
పాట్నా: ఓ ఊరి గ్రామస్తులు దారుణానికి ఒడిగట్టారు. ఊర్లో పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులపై దాడుల చేశారు. గ్రామస్తులు చేసిన దాడుల్లో ఏఎస్‌ఐ దుర్మరణం పాలయ్యారు.
బీహార్ రాష్ట్రం, అరారియా జిల్లా ఫుల్కహా అనే గ్రామంలో అన్మోల్ యాదవ్ ఓ పేరు మోసిన క్రిమినల్. పలు నేరాలకు పాల్పడి.. పోలీసులు కళ్లు గప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఈ క్రమంలో బుధవారం అన్మోల్ యాదవ్ తన స్వగ్రామంలో పెళ్లి చేసుకుంటున్నాడనే సమాచారం పోలీసులకు అందింది.
వెంటనే ఫుల్కహా గ్రామంలో పోలీసులు మోహరించారు. పెళ్లి చేసుకుంటున్న క్రిమినల్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో గ్రామస్తులు రెచ్చిపోయారు. పోలీసులపై దాడులకు తెగబడ్డారు. దాడుల్లో ఏఎస్‌ఐ రాజీవ్ రంజన్ మాల్ దెబ్బలకు తాళలేక స్పృహ కోల్పోయాడు. అప్రమత్తమైన పోలీసులు రాజీవ్ రంజన్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షల్లో ఏఎస్‌ఐ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని ఎస్పీ అంజన్ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామంలో ఆరుగురు ఆనుమోల్ యాదవ్ మద్దతుదారుల్ని అరెస్ట్ చేశారు. అనుమోల్ యాదవ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment