పట్నా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో 26 ఏళ్ల క్రితం జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో ఇద్దరు పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఒక హత్యను ఎన్‌కౌంటర్‌గా చిత్రించిన నాటి పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్‌కి ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసు దర్యాప్తు సీఐడీకి, అనంతరం సీబీఐకి వెళ్లడంతో ఈ కేసులో చిక్కుముడి వీడింది.
ఈ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో బర్హారా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్‌ఛార్జికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ఇటీవలే ఇన్‌స్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఇదే కేసులో బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్‌కు పట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనితోపాటు రూ.3 లక్షల ఒక వేయి రూపాయల జరిమానా విధించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అవినాష్ కుమార్ విచారణ అనంతరం పూర్నియా మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్ ముఖ్‌లాల్ పాశ్వాన్‌ను ఐపీసీ సెక్షన్లు 302, 201, 193, 182 కింద దోషిగా పేర్కొంటూ ఈ శిక్షను విధించారు.
జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నాడు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ముఖ్‌లాల్ పాశ్వాన్ ఇటీవలే పదోన్నతి పొంది డీఎస్‌పీగా నియమితులయ్యారు. ఇదే కేసులో మరో నిందితుడైన బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్‌స్పెక్టర్ అరవింద్ కుమార్ ఝాకు ఐపీసీ సెక్షన్ 193 కింద కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు కోర్టు రూ.50,000 జరిమానా విధించింది. జరిమానా మొత్తం చెల్లించని పక్షంలో, ఇతను అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.
ఈ కేసు 1998 నాటిదని సీబీఐకి చెందిన ఢిల్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్రేష్ కుమార్ తివారీ తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఒక నేరస్తుడిని వెదికేందుకు పోలీసులు పూర్నియాలోని బిహారీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని జగదీష్ ఝా ఇంటిని చుట్టుముట్టి, సంతోష్ కుమార్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంతోష్ కుమార్ సింగ్ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిపై తొలుత స్థానిక పోలీసు అధికారుల స్థాయిలో విచారణ జరిగింది. అనంతరం దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. అక్కడి నుంచి కేసు సీబీఐకి చేరింది. ఈ కేసులో ఆరోపణలను రుజువు చేసేందుకు సీబీఐ కోర్టు 45 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.
ఇది కూడా చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరం
Comments
Please login to add a commentAdd a comment