
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పహల్గాం దాడులపై పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దని స్పష్టం చేసింది. తాజాగా కొందరు కాంగ్రెస్ నేతలు దాడులపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేకూర్చేవి ఉన్నాయని పెద్దలు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నాం 2.30గం. ప్రాంతంలో సైన్యం దుస్తుల్లో వచ్చిన ఐదారుగురు ఉగ్రవాదులు.. పహల్గాం బైసరన్‌లోయ పిక్నిక్ స్పాట్‌లో పర్యాటకుల్ని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ఒక స్థానికుడితో సహా 25 మంది టూరిస్టులు కన్నుమూశారు. అయితే ఈ దాడిని పార్టీలకతీతంగా రాజకీయ నేతలు ఖండిస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదమే చోటు చేసుకుంది. పహల్గాం దాడి వెనుక నిఘా వర్గాల వైఫల్యం ఉండొచ్చని, ఏ దేశం కూడా వంద శాతం ఇలా దాడులను పసిగట్టకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ శశిథరూర్‌పై తీవ్రంగా స్పందించారు. థరూర్ కాంగ్రెస్‌లో ఉన్నారా? బీజేపీలో ఉన్నారా? అని ప్రశ్నించారు. ‘సూపర్ బీజేపీ మ్యాన్’గా మారేందుకు ప్రయత్నిస్తున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..
ఈ పరిణామాలను అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. భవిష్యత్తులో ఇతర నేతలు ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఇద్దరు నేతలను మందలించినట్లు కూడా ఇండియా టుడే ఓ కథనం ప్రచురించింది.