officer
-
జాహ్నవి కందుల కేసులో ఎట్టకేలకు న్యాయం!
భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల(Jaahnavi Kandula) కేసులో విద్యార్థుల, ఎన్నారైల పోరాటం ఫలించింది. ఆమె మృతికి కారణమైన అధికారిని విధుల్లోంచి తొలగించినట్లు సియాటెల్ పోలీస్ శాఖ ప్రకటించింది. ఇంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మరణం గురించి చులకనగా మాట్లాడిన అధికారిపై సైతం వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసులో న్యాయం జరిగినట్లైంది!.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జాహ్నవి కందుల(23).. 2023,జనవరి 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి అతివేగంగా పాట్రోలింగ్ వాహనం నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీ కొట్టాడు. దీంతో.. ఆమె చాలాదూరం ఎగిరిపడి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది.అయితే విధి నిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని.. కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీస్ శాఖ భావించింది. అలాగే ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపించాయి. జస్టిస్ ఫర్ జాహ్నవి పేరుతో విద్యార్థులు ఫ్లకార్డులతో రోడ్డెక్కి నిరసనసలు చేపట్టారు. దీంతో సియాటెల్ పోలీస్ శాఖ దిగొచ్చింది. ఉన్నతస్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురు చూసింది. చివరకు చర్యలకు ఉపక్రమించింది. ఇదీ చదవండి: జాహ్నవికి మరణానంతర డిగ్రీ‘‘ఘటనలో ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చు. డ్రగ్స్ ఓవర్‌డోస్ అయిన బాధితుడ్ని రక్షించాలని ఆయన తాపత్రయపడ్డారు. ఆ క్రమంలోనే తన వాహనంతో ఢీ కొట్టి ప్రాణం పోయేందుకు కారణం అయ్యారు. అయితే ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారు. సియాటెల్ పోలీస్ విభాగానికి చెడ్డ పేరు తెచ్చారు. డిపార్ట్మెంట్ పాలసీల్లో నాలుగింటిని ఆయన ఉల్లంఘించారు. అందుకే సియాటెల్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి డేవ్‌ను తొలగించాం’’ అని సియాటెల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రెహర్ ప్రకటించారు. ఆమె ప్రకటనను సియాటెల్ టైమ్స్ సోమవారం ప్రచురించింది. అంతకు ముందు.. ఇదే కేసులో ఆమె మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడెరెర్‌ను సైతం గతేడాది సెప్టెంబర్‌లో విధుల్లోంచి తొలగించారు.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి(23) గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్లింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా.. ఆమె ప్రాణం విలువ గురించి మరో అధికారి చులకనగా మాట్లాడారు. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి Just a regular person.. ఈ మరణానికి విలువలేదు. ఆమె జీవితానికి పరిమితమైన విలువ ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుందని.. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి 11 వేల డాలర్లు ఇస్తే సరిపోతుంది’ అని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నారైల నుంచి, విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో దర్యాప్తు అనంతరం అతన్ని విధుల్లోంచి తొలగించింది. అయితే.. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని డేనియల్ అడెరె వివరణ ఇచ్చినప్పటికీ వేటు మాత్రం తప్పలేదు. -
పాక్‌లో తొలి హిందూ పోలీసు అధికారిగా రాజేందర్ మేఘ్వార్
న్యూఢిల్లీ: మన దాయాది దేశం పాకిస్తాన్లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్‌లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అక్కడి పోలీస్ సర్వీసెస్‌కు రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు.దీంతో పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేఘ్వార్ చరిత్ర సృష్టించారు. ఈ నేపధ్యంలో రాజేందర్ మేఘ్వార్ భారత్‌లోనూ వార్తల్లో నిలిచారు. రాజేందర్ తాను పాక్‌లో మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్‌లోని ఫైసలాబాద్ పోలీస్‌శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా రాజేందర్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ పరిధిలోని బాడిన్కు చెందిన రాజేందర్ మేఘ్వార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన చిరకాల కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలు సులభంగా తెలుస్తాయని, అప్పుడే వాటిని పరిష్కరించగలనని రాజేందర్ మేఘ్వార్ తెలిపారు.ఒక పోలీసు అధికారిగా తన పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. రాజేందర్ మేఘ్వార్ రాకతో పాక్‌లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా రాజేందర్ మేఘ్వార్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. రహీమ్ యార్ ఖాన్‌కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్ అరెస్ట్
సాక్షి, ప్రకాశం జిల్లా: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి విజయ్‌పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన కేసులో విజయ్‌పాల్‌ను ఈ రోజు కూడా పోలీసులు విచారించారు. రాజకీయ కక్షతోనే విజయ్‌పాల్‌ను అరెస్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.ఈనెల 13న విజయ్‌పాల్ మొదటి సారి విచారణకు హాజరయ్యారు. రెండోసారి ఈ రోజు(మంగళవారం) విచారించిన అనంతరం ఆయనను అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. -
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. -
ఐఏఎస్ టీనా దాబీ వైరల్ .. అధికార పార్టీ నేతకు వంగి వంగి దండాలు
జైపూర్ : ఒకటి,రెండు,మూడు.. ఇదంతా ఏంటని అనుకుంటున్నారా? ఓ జిల్లా ఐఏఎస్ అధికారిణి సదరు అధికార పార్టీ నేతకు వంగి వంగి పెట్టిన దండాలు. ఇప్పుడీ అంశంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏఎస్ అధికారిణి టీనా దాబి గత నెలలో రాజస్థాన్ రాష్ట్రం బార్మర్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరంలో పరిశుభ్రత, స్వచ్ఛత కోసం ‘నవో బార్మర్’ పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా నవో బార్మర్ కార్యక్రమానికి రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ పూనియాను ఆహ్వానించారు."दादागिरी करके सफाई करवा रहे हो, बाड़मेर भी इंदौर जैसा हो जाएगा। आप अच्छा काम कर रही हो।"#tinadabi @DrSatishPoonia pic.twitter.com/DDc16wrtcf— Mukesh Mathur (@mukesh1275) October 24, 2024 అయితే కార్యక్రమానికి వచ్చిన సతీష్ పూనియా కాన్వాయ్ నుంచి దిగి వస్తూనే ఫోన్లో బిజీ అయ్యారు. అదే సమయంలో సతీష్ పూనియాను ఆహ్వానించేందుకు వచ్చిన టీనా దాబి ఆయనకు వంగి వంగి దండాలు పెట్టింది. ఏడు సెకన్ల వ్యవధిలో ఐదుసార్లు నమస్కరించారు. కొద్ది సేపటి తర్వాత టీనా దాబి పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండోర్ మాదిరిగా బార్మర్ కూడా మారుతుందని అన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సతీష్ పూనియాకు జిల్లా కలెక్టర్ టీనా దాబి వంగి వంగి దండాలు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. సంచలనాలకు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టీనా దాబిరాజస్థాన్కు చెందిన టీనా దాబి.. ఢిల్లీ లేడీ శ్రీ రామ్ కాలేజీలో చదివారు. దళిత వర్గం నుంచి మొదటి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచిన ఫీట్‌ను సొంతం చేసుకున్నారు. టీనా దాబి 2015 సివిల్స్ సర్వీసెస్ ఎంట్రెన్స్‌లో టాపర్. రెండో ర్యాంకర్ అథర్ అమీర్ ఖాన్. వీళ్లిద్దరూ రిలేషన్లో ఉన్నట్లు 2016లో సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ సమయంలో మతపరమైన చర్చతో పెను దుమారమే చెలరేగింది. అయినా ఈ జంట వెనక్కి తగ్గలేదు. 2018లో వీళ్లద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమవివాహం చేసుకున్నారు. ఢిల్లీలో జరిగిన వీళ్ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు వెంకయ్య నాయుడు, సుమిత్ర మహాజన్ లాంటి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. అయితే.. 2020లో విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట..2021లో జైపూర్ కోర్టు నుంచి అధికారికంగా విడాకులు కూడా తీసుకుంది.గతేడాది 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ప్రదీప్ గవాన్డేతో ఆమె నిశ్చాతార్థం చేసుకున్నారు. టీనా కంటే ఆయన మూడేళ్లు సీనియర్ బ్యాచ్. గ్లామర్ ఉన్న ఆఫీసర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. టీనా దబీకి సుమారు మిలియన్న్నర ఫాలోవర్లు ఉన్నారు. టీనా సోదరి రియా దాబి 2020 ఐఏఎస్ ఫలితాల్లో 15వ ర్యాంకు సాధించింది. -
బూటకపు ఎన్కౌంటర్.. డీఎస్పీకి జీవితఖైదు
పట్నా: బీహార్‌లోని పూర్నియా జిల్లాలో 26 ఏళ్ల క్రితం జరిగిన బూటకపు ఎన్కౌంటర్ కేసులో ఇద్దరు పోలీసులు చిక్కుల్లో పడ్డారు. ఒక హత్యను ఎన్‌కౌంటర్‌గా చిత్రించిన నాటి పోలీస్‌స్టేషన్ ఇన్ఛార్జ్కి ఉచ్చు బిగుసుకుంది. ఈ కేసు దర్యాప్తు సీఐడీకి, అనంతరం సీబీఐకి వెళ్లడంతో ఈ కేసులో చిక్కుముడి వీడింది.ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో బర్హారా పోలీస్ స్టేషన్ మాజీ ఇన్ఛార్జికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఆయన ఇటీవలే ఇన్స్పెక్టర్ నుంచి డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఇదే కేసులో బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్కు ఐదేళ్ల శిక్ష పడింది. ఈ బూటకపు ఎన్కౌంటర్ కేసులో మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్‌కు పట్నాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనితోపాటు రూ.3 లక్షల ఒక వేయి రూపాయల జరిమానా విధించింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అవినాష్ కుమార్ విచారణ అనంతరం పూర్నియా మాజీ పోలీస్ స్టేషన్ చీఫ్ ముఖ్లాల్ పాశ్వాన్‌ను ఐపీసీ సెక్షన్లు 302, 201, 193, 182 కింద దోషిగా పేర్కొంటూ ఈ శిక్షను విధించారు.జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా మరో ఏడాదిన్నర శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. నాడు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ముఖ్లాల్ పాశ్వాన్ ఇటీవలే పదోన్నతి పొంది డీఎస్పీగా నియమితులయ్యారు. ఇదే కేసులో మరో నిందితుడైన బీహారీగంజ్ పోలీస్ స్టేషన్ మాజీ సబ్ ఇన్స్పెక్టర్ అరవింద్ కుమార్ ఝాకు ఐపీసీ సెక్షన్ 193 కింద కోర్టు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు కోర్టు రూ.50,000 జరిమానా విధించింది. జరిమానా మొత్తం చెల్లించని పక్షంలో, ఇతను అదనంగా మరో ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.ఈ కేసు 1998 నాటిదని సీబీఐకి చెందిన ఢిల్లీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమ్రేష్ కుమార్ తివారీ తెలిపారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం ఒక నేరస్తుడిని వెదికేందుకు పోలీసులు పూర్నియాలోని బిహారీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలోని జగదీష్ ఝా ఇంటిని చుట్టుముట్టి, సంతోష్ కుమార్ సింగ్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంతోష్ కుమార్ సింగ్ మృతిచెందాడు. అయితే ఈ ఘటనను పోలీసులు ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దీనిపై తొలుత స్థానిక పోలీసు అధికారుల స్థాయిలో విచారణ జరిగింది. అనంతరం దర్యాప్తును సీఐడీకి అప్పగించారు. అక్కడి నుంచి కేసు సీబీఐకి చేరింది. ఈ కేసులో ఆరోపణలను రుజువు చేసేందుకు సీబీఐ కోర్టు 45 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది.ఇది కూడా చదవండి: రుణ మార్గదర్శకాలు కఠినతరం -
మొత్తం చెరువులెన్ని.. ఎన్ని మిగిలాయి?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరం పరిధిలో మొత్తంగా ఎన్ని చెరువులు ఉండేవి? ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? ఎంత మేర ఆక్రమణలకు గురయ్యాయి? అనే లెక్కలను శాస్త్రీయంగా తేల్చాలని ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’నిర్ణయించింది. దీని కోసం సర్వే ఆఫ్ ఇండియా సహకారం తీసుకోనుంది. ఈ మేరకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇతర అధికారులు మంగళవారం హబ్సిగూడలో ఉన్న సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయానికి వెళ్లారు.సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ బీసీ పరీడా, సూపరింటెండెంట్ ఆఫ్ సర్వే దేబబ్రత పాలిత్తోపాటు ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. సర్వే ఆఫ్ ఇండియా గతంలో రూపొందించిన మ్యాప్‌లను రంగనాథ్ పరిశీలించారు. 1971–72 నాటి సర్వే ప్రకారం నగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి? అప్పట్లో వాటి విస్తీర్ణం ఎంత? నాలాలు ఎక్కడెక్కడ, ఎంత విస్తీర్ణంలో ఉండేవి? తదితర విషయాలు పరిశీలించారు. తాజా మ్యాప్‌లతో వాటిని సరిపోల్చి చూశారు. ఈ అంశాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హైడ్రా బృందానికి వివరించారు. పూర్తి వివరాలతో నివేదిక రూపకల్పనపై దృష్టి చెరువుల ఫుల్ ట్యాంక్ లెవల్, మాగ్జిమమ్ వాటర్ స్ప్రెడ్ ఏరియాలను గుర్తించడానికి, తాజాగా నిర్థారించడానికి ఇప్పటికే హెచ్ఎండీఏ, ఇరిగేషన్, జీహెచ్‌ఎంసీలతో కలిసి ముందుకు వెళ్తున్న హైడ్రా.. ఇప్పటికే ఆయా విభాగాల నుంచి సమాచారం సేకరించింది. ఆ డేటాను సర్వే ఆఫ్ ఇండియా డేటాతో క్రోడీకరించనుంది. మంగళవారం సర్వే ఆఫ్ ఇండియా అందించిన వివరాలతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువుల పరిస్థితిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని నిర్ణయించింది. సర్వే ఆఫ్ ఇండియా డేటాను డిజిటలైజ్ చేయడంతోపాటు చెరువుల విస్తీర్ణం, నాలాల పొడవు, వెడల్పులను నిర్ధారించి ఈ నివేదికలో పొందుపర్చనుంది. నివేదికకు తుదిరూపు ఇచ్చాక తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రాధాన్యత క్రమంలో చెరువులను గుర్తించి పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. -
ఫ్రెష్‌వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీ సీపీవో రాజీనామా
నాస్డాక్-లిస్టెడ్ సాఫ్ట్వేర్ సంస్థ ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ (CPO) ప్రకాష్ శ్రీనివాసగోపాలన్ రామమూర్తి రాజీనామా చేశారు. ఆగస్టు 14నాటి ఎస్ఈసీ ఫైలింగ్ సమాచారం ప్రకారం.. కొత్తగా నియమితులైన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డెన్నిస్ వుడ్సైడ్కి అక్టోబర్ 1 వరకు రామమూర్తి సహకారంగా ఉంటూ సాఫీగా పరివర్తన జరిగేలా చూస్తారు.మరోవైపు కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ టైలర్ స్లోట్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా అదనపు పాత్రను పోషిస్తారని ఆగస్టు 6న ఎస్ఈసీ ఫైలింగ్‌లో సంస్థ ప్రకటించింది. అలాగే ఫిలిప్పా లారెన్స్‌ను చీఫ్ అకౌంటింగ్ ఆఫీసర్‌గా కంపెనీ నియమించింది. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా సంస్థలో మేనేజ్మెంట్ స్థాయిలో అనేక మార్పులు జరుగుతూ వస్తున్నాయి.సంస్థ అంతర్గత పునర్వ్యవస్థీకరణలో భాగంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న గిరీష్ మాతృభూతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారు. డెన్నిస్ వుడ్‌సైడ్ సీఈవో అయ్యారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత సీపీవో రాజీనామా వ్యవహారం చోటు చేసుకుంది. ఫ్రెష్‌వర్క్స్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ (CRO) ప్రదీప్ రథినం కూడా ఈ ఏడాది ఫిబ్రవరిలో సంస్థకు రాజీనామా చేశారు. -
జేకేలో ఎన్కౌంటర్.. అమరులైన ఐదుగురు జవాన్లు
జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా అడవుల్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఉగ్రవాదుల ఉనికిపై అందిన ఆధారాల దరిమిలా దోడాలోని ఉత్తర ప్రాంతంలో భారత సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.రాష్ట్రీయ రైఫిల్స్, జమ్ముకశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సైనికులు సోమవారం రాత్రి 7.45కి దేశా అటవీ ప్రాంతంలో జాయింట్ కార్డన్, సెర్చ్ ఆపరేషన్ చేపట్టినప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ అధికారి, నలుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారని అధికారులు తెలిపారు. 20 నిమిషాలకు పైగా కాల్పులు జరిగాయి. ఆ ప్రాంతానికి అదనపు బలగాలను పంపామని, చివరి నివేదిక వచ్చే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. -
మహిళా డాక్టర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారి వేధింపులు
-
ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా?
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నంత వరకూ మేయర్ ఎన్నిక వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేసే హక్కు ఎల్జీకి ఉన్నప్పటికీ, ప్రిసైడింగ్ అధికారిగా ఎవరిని నామినేట్ చేయాలనే విషయంలో సీఎం సూచన తప్పనిసరి. సీఎం జైలులో ఉన్నందున సంబంధిత ఫైలును ఢిల్లీ ప్రధాన కార్యదర్శి ఎల్జీ కార్యాలయానికి పంపించాల్సి వచ్చింది.ప్రిసైడింగ్ అధికారిని నామినేట్ చేయకపోవడంతో ఏప్రిల్ 26న మేయర్ ఎన్నిక జరగలేదు. దీంతో ప్రస్తుత మేయర్ షెల్లీ ఒబెరాయ్ తన బాధ్యతలను కొనసాగించనున్నారు. ఆమె ఎంసీడీ సాధారణ సమావేశాలను నిర్వహించడాన్ని కొనసాగిస్తునే ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో ఆర్థిక, విధానపరమైన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. -
గన్ మిస్‌ఫైర్.. డీఎస్పీ మృతి
సాక్షి,భద్రాద్రికొత్తగూడెంజిల్లా: సీఆర్పీఎఫ్ క్యాంపులో గన్ మిస్‌ఫైర్ అయి డీఎస్పీస్థాయి అధికారి శేషగిరి మృతి చెందినట్లు తెలుస్తోంది. చర్ల మండలంలోని పూసుగుప్ప గ్రామంలోని క్యాంపులో బుధవారం(ఏప్రిల్24) ఈ ఘటన జరిగింది. పూసుగుప్ప సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్ క్యాంపులో శేషగిరి విధులు నిర్వహిస్తున్నారు. ఛాతిలోకి బుల్లెట్ దూసుకెవెళ్లడంతో శేషగిరిని చికిత్స నిమిత్తం హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యనా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు వివరాలు గోప్యంగా ఉంచడంతో ఈ ఘటనపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
ఐదుగురు పోలీసులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐదుగురు పోలీసు అధికారులకు ప్రభుత్వం ముఖ్యమంత్రి శౌర్య పతకాలను ప్రకటించింది. దాంతోపాటు ఉగాది పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని పోలీస్, విపత్తుల స్పందన దళం విభాగాల అధికారులు, సిబ్బందికి 255 వివిధ సేవా పతకాలను ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ నెల 15న ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి శౌర్య పతకాలు: కె.వాసు (సీఐ, మేడికొండూరు, గుంటూరు జిల్లా), బి.మధుసూదనరావు (ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె. వెంకట రమణ(రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), కె.సంపత్ రావు (ఆర్ఎస్ఐ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.త్రిమూర్తులు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో), బి.భాస్కర రావు (కానిస్టేబుల్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ బ్యూరో). పోలీసు శాఖలో: ఉత్తమ సేవా పతకాలు 35మందికి, కఠిన సేవా పతకాలు 30మందికి, సేవా పతకాలు 161మందికి విపత్తుల స్పందన విభాగంలో: ఉత్తమ సేవా పతకాలు నలుగురికి, సేవా పతకాలు 25మందికి. -
10 కోట్ల ఆస్తి.. 4 కేజీల బంగారం.. మైండ్ బ్లాక్ అయ్యేలా జ్యోతి ఆస్తులు
-
తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ..
పుట్టపర్తి: శివారులో ఇటీవల ప్రారంభమైన ఓ హోటల్‌కు 3 రోజుల క్రితం తమ చిన్నారి పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు వెళ్లారు. పలు వంటకాలు ఆర్డర్ చేసి తిన్నారు. రుచికరంగా లేవని హోటల్ నిర్వాహకులకు చెబితే.. మాట్లాడే సమయం లేదు, బిల్లు కట్టి వెళ్లాలంటూ దబాయించారు. తీరా ఇంటికెళ్లిన తర్వాత అందరూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు చేసుకున్నారు. హిందూపురం: బస్టాండు పక్కనే ఉన్న హోటల్లో నాలుగు రోజుల క్రితం ఇద్దరు స్నేహితులు భోజనం చేశారు. అన్నం సరిగా ఉడకలేదని అక్కడికి సిబ్బందికి చెబితే... ఇప్పుడే చేశాం, అలాగే ఉంటుందని సమాధానమిచ్చారు. దీంతో చేసేదిలేక స్నేహితులు తిన్నారు. ఇంటికెళ్లాక విరేచనాలు ప్రారంభమయ్యాయి. సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాక కాస్త ఉపశమనం లభించింది. సాక్షి, పుట్టపర్తి: చూడచక్కనైన బోర్డులు పెట్టి ఆకర్షిస్తారు. పసందైన వంటకాల మెనూతో నోరూరిస్తారు. లోపలికి వెళ్లగానే ఘుమఘుమలాడే వాసనలతో మైమరిపింపచేస్తారు. అన్నీ ఫ్రెష్వే అంటూ వడ్డించేస్తారు. కానీ, తిన్నాకే తెలుస్తుంది. మన కళ్లు మనల్ని ఎంతలా మోసం చేశాయో!. ఆస్పత్రికెళ్లి వైద్య చికిత్సలు పొందాకే అర్థం అవుతుంది.. ఆ హోటల్‌కి వెళ్లి ఎంతపెద్ద తప్పు చేశామో!. కల్తీతో కల్లోలం.. జిల్లా వ్యాప్తంగా పలు రెస్టారెంట్లు, హోటళ్లలో కల్తీ ఆహారం వీరవిహారం చేస్తోంది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. రుచికరంగా ఉండేందుకు ఏవి పడితే అవి కలిపేయడం తిన్న వారి ప్రాణాలమీదికొస్తోంది. మరోవైపు నిల్వ ఉంచి వడ్డిస్తున్న వంటకాల ప్రభావం తక్షణమే కనిపిస్తోంది. ఫుడ్ పాయిజన్‌తో ఆస్పత్రులబాట పడుతున్న బాధితుల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. తప్పక తింటూ.. తిప్పలు ఎదుర్కొంటూ.. మారిన జీవనశైలిలో భాగంగా చాలామంది హోటళ్లలో తినడానికి అలవాటుపడ్డారు. దీంతో రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకులు ఉదయంపూట ఒకేసారి వందల మందికి సరిపడా వంటకాలు తయారు చేసి ఉంచుతున్నారు. కస్టమర్లు ఇచ్చే ఆర్డర్ల ఆధారంగా అప్పటికప్పుడు మరోసారి వేడి చేసి ఇస్తున్నారు. అమ్ముడు పోకుండా మిగిలిపోతే ఫ్రిడ్జ్‌లో ఉంచి మరుసటి రోజు అంటగడుతున్నారు. చుక్కలు చూపుతున్నారు. ప్రశ్నిస్తే దౌర్జన్యం.. చాలా హోటళ్లలో ఆహారం తిన్నాక బిల్లులు ఇవ్వడం లేదు. తెల్ల కాగితాలపై రాసి పంపిస్తున్నారు. మరుసటి రోజు కస్టమర్లు గొడవకు దిగినా.. మా హోటల్లో తినలేదంటూ దబాయిస్తున్నారు. తినే సమయంలోనూ ఆహారం బాగుండటం లేదని ప్రశ్నించినా హోటల్ నిర్వాహకులు తిరగబడు తున్నారు. బిల్లు ఇచ్చేది లేదు.. డబ్బు కట్టి వెళ్లాలని దౌర్జన్యం చేస్తున్నారు. తూతూమంత్రపు చర్యలతో సరి..! కల్తీ హోటళ్లపై అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. తూతూమంత్రపు తనిఖీలతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సరిపెడుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో కూడా విఫలమవుతున్నారు. దీంతో చాలామంది ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలీక మిన్నకుండిపోతున్నారు. ఇదే అదనుగా హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు. మీకు ఇష్టం వచ్చిన వాళ్లకు ఫిర్యాదు చేసుకోవాలంటూ రుబాబు చేస్తున్నారు. చర్యలు తీసుకుంటాం ప్రతి నెలా మాకు విధించిన లక్ష్యం మేరకు తనిఖీలు చేస్తున్నాం. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా.. ఆయా ప్రాంతాలకు వెళ్లి తనిఖీ చేసి ళ్లు తీసుకుని ల్యాబ్‌కు పంపిస్తున్నాం. రిపోర్టులు వచ్చిన తర్వాత చర్యలకు ఆదేశిస్తున్నాం. కల్తీ ఆహారం, నిల్వ ఉంచిన ఆహారం వడ్డించే హోటళ్లపై ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటాం. – రామచంద్ర, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి -
సోరెన్ కోసం ఈడీ వెదుకులాట
న్యూఢిల్లీ/రాంచీ: భూ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ప్రశ్నించేందుకు సోమవారం ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఇంట్లో లేరని, ఎక్కడున్నారో జాడ తెలియడం లేదని, సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందని అధికారులు చెప్పారు. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీ బయల్దేరిన సోరెన్ ఎక్కడున్నారో తెలియడం లేదన్నారు. జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని నివాసంలో అందుబాటులో ఉంటానని ఆయన నుంచి మెయిల్ అందినట్లు తెలిపారు. ఈడీ అధికారులు రాత్రి దాకా ఢిల్లీ నివాసంలోనే పడిగాపులు కాశారు. సోరెన్ ఆచూకీ దొరికే దాకా అక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఆయన గురించి ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా అప్రమత్తం చేసినట్టు తెలిపారు. తనకందిన తాజా సమన్లను కక్షసాధింపు చర్యగా మెయిల్లో సోరెన్ అభివర్ణించారు. -
వాయుసేనలో శిక్షణాధికారిగా రైతు బిడ్డ
చోడవరం: రైతు బిడ్డ భారతదేశ యుద్ధ విమానాల్లో శిక్షణ ఇచ్చే అధికారిగా ఎదిగారు. తండ్రి వ్యవసాయం చేసుకుంటూ కుమారుణ్ణి భారత సైన్యంలో చేర్పించగా.. తండ్రి కష్టానికి, ఆశయానికి అనుగుణంగా ఆ కుమారుడు 21 ఏళ్లప్రాయంలోనే ఉన్నత స్థానాన్ని అందిపుచ్చుకున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి చెందిన సాధారణ రైతు మజ్జి గౌరీశంకర్, లక్ష్మి దంపతులకు వెంకటసాయి, దుర్గాప్రసాద్ ఇద్దరు కుమారులు. చిన్నతనం నుంచి ఇద్దరూ చదువులో ముందంజలో నిలిచారు. పెద్ద కుమారుడు ప్రాథమిక విద్య చోడవరంలో చదివి, 6వ తరగతిలో విజయనగరం సైనిక్ స్కూల్లో చేరారు. అక్కడ ఇంటర్మిడియెట్ చదువుతూ భారతదేశ సైనిక విభాగంలో చేరేందుకు శిక్షణ కూడా పొందారు. దేశ రక్షణ విభాగంలో అత్యంత కీలకమైన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) ప్రవేశ పరీక్షల్లో 2019లో ఉత్తమ స్థానం సాధించి ఎన్డీఏలో చేరారు. మూడేళ్లపాటు పుణెలో, ఏడాదిపాటు హైదరాబాద్ దుండిగల్ ఎయిర్‌పోర్టులో యుద్ధ విమానాల్లో శిక్షణ పొందారు. ఎన్డీఏతోపాటు ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్ ఇంజినీరింగ్ (ఈసీఈ) కూడా పూర్తిచేశారు. శిక్షణ అనంతరం దేశ రక్షణ విభాగంలో కీలకమైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ యుద్ధ శిక్షణలో ఫ్లయింగ్ ఆఫీసర్‌గా భారత రక్షణ శాఖ నియమించింది. మజ్జి వెంకటసాయిని అనకాపల్లి కలెక్టర్ రవి పట్టాన్‌శెట్టి మంగళవారం అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులకు వెంకటసాయి మంచి స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. దేశానికి సైన్యాన్ని అందిస్తున్న బెన్నవోలు మారుమూల గ్రామంగా పెద్దేరు నది ఒడ్డున ఉన్న బెన్నవోలు గ్రామం దేశానికి ఎందరో సైనికులను అందించింది. ఆరు దశాబ్దాలుగా గ్రామానికి చెందిన అనేక మంది యువకులు త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలందించారు. పూర్తిగా వ్యవసాయాధారిత గ్రామమైనప్పటికీ దేశ రక్షణకు ఈ గ్రామం చేస్తున్న సేవ అందరి ప్రశంసలు అందుకుంటోంది. నా మొదటి ఆశయం ఇదే చిన్నప్పటి నుంచీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌గా చేరాలని అనుకునేవాణ్ణి. మా అమ్మ, నాన్న కష్టపడి పనిచేస్తూ నా చదువుకు కావలసినవన్నీ సమకూర్చారు. వారి సహకారంతో నా జీవితాశయాన్ని సాధించగలిగాను. దేశానికి సేవ చేయాలన్న నా ఆశయానికి ఫ్లయింగ్ ఆఫీసర్ పోస్టు మరింత దోహదపడుతుంది. – మజ్జి వెంకటసాయి, ఫ్లయింగ్ ఆఫీసర్ -
ఎనిమిదేళ్లుగా మృత్యువుతో పోరాడి.. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ అధికారి
ఢిల్లీ: ఉగ్రదాడిలో గాయపడి ఎనిమిదేళ్లుగా కోమాలో ఉన్న ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ కరణ్‌బీర్ సింగ్ నట్ ప్రాణాలు కోల్పోయారు. టెరిటోరియల్ ఆర్మీ విభాగానికి చెందిన కరణ్‌బీర్ సింగ్ 2015లో చేపట్టిన ఆపరేషన్‌లో ఉగ్రవాద కాల్పుల్లో గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు. టెరిటోరియల్ విభాగాని కంటే ముందు ఆయన 160 ఇన్ఫెంట్రీ విభాగానికి సెకండ్ ఇన్ కమాండ్‌గా పనిచేశారు. అంతకుముందు ఆయన పద్నాలుగేళ్లు సైన్యంలో పనిచేశారు. Army Officer, Who Was In Coma For 8 Years After Gunshot Injuries, Dies https://t.co/9AaAfXz7Vy — NDTV (@ndtv) December 26, 2023 2015 నవంబర్ 17న 41 రాష్ట్రీయ రైఫిల్స్ కుప్వారాలోని కలరూస్ ప్రాంతంలో టెర్రర్ ఆపరేషన్‌ను చేపట్టింది. దీనికి నాయకత్వం వహించిన కల్నల్ సంతోష్ మహదిక్ ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో కరణ్‌బీర్ సింగ్ తలకు తూటా గాయం అయింది. అనంతరం ఆయన్ని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేర్పించారు. కానీ ఇన్నేళ్ల చికిత్స తర్వాత ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇదీ చదవండి: ఖర్గే పేరుతో ఇండియా కూటమిలో చీలిక? -
సియాచిన్‌లో ‘నారీ పర్వం’
లేహ్/జమ్మూ: ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో ప్రప్రథమ మహిళా వైద్యాధికారిగా కెప్టెన్ ఫాతిమా వసీమ్ రికార్డు సృష్టించనున్నారు. మొదటిసారిగా ఆపరేషనల్ పోస్టులో భారత ఆర్మీ ఈమెను నియమించింది. కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని సియాచిన్‌లో బాధ్యతలు చేపట్టనున్న రెండో వైద్యాధికారి ఫాతిమా అని భారత ఆర్మీకి చెందిన ఫైర్ అండ్ ఫ్యురీ కార్ప్స్ మంగళవారం తెలిపింది. సైన్యంలో లింగసమానత్వం పెంచేందుకు తీసుకుంటున్న చర్యల్లో కెప్టెన్ ఫాతిమా నియామకం ఒకటని తెలిపింది. సియాచిన్ బ్యాటిల్ స్కూల్లో కఠోర శిక్షణ పొందిన ఆమె 15,200 అడుగుల ఎత్తులో ఉన్న సియాచిన్ పోస్టులో బాధ్యతలు చేపడతారని వివరించింది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల మధ్య ఈమె బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. కెప్టెన్ గీతికా కౌల్‌ను సియాచిన్‌లో మొదటి మహిళా వైద్యాధికారిగా నియమించినట్లు ఈ నెల మొదటి వారంలో ఆర్మీ ప్రకటించింది. -
TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో..
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ సెటిల్మెంట్లు, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్లో దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా అవతారం ఎత్తిన ప్రవీణ్ సాయి.. పలువురికీ సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు తెర తీశాడు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న అత్తిలి ప్రవీణ్ సాయి.. 6 నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. అతని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. ఇన్నోవా కార్, సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు -
ఐటీ కంపెనీ విప్రోలో కీలక నాయకత్వ మార్పు.. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడి
దిగ్గజ ఐటీ సంస్థ విప్రోలో వచ్చే నెలలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకోనుంది. కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్మన్ డిసెంబర్ 31న వైదొలుగుతున్నట్లు విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో శుక్రవారం ప్రకటించింది. ట్రాట్మన్ను దాదాపు మూడు సంవత్సరాల క్రితం యాక్సెంచర్ పీఎల్సీ నుంయి విప్రో హై-ప్రొఫైల్ హైరింగ్‌లో తీసుకువచ్చింది. విప్రో వెబ్‌సైట్‌లోని ఆమె ప్రొఫైల్ ప్రకారం, ట్రాట్మాన్ అభివృద్ధి భాగస్వాములతో విప్రో సంబంధాలకు నాయకత్వం వహించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌ను అందించారు. విప్రో బ్రాండ్ అవగాహనను మెరుగుపరిచారు. గ్లోబల్, స్ట్రాటజిక్ పర్స్యూట్ టీమ్ ఏర్పాటుతో సహా సంస్థ అంతటా అమ్మకాల సామర్థ్యాలను అభివృద్ధి చేశారు. స్టెఫానీ ట్రాట్మాన్ సమర్పించిన డిసెంబరు 8 నాటి రాజీనామా లేఖ కాపీని కూడా ఫైలింగ్‌లో కంపెనీ పొందుపరిచింది. సంస్థలో కొనసాగిన మూడేళ్ల కాలంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేసిన ట్రౌట్మన్.. విప్రో వెలుపల వ్యక్తిగత, వృత్తిపరమైన లక్ష్యాల కోసమే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. -
ఈడీకి స్టాలిన్ సర్కారు షాక్..!
చెన్నై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. దిండిగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ డాక్టర్ నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకున్నందుకు మధురై జోన్ ఈడీ అధికారి అంకిత్ తివారీని తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ అధికారి అరెస్టు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. డీఎంకే, బీజేపీ పరస్పర మాటల దాడికి దిగాయి. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదని ఎక్స్టార్షన్ డిపార్ట్మెంట్ అని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫైరయ్యారు. ఈడీపై ఎంపీ దయానిధి మారన్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఒక్క అధికారి తప్పు చేస్తే మొత్తం ఏజెన్సీనే తప్పు పట్టడం సరికాదని పేర్కొంది. ఈడీ అధికారి అమాయకుడైతే విజిలెన్స్ పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడని స్టేట్ కాంగ్రెస్ చీఫ్ కె.ఎస్ అళగిరి ప్రశ్నించారు. The Directorate of Vigilance & Anti-Corruption police , Tamil Nadu have arrested an ED Officer for demanding and accepting a bribe of ₹20 Lakh in Dindigul. This shatters the faith citizens have in public institutions, making one wonder if ED stands for Extortion Department or… — Dayanidhi Maran தயாநிதி மாறன் (@Dayanidhi_Maran) December 2, 2023 ఇదీచదవండి..ఎంపీ మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు! -
ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎంల తరలింపు.. అడ్డుకున్న గ్రామస్తులు
నాగారం: నాగారం మండలం పేరబోయినగూడెంలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అధికారులు ఎస్కార్ట్ లేకుండా ఈవీఎంలను తరలిస్తుండటంతో గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.పేరబోయినగూడెం గ్రామంలో సాయంత్రం 5:10గంటలకు పోలింగ్ ముగిసింది. అధికారులు ఎస్కార్ట్ లేకుండానే ఈవీఎం బాక్సులను మినీ బస్సులో ఐదు కిలో మీటర్ల దూరంలో ఉన్న నరసింహులగూడెం వరకు తరలించారు. అదే మాదిరిగా నరసింహులగూడెంలో ఉన్న ఈవీఎంను కూడా మినీ బస్సులో తరలించేందుకు ప్రయత్నించారు. ఇదే సమయంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఈవీఎంలను తన కారులో వేసుకుని నర్సింహులగూడేనికి చేరుకున్నాడు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామస్తులు కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలను గమనించి ఎక్కడివి అని ప్రశ్నించారు. ఈ క్రమంలో సెక్టోరియల్ అధికారి అదనపు ఖాళీ ఈవీఎంలు అని చెప్పే ప్రయత్నం చేస్తుండగానే ఎస్కార్ట్ లేకుండా ఈవీఎం బాక్సులను తరలించవద్దని ఆందోళనకు దిగారు. కారులో ఉన్న ఖాళీ ఈవీఎంలు పోలింగ్ అయిన ఈవీఎంల స్థానంలో మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. దీంతో సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సెక్టోరియల్ అధికారి వెంట అదనపు ఏవీఎంలు ఉంటాయని గ్రామస్తులకు వివరించే ప్రయత్నిం చేశారు. అయినా ఆందోళన విరమించకుండా బాక్సులు తారుమారు చేసే కుట్ర చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు అక్కడి నుంచి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి ఈవీఎంలను తరలించారు. గ్రామస్తులు అనుమానంతో ఈవీఎంలు తరలిస్తున్న వాహనాన్ని భద్రపరిచే స్థలం తుంగతుర్తి వరకు వెంబడించారు. సెక్టోరియల్ అధికారి కారు అద్దాలు ధ్వంసం తుంగతుర్తి గోదాం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు అధికసంఖ్యలో గుమిగూడి ఈవీఎంలు తరలిస్తున్న సెక్టోరియల్ అధికారి కారును అడ్డగించారు. అనంతరం కారు అద్దాలను ధ్వంసం చేశారు. తమ ఎదుట ఖాళీ ఈవీఎంలను ఓపెన్ చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిని అదుపుచేసి ఈవీఎంలను గోదాముకు తరలించారు. ఈ విషయంపై తమకు వివరణ ఇవ్వాలని కార్యకర్తలు ఆర్వో వెంకట్‌రెడ్డి, డీఎస్పీ రవిలను కోరారు. దీంతో వారు కాంగ్రెస్ నాయకులకు, ఏజెంట్ల ఎదుట ఖాళీ ఈవీఎంలను తెరిచి వారి అనుమానాన్ని నివృత్తి చేశారు. -
నకిలీ ఐటీ అధికారి అరెస్ట్
కొరుక్కుపేట: ఐటీ అధికారిగా నమ్మించి రూ.లక్ష దోపిడీ చేసిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణగిరి జిల్లా హొసూరు, పొదుగైనగర్‌కు చెందిన బాలాజి భార్య శ్రుతిలయ (29). గ్రాడ్యుయేట్ అయిన ఈమె రైల్వేస్టేషన్ ఎదురుగా ఆమె పేరుతో ఆడిటింగ్ కార్యాలయాన్ని నడపుతున్నారు. ఈక్రమంలో ఓ యువతి బుధవారం రాత్రి ఐటీ అధికారిగా దుస్తులు ధరించి అసోసియేట్స్ కార్యాలయానికి వచ్చింది. ఐటీ కార్యాలయం నుంచి వస్తున్నట్టు శ్రుతిలయకు చెప్పింది. రూ.లక్ష ఇవ్వాలని బెదిరించింది. దీంతో శ్రుతిలయ భయపడి, ఆఫీసులో ఉన్న డబ్బు తీసుకుని మహిళకు ఇచ్చింది. అయితే ఆమె తీరుపై అనుమానం వచ్చిన శ్రుతిలయ ఆమెకు తెలియకుండా సెల్ఫోన్లో హొసూర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వచ్చిన పోలీసులు రంగంలోకి దిగి యువతిని విచారించారు. డిపార్టుమెంట్ కార్యాలయం నుంచి వస్తున్నానని చెప్పిన మహిళ హొసూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈ–సేవా కేంద్రం నిర్వహిస్తున్న దీప (33)అని, ఐటీ అధికారిగా నటిస్తునట్టు తేలింది. పోలీసులు దీపను అరెస్ట్ చేశారు. -
వేటాడే సత్యభామ
‘సత్యా.. ఈ కేసు నీ చేతుల్లో లేదు (ప్రకాశ్‌రాజ్).. కానీ ఆ ప్రాణం నా చేతుల్లోనే పోయింది సార్ (కాజల్ అగర్వాల్)’ అనే డైలాగ్స్‌తో మొదలవుతుంది ‘సత్యభామ’ టీజర్. పోలీసాఫీసర్ సత్యభామ పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తున్న చిత్రం ఇది. ప్రకాశ్‌రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రధారులు. బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్‌ప్లే అందించారు. శుక్రవారం ‘సత్యభామ’ టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘సార్.. ఆ గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంది. వేటాడాలి (కాజల్ అగర్వాల్)’, ‘ఆ అమ్మాయి చావుకు మీరే కారణం అంటున్నారు. ఈ కేసును మీరు వదిలేసినట్లేనా? (విలేకర్లు).. నెవర్ (కాజల్)’ అనే డైలాగ్స్ టీజర్లో ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల.