Comptroller and Auditor General
-
8 నెలలు..8 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ రాబడులు తగ్గిపోతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది నెలలు ముగిసే నాటికి (నవంబర్ 30, 2024 వరకు) అన్ని రకాల రాబడులు కలిపి రూ.1,41,178 కోట్లు వచ్చినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రాబడుల కింద అంచనా వేసిన రూ.2.74 లక్షల కోట్లలో ఇది 51.51 శాతం కావడం గమనార్హం.కాగా గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో నవంబర్ నెల ముగిసేసరికి రూ.1,49,316.41 కోట్లు రావడం గమనార్హం. గత ఏడాది మొత్తం అంచనాల్లో ఇది 57.46 శాతం కాగా, ప్రస్తుత 8 నెలల కాలంలో రూ.8 వేల కోట్ల మేర రాబడులు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారీగా తగ్గిన పన్నేతర ఆదాయంరాష్ట్ర ప్రభుత్వ ఆదాయ రాబడులకు సంబంధించిన కీలకమైన పద్దుల్లో తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా పన్నేతర ఆదాయంలో భారీగా క్షీణత నమోదైంది. ఇసుకతో పాటు ఇతర ఖనిజాల మైనింగ్, యూజర్ చార్జీలు, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా సమకూరే ఆదాయాన్ని పన్నేతర ఆదాయం కింద పరిగణిస్తారు. ఈ పద్దు కింద 2023–24లో నవంబర్ నెల ముగిసే సమయానికి రూ.19,524.69 కోట్లు సమకూరింది. అదే ప్రస్తుత సంవత్సరంలో మాత్రం కేవలం రూ. 5,217.26 కోట్లు మాత్రమే వచ్చింది. వాస్తవానికి 2024–25లో రూ.35,208 కోట్ల పన్నేతర ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ అందులో దాదాపు 15 శాతం మాత్రమే సమకూరడం గమనార్హం. మరోవైపు ఎక్సైజ్ శాఖ ద్వారా రావాల్సిన ఆదాయం గత ఏడాదితో పోలిస్తే తగ్గింది. గత ఆర్థిక సంవత్సరంలో 8 నెలల్లో రూ.14,607 కోట్లు రాగా, ఈ ఏడాదిలో రూ.2 వేల కోట్లు తక్కువగా రూ.12,364 కోట్లు వచ్చింది. అయితే జీఎస్టీ పద్దు కింద గత ఏడాది కంటే రూ.3 వేల కోట్లు, అమ్మకపు పన్ను కింద రూ.1.500 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా రూపంలో రూ.3 వేల కోట్లు అధికంగా సమకూరాయి. గత ఏడాదితో పోలిస్తే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.200 కోట్ల మేర ఆదాయం పెరిగింది. అప్పులు కూడా గత ఏడాది కంటే స్వల్పంగా తగ్గినా బడ్జెట్ అంచనాల్లో 72 శాతం ఇప్పటికే సమకూరడం గమనార్హం.నాలుగు నెలల్లో రాబడి వస్తుందా?ప్రస్తుత లెక్కల ప్రకారం నవంబర్ తర్వాత మిగిలిన నాలుగు నెలల్లో బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.1.30 లక్షల కోట్లకు పైగా రాబడులు ప్రభుత్వ ఖజానాకు సమకూరాల్సి ఉంది. అయితే గత ఏడాది చివరి నాలుగు నెలల్లో రూ.70 వేల కోట్లకు పైగా మాత్రమే వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి బడ్జెట్ అంచనాలకు, రాబడులకు భారీ లోటు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నాలుగు నెలల్లో రూ.80 వేల కోట్ల మేర రాబడులు వస్తాయని ఆశించినా, కనీసం మరో రూ.20–30వేల కోట్లు ఇతర మార్గాల్లో సమకూర్చుకోకపోతే బడ్జెట్ లెక్కలు తప్పుతాయని ఆర్థికరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్ఆర్ఎస్, సాదాబైనామాల క్రమబద్ధీకరణ, జీవో 59 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారం, భూముల అమ్మకాలు, మైనింగ్ ఆదాయం పెంపు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం లాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని వారు సూచిస్తున్నారు. -
ఐదేళ్ల వృద్ధి రేటు రయ్.. రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వృద్ధి రేటు 2018–19తో పోలిస్తే 2022–23లో పెరిగిందని.. బడ్జెట్ లోపల చేసిన అప్పులు, ద్రవ్యలోటు, రెవెన్యూ లోటు నిబంధనలకు లోబడే ఉన్నాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక స్పష్టం చేసింది. 2022–23 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది.2018–19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.8,73,721 కోట్ల నుంచి 2022–23లో రూ.13,17,728 కోట్లకు పెరిగి సగటు వార్షిక వృద్ధి రేటు 11.01 శాతంగా ఉందని కాగ్ స్పష్టం చేసింది. 2021–22 సంవత్సరంతో పోలిస్తే 2022–23లో జీఎస్డీపీలో 16.22 శాతం వృద్ధి నమోదైనట్టు కాగ్ వెల్లడించింది. ఈ కాలంలో పన్నుల ద్వారా ఆదాయం 9.25 శాతం, రాష్ట్ర సొంత పన్నుల ద్వారా ఆదాయం 9.93 శాతం మేర పెరిగాయి. రాష్ట్ర మొత్తం వ్యయం 2021–22లో రూ.1,77,647 కోట్ల నుంచి 2022–23లో రూ.2,10,272 కోట్లకు పెరగ్గా.. 18.35 శాతం పెరుగుదల నమోదు చేసింది. తప్పనిసరి వ్యయం రూ.15,451 కోట్లు పెరగడం, స్థానిక సంస్ధలకు ఇచ్చే ఆరి్థక సహాయం రూ.14,208 కోట్లు పెరగడం, రూ.8,315 కోట్లు మేర సబ్సిడీలు పెరగడం రెవెన్యూ లోటు పెరగడానికి ప్రధాన కారణాలుగా కాగ్ తెలిపింది. వార్షిక రాబడులూ పెరిగాయ్ 2018–19 నుంచి 2022–23 వరకు రెవెన్యూ రాబడులు సగటు వార్షిక వృద్ధి రేటు 8.91 శాతం పెరిగినట్లు కాగ్ నివేదిక వెల్లడించింది. రెవెన్యూ రాబడుల్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ వాటా 2018–19లో 16.97 శాతం ఉండగా.. 2022–23లో 22.01 శాతానికి పెరిగింది. 2018–19లో సబ్సిడీ వ్యయం రూ.2,352 కోట్ల నుంచి 2022–23లో రూ.23,004 కోట్లకు పెరిగిందని తెలిపింది. ఈ కాలంలో మొత్తం సబ్సిడీల్లో 43 శాతం నుంచి 88 శాతం వరకు విద్యుత్ రాయితీలే గణనీయంగా ఉన్నాయని పేర్కొంది. 2022–23లో ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.30 శాతం పరిమితికి గాను 3.30 శాతం ఉందని, ద్రవ్యలోటు 4.50 శాతం పరిమితికి గాను 3.98 శాత ఉందని, రాష్ట్ర బకాయిల పరిమితి జీఎస్డీపీలో 36.30 శాతం పరిమితికి గాను 32.17 శాతం ఉందని కాగ్ వివరించింది. గ్యారెంటీల పరిమితి 180 శాతానికి గాను ఇచ్చిన హామీలు 92.24 శాతంగా ఉందని కాగ్ పేర్కొంది. బడ్జెటేతర రుణాల బకాయిలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం బకాయిలు జీఎస్డీపీలో 41.89 శాతంగా ఉందని తెలిపింది. తలసరి జీడీపీ భారీగా పెరుగుదల 2018–19లో తలసరి జీడీపీ రూ.1,70,180 ఉండగా.. 2022–23లో రూ.2,48,258కి పెరిగిందని కాగ్ వెల్లడించింది. 2022–23 నాటికి చెల్లించాల్సిన ప్రజా రుణం రూ.3,56,455 కోట్లు అని పేర్కొంది. ఈ మొత్తం బకాయిలు ఎఫ్ఆర్బీఎం చట్టంలో నిర్దేశించిన లక్ష్యాలకు లోబడే ఉన్నప్పటికీ బడ్జెటేతర రుణాలను, పెండింగ్బిల్లులు తీసుకుంటే లక్ష్యాల కన్నా బకాయిలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది.2023 మార్చి నాటికి ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ.1,28,048 బడ్జెటేతర రుణాలను సేకరించినట్టు కాగ్ పేర్కొంది. తప్పనిసరి ఖర్చులు పెరిగిపోతున్నాయని కాగ్ తెలిపింది. ప్రధానంగా జీతాలు, వేతనాలు, పెన్షన్లు, స్థానిక సంస్థలకు నగదు బదిలీలు, వడ్డీ చెల్లింపు ఐదేళ్లలో భారీగా పెరిగినట్టు కాగ్ పేర్కొంది. పీఆర్సీ అమలు చేయడంతో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పెరిగాయని కాగ్ స్పష్టం చేసింది. -
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నూతన అధిపతిగా కొండ్రు సంజయ్ మూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం రాష్ట్రపతి భవన్‌లోని గణతంత్ర మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంజయ్ మూర్తి చేత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తదితరులు హాజరయ్యారు.ఇక ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు కాగ్ అధిపతిగా ఉన్న గిరీశ్ చంద్ర ముర్ము పదవీ కాలం ఈ నెల 20తో ముగిసింది. దీంతో తదుపరి కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తిని రాష్ట్రపతి ఈనెల 18న నియమించారు.కాగా అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. కేఎస్ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయిలో సేవలందించారు.ఇక 1964 డిసెంబరు 24న జన్మించిన ఆయన.. మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. మూర్తి 1989లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎంపికయయారు. ఆయన ప్రస్తుతం కేంద్రంలో ఉన్నత విద్యా మంత్రిత్వశాఖలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా ఆయన వచ్చే నెలలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం ఈ కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వయసు వరకు కానీ కొనసాగడానికి వీలుంది. -
అంచనాలకు మించి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పన్ను ఆదాయం ఏటేటా పెరుగుతోంది. వరుసగా మూడో ఏడాది పన్ను రాబడుల్లో వృద్ధి నమోదు అయ్యింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) లెక్కల ప్రకారం మార్చి 2024 నాటికి రూ.1.35 లక్షల కోట్లు పన్ను ఆదాయం కింద సమకూరాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా, ఇతర పన్నుల రూపేణా ఈ మొత్తం సమకూరిందని కాగ్ తెలిపింది.బడ్జెట్ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు ఎక్కువగా, సవరించిన అంచనాల కంటే రూ.17 వేల కోట్లు ఎక్కువగా ఈ ఏడాది పన్ను రాబడులు రావడం గమనార్హం. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పన్ను రాబడుల వ్యవస్థ సజావుగానే ముందుకెళుతోందని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలో రూ.48 వేల కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. గత మూడేళ్లుగా.. పన్ను రాబడులు తొలిసారిగా 2021–22లో బడ్జెట్ ప్రతిపాదనలకు మించి వచ్చాయి. ఆ ఏడాదిలో రూ.1.06 లక్షల కోట్లు పన్ను రాబడుల కింద వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా, రూ.1.09 లక్షల కోట్ల వాస్తవిక రాబడులు వచ్చాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆ ఏడాది పన్ను వసూళ్లలో ఏకంగా రూ.30 వేల కోట్ల పెరుగుదల చోటు చేసుకుంది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి పూర్తిగా కోలుకుని, సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆదాయంలో మంచి వృద్ధి కనిపించింది.ఆ తర్వాతి ఏడాది కూడా బడ్జెట్ ప్రతిపాదనలతో పోల్చితే స్వల్ప పెరుగుదలే నమోదయ్యింది. ఇక గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో రూ.1.31 లక్షల కోట్ల పన్ను ఆదాయం వస్తుందని వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల్లో చూపెట్టారు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ పన్ను రాబడులు రూ.1.18 లక్షల కోట్లు వచ్చే అవకాశముందని సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల కంటే రూ.4 వేల కోట్లు అదనంగా రూ.1.35 లక్షల కోట్ల పన్ను ఆదాయం సమకూరింది. శాఖల వారీగా ఇలా...! శాఖల వారీగా పరిశీలిస్తే.. 2022–23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జీఎస్టీ రాబడులు రూ.5 వేల కోట్ల వరకు పెరిగాయి. 2022–23లో రూ.41,888 కోట్లు జీఎస్టీ కింద రాగా, 2023–24లో రూ.46,500 కోట్లు వచ్చాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో అంతకుముందు ఏడాది రూ.14,228 కోట్లు రాగా, గత ఏడాదిలో రూ.14,295 కోట్లు వచ్చాయి. ఇక అమ్మకపు పన్ను ద్వారా 2022–23లో రూ.29,604 కోట్లు రాగా, గత ఏడాది కొంచెం ఎక్కువగా రూ.29,989 కోట్లు సమకూరాయి.ఇక ఎక్సైజ్ ద్వారా అంతకు ముందు సంవత్సరం రూ.18740 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది 20,298.89 కోట్లు వచ్చింది. కేంద్ర పన్నుల్లో వాటా కింద 2022–23లో రూ.13,394 కోట్లు రాగా, 2023–24లో రూ.16,536.65 కోట్లు వచ్చాయి. ఇతర పన్నుల రూపంలో అంతకుముందు ఏడాది రూ. 8,430 కోట్లు రాగా, ఈసారి రూ.7,918.74 కోట్లు మాత్రమే వచ్చాయి. గత ఐదు నెలల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పన్ను ఆదాయ రాబడులు పెరిగాయని కాగ్ లెక్కలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల నాటికి రూ. 80,853 కోట్ల పన్ను ఆదాయం వచ్చింది. ఆ తర్వాతి నాలుగు నెలల్లో మరో రూ.46 వేల కోట్లు రాగా, మొత్తం ఆ ఏడాది పన్ను ఆదాయం రూ. 1.26 లక్షల కోట్లకు చేరింది. 2023–24లో నవంబర్ నెల నాటికి రూ.87,083 కోట్లుగా నమోదైన పన్ను ఆదాయం ఏడాది చివరి నాటికి (మార్చి 2024 ) రూ. 1.35 లక్షల కోట్లకు చేరింది. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతి 4 నెలల్లో వచ్చిన పన్ను ఆదాయం రూ. 48 వేల కోట్లన్నమాట. గత ఏడాది చివరి నాలుగు నెలలతో పోలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో పన్ను ఆదాయం రూ.2వేల కోట్లు పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. -
అమరావతి.. ఓ ఆర్థిక అగాధమే
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి రాష్ట్రంపై అంతులేని భారీ ఆర్థిక భారాన్ని మోపుతుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక హెచ్చరించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తక్షణంతో పాటు భవిష్యత్తులోనూ మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఇందుకు ప్రధాన కారణం గత సర్కారు గ్రీన్ ఫీల్డ్ రాజధాని పేరుతో నిపుణుల కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, ప్రభుత్వ భూములు విస్తారంగా అందుబాటులో ఉండే ప్రదేశాలను వదిలేసి బయటి వ్యక్తుల నుంచి చాలా ఎక్కువ భూమిని పూలింగ్తో సేకరించడమేనని స్పష్టం చేసింది. ఈమేరకు కాగ్ సమర్పించిన తనిఖీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అసెంబ్లీకి సమర్పించింది. ఇందులో ప్రధానంగా అమరావతి విషయంలో టీడీపీ సర్కారు అనుసరించిన విధానాలను, భూ సమీకరణను కాగ్ తీవ్రంగా తప్పుబట్టింది. అంతా అసమగ్రం రాజధాని అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులపై మూడు సార్లు ఆడిట్ నిర్వహించినట్లు కాగ్ నివేదికలో వెల్లడించింది. గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ఎంచుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకున్న కీలక పరిమితులు, రాజధాని నగర అభివృద్ధికి భూమి వాస్తవ అవసరాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించలేదని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగర అభివృద్ధికి సంబంధించిన మొత్తం ప్రాజెక్టు ప్రణాళిక వివరాల్లో సమగ్రత లేదని పేర్కొంది. అమరావతిలో ఏకరీతిలో భూ కేటాయింపుల విధానాన్ని అమలు చేయలేదని, వివిధ ప్రైవేట్ సంస్థలకు ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని కాగ్ నివేదిక ఎండగట్టింది. చేపట్టిన పనులన్నీ 2017 నవంబర్ నుంచి 2019 ఫిబ్రవరి వరకు ప్రారంభించలేదని, దీంతో ఎల్పీఎస్ (ల్యాండ్ పూలింగ్ స్కీమ్) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సాధ్యం కాలేదని కాగ్ పేర్కొంది. రహదారి పనులతో కూడిన ప్రాధాన్యత కలిగిన మౌలిక సదుపాయాలను సరైన అంచనా, ప్రాథమిక సర్వే లేకుండా చేపట్టడంతో పనుల పురోగతి దెబ్బ తిందని కాగ్ తెలిపింది. అమరావతి రాజధాని అభివృద్ధిలో నిపుణుల కమిటీ సిఫార్సులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని తప్పుబట్టింది. రాజధాని మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెంట్లపై తగిన విధానాన్ని అనుసరించకుండా నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేశారని కాగ్ పేర్కొంది. ప్రణాళిక లోపం.. వ్యయంపై ప్రభావం స్పష్టమైన ఆర్థిక ప్రణాళిక లేకుండా ఏపీ సీఆర్డీఏ, ఏడీసీఎల్‌లు రూ.33,476.23 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్యాకేజీల కోసం ఒప్పందాలను కుదుర్చుకున్నాయని కాగ్ నివేదికలో ప్రస్తావించింది. రాజధాని నగర అభివృద్ధిపై విధానపరమైన మార్పు ఫలితంగా 2019 మే నుంచి కాల పరిమితి లేని ఒప్పందాల ప్యాకేజీలు అనిశ్చితిగా ఉన్నాయని తెలిపింది. గత సర్కారు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జలవనరుల పరిధిలో అనధికారికంగా గ్రీవెన్స్ సెల్ భవన నిర్మాణానికి ఏపీ సీఆర్డీఏ అనుమతి ఇవ్వడాన్ని కాగ్ తప్పుబట్టింది. రాజధాని నగరానికి భూమి వాస్తవ అవసరాలను అంచనా వేసేందుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం రికార్డులను సీఆర్డీఏ అందించలేదని కాగ్ పేర్కొంది. పర్యవసానంగా ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం లేనందున ఎల్పీఎస్ ద్వారా సేకరించిన భూమి అవసరం హేతుబద్ధతను నిర్ధారించలేకపోయినట్లు కాగ్ వెల్లడించింది. దశలవారీ ప్రణాళిక లేకపోవడంతో ప్రాజెక్టుల వ్యయంపై ప్రభావం పడిందని, కార్యాచరణ ప్రణాళికను సూచించడానికి సలహా కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీ సిఫార్సులను ఆడిట్‌కు అందుబాటులో ఉంచలేదని కాగ్ తెలిపింది. కేంద్రం వివరణ కోరినా.. టీడీపీ సర్కారు నిర్దిష్ట విధివిధానాలను అనుసరించకుండా కన్సల్టెన్సీ సంస్థలు, కన్సల్టెంట్లను ఎంపిక చేసినట్లు కాగ్ నివేదిక పేర్కొంది. రాజధాని నగర ప్రణాళిక ప్రక్రియలో ఏపీ సీఆర్డీఏ టెండరింగ్, కాంపిటేటివ్ బిడ్డింగ్ విధివిధానాలను అనుసరించకుండా మూడు కన్సల్టెన్సీ సంస్ధలకు రూ.28.96 కోట్ల ఒప్పంద విలువతో నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చినట్లు కాగ్ తెలిపింది. రాజధాని నగరానికి సంబంధించి రూ.1,09,023 కోట్ల అంచనాతో డీపీఆర్‌లు రూపొందించినప్పటికీ వీటిలో రూ.46,400 కోట్ల మేర డీపీఆర్‌లను నీతి ఆయోగ్‌కు సమర్పించలేదని వెలుగులోకి తెచ్చింది. డీపీఆర్‌లు లోపభూయిష్టంగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం దీనిపై వివరణ కోరినా గత సర్కారు సమర్పించలేదని కాగ్ తెలిపింది. -
లక్ష్యంలో 82.8 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.14.53 లక్షల కోట్లకు చేరింది. బడ్జెట్ అంచనాలతో పోల్చితే ఇది 82.8 శాతానికి చేరింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ)ఈ గణాంకాలను విడుదల చేసింది. 2022–23లో మొత్తం ద్రవ్యలోటు రూ.17.55 లక్షల కోట్లుగా అంచనావేయడం జరిగింది. స్థూల దేశీయోత్పత్తి ఇది 6.4 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి తగ్గించాలన్నది లక్ష్యం. -
‘కాగ్’ నివేదికలోనూ.. ‘చంద్రబాబు ప్రభుత్వ దోపిడీ ‘స్కిల్’ సిత్రాలు
సాక్షి, అమరావతి : టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్ఎస్డీసీ) ముసుగులో సాగిన కుంభకోణాన్ని రాజ్యాంగ ప్రతిపత్తిగల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)కు చెందిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కూడా నిగ్గుతేల్చింది. యువతకు నైపుణ్యాభివృద్ధి ముసుగులో సీమెన్స్ కంపెనీ పేరిట చంద్రబాబు ప్రభుత్వం నడిపించిన ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలను కడిగిపారేసింది. 2015 నుంచి 2018 వరకు సాగిన ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్టు రికార్డులను కాగ్ 2018 మే 29 నుంచి జూన్ 22 వరకు పరిశీలించింది. అందులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండిపడిందని తేల్చింది. కాగ్ ప్రధానంగా లేవనెత్తిన అభ్యంతరాలివే.. రూ.370 కోట్ల ప్రాజెక్టును రూ.3,300 కోట్లుగా.. సీమెన్స్ కంపెనీ పేరిట ప్రాజెక్టు నివేదిక రూపకల్పనలోనే చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆ ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ఆ ఒప్పందం విలువ రూ.370కోట్లు మాత్రమే. ప్రైవేటు కంపెనీ సరఫరా చేస్తామని చెప్పిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్లను పరిశీలిస్తే ఆ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లుగానే లెక్కతేలిందని పేర్కొంది. కానీ, అది రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా భ్రమింపజేసేలా అంచనాలను అమాంతంగా పెంచేసి నివేదికను రూపొందించారు. దాంతోనే ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి ఆస్కారం ఏర్పడింది. ఇంతవరకూ లెక్కాపత్రం లేదు ఇక ప్రాజెక్టు ఒప్పందంలో భాగంగా సరఫరా చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విలువ ఎంత అన్నది కనీసం నిర్థారించలేదు. నిపుణులైన ఏజెన్సీలతో నిర్థారించాలని 2017, నవంబరు 25న నిర్వహించిన ఏపీఎస్ఎస్డీసీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. కానీ, ఆ మేరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. డిజైన్‌టెక్ కంపెనీ సరఫరా చేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కొనుగోలు ఆర్డర్ కాపీని ఆడిట్ కోసం అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. ఖజానాకు రూ.355 కోట్ల గండి నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టు రూపకల్పన, నిధుల విడుదలతో మొత్తం రూ.355 కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. ప్రాజెక్టులో పేర్కొన్న వివరాల ప్రకారం ప్రాజెక్టు విలువలో ప్రభుత్వం 10శాతం నిధులు కేటాయించాలి. అంటే, ప్రాజెక్టు వాస్తవ విలువ రూ.370 కోట్లుగా చూపించి ఉంటే.. ప్రభుత్వం రూ.37 కోట్లు మాత్రమే విడుదల చేయాలి. కానీ.. అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి.. ప్రభుత్వ వాటా 10 శాతంతో పాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలుపుతూ ఏకంగా రూ.370 కోట్లు విడుదల చేశారు. అలా రూ.333 కోట్లు కొల్లగొట్టారు. అంతేకాదు, ఒక ఏడాది ముందే.. అది కూడా ప్రాజెక్టు మొదలుకాకుండానే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం గమనార్హం. దాంతో రూ.22 కోట్ల వడ్డీ రూపంలో రావల్సిన ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లింది. నకిలీ ఇన్వాయిస్లతో రూ.241కోట్లు కొల్లగొట్టారు ఇక షెల్ కంపెనీలు సరఫరా చేసినట్లుగా నకిలీ ఇన్వాయిస్లు చూí³ంచి కనికట్టు చేశారు. ఆ విధంగా రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారు. అక్కడ నుంచి హవాలా మార్గంలో టీడీపీ పెద్దలకు ఆ నిధులు చేరాయని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఒప్పందంలో కాలేజీలకు భాగస్వామ్యం లేదు అలాగే, యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం చేసుకున్నామని చెబుతున్న ఈ ఒప్పందంలో సంబంధిత కాలేజీలను భాగస్వాములను చేయనేలేదు. దాంతో ఆ కాలేజీలకు ఎలాంటి పాత్రా లేకుండాపోయింది. వాటిల్లో నెలకొల్పిన నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ఏర్పాటుచేసిన హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్ విలువ ఎంతన్నది మదింపు చేయనేలేదు. ఆ కాలేజీల యాజమాన్యాలకు కూడా ఆ విషయంపై ఎలాంటి అవగాహనలేదు. -
ఆడిటింగ్‌లో సైంటిఫిక్ పద్ధతులు పాటించాలి
న్యూఢిల్లీ: ఆడిటింగ్‌లో మరింత పటిష్టమైన, శాస్త్రీయమైన పద్ధతులను పాటించాలని ఆడిటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సమస్యలను గుర్తించడంలోనూ, పరిష్కారాలను కనుగొనడంలోనూ ఆడిటింగ్ కీలక సాధనమని ఆయన పేర్కొన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన తొలి ఆడిట్ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మోదీ ఈ విషయాలు తెలిపారు. ఒకప్పుడు దేశీయంగా ఆడిట్ అంటే ఒకింత అనుమానంగా, భయంగాను చూసేవారని, కాగ్.. ప్రభుత్వం ఒకదానితో మరొకటి తలపడినట్లుగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. కానీ ప్రస్తుతం మైండ్‌సెట్ మారిందన్నారు. విలువ జోడింపులో ఆడిట్ కీలక పాత్ర పోషిస్తుందన్న భావన నెలకొందని మోదీ చెప్పారు. గత ప్రభుత్వం పాటించిన తప్పుడు విధానాలు, పారదర్శకత లేకపోవడం వల్లే బ్యాంకింగ్ రంగంలో మొండిబాకీలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ‘గతంలో ఎన్పీఏలను ఎలా దాచిపెట్టేవారో మీకు తెలుసు. గత ప్రభుత్వాలు చేసిన పనులను మేం పూర్తి నిజాయితీతో దేశ ప్రజల ముందు ఉంచాము. సమస్యలను గుర్తించినప్పుడే వాటికి పరిష్కార మార్గాలను కనుగొనగలము. వ్యవస్థలో పారదర్శకత తెచ్చిన తర్వాత ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి‘ అని ప్రధాని చెప్పారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. డేటా కీలకం.. గతంలో సమాచారాన్ని కథల రూపంలో చెప్పేవారని, చరిత్రను కూడా కథల రూపంలోనే రాశారని మోదీ చెప్పారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని, సమాచారం అంటే డేటాయేనని ఆయన పేర్కొన్నారు. ‘21వ శతాబ్దంలో సమాచారం అంటే డేటా. భావి తరాల్లో మన చరిత్రను డేటా ద్వారానే చూస్తారు. దాని కోణంలోనే అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో చరిత్రను డేటానే నిర్దేశిస్తుంది‘ అని మోదీ తెలిపారు. కాగ్ అడిగే డేటా, ఫైళ్లను ప్రభుత్వ విభాగాలు విధిగా అందజేయాలని ఆయన సూచించారు. క్షేత్ర స్థాయి ఆడిట్లు నిర్వహించడానికి ముందు ప్రాథమికంగా బైటపడిన అంశాల గురించి ఆయా ప్రభుత్వ విభాగాలకు తెలియజేసేలా కాగ్ కొత్త విధానాన్ని అమల్లోకి తేవడం మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని మోదీ చెప్పారు. మరోవైపు, తొలి ఆడిటర్ జనరల్ 1860 నవంబర్ 16న బాధ్యతలు చేపట్టారని, అందుకే ఆ రోజును ఆడిట్ దివస్‌గా నిర్వహించాలని భావించినట్లు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. కొత్త ఆడిట్ ప్రక్రియ మేనేజ్మెంట్ అప్లికేషన్‌ను కాగ్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
లక్ష్యంలో 31.1 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో 31.1 శాతానికి చేరింది. విలువలో ఇది రూ.4,68,009 కోట్లు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) గురువారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే, 2021–22లో రూ.15,06,812 కోట్ల వద్ద ద్రవ్యలోటు ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనావేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలతో పోలి్చతే ఇది 6.8 శాతం. అంచనాలతో పోలి్చతే ఇప్పటికి ద్రవ్యలోటు రూ.4,69,009 కోట్లకు (31.1 శాతం) చేరిందన్నమాట. గత ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ప్రస్తుత ద్రవ్యలోటు పరిస్థితి అదుపులో ఉండడం గమనార్హం. కరోనా కష్టాల నేపథ్యంలో పడిపోయిన ఆదాయాలు– పెరిగిన వ్యయాల నేపథ్యంలో గత ఏడాది ఇదే కాలానికి ద్రవ్యలోటు అప్పటి బడ్జెట్ అంచనాలను దాటి ఏకంగా 109.3 శాతానికి ఎగసింది. 2020–21లో 3.5 శాతం తొలి (బడ్జెట్) అంచనాలను మించి ద్రవ్యలోటు 9.3 శాతానికి ఎగసింది. తాజా సమీక్షా కాలానికి సంబంధించి ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే... 2020–21తో పోలి్చతే మెరుగైన స్థితి ► 2021 ఆగస్టు నాటికి ప్రభుత్వ ఆదాయాలు రూ.8.08 లక్షల కోట్లు. బడ్జెట్ మొత్తం ఆదాయ అంచానల్లో ఈ పరిమాణం 40.9 శాతానికి చేరింది. గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలంలో బడ్జెట్ మొత్తం ఆదాయ అంచనాల్లో ఆగస్టు నాటికి ఒనగూరింది కేవలం 16.8 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఆదాయాల్లో పన్నుల విభాగం నుంచి తాజా సమీక్షా కాలానికి (2021 ఆగస్టు నాటికి) వచి్చంది రూ.6.44 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాల్లో ఇది 41.7 శాతం. అయితే గత ఆర్థిక సంవత్సరం (2020–21) ఇదే కాలానికి బడ్జెట్ మొత్తం పన్ను వసూళ్ల అంచనాల్లో ఆగస్టు నాటికి ఒనగూరింది కేవలం 17.4 శాతమే కావడం గమనార్హం. ► ఇక సమీక్షా కాలంలో ప్రభుత్వ వ్యయాలు రూ.12.76 లక్షల కోట్లు. 2021–22 బడ్జెట్ మొత్తం వ్యయ అంచనాల్లో ఇది 36.7 శాతం. ► వెరసి ఆదాయ–వ్యయాల మధ్య వ్యత్యాసం (ద్రవ్యలోటు) ఆగస్టు నాటికి రూ.4.68 లక్షల కోట్లకు చేరిందన్నమాట. ► ద్రవ్యలోటు కట్టడికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, రేటింగ్ సంస్థలు ఇతర ఆర్థికవేత్తలు ఉద్ఘాటిస్తున్నారు. ఆర్థిక ఉద్దీపనల ప్రకటనల విషయంలో జాగరూకత పాటించాలన్నది వారి అభిప్రాయం, కాగా, కేవీ కామత్ లాంటి ప్రముఖ బ్యాంకర్లు ఈ విషయంలో కొంత సాహస వైఖరిని ప్రదర్శించాలని కేంద్రానికి సూచిస్తున్నారు. ► 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. ► ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెపె్టంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. -
వృద్ధిలో మనమే నంబర్‌వన్
ఆదాయ వృద్ధిలో దేశంలో తెలంగాణే టాప్ ► రాష్ట్ర ఆదాయ వృద్ధి 17.81 శాతం: కాగ్ ► రెండో స్థానంలో బెంగాల్, ఏపీకి 7వ స్థానం సాక్షి, హైదరాబాద్: ఆదాయ వృద్ధి రేటులో తెలంగాణ మరోసారి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వెల్లడించిన గణాంకాల ప్రకారం తెలంగాణ 17.81% ఆదా య వృద్ధిని నమోదు చేసింది. 17.16% వృద్ధితో పశ్చిమబెంగాల్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని సీఎం కేసీఆర్ ఇటీవల పలుమార్లు ప్రకటించడం తెలిసిందే. ప్రభుత్వ అంచనాలకు తగ్గట్టే గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. కాగ్ లెక్కల ప్రకారం పన్నుల ఆదాయంలో దేశంలో రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది. ఏపీ ఏడో స్థానంలో ఉంది. ప్రధానంగా వ్యాట్, ఎక్సైజ్, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయం 17.82% పెరిగింది. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయమూ కలిపితే 17.81% వృద్ధి నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 2016 ఫిబ్రవరి వరకు రూ.33,257 కోట్ల ఆదాయం రాగా, గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి నాటికి రూ.39,183 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రధాన పన్నులతో కలిపి రవాణా రంగం, నాలా, అటవీ, వృత్తి పన్ను తదితరాలనూ కలుపుకుంటే 2015–16లో రూ.36,130 కోట్ల ఆదాయం రాగా 2016–17లో రూ.42,564 కోట్ల ఆదాయం వచ్చింది. రెండు విభాగాల్లోనూ దేశంలోని తెలంగాణ తొలి స్థానంలో ఉంది. పన్ను ఆదాయంలో జార్ఖండ్ రెండో స్థానం (16.86%), ఛత్తీస్‌గఢ్ మూడో స్థానం (11.41%)లో ఉన్నాయి. రాష్ట్ర సొంత పన్ను ఆదాయాన్నీ కలిపితే పశ్చిమబెంగాల్ రెండో స్థానం (17.16%), జార్ఖండ్ మూడో స్థానం (16.42%)లో ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ ఏపీ ఏడో స్థానంలో ఉంది. తెలంగాణ సత్తా రుజువైంది: సీఎం పన్ను ఆదాయం, రాష్ట్ర సొంత పన్ను ఆదాయం విభాగాలు రెండింట్లోనూ తెలంగాణ 17 శాతానికి పైగా వృద్ధి సాధించటం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వెలిబుచ్చారు. తెలంగాణ ధనిక రాష్ట్రమవుతుందని ఉద్యమ సమయంలోనే తాను వాదించానని ఆయన గుర్తు చేశారు. ఈ మూడేళ్ల సమయంలో అది పలుమార్లు రుజువైందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ రాష్ట్రానికి పన్నుల ఆదాయం తగ్గకపోగా పెరుగుదల సాధించడం గొప్ప విశేషమని అభిప్రాయపడ్డారు. ఈ విజయంలో పాలుపంచుకున్న అధికారులకు అభినందనలు తెలిపారు. ఆదాయ వృద్ధిలో ఆశించిన పెరుగుదల నమోదవడంతో రాష్ట్రంలో చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. ఆశించిన ఫలితం ఇటీవలి గణాంకాల ప్రకారం తెలంగాణ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 10.1 శాతంగా నమోదైంది. సగటున 4 శాతం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా ఆదాయ వృద్ధి కనీసం 15 శాతానికి చేరడం ఖాయమని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ముందునుంచీ ధీమాతో ఉన్నారు. ఆ మేరకే ఈసారి భారీ బడ్జెట్‌ను రూపొందించారు. అన్ని రంగాల్లో వృద్ధితో పాటు ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, పన్ను వసూలు విధానాలను పటిష్టం చేయడం, అధికారులు సమర్థంగా వ్యవహరించడం ఈ వృద్ధికి కారణమని ఆర్థిక శాఖ విశ్లేషిస్తోంది. -
కాగ్‌కు కూడా బుద్ధి లేదంటారా?: ఉండవల్లి
రాజమహేంద్రవరం: ప్రజలకు ఒక్క మంచి పనీ చేయకుండా మూడేళ్లుగా ప్రతి పథకం, ప్రాజెక్టులో అవినీతికి పాల్పడుతుంటే ప్రజలు తగిన విధంగా బుద్ధి చెబుతారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. కాగ్ నివేదిక ద్వారా ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల్లో అవినీతి స్పష్టమైందన్నారు. శనివారం ఆయన తూర్పు గోదావరి జిల్లా రాజమహేద్రవరంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల ప్రయోజనం శూన్యమన్న విషయం తాను ముందు నుంచీ చెబుతున్నానని, ఇదే విషయం కాగ్ నివేదికతో స్పష్టమైందన్నారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో అప్పడు కాగ్ ఇచ్చిన నివేదిక కేవలం అంచానాలేనని, అయినా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందన్నారు. ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టుపై స్పష్టంగా రూ. 375 కోట్ల అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు నిరర్థకమైందని కాగ్ స్పష్టం చేసిందన్నారు. పట్టిసీమ వృథా అంటున్న వారికి బుద్ధిలేదన్న చంద్రబాబు ఇప్పుడు కాగ్‌కు కూడా బుద్ధిలేదంటారా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 21న హైదరాబాద్‌లో పోలవరం అంచనాలు పెంపు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై శాసనసభ అంచనా కమిటీ,ప్రజాపద్దుల కమిటీల సమావేశం జరిగితే.. హైదారాబాద్‌లో జరిగే సమావేశాలకు అధికారులు హాజరుకావద్దని స్పీకర్ నోటీసులు ఇచ్చారని, కానీ ఎమ్మెల్యే రోజాపై చర్యలు తీసుకునేందుకు ప్రివిలేజ్ కమిటీ సమావేశం మాత్రం హైదరాబాద్‌లోనే నిర్వహించారని పేర్కొన్నారు. మంచి పనులు చేస్తేనే.. రాష్ట్రంలో అవినీతికి రెండేళ్లు సెలవు ప్రకటించాలని చెప్పారు. చంద్రబాబు కోరుకున్నట్లుగా ఆయన ఫొటో భవిష్యత్తులో గాంధీ, అంబేడ్కర్ ఫొటోల పక్కన ఉండాలంటే మంచిపనులు చేయాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి పనులు చేశారు కాబట్టే ప్రజలు వారి ఇళ్లలో, గుండెల్లో ఆయన ఫొటో పెట్టుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ చేసిన మంచి పనుల వల్లే వైఎస్ జగన్‌కు ప్రజలు ఓట్లు వేశారన్నారు. చంద్రబాబు స్వతంత్రంగా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ, పవన్‌కల్యాణ్‌లు చెరో పక్క నిలబడితే వైఎస్ఆర్ సీపీ కన్నా కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఎప్పడు కూడా అప్పులు చేయకుండా పాలన చేయలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో ఏ ఏడాది కూడా ఓవర్‌డ్రాఫ్ట్‌కు వెళ్లలేదని గుర్తు చేశారు. ఏ ఒక్క మంత్రి ఏ పని చేసినా అది మంత్రివర్గ సమష్టి బాధ్యత అంటున్న అచ్చెన్నాయుడు.. వైఎస్ఆర్ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలో అప్పటి మంత్రులకు కూడా వాటాలు ఉండవా అని ప్రశ్నించారు. అదే నిజమైతే వైఎస్ హయాంలో ఉన్న మంత్రులు ఇప్పడు చంద్రబాబు ప్రభుత్వం, పార్టీలో ఉన్నారని, వారికి ఎంత మేరకు ముడుపులు వచ్చాయో చంద్రబాబు అడగాలని కోరారు. -
బడ్జెట్ రూ.2600 కోట్లు
సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరపాలక అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 2017–18 వార్షిక సంవత్సరానికి రూ.2600 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కమిషనర్ చిరంజీవులు అధ్యక్షతన గురువారం సంస్థ ప్రధాన కార్యాలయంలో 21వ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన కోసం 50 మంది జూనియర్ ప్లానింగ్ ఆఫీసర్లును తీసుకోవాలని నిర్ణయించింది.కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గుర్తిం చింది. టీఎస్ఎంఐడీసీ తీరును తప్పుబట్టింది. అధిక ధరకు కొనుగోళ్లు.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వైన్‌ఫ్లూ రోగుల కోసం ఏడాది క్రితం మెస్సర్స్ సీజన్స్ హెల్త్‌కేర్ లిమిటెడ్ కంపెనీ నుంచి 50 వెంటిలేటర్లు (బెల్లావిస్టా 1000) కొనుగోలు చేసింది. యూనిట్ ధర రూ.11.01 లక్షలుగా నిర్ధారించింది. దీని మార్కెట్ ధర రూ.6.50 లక్షలు ఉండగా, టీఎస్ఎంఐడీసీ అధికారులు అధిక ధరకు కొనుగో లు చేసినట్లు ‘కాగ్’ గుర్తించింది. మార్కెట్ ధరను, టెండర్ పత్రాలను పరిగణలోకి తీసుకోకుండా కొనుగోలుచేశారని, ప్రభుత్వం పెద్ద మొత్తంలో నష్టపోయిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఇండెంట్ పంపకుండానే సరఫరా ఏ రోగికి ఏ మందు అవసరమో.. ఏ వైద్య పరీక్ష చేయాలనే అంశంపై సంబంధిత వైద్యులకు అవగాహన ఉంటుంది. ఆమేరకు వాటిని సరఫరా చేయాల్సిందిగా ఆస్పత్రులు టీఎస్ఎండీసీకి ఇండెంట్ పంపుతాయి. కానీ టీఎస్ఎంఐడీసీ అధికారులు వీటితో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ముందులు, వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. వాటిని వదిలించుకునేందుకు అడగకపోయినా, అవసరం లేకున్నా ఆస్పత్రులకు అంటగట్టారు. నిలోఫర్ ఆస్పత్రికి రూ.18.14 లక్షల విలువ చేసే ‘ఎక్సరే మెషిన్ 500 ఎంఏ’ను 2013 మార్చిలో సరఫరా చేసింది. నాలుగేళ్లు అవుతున్నా దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ పరికరానికి అవసరమైన విద్యుత్ సరఫరా లేనందువల్లే వినియోగించలేక పోయినట్లు తేలింది. ఆస్పత్రి సూపరింటిండెంట్ కానీ ఇతర అధికారులు కానీ ఈ పరికరం కావాలని అడగలేదు. అధికారికంగా ఎలాంటి ఇండెంట్ పంపలేదు. కానీ మెషన్ మాత్రం సరఫరా అయింది. ఇదిలా ఉంటే.. ఆస్పత్రిలో రెండు ఎక్సరే మిషన్లు ఉండగా వీటిలో ఒకటి ఇప్పటికే పాడైపోయింది. దీన్ని రిపేరు చేయకపోగా, మరోదాన్ని అందుబాటులోకి తేలేదు. డెంగీ రోగుల చికిత్స కోసం 2014 అక్టోబర్‌లో రూ.7.50 కోట్లతో 12 బ్లడ్ కాంపోనెంట్ సెపరేటర్లను కొనుకోగులకు పాలనాపరమైన అనుమతి పొంది, రూ.32.30 లక్షల విలువ చేసే ఒక యూనిట్‌ను 2016 మార్చిలో నిలోఫర్‌కు అందజేసింది. దీన్ని ఇప్పటి వరకు వినియోగంలోకి తేలేదు. నిజానికి దీన్ని తాండూరు జిల్లా ఆస్పత్రి కోసం టీవీవీపీ కమిషనర్ అభ్యర్థన మేరకు కొనుగోలు చేశారు. అక్కడి అధికారులు తిరస్కరించడంతో నిలోఫర్‌కు అంటగట్టారు. పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రికి 2009లో రూ.13.15 లక్షల విలువచేసే ఎండోస్కోపిక్ వీడియో రికార్డింగ్ సిస్టం సరఫరా చేసింది. నాటి నుంచి ఇది నిరుపయోగంగానే ఉంది. ఇండెంట్ పంపక పోయినా దీన్ని సరఫరా చేశారు. అవసరం లేకుండా అడ్డుగోలు కొనుగోళ్ల వ్యవహారం అలా ఉంచితే.. అవసరమున్న అత్యవసర వైద్య పరికరాలను వినియోగంలోకి తేవడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. గాంధీ ఆస్పత్రిలో రోగుల అవసరాల కోసం ‘ఎనస్తీషియా వర్క్ స్టేషన్’ను 2014 ఏప్రిల్‌లో రూ.2.91 కోట్లతో కొనుగోలుచేసింది. దీన్ని 2015 మార్చిలో అమర్చింది. ఉస్మానియా ఆస్పత్రికి 2014 మేలో రూ.1.24 కోట్ల విలువ చేసే డిజిటల్ మామోగ్రఫీ యూనిట్‌ను కొనుగోలు చేసి, 2015 ఫిబ్రవరిలో అమర్చింది. అయితే సరఫరా సంస్థ ఈ పరికరాన్ని అమర్చి, ప్రయోగాత్మకంగా నడిపి చూపించడం, ఆస్పత్రికి అప్పగించడం వంటి పనులన్నీ 2015 ఫిబ్రవరి నాటికే పూర్తి చేసినట్లు టీఎస్ఎంఐడీసీ ‘కాగ్’కు నివేదించింది. వాస్తవానికి ఆయా ఆస్పత్రుల అధికారులు ‘కాగ్’కు ఇచ్చిన నివేదికలో మాత్రం తొమ్మిది నెలలు అనంతరం వినియోగంలోకి వచ్చినట్టు పేర్కొన్నారు. రూ.15.49 లక్షలు విలువచేసే ఆల్ట్రా సౌండ్ కలర్ డాప్లర్ సిస్టంతో సహా.. రూ.13.50 లక్షల విలువైన ‘డీఫైబ్రిలేటర్’ వైద్య పరికరం కూడా తొమ్మిది నెలలు నిరూపయోగంగా ఉన్నాయి.నిబంధనల ప్రకారం ఆర్డర్ ఇచ్చిన 60 రోజుల్లోనే యంత్రాలు కొనుగోలు చేసి, అందుబాటులోకి తీసుకురావాలి. ఆలస్యం జరిగితే టెండర్‌ను రద్దు చేయడంతో పాటు ఈఎండీని కూడా జప్తుచేసే అధికారం ఉంది. కానీ ప్రభుత్వం ఉదాసీనతతో చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా టీఎస్ఎంఐడీసీ ఆడింది ఆటగా సాగుతోంది. -
ప్రత్యక్ష నగదు బదిలీతో ప్రయోజనం తక్కువే!
ఎల్పీజీ సబ్సిడీపై కేంద్రం ప్రకటనను తప్పుబట్టిన కాగ్ న్యూఢిల్లీ: వంటగ్యాస్ సబ్సిడీకి ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీఎల్) విధానాన్ని అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ప్రయోజనం రూ. 1,764 కోట్లేనని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) స్పష్టం చేసింది. డీబీటీఎల్ అమలుతో ఏకంగా రూ.23,316 కోట్ల సబ్సిడీ భారం తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నదంతా అవాస్తవమేనని, వాస్తవానికి అంతర్జాతీయంగా ధరలు పడిపోయినందునే సబ్సిడీ భారం తగ్గిందని పార్లమెంటుకు అందజేసిన నివేదికలో పేర్కొంది. 2014లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఎల్పీజీ సబ్సిడీ భారం రూ. 35,400 కోట్లుకాగా.. 2015 ఏప్రిల్-డిసెంబర్ మధ్య రూ.12,084 కోట్లు అని కాగ్ పేర్కొంది. తగ్గిన రూ.23,316 కోట్లను డీబీటీఎల్ వల్ల జరిగిన మిగులుగా ప్రభుత్వం చెప్పడాన్ని తప్పుబట్టింది. తగ్గిన మొత్తంలో కేవలం రూ.1,764 కోట్లే(15 శాతం) డీబీటీఎల్ వల్ల మిగిలాయని.. మిగతా రూ.21,552 కోట్ల తగ్గుదల ముడిచమురు ధరల పతనంగా వచ్చిందేనని పేర్కొంది. ఇక సబ్సిడీ మొత్తం, 67.27 లక్షల మంది వినియోగదారులు సబ్సిడీని వదులుకోవడం వల్ల మిగిలిన మొత్తానికి సంబంధించి చమురు సంస్థలు, పెట్రోలియం శాఖల లెక్కలకు పొంతన లేదని పేర్కొంది. తప్పుడు విధానంలో ‘ఏఆర్‌సీఐ’ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్‌లో స్వతంత్ర ప్రతిపత్తి గల ‘ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ(ఏఆర్‌సీఐ)’ని ఏర్పాటు చేసిందని కాగ్ పేర్కొంది. కేబినెట్ ఆమోదం లేకుండా ఇలాంటి సంస్థ ఏర్పాటు.. జనరల్ ఫైనాన్షియల్ నిబంధనలకు విరుద్ధమని, ఇప్పటికైనా ఆ అనుమతి తీసుకోవాలని సూచించింది. -
కడిగేసిన కాగ్
పాల్వంచలో అభివృద్ధి పనుల అమలుపై మొట్టికాయ సాక్షిప్రతినిధి, ఖమ్మం: పాల్వంచ మున్సిపాలిటీతోపాటు జిల్లాలోని పలు శాఖల పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టింది. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2015 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికిగాను చేసిన ఆర్థిక వ్యయాలకు సంబంధించిన మదింపు నివేదికను తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ నివేదిక ప్రకారం ప్రత్యేకంగా పాల్వంచ మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు సంబంధించి మురికివాడలను గుర్తించడంలో సరైన కారణాలు చూపలేదని అక్షింతలు వేసింది. అలాగే పంచాయతీరాజ్‌లో కొన్ని చోట్ల యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీ) ఇవ్వలేదని, మరికొన్ని చోట్ల కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఖర్చు కాకుండా మిగిలిన వాటిని మళ్లీ కేంద్రానికి జమచేయలేదని ఎత్తి చూపింది. జిల్లాకు సంబంధించిన ఇతర అంశాలు, స్థానిక సంస్థల ఆడిట్లో కాగ్ ప్రస్తావించిన అంశాలివి... సమీకృత గృహ, మురికివాడల అభివృద్ధి కార్యక్రమం (ఐహెచ్ఎఫ్డీసీ) డిసెంబర్ లో ప్రవేశపెట్టిన నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణపథకం (జేఎన్ఎన్యూఆర్ఎం)లో ఒక అంశంగా చేర్చారు. ఎంపిక చేసిన నగరాలలో సంస్కరణలు, ప్రణాళికాబద్ధమైన సత్వర అభివృద్ధిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. అయితే పాల్వంచలో స్థలాలు లభించకపోవడం వల్ల సామాజిక వినియోగకేంద్రాలు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టలేదు. అలాగే పాల్వంచలో 17 మురికివాడలను అభివృద్ధి చేసేందుకు గుర్తించినట్లు నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ మురికివాడలను ఎంపిక చేసేందుకు తీసుకున్న ప్రామాణికాలు ఏమిటో తెలపలేదు. దీంతో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మురికివాడలను ఎంపిక చేశారని ఆడిట్ నిర్ధారణకు రాలేదు. పాల్వంచలో ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఉన్న మురికివాడలను ఎంపిక చేసి.. దాని అభివృద్ధికి నిధులు ఖర్చు చేయడంపై ఆడిట్ అభ్యంతరం తెలిపింది. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయకపోవడాన్ని ఆడిట్లో తప్పుపట్టారు. అలాగే కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధి నిధుల్లో మిగులు, వడ్డీని తిరిగి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే పాల్వంచ మున్సిపాలిటీ రూ.1.40 కోట్లు తిరిగి చెల్లించలేదని ఆడిట్ నివేదికలో పేర్కొంది. మురికవాడలను గుర్తించేందుకు ప్రామాణికంగా చేసుకున్న అంశాలను ఖమ్మం కార్పొరేషన్ అందజేసిన నివేదికలో పొందుపరచలేదని పేర్కొంది. వివిధ రకాల గ్రాంట్లకు సంబంధించి పంచాయతీ రాజ్ సంస్థల్లో 2015 మార్చి నాటికి వినియోగ ధ్రువపత్రాలను జెడ్పీ సీఈఓ సమర్పించలేదని నివేదికలో కాగ్ పేర్కొంది.సెర్ప్‌కు సంబంధించి పరిహార రుసుము, వడ్డీ కలుపుకుని రూ.23,25,486లను చెల్లించాలని 2014 మేలో నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంత వరకు చెల్లించలేదు. ఆడిట్ నిర్వహించిన ఐదు సర్కిళ్లలోని మొత్తం 5057 కేసులలోని వ్యాట్ డీలర్లు (సదరు ఆర్థిక సంవత్సరంలో రూ.50లక్షల కన్నా ఎక్కువ టర్నోవర్ కలిగిన వారు) 2011-14 సంవత్సరానికి ఆడిటర్లు ధ్రువీకరించిన ఆర్థిక వివరణ పట్టికలను సమర్పించలేదని కాగ్ నిర్ధారణకు వచ్చింది. ఇందులో కొత్తగూడెం కూడా ఉంది. 2014 సెప్టెంబర్నుంచి 2015 ఫిబ్రవరి మధ్య 68 మంది డీలర్లు ఒక రోజు నుంచి 487 రోజుల ఆలస్యంతో పన్నులు చెల్లించినప్పటికీ అసెసింగ్ అధికారులు వడ్డీ, ఫెనాల్టీ విధించలేదు. ఇందులో జిల్లాకు సంబంధించిన డీలర్లు కొంతమంది ఉన్నారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి జిల్లాలో తాటి, ఈతచెట్ల అద్దెలను గ్రామీణ ప్రాంతాలకు వర్తింపచేయు రేట్ల ప్రకారం వసూలు చేసినట్లు ఆడిట్ గమనించింది. 41 కేసులకు గాను 40 కేసులలో పట్టణ జనాభా లెక్కల ప్రకారం అద్దెలను వసూలు చేయాల్సి ఉందని ఆడిట్లో గుర్తించారు. ఇందులో ఖమ్మం జిల్లా కూడా ఉంది. తెలంగాణ మోటారు వాహనాల పన్ను విధాన చట్టం ప్రకారం... ప్రతి మోటారు వాహన యజమాని ప్రభుత్వ నిర్దేశించిన రేట్లననుసరించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రంలో రూ.4.23 కోట్ల మేర త్రైమాసిక పన్నును 2,644 మంది రవాణా వాహన యజమానులు చెల్లించడం కానీ, రవాణా శాఖ ఆమేరకు డిమాండ్ పంపించడం కానీ జరగలేదని ఆడిట్లో గమనించారు. ఇందులో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌తోపాటు ఖమ్మం కూడా ఉంది. -
విభజన వివాదాలపై ఢిల్లీలో పంచాయితీ
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ పంచాయితీ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోంశాఖ సారథ్యంలోని వివాదాల పరిష్కార కమిటీ శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో సమావేశం కానుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. రాష్ర్ట విభజనలో భాగంగా నిధులు, ఆస్తులు, అప్పుల పంపిణీ అంశాలను ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలతోపాటు.. ఇప్పటివరకు జరిగిన విభజనను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఇందుకు వీలుగా సంబంధిత సమగ్ర సమాచారాన్ని రెండు రాష్ట్రాల నుంచి ఇప్పటికే స్వీకరించింది. పునర్విభజనకు ముందున్న పన్నుల బకాయిల పంపిణీని ప్రధానంగా ప్రస్తావించాలని తెలంగాణ సర్కారు పట్టుదలతో ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పన్నుల బకాయిలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఎక్సైజ్ డ్యూటీ, వాహనాల పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల పన్ను, గనులు-ఖనిజ వనరులు, ల్యాండ్ రెవెన్యూ, విద్యుత్ బకాయిలు కలిపితే మొత్తం రూ.7,326 కోట్ల పాత బకాయిలున్నట్లు ఇటీవలే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తమ నివేదికలో ప్రస్తావించింది. 2014 మార్చి 31 వరకు ఉన్న ఈ బకాయిల్లో దాదాపు రూ. 2,337.06 కోట్లు ఐదేళ్లుగా పేరుకుపోయాయి. వీటి పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తింది. బకాయిలను ఆస్తిగా పరిగణించి జనాభా ప్రాతిపదికన తెలంగాణకు 41.68 శాతం, ఏపీకి 58.32 శాతం పంచుకోవాలని పొరుగు రాష్ర్టం పట్టుబడుతోంది. కానీ ఏ ప్రాంతంలో ఉన్న బకాయిలను ఆ ప్రభుత్వమే స్వీకరించాలని తెలంగాణ సర్కారు వాది స్తోంది. హైదరాబాద్‌లో వచ్చే రెవెన్యూ బకాయి మొత్తం తెలంగాణ సర్కారుకే చెందుతుందని అంటోంది. దీంతో ఈ అంశం పెండింగ్‌లో పడింది. ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించి పునర్విభజన చట్టంలోని ఏడో షెడ్యూలులో ఉన్న అంశాలపై తాజా భేటీలో కేంద్ర కమిటీ దృష్టి సారించనుంది. దీనికితోడు ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల పంపిణీ, ఇటీవల ఏపీ ఉన్నత విద్యామండలి నిధులు, బ్యాంకు ఖాతాల నిలిపివేతపై హైకోర్టు తీర్పు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. అలాగే కేంద్ర రుణాల పంపిణీ, నాబార్డు, వరల్డ్ బ్యాంకు, జైకా తదితర సంస్థల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న అప్పుల పంపిణీ కూడా జరగాల్సి ఉంది. ప్రాజెక్టులవారీగా పంచుకోవాలా లేక జనాభా ప్రాతిపదికన పంచుకోవాలా అనేది తేలాల్సి ఉంది. ఈ అప్పులకు సంబంధించి లెక్కలు కూడా లేకపోవడం గందరగోళంగా మారింది. దీంతో రుణ సంస్థల వద్ద గణాంకాలనే పరిగణనలోకి తీసుకోవాలని రెండు రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఎయిర్టెల్, రిలయన్స్ జియోకి అనుచిత లబ్ధి
టెలికం శాఖకు కాగ్ అక్షింతలు న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌లకు (ఆర్‌జియో) అనుచిత ప్రయోజనాలు కట్టబెట్టిందని టెలికం శాఖను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) అక్షింతలు వేసింది. ఆర్‌జియోకి ఏకంగా రూ. 3,367 కోట్ల మేర లాభించేలా బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంపై వాయిస్ కాలింగ్ సేవలకు అనుమతించిందంటూ ఆక్షేపించింది. ఇందుకు సంబంధించిన నివేదికను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రకారం బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రంను దక్కించుకున్న ఇన్ఫోటెల్ను రిలయన్స్ జియో కొనుగోలు చేసింది. ఆ తర్వాత వాయిస్ కాలింగ్ సేవలు కల్పించేలా యూనివర్సల్ లెసైన్స్ (యూఎల్) కోసం ఎంట్రీ ఫీజు కింద రూ. 15 కోట్లు, అదనంగా మైగ్రేషన్ ఫీజు కింద రూ. 1,658 కోట్లు 2013 ఆగస్టులో కట్టింది. అయితే, ఈ ఫీజు 2011 నాటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయించినవని, 2013 నాటికి ఇది కనీసం రూ. 5,025.29 కోట్లుగా ఉండాల్సిందని కాగ్ లెక్కగట్టింది. టెలికం శాఖ మైగ్రేషన్ విధానం వల్ల ఆర్‌జియోకి రూ.3,367.29 కోట్ల మేర ప్రయోజనం లభించిందని పేర్కొంది. మరోవైపు, ఈ అంశాన్ని ఆర్‌జియో ఖండించింది. నిబంధనల మేరకే తాము ఫీజులు చెల్లించామని స్పష్టం చేసింది. ఇక లాభనష్టాల గురించి సరైన అధ్యయనం చేయకుండానే 2005లో టెలికం శాఖ చెన్నై మెట్రో, తమిళనాడు టెలికం సర్కిల్స్‌ను విలీనం చేసిందని, ఈ తొందరపాటు నిర్ణయం వల్ల కొన్ని టెల్కోలు లాభపడ్డాయని కాగ్ పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌కు రూ. 499 కోట్ల అనుచిత ప్రయోజనం చేకూరిందని వివరించింది. -
రూ. 3 లక్షల కోట్లు!
అంచనాలు మించుతున్న బొగ్గు, స్పెక్ట్రం వేలం ఆదాయం - 32 బొగ్గు బ్లాకులతో రూ. 2 లక్షల కోట్లు - స్పెక్ట్రం వేలంతో మరో రూ. 1 లక్ష కోట్లు న్యూఢిల్లీ: ఒకవైపు బొగ్గు బ్లాకులు వేలం, మరోవైపు టెలికం స్పెక్ట్రం వేలం అంచనాలను మించే స్థాయిలో సాగుతున్నాయి. వీటితో ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఏకంగా రూ. 3 లక్షల కోట్ల పైచిలుకు మొత్తం సమకూరినట్లయింది. బొగ్గు, స్పెక్ట్రం కుంభకోణాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో వేసిన లెక్కలకు మించి ఇది ఉండటం గమనార్హం. ఈ రెండింటి వేలం ఇంకా కొనసాగుతోంది. టెలికం స్పెక్ట్రం వేలానికి సంబంధించి బిడ్లు సోమవారం నాటికి రూ. 94,000 కోట్లకు చేరుకున్నాయి. అటు రెండో విడత బొగ్గు బ్లాకుల వేలానికి సంబంధించి అయిదో రోజున మరో రెండు బ్లాకులు అమ్ముడయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ. 11,000 కోట్లు రానున్నాయి. దీంతో బొగ్గు బ్లాకుల వేలం ద్వారా రాయల్టీలు, చెల్లింపులు మొదలైన వాటి రూపంలో రూ. 2.07 లక్షల కోట్లు వచ్చినట్లవుతుంది. యూపీఏ హయాంలో బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల ప్రభుత్వానికి రూ. 1.86 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గతంలో అంచనా వేసిన దానికంటే తాజా వేలంలో ఖజానాకు మరింత అధికంగా ఆదాయం రానుండటం గమనార్హం. కుంభకోణానికి కేంద్ర బిందువులైన 204 బొగ్గు బ్లాకుల కేటాయింపులను సుప్రీం కోర్టు కొన్నాళ్ల క్రితం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కేవలం 32 బ్లాకులను విక్రయిస్తేనే ఏకంగా రూ. 2.07 లక్షల కోట్లు వ స్తున్నాయని బొగ్గు శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. దీని వల్ల విద్యుత్ చార్జీలు తగ్గడంతో పాటు ఒడిషా తదితర రాష్ట్రాలకు లక్షల కోట్ల రూపాయల అదనపు ఆదాయం రాగలదన్నారు. ఇక స్పెక్ట్రం వేలానికి సంబంధించి సోమవారం నాడు ఏడు రౌండ్లు జరిగాయి. దీంతో మొత్తం 31 రౌండ్లు పూర్తయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ముంబై, ఢిల్లీ సర్కిళ్లలో 3జీ స్పెక్ట్రం వేలానికి ఇప్పటిదాకా బిడ్డింగ్ రాలేదు. -
పౌర సరఫరాలు.. లోపాల పుట్ట!
* శాఖ పనితీరును తప్పుబట్టిన కాగ్ * పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వానికి సూచన * కుటుంబాల సంఖ్యను మించి రేషన్ కార్డులు * బోగస్ కార్డులపై పర్యవేక్షణ లేని కారణంగా రూ. 1,136 కోట్ల భారం * ఏపీఎల్ బియాన్ని బీపీఎల్‌కు మళ్లించడంతో రూ. 2,330 కోట్ల భారం * 17,940 మంది ప్రభుత్వ ఉద్యోగులకు, కార్లున్న 89,850 మందికి కూడా కార్డులు * రేషన్ దుకాణాల పరిధిలో పరిమితికి మించి కార్డులు సాక్షి, హైదరాబాద్: అలవి మాలిన నిర్లక్ష్యానికి, నిలువెత్తు లోపాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిదర్శనమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, తనిఖీ ప్రక్రియ సరిగా జరగడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యకు మించి రేషన్ కార్డులు జారీ అయ్యాయని, లక్షల సంఖ్యలో అనర్హులకు కార్డులు పంపిణీ చేశారని ఎండగట్టింది. తద్వారా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ. 1,136 కోట్ల భారం పడిందని వెల్లడించింది. రేషన్ దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదని, ఈ దృష్ట్యా అనర్హులు కార్డులు పొందగలిగారని కాగ్ స్పష్టం చేసింది. బీపీఎల్ కుటుంబాల గుర్తింపునకు లోప రహిత విధానాన్ని ప్రభుత్వం రూపొందించుకోవాలని సూచించింది. పీడీఎస్ వ్యవస్థ కార్యకలాపాలపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని హితవు చెప్పింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభ ముందు ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పౌర సరఫరాల శాఖ పనితీరును అనేక అంశాల్లో తప్పుబట్టింది. కాగ్ తప్పుబట్టిన అంశాలు.. కేంద్రం బీపీఎల్ కుటుంబాలకు బియ్యం కిలో రూ. 5.65కు, ఏపీఎల్ కుటుంబాలకు రూ.8.30కు అందిస్తోంది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ పరిమితిని పెంచిన దృష్ట్యా రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు 2.17 కోట్లకు పెరిగాయి. కేంద్రం ఏపీఎల్ కోటా కింద కేటాయించిన బియ్యాన్ని బీపీఎల్ కార్డుల వారికి ఇస్తుండటంతో వీటి ధరలోని వ్యత్యాసం రూ. 2.65ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఇలా 2008-2013 మధ్య మళ్లించిన 87.96 లక్షల టన్నులపై 2,330 కోట్ల భారం పడింది. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చిన నాటి నుంచి 15 రోజుల్లోగా మిల్లింగ్ చేయించి బియ్యాన్ని సేకరించాలి. దీనిని జాయింట్ కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. కానీ సరైన పర్యవేక్షణ లేక 2008-2013 మధ్య సాలీనా సగటున 46 రోజుల జాప్యం జరిగింది. దీంతో క్యాష్ క్రెడిట్‌పై వడ్డీ రూపేణా ప్రభుత్వం రూ. 171 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 2.10 కోట్లు. 2010-1 1 ఏడాదిలో బీపీఎల్ కార్డుల సంఖ్య 2.04 కోట్లు, ఏపీఎల్ కార్డుల సంఖ్య 29.94 లక్షలు. అంటే మొత్తంగా జారీ అయిన రేషన్‌కార్డుల సంఖ్య 2.33 కోట్లు. ఇది రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య 2.10 కోట్ల కన్నా అధికం. బీపీఎల్ కార్డుల జారీకి ముందు లబ్ధిదారుల అర్హతను తగురీతిలో పరిశీలించలేదు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరిశీలిస్తే.. కార్డులకు అనర్హులైన 17,940 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 89,850 మంది కార్లు ఉన్నవారు, 750 చదరపు అడుగులకు మించి ప్లింత్ ఏరియా కలిగిన ఇళ్లున్న వారు 20,545 మంది కార్డులు పొందినట్లు తెలుస్తోంది. మొత్తంగా 2009 నుంచి ప్రభుత్వం చేపట్టిన నకిలీ కతార్డుల తొలగింపు ద్వారా 2013 మార్చి వరకు 23.93 లక్షల రేషన్ కార్డులను బోగస్‌గా తేల్చారు. ఈ బోగస్ కార్డులతో 2013 నాటికి ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల సబ్సిడీ రూపేణా ప్రభుత్వంపై రూ. 1,136 కోట్ల భారం పడింది. చౌక దుకాణాల హేతుబద్ధీకరణ క్రమ పద్ధతిలో లేదు. 16,653 రేషన్ దుకాణాల్లో పరిమితికి మించి కార్డులు ఉన్నాయి. నిత్యావసర సరుకుల లభ్యత, వాటి ధరల సమీక్ష, అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టేందుకు ధరల పర్యవేక్షణ సంఘాలను ఏర్పాటు చేసినా వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 2009-12 మధ్య ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదు. -
కాంట్రాక్టర్లతో డిస్కంల దోస్తీ!
జెన్కో ప్రాజెక్టుల జాప్యంతో సర్‌చార్జీల భారం ప్రభుత్వ శాఖల పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఖాజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. వివిధ శాఖలు అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తలంటుపోసింది. అధికారుల హస్తలాఘవం, నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని చీవాట్లు పెట్టింది. పౌర సరఫరాలు, విద్యుత్, పింఛన్లు, పారిశుద్ధ్యం, ఆర్టీసీ, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ వంటి అన్ని విషయాల్లోనూ ఇదే తంతుగా ఉందని లోపాలను ఎత్తిచూపింది. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో మితిమీరిన జాప్యం కారణంగా వినియోగదారులపై ఇంధన సర్‌చార్జీల మోత మోగుతోందని కాగ్ ఎత్తిచూపింది. దీంతో అంచనా వ్యయం పెరిగిపోవడంతో పాటు కొరతను అధిగమించేందుకు బహిరంగ మార్కెట్ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోందని వెల్లడించింది. ‘2008-12 మధ్య డిస్కంలు మార్కెట్లో 23,709.72 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేశాయి. ఒక్కో యూనిట్‌కు రూ. 4.49 నుంచి రూ. 6.95 వరకు చెల్లించాయి. 2012-13లో యూనిట్‌కు రూ. 5.17 చొప్పున కొనుగోలు చేశాయి. అదే వ్యవధిలో జెన్కో ఉత్పత్తి చేసిన విద్యుత్ ఖరీదు యూనిట్‌కు కేవలం రూ. 2.23 నుంచి రూ. 3.54 మాత్రమే. మార్కెట్లో చెల్లించిన అదనపు వ్యయాన్ని డిస్కంలు వినియోగదారులపై ఇంధన సర్‌చార్జీలుగా భారం మోపాయి..’ అని కాగ్ విశ్లేషించింది. ఉమ్మడి రాష్ట్రంలో హైవోల్టేజీ డిస్ట్రిబ్యూషన్ పథకం (హెచ్‌వీడీఎస్) అంచనాల్లోనే లోటుపాట్లు ఉన్నాయని.. డీపీఆర్‌ల అంచనా వ్యయం పెంచి రూ. 51.52 కోట్లు అదనంగా ఖర్చు చేసినట్లు ధ్రువీకరించింది. కాంట్రాక్టర్లకు ఇష్టమొచ్చినట్లుగా గడువు పెంచటంతో పాటు ఎక్సైజ్, వ్యాట్ రూపంలో అధికంగా చెల్లింపులు చేసినట్లు గుర్తించింది. పనుల్లో తీవ్ర జాప్యంతో ఆర్ఈసీ నుంచి తీసుకున్న రుణాలకు ఎన్పీడీసీఎల్ రూ. 8.24 కోట్ల వడ్డీ భారం భరించాల్సి వచ్చిందని, హెచ్‌వీడీఎస్ మూడో దశ బిడ్లలో నిబంధనలు పాటించకపోవటంతో సీపీడీసీఎల్ రూ. 6.17 కోట్లు అదనంగా ఖర్చు చేసిందని తప్పుబట్టింది. విద్యుదీకరణ పథకంలో లోటుపాట్లు.. కేంద్రం అమలు చేసిన రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ పథకంలో లోటుపాట్లను కాగ్ ఎత్తి చేపింది. నాలుగేళ్లు జాప్యం కావటం, లబ్ధిదారులను గుర్తించేందుకు ముందస్తు సర్వే చేయకపోవటంతో డీపీఆర్‌లలో తప్పులు జరిగినట్లు నివేదించింది. ఒప్పందాలకు విరుద్ధంగా డిస్కంలు రూ. 6.04 కోట్లు చెల్లించాయని, ఎన్డీపీసీఎల్ కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన రూ. 1.16 కోట్ల లేబర్ సెస్ వసూలు చేయలేదని తెలిపింది. ఖర్చు కాకుండా మిగిలిన ఆర్జీజీవివై నిధులపై వచ్చిన వడ్డీని ప్రాజెక్టు వ్యయంపై సర్దుబాటు చేయకుండా సొంత ఆదాయంగా చూపించాయని తెలిపింది. రైతులు వాడని గిడ్డంగులు సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ ఉత్పత్తులు, విత్తనాలు, ఎరువులు, నోటిఫై చేసిన వస్తువులు నిల్వ చేసేందుకు నిర్దేశించిన ప్రభుత్వ గిడ్డంగులు నష్టాల్లో ఉన్నాయని కాగ్ వెల్లడించింది. 2008-13 మధ్యలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 159 గోదాముల్లో 56 గోదాములు రూ. 1.69 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. 2009 ఏప్రిల్ నుంచి ఎఫ్‌సీఐ సవరించిన నిల్వ చార్జీలను ఏపీఎస్డబ్ల్యుసీ క్లెయిమ్ చేయకపోవటంతో రూ. 40.96 కోట్ల రాబడి నష్టం వాటిల్లింది. ఇప్పటికీ గిడ్డంగులు నిల్వల నాణ్యతా ప్రమాణాలను పాటించటం లేదు. రైతులు వాటిని వినియోగించడం లేదు. గోదాముల సామర్థ్య వినియోగం 2008-09లో 58 శాతం ఉండగా.. 2012-13 నాటికి 89 శాతానికి పెరిగింది. కానీ అద్దె గోదాములు, పెట్టుబడిదారుల గోదాముల సామర్థ్య వినియోగమే ఇప్పటికీ ఎక్కువగా ఉంది. సొంతది ఖాళీ.. ‘అద్దె’తో లూటీ సొంత భవనం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ లిమిటెడ్ (ఏపీఎండీసీ) అద్దె భవనంలో ఉంటూ ఆదాయాన్ని కోల్పోయిందని కాగ్ అక్షింతలు వేసింది. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతంలో 15,920 చదరపు అడుగుల సొంత భవనముంది. అది ఖాళీ చేసి హెచ్ఎండబ్ల్యు ఎస్ఎస్బీ అద్దె భవనంలోకి కార్యాలయాన్ని మార్చింది. రూ. 5.25 లక్షల నెలసరి అద్దెతో ఐదేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి తోడు అద్దె భవనంలో అంతర్గత మార్పులకు రూ. 2.78 కోట్లు ఖర్చు చేసింది. మూడేళ్లుగా సొంత భవనం ఖాళీగా ఉండడంతో ఆదాయం కోల్పోయింది. దేవుడిపైనే భారం.. దేవాదాయ శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని కాగ్ తేల్చింది. ఆ శాఖకు ప్రధాన దేవాలయాల నుంచి రావాల్సిన దేవాదాయ పరిపాలన నిధి, ఆడిట్ ఫీజు, సర్వ శ్రేయోనిధి, అర్చక సంక్షేమ నిధిలాంటి విరాళాలు అందడం లేదని వెల్లడించింది. 2003-2012 మధ్య దేవాదాయ పరిపాలన నిధికి రూ. 83 కోట్లు, ఆడిట్ ఫీజు కింద రూ. 24 కోట్లు, సర్వశ్రేయోనిధికి రూ. 27 కోట్లు, అర్చక సంక్షేమ నిధికి రూ. 43 కోట్లు.. వెరసి దాదాపు రూ. 178 కోట్ల బకాయిలు పేరుకుపోయినట్టు తేల్చింది. 2013 మార్చి నాటికి దేవాలయాల స్థలాలకు లీజులు, సేవా హక్కుల లెసై న్సు ద్వారా రావాల్సిన మొత్తంలో రూ. 7.61 కోట్లు బకాయిలున్నట్లు తెలిపింది. ప్రణాళికలు లేకుండానే.. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన పథకంలో రహదారుల నిర్మాణానికి ప్రాజెక్టు నివేదికలు రూపొందించకుండా.. అవాస్తవికమైన సమాచారంతోనే పనులు చేపడుతున్నారని ‘కాగ్’ తుర్పారబట్టింది. బీటీ రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 1,104 కోట్లు కావాలని ఆ శాఖ ప్రతిపాదనలు ఇస్తే.. ప్రభుత్వం రూ. 99 కోట్లు మాత్రమే విడుదల చేసిందని... దీనివల్ల 3,817 కోట్లతో చేపట్టిన రహదారులు శిథిలావస్థకు చేరుకున్నాయని కాగ్ తెలిపింది. -
వ్యాట్ నష్టం 30 కోట్లు
పన్ను ఎగవేసిన 70 మంది బిల్డర్లు ప్రభుత్వ శాఖల పనితీరును కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) తప్పుబట్టింది. సిబ్బంది నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఖాజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని స్పష్టం చేసింది. వివిధ శాఖలు అనుసరిస్తున్న విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని తలంటుపోసింది. అధికారుల హస్తలాఘవం, నిబంధనల ఉల్లంఘన యథేచ్చగా సాగుతోందని చీవాట్లు పెట్టింది. పౌర సరఫరాలు, విద్యుత్, పింఛన్లు, పారిశుద్ధ్యం, ఆర్టీసీ, రోడ్లు, ప్రాజెక్టుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ వంటి అన్ని విషయాల్లోనూ ఇదే తంతుగా ఉందని లోపాలను ఎత్తిచూపింది. దీనిపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని పేర్కొంది. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నిర్మించిన భవనాలకు సంబంధించి 2013 మార్చి నుంచి మే మధ్యలో 70 మంది బిల్డర్లు వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సిన విలువ ఆధారిత పన్ను (వ్యాట్) రూ. 30.78 కోట్ల మేర ఎగవేసినట్లు కాగ్ తేల్చింది. బిల్డర్లు తాము నిర్మించే కట్టడాల వల్ల పొందిన ప్రతిఫలంలో 25 శాతం మీదగాని, స్టాంపు డ్యూటీ చెల్లింపునకు నిర్ణయించిన మార్కెట్ విలువలో గానీ 5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఎస్ఆర్ నగర్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసిన 70 మంది బిల్డర్లను ఇంటర్నెట్ ద్వారా గుర్తించిన కాగ్ తనిఖీలు చేయగా భారీగా అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. ఈ 70 మంది బిల్డర్లు తక్కువ స్టాంపు డ్యూటీతో ఏడు రిజిస్టర్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్టర్ చేసి ఆ విలువ ఆధారంగా వ్యాట్ చెల్లింపులు జరిపినట్లు గుర్తించింది. ఈ క్రమంలో రూ. 30.78 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు గుర్తించి వాణిజ్య పన్నుల శాఖకు, ప్రభుత్వానికి 2013 ఆగస్టులోనే తెలియజేసినట్లు కాగ్ స్పష్టం చేసింది. కాగ్ పరిశీలనలో తేలిన అంశాలు - వాణిజ్యపన్నుల శాఖ అధికారులు వే బిల్లులను పరిశీలించడం లేదు, అడ్వాన్స్ వే బిల్లులు పంపడం లేదు - వ్యాట్ డీలర్లు సమర్పించిన టర్నోవర్ వివరాలకు, చెక్‌పోస్టుల వద్ద ఉన్న జీఐఎస్ సమాచారంతో సరిపోలిస్తే 2012 నవంబర్ నుంచి 2013 మే మధ్య వేల కోట్ల రూపాయల తేడా ఉన్నట్లు తేలింది. - తప్పుడు డిక్లరేషన్లపై పన్ను తక్కువ విధింపు, జరిమానాలు విధించకపోవడం - అంతర్రాష్ట్ర కొనుగోళ్లలో సీ ఫారాల దుర్వినియోగంపై జరిమానాలు విధించకపోవడం - చెల్లని సీ-ఫారాలను అనుమతించడం ద్వారా పన్ను రాయితీ ఇవ్వడం ఆర్టీసీకి టోల్ నష్టం క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండానే ఆర్టీసీ డీపీఆర్ తయారు చేసిందని, కేంద్ర, రాష్ట్ర గ్రాంట్లు రాకముందే రుణంగా తెచ్చిన నిధులతో బస్స్టాండ్లు, టెర్మినల్స్ నిర్మించడంతో నష్టం వాటిల్లిందని కాగ్ వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వసూలు చేయాల్సిన యూజర్ ఫీజును టోల్‌టాక్స్‌కు అనుగుణంగా సవరించకపోవటంతో 2010 ఏప్రిల్ నుంచి 2013 మే వరకు రూ. 50.69 కోట్లను ఆర్టీసీ నష్టపోయిందని తెలిపింది. 2012 నుంచి జిల్లాల్లో రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాల మీద టోల్ చార్జీలపై 50 శాతం రాయితీ లభిస్తుంది. ఆర్టీసీ తమ బస్సులన్నింటినీ హైదరాబాద్‌లో రిజిస్టర్ చేయించటంతో ఈ రాయితీని కోల్పోయినట్లయింది. 2011లో పూర్తయిన కోఠి బస్సు టెర్మినల్స్‌లో వాణిజ్య సముదాయాన్ని లీజుకు ఇవ్వటం ఆలస్యం కావటంతో ఆర్టీసీ రూ. 29.02 కోట్లను కోల్పోయింది. వాహనాల పన్ను హుష్‌కాకి ప్రభుత్వ ఖజానాకు ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన మోటారు వాహనాల పన్ను వసూళ్లలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నట్లు కాగ్ తేల్చింది. 2012 ఏప్రిల్-2013 మార్చి మధ్య రవాణాశాఖ కార్యాలయాల్లో పలు రికార్డులను తనిఖీ చేసినప్పుడు ఇది వెల్లడైందని తెలిపింది. ‘‘వీటి పరిధిలో 6,447 మంది వాహనదారులు రూ. 10.32 కోట్ల త్రైమాసిక పన్ను ఎగ్గొట్టినట్టు తేలింది. కనీసం వారికి నోటీసులు కూడా పంపలేదు. జరిమానాగా వసూలు చేయాల్సిన రూ. 20.65 కోట్లనూ పట్టించుకోలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన బకాయిలు రూ. 36.76 కోట్ల వరకు ఉన్నట్టు తేలింది’’ అని వెల్లడించింది. -
వైఎస్ హయాంలో పింఛన్ల వర్షం
►ఒకే ఏడాది 23 లక్షల కొత్త పెన్షన్లు.. కాగ్ నివేదికలో వెల్లడి ►ఇందిరమ్మ, రచ్చబండ కార్యక్రమాల ద్వారా కొత్తవారికి అవకాశం ►ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 72.36 లక్షల మంది పింఛనుదారులు సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 23 లక్షల మందికి ఒకే ఏడాదిలో కొత్త పింఛన్లు మంజూరయ్యాయని కాగ్(కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) నివేదిక వెల్లడించింది. 2007-08తో పోల్చితే 2008-09 సంవత్సరంలో ఇలా ఇన్ని లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడాది అంతకు ముందు ఏడాదికన్నా ఈ రంగానికి 80 శాతం మేర అదనంగా బడ్జెట్ కేటాయింపులు కూడా జరిపినట్టు కాగ్ నివేదిక స్పష్టంచేసింది. 2006లో ఇందిరమ్మ పథకాన్ని అప్పటి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టడం.. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు దరఖాస్తులు నేరుగా తీసుకోవడమే పింఛనుదారుల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు తమ దృష్టికి తీసుకొచ్చినట్టు కాగ్ పేర్కొంది. 2008 -13 మధ్య ఐదేళ్ల కాలానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్లపై కాగ్ పరిశీలన జరిపి తాము గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందజేయగా.. సంబంధిత నివేదికను 13 జిల్లాల ఏపీ ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పేదలకు 39.15 లక్షల ఇళ్లు వైఎస్ హయాంలో ఇందిరమ్మ పథకం కింద మూడేళ్లలోనే సాధ్యం సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పేదలందరికీ గూడు కల్పించేందుకు చేపట్టిన ఇందిరమ్మ పథకం ద్వారా రికార్డు స్థాయిలో మూడేళ్లలోనే ఏకంగా 39.15 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. ఈ వాస్తవాన్ని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2013 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సామాన్య-సామాజిక రంగాలపై కాగ్ నిర్వహించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీకి సమర్పించింది. ఆ నివేదికలో ఇందిరమ్మ ఇళ్ల పథకం వాస్తవ ప్రగతిని పట్టిక రూపంలో వివరించారు. రాజశేఖరరెడ్డి హయాంలో 2006-07, 2007-08, 2008-09 ఆర్థిక సంవత్సరాల్లో ఏకంగా పేదల కోసం ఇందిరమ్మ పథకం కింద 44.98 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. వాటిలో ఆ మూడు ఆర్థిక సంవత్సరాల్లోనే 39.15 లక్షల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేశారని కాగ్ పేర్కొంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మృతి అనంతరం అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పేదల ఇళ్ల నిర్మాణాన్ని అటకెక్కించినట్లు స్పష్టం చేసింది. -
ఇప్పుడేమంటారు?!
రెండేళ్లక్రితం వెల్లడై జాతి మొత్తాన్ని దిగ్భ్రమపరిచిన బొగ్గు క్షేత్రాల కేటాయింపు వ్యవహారంలో ఆద్యంతమూ అవకతవకలు చోటుచేసుకు న్నాయని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు చెప్పింది. రెం డేళ్లక్రితం ఆనాటి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) 195 బొగ్గు క్షేత్రాల కేటాయింపులో లక్షా 86 వేల కోట్ల స్కాం జరిగిందని వెల్లడించి నప్పుడు యూపీఏ పెద్దలు ఇంతెత్తున లేచారు. ఆయన కావాలని సంచలనం కోసం పెద్ద పెద్ద అంకెలను చూపుతున్నారని కపిల్ సిబల్ వంటి నేతలు దుయ్యబట్టారు. దేశంలో నీరసించివున్న మౌలిక సదుపా యాల రంగాన్ని పట్టాలెక్కించి...అటు ఉత్పాదకతనూ, ఇటు ఉపాధిని పెంచే ఉద్దేశంతో తీసుకున్న కీలక నిర్ణయాలను అనవసరంగా తప్పుబ డుతున్నారని ఆరోపించారు. బొగ్గు క్షేత్రాల కేటాయింపులో తాము అంతక్రితంనాటి ఎన్డీయే సర్కారు విధానాన్నే అనుసరించాం తప్ప కొత్తదేమీ సృష్టించలేదని దబాయించారు. కానీ ఎవరు చేసినా తప్పు తప్పే. ఈ కేటాయింపులు రెండు విధాలుగా జరిగాయి. తొలుత ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సిఫార్సుతో కేటాయిస్తే, ఆ తర్వాత కేంద్రం లోని వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులతో ఏర్పాటైన స్క్రీనింగ్ కమిటీ ద్వారా కొనసాగాయి. ఈ రెండు విధానాల్లోనూ పారదర్శకత లోపించడమేగాక, అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని....కనుక ఎన్డీయే, యూపీఏ పాలకులు పంచిపెట్టిన 218 బొగ్గు క్షేత్రాలూ చట్టవిరుద్ధమైనవేనని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. సహజ వనరుల వినియోగం విషయంలో ప్రభుత్వాలు వ్యవహరి స్తున్న తీరులో చట్టవిరుద్ధత ఉంటున్నదని, అవి ఎలాంటి మార్గదర్శకా లనూ అనుసరించడంలేదని పర్యావరణవేత్తలనుంచి, స్వచ్ఛంద సంస్థ లనుంచి చాన్నాళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వప్రయోజనా లంటూ లేకపోతే పాలకులు వీటిని పట్టించుకునేవారు. తమ విధానా లను సమీక్షించుకుని సరిదిద్దుకునేవారు. దేశంలో మౌలిక సదుపా యాల రంగం బలహీనంగా ఉందన్నది నిజమే. ముఖ్యంగా సిమెంటు, విద్యుత్తు, ఉక్కు పరిశ్రమలకు అవసరమైన బొగ్గును కోల్ ఇండియా అందించలేకపో తున్నదని, విదేశాలనుంచి దిగుమతి చేసు కుంటే ఆయా పరిశ్రమలకు తడిసిమోపెడవుతున్నదని ఆ రంగంలోని వారు మొరపెట్టుకున్నారు. మౌలిక సదుపాయాల రంగం పటిష్టం కావాలంటే ఈ పరిశ్రమలకు బొగ్గు క్షేత్రాలు కేటాయించడం ఉత్తమ మన్న నిర్ణయానికి పాలకులు వచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, సహజ వనరులను ప్రైవేటు వ్యక్తులకూ, సంస్థలకూ కేటాయించి నప్పుడు అత్యంత జాగురూకతతో వ్యవహరించాలన్న సంగతిని వారు విస్మరించారు. బొగ్గు క్షేత్రాలను స్వీయావసరాల కోసం వినియోగించు కోవాలి తప్ప బయటివారికి అమ్మరాదన్న షరతు పెట్టడం మినహా ఇతర నియమాలేవీ పాటించలేదు. వచ్చిన దరఖాస్తుల్లో వేటిని ఎందుకు అనుమతిస్తున్నారో, ఎందుకు నిరాకరిస్తున్నారో స్క్రీనింగ్ కమిటీ సభ్యులే చెప్పలేని స్థితి నెలకొన్నది. బొగ్గు క్షేత్రం కావాలని కోరిన సంస్థకు అందుకు అవసరమైన అర్హతలున్నాయో లేదో చూసే నాథుడు లేడు. నిజానికి యూపీఏ అధికారానికొచ్చిన కొత్తలో ఈ కేటాయింపులకు అనుసరిస్తున్న విధానాన్ని మార్చాలని తలపోసింది. నిజాయితీ అధికారిగా పేరొందిన పీసీ పరేఖ్ అందుకోసం ఒక కొత్త విధానాన్ని రూపొందించారు. దేశంలో బొగ్గు క్షేత్రాలు తగినంతగా లేనపుడూ...వాటి కోసం విపరీతమైన పోటీ ఉన్నప్పుడూ సొమ్ముకు ఆశపడి అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, కనీసం అలా జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తే అవకాశం ఉన్నదని పరేఖ్ గుర్తిం చారు. అందుకోసం పారదర్శకంగా ఉండేలా పోటీ వేలం విధానం అనుసరిస్తే బాగుంటుందని సూచించారు. ఇదంతా 2004నాటి మాట. స్క్రీనింగ్ కమిటీ విధానాన్ని రద్దు చేయాలని ఆనాటి ప్రధాని మన్మోహ న్సింగ్ కూడా భావించారు. అందుకోసం వెనువెంటనే ఆర్డినెన్స్ తీసుకురావడం మంచిదా... లేక సవివరమైన బిల్లు రూపొందించి చట్టం చేస్తే మంచిదా అన్న విచికిత్స కూడా జరిగింది. ఏమైందో ఏమో... ఈలోగా పాత విధానమే అమలవుతూ వచ్చి చివరకు అదే ఖరారైపోయింది! బొగ్గు క్షేత్రాల కేటాయింపుపై ఆరోపణలొచ్చిన కాలంలో నాలుగేళ్లపాటు ప్రధాని మన్మోహన్సింగే బొగ్గు శాఖను స్వయంగా పర్యవేక్షించారు. మంచిగా ఉండటం, మౌనంగా మిగలడం సుగుణం కావచ్చేమోగానీ తాను స్వయంగా పర్యవేక్షిస్తున్న శాఖలో భారీయెత్తున అవకతవకలు సాగుతున్నాయని తెలిసినప్పుడైనా సరిచే ద్దామని చూడకపోవడం మన్మోహన్ తప్పిదం. పైగా ఈ కుంభ కోణాన్ని కాగ్ బయటపెట్టినప్పుడు అంతా సవ్యంగానే ఉందంటూ సమర్ధించబోవడం మరింత దారుణం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వ్యక్తిగతంగా మన్మోహన్పై కూడా అభిశంసనే. ఇంతకూ బొగ్గు క్షేత్రాల కేటాయింపులన్నీ రద్దవుతాయా? కేటాయింపుల ప్రక్రియ పరమ అవకతవకలతో నడిచిందని ధర్మాసనం చెప్పినా బొగ్గు క్షేత్రాలనూ ఆయా సంస్థలనుంచి వెనక్కి తీసుకోవాలా లేదా అన్న విషయంలో నిర్ణయాన్ని వాయిదా వేసింది. కేటాయింపు వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉండటంతో బొగ్గు క్షేత్రాల్లో పనులు గత రెండేళ్లుగా నిలిచిపోయాయి. పర్యవసానంగా పరిశ్రమలకు అవసరమైన విద్యుదుత్పాదన సాధ్యంకాలేదు. కనుక ఉత్పాదన, ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. బొగ్గు క్షేత్రాల్లో పెట్టుబడులకు రుణాలిచ్చిన బ్యాంకులు సైతం బేలగా మారాయి. ఇన్నివిధాల దేశాన్ని భారీగా నష్టపరిచిన నేతలపై చర్య తీసుకోవడంతోపాటు భవిష్యత్తులో ఈ తరహా స్కాంలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించవలసిన అవసరం ఉన్నది. -
అక్రమాలతోనే ఇక్కట్లు
న్యూఢిల్లీ: అక్రమాలు, నిర్వహణ బాగా లేకపోవడం వల్లే ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ (డీటీటీడీసీ) రాష్ట్ర శాసనసభలో నిర్వహిస్తున్న క్యాంటీన్ నష్టాల పాలయినట్టు తేలింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పరిశీలనలో ఈ విషయం వెల్లడయింది. నిర్వహణ వ్యయాన్ని మదింపు చేయకపోవడం, శాసనసభ సచివాలయంతో తగిన ఒప్పందం లేకుండానే సేవలు ప్రారంభించడంతో రూ.1.44 కోట్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. నష్టాలు వస్తున్నాయని తెలిసిన తరువాత కూడా దీనిని మూసివేయకపోవడం సరికాదని అభిప్రాయపడింది. క్యాంటీన్ నష్టాలను భరించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు కాబట్టి, దీని నిర్వహణ నుంచి తప్పుకొని ఉండాల్సిందని కాగ్ నివేదిక పేర్కొంది. శాసనసభ సమావేశాలకు హాజరయ్యే ఎమ్మెల్యేలు, ఇతర వీఐపీలకు ఆహారం అందించేందుకు వీలుగా డీటీటీడీసీ 2007, సెప్టెంబర్ 10న క్యాంటీన్ ప్రారంభించింది. శాసనసభ సచివాలయం అధికారుల విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ క్యాంటీన్లోని రేట్లనే ఇక్కడా అమలు చేసేందుకు అంగీకరించింది. ఇదిలా ఉంటే కంగన్కేరీ పర్యాటక భవనం నిర్వహణకు కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసేందుకు తగిన సలహాదారుణ్ని నియమించుకోవడంలో ఆలస్యం ఫలితంగా రూ. 5.67 కోట్ల నిధులు స్తంభించిన విషయాన్ని కూడా కాగ్ నివేదిక బయటపెట్టింది. పీతంపురా ఢిల్లీహాట్ పార్కింగ్కేంద్రం కాంట్రాక్టరు నుంచి ఆస్తిపన్ను వసూలు చేయకపోవడం వల్ల రూ.51.43 లక్షల నష్టం వాటిల్లిందని కాగ్ నివేదిక వివరించింది. -
రూ.15 వేల కోట్లకు లెక్కల్లేవ్!
రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లపై ప్రభుత్వానికి అందని యూసీలు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యాన్ని ఎండగట్టిన కాగ్ 15 రోజుల్లో యూసీలు ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ ఆదేశం హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది. విద్యార్థుల కోసం విడుదల చేసే నిధుల వినియోగానికి సంబంధించిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడంలో పూర్తి అలసత్వం ప్రదర్శించారని తప్పుబట్టింది. కళాశాలల నుంచి యూసీలు సకాలంలో అందేలా చూడాల్సిన వివిధ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు ఏడేళ్లుగా నిద్రావస్థలో ఉన్నట్లు కాగ్ నివేదిక స్పష్టం చేసింది. 2007-08 నుంచి 2014-15 విద్యా సంవత్సరం వరకు 27 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం విడుదలైన రూ. 14,850 కోట్లకు సంబంధించిన యూసీలు ఇప్పటి వరకూ ప్రభుత్వానికి అందలేదని కాగ్ పేర్కొంది. కాగ్ తప్పుపట్టిన విషయంపై బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ లెటర్ నంబర్ 1399/బి/2014 ద్వారా శనివారం అన్ని సంక్షేమ శాఖల అధికారులకు లేఖలు రాశారు. 15 రోజుల్లోగా జిల్లా అధికారులు యూసీలను సమర్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు 23 జిల్లాలకు సంబంధించిన వివరాలు, 2007 నుంచి ఇప్పటి వరకు కాలేజీలు అందజేసిన యూసీలు, ఇంకా యూసీలు ఇవ్వాల్సిన నిధుల వివరాలను అందులో పొందుపర్చారు. ఫీజు రీయింబర్స్మెంట్ కింద రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖ పరిధిలో రూ.7,579 కోట్లు, స్కాలర్‌షిప్పుల కింద రూ. 3,743 కోట్లు, ఈబీసీ ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.3,527 కోట్లకు సంబంధించిన యూసీలు రావలసి ఉందని వివరించారు. వీటిలో స్కాలర్‌షిప్‌లకు సంబంధించే వివిధ శాఖల పరిధిలో రూ. 1,276 కోట్లు విడుదల చేయగా, రూ. 120 కోట్లకు మాత్రమే యూసీలు అందాయని, ఇంకా రూ. 1,156 కోట్లకు యూసీలు అందాల్సి ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. -
కాగ్ మాట వినాల్సిందే!
న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ సహకరించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ హైకోర్టు డిస్కమ్‌లకు స్పష్టం చేసింది. ఈ మేరకు టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్), రిలయన్స్ అడాగ్‌కు చెందిన బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి ఎస్ మృదుల్‌తో కూడిన బెంచ్ ఆదేశించింది. కాగ్ ఆడిటింగ్ నిలిపివేతపై స్టే మంజూరు చేయాలన్న మూడు డిస్కమ్‌ల విజ్ఞప్తి తోసిపుచ్చింది. ఈ కంపెనీల అభ్యర్థనలు, వీటికి కాగ్ ఆడిటింగ్ కోరుతూ ఒక స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన పిటిషన్లంటిపై మే ఒకటిన విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, వాదనలను అప్పటి వరకు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కాగ్ ఆడిటింగ్‌ను నిలిపివేయడానికి తిరస్కరిస్తూ జనవరి 24న ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ మూడు డిస్కమ్‌లు పిటిషన్ దాఖలు చేశాయి. కాగ్ అడిగిన పత్రాలన్నింటినీ తప్పకుండా అందజేయాలని కూడా దిగువకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా నివేదికను విడుదల చేయవద్దని న్యాయమూర్తి కాగ్‌ను ఆదేశించారు. తమ ఖాతాలకు కాగ్ అడిటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి స్వచ్ఛంద సంస్థ, నివాసుల సంక్షేమ సంఘా సంయుక్త కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించాలని డిస్కమ్‌లు కోరాయి. దీనికి కమిటీ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ డిస్కమ్‌లు ఆడిటింగ్ రద్దు కోరుతున్నాయని కాబట్టి తమ పిటిషన్‌ను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతాల్లో అవకతవకలు ఉన్నట్టు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) స్వయంగా ప్రకటించిందని, బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కాగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆడిటింగ్ ప్రక్రియకు డిస్కమ్‌లు సహకరించడం లేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వాదనతో విభేదించిన డిస్కమ్‌లు, తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని స్పష్టీకరించాయి. ఆడిటింగ్ కోసం కాగ్‌కు ఇప్పటికే 10 వేల పత్రాలు సమర్పించామని తెలిపాయి. వీటి ఖాతాల్లో పలు అవకతవకలు ఉన్నందున సీబీఐ దర్యాప్తు లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానానికి విన్నవించారు. నష్టాలు వచ్చాయంటూ డిస్కమ్‌లు చూపించిన కాకిలెక్కలను నమ్మిన షీలా దీక్షిత్ ప్రభుత్వం, కరెంటు టారిఫ్ పెంపునకు అనుమతించిందని నివాసుల సంక్షేమ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆరోపించింది. రాజధానిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలని షీలా దీక్షిత్ ప్రభుత్వం నిర్ణయించడంతో 2002 నుంచి ఈ మూడు డిస్కమ్‌లు కరెంటు పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ఇవి ఖాతాలను తారుమారు చేసి దొంగ లెక్కలు చూపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. డీఈఆర్సీ సైతం ఈ వాదనను సమర్థిస్తూ టారిఫ్ తగ్గించవచ్చని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే డిస్కమ్‌ల ఖాతాలకు ఆడిటింగ్ జరిపిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం తెలిసిందే. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం డిస్కమ్‌ల ఖాతాలపై కాగ్ ఆడిటింగ్‌కు ఆదేశాలు జారీ చేయడంతోపాటు, విద్యుత్ బిల్లులపై 50 శాతం ప్రకటించింది. ఇదిలా ఉంటే..డిస్కమ్‌లు ఇటీవల ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా భారీగా పెంచడంతో నగరవాసిపై భారం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే తాము ఆడిటింగ్‌కు సహకరించడంతో లేదంటూ కాగ్ మరోసారి సోమవారం హైకోర్టుకు ఫిర్యాదు చేయడంపై బీఎస్ఈఎస్ రాజధాని విస్మయం వ్యక్తం చేసింది. కాగ్ ఆడిటర్లకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపింది.