
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక భేటీ జరిగింది. 2 గంటలకుపైగా సమావేశం కొనసాగింది. పహల్గామ్ మృతులకు అఖిలపక్షం నివాళులర్పించింది. నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఉగ్రదాడి అనంతరం తీసుకున్న చర్యలపై అఖిలపక్షానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఉగ్రదాడుల్ని ఎదుర్కోవడంలో ఆయా పార్టీల సలహాలను కోరింది.
ఉగ్ర దాడులను అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కశ్మీర్‌లో శాంతి నెలకొనాలని.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా సమర్థిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు జైశంకర్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజుజు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.
కశ్మీర్‌లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి: మిథున్‌రెడ్డి
ఉగ్రదాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా వైఎస్సార్‌సీపీ మద్దతు ఉంటుంది. కశ్మీర్‌లో అశాంతి నెలకొల్పే శక్తులను అణచివేయాలి. భద్రతను మరింత పటిష్టం చేయాలి. త్వరగా ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలని మిథున్‌రెడ్డి డిమాండ్ చేశారు.