పౌర సరఫరాలు.. లోపాల పుట్ట!
* శాఖ పనితీరును తప్పుబట్టిన కాగ్
* పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని ప్రభుత్వానికి సూచన
* కుటుంబాల సంఖ్యను మించి రేషన్ కార్డులు
* బోగస్ కార్డులపై పర్యవేక్షణ లేని కారణంగా రూ. 1,136 కోట్ల భారం
* ఏపీఎల్ బియాన్ని బీపీఎల్‌కు మళ్లించడంతో రూ. 2,330 కోట్ల భారం
* 17,940 మంది ప్రభుత్వ ఉద్యోగులకు, కార్లున్న 89,850 మందికి కూడా కార్డులు
* రేషన్ దుకాణాల పరిధిలో పరిమితికి మించి కార్డులు
సాక్షి, హైదరాబాద్: అలవి మాలిన నిర్లక్ష్యానికి, నిలువెత్తు లోపాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నిదర్శనమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎండగట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని, తనిఖీ ప్రక్రియ సరిగా జరగడం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యకు మించి రేషన్ కార్డులు జారీ అయ్యాయని, లక్షల సంఖ్యలో అనర్హులకు కార్డులు పంపిణీ చేశారని ఎండగట్టింది.
తద్వారా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ. 1,136 కోట్ల భారం పడిందని వెల్లడించింది. రేషన్ దరఖాస్తులను క్షుణ్నంగా పరిశీలించిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదని, ఈ దృష్ట్యా అనర్హులు కార్డులు పొందగలిగారని కాగ్ స్పష్టం చేసింది. బీపీఎల్ కుటుంబాల గుర్తింపునకు లోప రహిత విధానాన్ని ప్రభుత్వం రూపొందించుకోవాలని సూచించింది. పీడీఎస్ వ్యవస్థ కార్యకలాపాలపై పర్యవేక్షణ యంత్రాంగాన్ని పటిష్టం చేయాలని హితవు చెప్పింది. శుక్రవారం రాష్ట్ర శాసనసభ ముందు ప్రవేశపెట్టిన కాగ్ నివేదికలో పౌర సరఫరాల శాఖ పనితీరును అనేక అంశాల్లో తప్పుబట్టింది.
కాగ్ తప్పుబట్టిన అంశాలు..
కేంద్రం బీపీఎల్ కుటుంబాలకు బియ్యం కిలో రూ. 5.65కు, ఏపీఎల్ కుటుంబాలకు రూ.8.30కు అందిస్తోంది. 2008లో ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయ పరిమితిని పెంచిన దృష్ట్యా రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు 2.17 కోట్లకు పెరిగాయి. కేంద్రం ఏపీఎల్ కోటా కింద కేటాయించిన బియ్యాన్ని బీపీఎల్ కార్డుల వారికి ఇస్తుండటంతో వీటి ధరలోని వ్యత్యాసం రూ. 2.65ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తోంది. ఇలా 2008-2013 మధ్య మళ్లించిన 87.96 లక్షల టన్నులపై 2,330 కోట్ల భారం పడింది.
ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చిన నాటి నుంచి 15 రోజుల్లోగా మిల్లింగ్ చేయించి బియ్యాన్ని సేకరించాలి. దీనిని జాయింట్ కలెక్టర్లు, క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి. కానీ సరైన పర్యవేక్షణ లేక 2008-2013 మధ్య సాలీనా సగటున 46 రోజుల జాప్యం జరిగింది. దీంతో క్యాష్ క్రెడిట్‌పై వడ్డీ రూపేణా ప్రభుత్వం రూ. 171 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.
2011 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 2.10 కోట్లు. 2010-1 1 ఏడాదిలో బీపీఎల్ కార్డుల సంఖ్య 2.04 కోట్లు, ఏపీఎల్ కార్డుల సంఖ్య 29.94 లక్షలు. అంటే మొత్తంగా జారీ అయిన రేషన్‌కార్డుల సంఖ్య 2.33 కోట్లు. ఇది రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య 2.10 కోట్ల కన్నా అధికం.
బీపీఎల్ కార్డుల జారీకి ముందు లబ్ధిదారుల అర్హతను తగురీతిలో పరిశీలించలేదు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పరిశీలిస్తే.. కార్డులకు అనర్హులైన 17,940 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 89,850 మంది కార్లు ఉన్నవారు, 750 చదరపు అడుగులకు మించి ప్లింత్ ఏరియా కలిగిన ఇళ్లున్న వారు 20,545 మంది కార్డులు పొందినట్లు తెలుస్తోంది. మొత్తంగా 2009 నుంచి ప్రభుత్వం చేపట్టిన నకిలీ కతార్డుల తొలగింపు ద్వారా 2013 మార్చి వరకు 23.93 లక్షల రేషన్ కార్డులను బోగస్‌గా తేల్చారు. ఈ బోగస్ కార్డులతో 2013 నాటికి ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల సబ్సిడీ రూపేణా ప్రభుత్వంపై రూ. 1,136 కోట్ల భారం పడింది.
చౌక దుకాణాల హేతుబద్ధీకరణ క్రమ పద్ధతిలో లేదు. 16,653 రేషన్ దుకాణాల్లో పరిమితికి మించి కార్డులు ఉన్నాయి.
నిత్యావసర సరుకుల లభ్యత, వాటి ధరల సమీక్ష, అక్రమ నిల్వలు, నల్లబజారు విక్రయాలను అరికట్టేందుకు ధరల పర్యవేక్షణ సంఘాలను ఏర్పాటు చేసినా వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో 2009-12 మధ్య ఒక్క సమావేశాన్ని కూడా నిర్వహించలేదు.