బీహార్‌లోని పూర్ణియా లోక్‌సభ స్థానం నుంచి ఇటీవలే ఎన్నికైన ఎంపీ కొత్త చిక్కుల్లో పడ్డాడు. ఎన్నిక అయ్యాడో లేదో.. బెదిరింపులకు, బలవంతపు వసూళ్లకు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇవే ఆరోపణలపై ఆయనపై పోలీసు కేసు కూడా నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి...
పూర్ణియా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెలువడిన విషయం మనకు తెలిసిందే. అయితే అదే రోజున ఆ నియోజకవర్గ అభ్యర్థి, రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ బలవంతపు వసూళ్లు మొదలుపెట్టాడు. స్థానిక ఫర్నీచర్ వ్యాపారి ఒకరిని తన ఇంటికి పిలిపించుకుని రూ.కోటి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. డబ్బులివ్వకుంటే చంపేస్తానని కూడా పప్పూయాదవ్ ఆ ఫర్నీచర్ వ్యాపారిని బెదిరించినట్లు సమాచారం. వచ్చే ఐదేళ్లు ప్రశాంతంగా బతకాలంటే తనకు కోటి రూపాయలు ఇవ్వాల్సిందేనని పప్పూ యాదవ్ తనను బెదిరించారని ఆ వ్యాపారి తెలిపారు.
అయితే ఆ వ్యాపారి పప్పూ యాదవ్ బెదిరింపులకు లొంగలేదు సరికదా.. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో పోలీసులు జూన్ 10వ పూర్నియాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్‌లో పప్పు యాదవ్‌తో పాటు అతని స్నేహితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్ణియా ఎంపీ తనను గతంలోనూ డబ్బుల కోసం బెదిరించినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2021 ఏప్రిల్ 2న పప్పూ యాదవ్ తన నుంచి రూ.10 లక్షల సొమ్ము డిమాండ్ చేశాడని, 2023లోనూ దుర్గాపూజ సందర్భంగా రూ.15 లక్షల నగదుతోపాటు రెండు సోఫా సెట్లు కావాలని కోరినట్లు ఆ వ్యాపారి తన ఫిర్యాదులో వివరించారు.
కాగా ఈ వ్యవహారంపై ఎంపీ పప్పూ యాదవ్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదు. పప్పూ యాదవ్ ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, విజయం సాధించారు. ఆయనకు 5.67 లక్షలకు పైగా ఓట్లు రాగా, జేడీయూ అభ్యర్థికి 5.43 లక్షల ఓట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment