
దేశంలో వక్ఫ్(సవరణ) చట్టం– 2025 ఇటీవల అమల్లోకి వచ్చింది. విపక్షాల అభ్యంతరాలను తోసిరాజని ఈ సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఈ బిల్లు అమల్లోకి వచ్చింది. అయితే వక్ఫ్(సవరణ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు పార్టీలతో పాటు మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. మరోవైపు ఈ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఏయే రాష్ట్రాల్లో వక్ఫ్ ఆస్తులు ఎన్నున్నాయే దానిపై కేంద్రం తాజాగా ప్రకటన చేసింది.
దేశంలో వక్ఫ్ ఆస్తులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమబెంగాల్, తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాలున్నాయని తెలిపింది. దేశంలో వక్ఫ్‌కు సంబంధించి 8,72,352 స్థిరాస్తులు, 16,713 చరాస్తులు ఉన్నాయని ప్రకటించింది. అలాగే ఇప్పటివరకు 994 వక్ఫ్ ఆస్తులను ఇతర అవసరాలకు కేటాయించినట్లు వివరించింది. ఉత్తరప్రదేశ్‌లో సున్నీల స్థిరాస్తులు 2,17,161, షియాల స్థిరాస్తులు 15,386 ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 14,685 స్థిరాస్తులు, 85 చరాస్తులున్నట్లు తెలిపింది. తెలంగాణలో 45,682 స్థిరాస్తులు ఉన్నట్టు ప్రకటించింది.
