న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.
కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. కేఎస్‌ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.
ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment