- డీజీ వంజర, పీపీ పాండేలకు బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు
అహ్మదాబాద్: ఇష్రాత్ జహా నకిలీ ఎన్‌కౌంటర్ కేసులో నిందితులైన ఐపీఎస్ అధికారులు డీజీ వంజర, పీపీ పాండేలకు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. అహ్మదాబాద్ సిటీ క్రైమ్‌బ్రాంచ్‌లో, ఉగ్రవాద వ్యతిరేక బృందం(ఏటీఎస్)లో వంజర కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో.. చట్టాల్ని చేతుల్లోకి తీసుకుని చేసిన హత్యల సంఖ్య ఒక్కసారిగా పెరిగిందని, ఆయనను బెయిల్‌పై విడుదల చేయడం సమాజానికి హానికరమని, కేసు విచారణను ఆయన ప్రభావితం చేయగలరని ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను కోర్టు పట్టించుకోలేదు.
ఇష్రాత్ జహా, సోహ్రాబుద్దీన్ షేక్, తులసీరామ్ ప్రజాపతిల నకిలీ ఎన్‌కౌంటర్ కేసులకు సంబంధించి డీజీ వంజర 2007 ఏప్రిల్ నుంచి.. దాదాపు గత 8 ఏళ్లుగా ఆయన జైళ్లోనే ఉన్నారు. డీజీ వంజరకు బెయిల్ మంజూరు చేస్తూ.. దేశం విడిచివెళ్లరాదని, గుజరాత్‌లో ఉండకూడదని, ప్రతీ శనివారం కోర్టుకు హాజరుకావాలని కోర్టు షరతులు విధించింది. రూ. 2 లక్షల వ్యక్తిగత పూచికత్తును సమర్పించాలని ఆదేశించింది. అలాగే, గత 18 నెలలుగా జైళ్లో ఉంటున్న అదనపు డీజీపీ ర్యాంక్ అధికారి పాండేకు కూడా బెయిలు మంజూరుచేసింది