యూపీలో 9 స్థానాల ఉప ఎన్నికల్లో ఎస్పీతో కలిసి కాంగ్రెస్ దిగ్గజాల ప్రచారంపై స్పష్టత కరువు
వయనాడ్ ఎన్నికలు ముగిశాక రాహుల్, ప్రియాంక ప్రచారం ఉంటుందని భావించినా ఖరారు కాని షెడ్యూల్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతల ప్రచారంపై సందిగ్ధత నెలకొంది. వయనాడ్ ఉప ఎన్నికకు పోలింగ్ ఈ నెల 13న ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాందీ, ప్రియాంకగాందీలు యూపీలో ఈ నెల 20న 9 స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావించినా ఇంతవరకు పార్టీ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్, ప్రియాంకలు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో వారు ప్రచారం చేయడం కష్టమేనని తెలుస్తోంది. నిజానికి యూపీలో జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావించింది. 9 స్థానాలకు గానూ కనీసంగా 4 స్థానాలకు తమకు వదిలేయాలని భాగస్వామ్య పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ నుంచి సానుకూల స్పందన రాలేదు.
చివరి 2 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ అంగీకరించినా, గెలుపు అవకాశాలు లేకపోవడంతో వాటిల్లో పోటీకి కాంగ్రెస్ నిరాకరించింది. తొమ్మిది స్థానాల్లోనూ ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో అఖిలేశ్ యాదవ్ దూకుడుగా ప్రచారం చేస్తున్నారు. అధికార బీజేపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనేతలు మాత్రం ఇంతవరకు ప్రచారంలో పాల్గొనలేదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు అజయ్‌రాయ్ సహా మాజీ ఎంపీ పీఎల్ పునియాలు ఎస్పీతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రచారం కోసం కాంగ్రెస్, ఎస్పీలు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్ర సీఎల్‌పీ నేత ఆరాధన మిశ్రా, కాంగ్రెస్ ఎంపీ తనూజ్ పునియాలు ఎస్పీతో కలిసి సంయుక్త ర్యాలీలు నిర్వహిస్తున్నా, అంతంతమాత్రం స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలతో ఉమ్మడి ప్రచార ప్రణాళికను రూపొందించాలనే డిమాండ్‌లు వస్తున్నాయి. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, బహిరంగ సభల కోసం సత్వరమే షెడ్యూల్ ఖరారు చేసి, అధికార బీజేపీ విభజన రాజకీయాలను బట్టబయలు చేసే కార్యాచరణ తీసుకోవాలని ఇరు పారీ్టల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా.. అగ్రనేతల ప్రచారంపై ఇంతవరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment