
ముజఫర్‌పూర్: అవినీతికి పాల్పడుతున్న పోలీసులకు సంబంధించిన ఉదంతాలను మనం అప్పుడప్పుడూ వింటుంటాం. ఇటువంటి ఘటనలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందిస్తూ, అవినీతికి పాల్పడిన పోలీసులను సస్సెండ్ చేస్తుంటారు. అయితే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో పోలీసుల అవినీతి బాగోతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ముజఫర్‌పూర్ పరిధిలోని మీనాపూర్ పోలీస్ స్టేషన్(Meenapur Police Station)కు వచ్చిన వృద్ధ దంపతులకు చేదు అనుభవం ఎదురయ్యింది. తమ కుమారుడు తప్పిపోయాడని, అతనిని వెదికిపెట్టాలంటూ వచ్చిన ఆ వృద్ధ తల్లిదండ్రుల విషయంలో పోలీసులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తమ కుమారుడిని వెదికి పెట్టాలంటే రెండు కిలోల వెల్లుల్లి, ఐదు వందల రూపాయలు ఇవ్వాలని స్టేషన్ ఇన్‌స్పెక్టర్ డిమాండ్ చేస్తున్నారని ఆ వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. కేసు ఇన్ఫార్మర్ యోగేంద్ర భగత్ మీడియాతో మాట్లాడుతూ ఆ దంపతుల ఏకైక కుమారుడు అజిత్ కుమార్ సిటీకి వెళ్లిన తరువాత అదృశ్యమయ్యాడన్నారు. మీనాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదన్నారు.
బాధిత దంపతులు మీడియాతో మాట్లాడుతూ తాము స్టేషన్‌కు వెళ్ళినప్పుడల్లా పోలీసు అధికారులు(Police officers) తమను దూషిస్తూ, అక్కడి నుండి తరిమివేస్తుంటారని చెప్పారు. పోలీస్ ఇన్స్పెక్టర్ రెండు కిలోల వెల్లుల్లి, రూ.500 ఇస్తే కేసు దర్యాప్తు చేస్తామని చెబుతున్నారన్నారు. మా ఇంట్లో 50 గ్రాముల వెల్లుల్లి కూడా లేదని, అలాంటప్పుడు తాము రెండు కిలోల వెల్లుల్లిని ఎలా ఇవ్వగలమని బాధిత తండ్రి వాపోయాడు. తాజాగా బాధిత కుటుంబం బీహార్ మానవ హక్కుల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేసింది. ఈ సందర్భంగా మానవ హక్కుల న్యాయవాది మాట్లాడుతూ పోలీసులు ఈ కేసును పరిష్కరించడానికి బదులుగా, మరింత క్లిష్టతరం చేస్తున్నారని అన్నారు. దీనిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. పోలీసులు ఈ కేసును దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే సీఐడీ దర్యాప్తు ఖచ్చితంగా అవసరమని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘డాన్స్ కోసం పుట్టి.. ప్రొఫెసర్ అయ్యారు’