
గువాహటి: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ప్రతిపక్ష పార్టీ ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రెటిక్ ఫ్రంట్((AIUDF) ఎమ్మెల్యే అమినుల్ ఇస్లాంను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి ఘటనలను ప్రభుత్వ కుట్రలో భాగమేనని నోరు జారిన ఎమ్మెల్యే అనిముల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎమ్మెల్యే అమినుల్ పై బీఎన్ఎస్ సెక్షన్లు 152/196/197(1)/113(3)/352/353 నమెదు చేసిన పోలీసులు.. గురువారం అరెస్ట్ చేశారు. బుధవారం అమినుల్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించడంతో సుమోటో కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయాన్ని ‘ ఎక్స్’ వేదికగా స్పష్టం చేశారు పోలీసులు.
పాక్ కు సపోర్ట్ గా నిలిస్తే కఠిన చర్యలు: సీఎం
ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతుగా నిలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం రాష్ట్ర సీఎం హిమాంతా బిశ్వా శర్మ స్పష్టం చేశారు. ఇందులో చిన్నా పెద్దా తేడా ఏమీ లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంచితే, ఎమ్మెల్యే అమినుల్ వ్యాఖ్యలతో తమకు ఏమీ సంబంధం లేదని అంటోంది ఏఐడీయూఎఫ్. ఈ విషయంలో తాము ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని, అమినుల్ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని ఏఐడీయూఎఫ్ చీఫ్ మౌలానా బదరుద్దీన్ తెలిపారు.