దాంతో వారందరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. వారి సర్వీసు ప్రయోజనాలను కూడా సస్పెండ్ చేశారు. 2010 సంవత్సరంలో ఉత్తర కాశ్మీర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులను ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బు ఇస్తామని చెప్పి మభ్యపెట్టి కుప్వారా ప్రాంతానికి పిలిపించారు. కుట్రపన్ని వాళ్లను పిలిపించినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిని నియంత్రణ రేఖ వద్దకు తీసుకెళ్లి బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారన్నారు. వాళ్లంతా పాకిస్థానీ ఉగ్రవాదులని, సరిహద్దు దాటి మన దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా ఎన్కౌంటర్ చేశామని అన్నారు. ఈ ఘటన నేపథ్యంలో కాశ్మీర్ లోయ ప్రాంతంలో సైన్యంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు వాళ్లు ఏడుగురికీ జీవితఖైదు విధించారు. -
ఎన్కౌంటర్ చేసినవారికి అవార్డులు వద్దు
న్యూఢిల్లీ : ఫేక్ ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు మంగళవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పోలీస్ ఎన్కౌంటర్లు జరిగిన అన్ని కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిది. ఆయా కేసుల్లో మెజిస్టీరియల్ విచారణ కూడా జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసు ఎన్కౌంటర్లపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం... కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎన్కౌంటర్లపై నమోదైన కేసులపై సీఐడీ విచారణ జరిపించాలని సూచించిన కోర్టు... ఎన్కౌంటర్ వివరాలను రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో సమర్పించాలని పేర్కొంది. ఎన్కౌంటర్లకు సంబంధించిన కేసుల్లో విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వడం కానీ, అవార్డులు ఇవ్వడం కానీ చేయకూడదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. -
నిషేధాలు లేని పాలన అవసరం
అల్వాల్: ప్రజాస్వామ్య ఉద్యమాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో నిషేధాలు, నిర్బంధాలు, షరతులు లేని స్వపరిపాలన ప్రజలకు అందించాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు అన్నారు. అమరుల బంధుమిత్రుల సంఘం, విప్లవ రచయితల సంఘాల ఆధ్వర్యంలో అల్వాల్ సుభాష్‌నగర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విప్లవ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులర్పించారు. ఇటీవల అమరులైన మంగన్న, సంజీవప్ప, మొగిలి, రాములు, సరోజ, బాబూరావు, భారతి, కవితలకు జోహార్లు అర్పించారు. అనంతరం వరవరరావు మాట్లాడుతు ప్రజాస్వామ్య యుతంగా ఏర్పడిన రెండు తెలుగు రాష్ట్రాలలో దళిత, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి జరిగినప్పుడే ప్రజలు హర్షిస్తారన్నారు. సామాజిక, ఆర్థిక హామీలను నెరవేరుస్తామంటున్న ప్రభుత్వాధినేతలు నిషేధాలు, నిర్బంధాలు లేని స్వపరిపాలనను అందించాలన్నారు. బూటకపు ఎన్కౌంటర్లను నిలిపివేయడంతో పాటు ఇప్పటివరకు జరిగిన ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆరు విప్లవ సంఘాలపై విధించిన నిషేదం ఎత్తివేయాలన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలు ఏ రాష్ర్టంలో ఉండాలన్న వాదనను పక్కనపెట్టి గిరిజన హక్కులను కాలరాసే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏడు మండలాలను ముంపునకు గురిచేసి సాధించుకున్న తెలంగాణ హర్షణీయం కాదన్నారు. స్వర్ణాంద్ర నిర్మిస్తాన్నంటున్న చంద్రబాబు నాయుడు, బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తానంటున్న కె.చంద్రశేఖర్‌రావులు ప్రజాస్వామిక విప్లవ పోరాటంలో అమరులైన వారి కుటుంబాల కడుపుకోతను గమనించాలన్నారు. ప్రజాకళా మండలి, విరసం, డప్పు రమేష్ బృందాలు విప్లవ గీతాలు ఆలపించాయి. ముందుగా సుభాష్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద జెండా ఎగరవేశారు. ఇలా ఉండగా అమరులను తలచుకుంటూ సభలో కన్నీరు పెట్టిన వారి కుటుంబ సభ్యులను చూసిన వారి హృదయాలు ద్రవించాయి. దమనకాండపై విచారణ జరపాలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం: శ్రీలంకలో తమిళులపై జరిగిన మారణకాండపై అంతర్జాతీయ జాతీయ స్థాయిలో స్వతంత్ర విచారణ జరపాలని విప్లవ సంఘం నేత పరిమిళ పంజా(తమిళనాడు) డిమాండ్ చేశారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమరుల బంధు మిత్రుల సంఘం, విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో గంటి ప్రసాదం ప్రథమ వర్ధంతి సభ జరిగింది. ఇందులో భాగంగా ‘విప్లవ బాటసారి గంటి ప్రసాదం స్మృతి గీతాలు’ సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిమిళ పంజా మాట్లాడుతూ ఇప్పటికీ శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న హత్యాకాండను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ప్రజా నాయకత్వంతో ప్రస్తుతం దండకారణ్యంలో నూతన మానవావిష్కారం జరుగుతోందని అన్నారు. నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు కలిసి, పోలవరం పేరిట ఆదివాసులను నిండా ముంచుతున్నార ని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా గంటి ప్రసాదంపై ఉషా పాడిన పాట సభికులను కన్నీరు పెట్టించింది. అమరుల బంధు మిత్రుల సంఘ అధ్యక్షురాలు అంజమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పద్మకుమారి, విరసం కార్యదర్శి వరలక్ష్మి, ప్రొఫెసర్ కాశీం, గంటి ప్రసాదం సతీమణి కామేశ్వరి, యూనివర్సిటీ డిస్కషన్ ఫోరం నాయకులు డేవిడ్ పాల్గొన్నారు. -
బూటకపు ఎన్కౌంటర్: పోలీసుకు మరణశిక్ష
దాదాపు ఏడాది క్రితం పాట్నాలో జరిగిన ఓ బూటకపు ఎన్కౌంటర్ కేసులో బీహార్‌కు చెందిన ఓ పోలీసు అధికారికి మరణశిక్ష విధించారు. షమ్సే ఆలమ్ అనే అధికారికి మరణశిక్ష విధించగా, కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సింగ్, మరో ఆరుగురికి మరణించే వరకు జీవిత ఖైదు విధించారు. గత వారం విచారణ పూర్తి కావడంతో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవిశంకర్ సిన్హా తన తీర్పును అప్పట్లో వాయిదా వేశారు. ఆ తీర్పును మంగళవారం వెలువరించారు. ఛార్జిషీటు ప్రకారం, వికాస్ రంజన్, ప్రశాంత్ సింగ్, హిమాంశు శేఖర్ అనే ముగ్గురు విద్యార్థులను 2002 డిసెంబర్ 28న ఆషియానా నగర్ ప్రాంతంలో మార్కెట్ సమీపంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో హతమార్చారు. సమ్మేళన్ మార్కెట్లోని కొందరు దుకాణదారులపై హత్యాయత్నం చేసిన కేసులో ఆరుగురు దోషులుగా తేలారు. ఎస్టీడీ బిల్లు చెల్లించే విషయంలో జరిగిన గొడవలో వారు ముగ్గురు విద్యార్థులను దారుణంగా కొట్టారు. దాంతో దుకాణదారులు పోలీసులను పిలిచి వారికి ఈ ముగ్గురు విద్యార్థులను అప్పగించారు. వాళ్లు దొంగలని, పలు నేరాల్లో ఉన్నారని చెప్పారు. అనంతరం పోలీసు రికార్డులలో ఆ విద్యార్థులను దోపిడీ దొంగలుగా చూపించి ఇద్దరు పోలీసులు వారిని కాల్చి చంపారు. దీనిపై విపక్షాలు గగ్గోలు పెట్టడంతో తొలుత స్థానిక పోలీసులకు అప్పగించిన ఈ కేసును తర్వాత సీఐడీకి, అనంతరం సీబీఐకి అప్పగించారు. -
ఆ పోలీసులకు ఉరే సరి
ఉత్తరాఖండ్‌లో బూటకపు ఎన్కౌంటర్లో 22 ఏళ్ల ఎంబీఏ విద్యార్థిని కాల్చి చంపిన 17 మంది పోలీసులకు ఉరి శిక్ష విధించాలని సీబీఐ కోరుతోంది. వాళ్లకు విధించే శిక్ష ఈ సమాజం మొత్తానికి ఓ గుణపాఠం కావాలని వాదించింది. దీంతోపాటు బాధితుడి కుటుంబానికి తగిన పరిహారం కూడా ఇవ్వాలని కోరింది. ఈ కేసులో మొత్తం 18 మంది పోలీసులను నిందితులుగా పేర్కొనగా, వారిలో ఏడుగురిపై హత్య, పదిమందిపై నేరపూరిత కుట్ర, కిడ్నాప్ నేరాలు రుజువైనట్లు ఢిల్లీలోని సీబీఐ కోర్టు శుక్రవారం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. మరొకరిపై కేవలం సాక్ష్యాలను ధ్వంసం చేసిన కేసు మాత్రమే రుజువైంది. ఘజియాబాద్‌కు చెందిన ఎంబీఏ విద్యార్థి రణ్‌బీర్ సింగ్ 2009 జూలైలో డెహ్రాడూన్‌లోని మోహిని రోడ్డులో 29 బుల్లెట్ గాయాలు తగిలి మరణించి కనిపించాడు. అతడు బెదిరింపుల రాకెట్ నడుపుతున్నాడని పోలీసులు ఆరోపించారు. కానీ, అది తప్పని తేలింది. కోర్టు మొత్తం 17 మంది పోలీసులను దోషులుగా తేల్చి, సోమవారం నాడు వారికి శిక్ష విషయం తేలుస్తామని తెలిపింది. దాంతో, దోషులందరికీ ఉరిశిక్ష విధించాల్సిందేనని ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది కోరారు. -
బూటకపు ఎన్కౌంటర్ కేసులో సంచలన తీర్పు
-
బూటకపు ఎన్కౌంటర్ కేసులో.. 17 మంది పోలీసులకు శిక్ష
న్యూఢిల్లీ: ఐదేళ్ల క్రితం జరిగిన ఓ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ సీబీఐ కోర్టు 17 మంది పోలీసులను దోషులుగా నిర్ధారించింది. 18 మంది భద్రతా సిబ్బందిపై ఆరోపణలు రాగా ఒకరు మాత్రం కేసు నుంచి బయటపడ్డారు. నిందితులకు సీబీఐ కోర్టు శనివారం శిక్షలను ఖరారు చేసే అవకాశముంది. ఉత్తరాఖండ్‌లోని డూన్లో 2009లో రణ్‌బీర్ అనే ఎంబీఏ విద్యార్థిని ఎన్కౌంటర్ పేరుతో పోలీసులు కాల్చిచంపారు. ఎలాంటి నేరం చేయని రణ్‌బీర్ ను చంపడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌పై బాధితుడి బంధువులు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం 17 మందిపై హత్య, కిడ్నాప్, కుట్ర అభియోగాలు రుజువయ్యాయి. కోర్టు తీర్పు అనంతరం రణ్‌బీర్ తండ్రి మాట్లాడుతూ.. కోర్టు తీర్పు వల్ల తన కొడుకు తిరిగిరాడని, ఆ నష్టం పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిందితులను కఠినంగా శిక్షించడం వల్ల ఇలాంటి నేరాలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని వ్యాఖ్యానించారు. -
మల్కాన్‌గిరి ఎన్కౌంటర్ బూటకం:ఏపీసీఎల్సీ
ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కొడియా, కోరాపూట్ అటవీ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున మావోయిస్టుల, పోలీసులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ బూటకమని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. చనిపోయిన వారందరికి సంఘటన స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మల్కాన్‌గిరిలో ఎన్కౌంటర్ పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. అయితే ఆ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు గాజర్ల రవి భార్య మీనా ఉన్నట్లు సమాచారం. కొడియా, కోరాపూట్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు సమావేశామయ్యారని సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఆ క్రమంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ క్రమంలో 14 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవలే ఆంధ్ర - ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరలో నలుగురు జవాన్లు మరణించారు. అనాటి నుంచి ఏవోబీ సరిహద్దుల్లో భద్రత బలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే.