కోడుమూరు కేంద్రంగా బోగస్ కార్డులు
కోడుమూరు కేంద్రంగా బోగస్ కార్డులు
Published Tue, Nov 8 2016 11:35 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
– 8 మంది డీలర్లపై నిఘా వేసిన సీసీఎస్ పోలీసులు
– డీలర్లను రక్షించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం
– తమ పేర్లు బయటపడకుండా ఉండేందుకు లాబీయిగ్ చేస్తున్న డీలర్లు
– బోగస్ కార్డులున్నాయని ఆనాడే హెచ్చరించిన సాక్షి
కోడుమూరు: ఇపాస్ యంత్రాలను బైపాస్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ సరుకులను దోచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న కోడుమూరు పట్టణంలోని 8 మంది డీలర్లపై సీసీఎస్ పోలీసులు నిఘా వేశారు. డేటాబేస్ ఆధారంగా గతంలో 100 శాతం సరుకులు డెలివరీ చేసిన డీలర్ల వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలానికి చెందిన డీలర్ ద్వారా ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా బోగస్ కార్డులపై డీలర్లే వేలిముద్రలు వేసుకుని సరుకులు తీసుకునే వెసులుబాటును అమర్చి భారీ ఎత్తున బోగస్ కార్డులు పొందినట్లు ఈ ఏడాది జులై 15న సాక్షిలో ‘బోగస్‌కార్డులు కుప్పలుతెప్పలు’ కథనం సాక్షాధారాలతో ప్రచురితమైంది. బ్యాక్‌లాగ్ సరుకులను డీలర్లు ఏ విధంగా స్వాహా చేస్తున్నారన్న విషయంపై సీసీఎస్ అధికారులు గుట్టు రట్టు చేసి అక్రమార్కులను అరెస్ట్ చేయడంతో డీలర్ల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. తమ పేర్లు బయటపడకుండా రక్షించాలని ఎమ్మెల్యే మణిగాంధీని కొంతమంది డీలర్లు కలిసినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే 4 నెలల క్రితం కోడుమూరు పట్టణంలో ఓ డీలర్ 102 శాతం సరుకులను కార్డుదారులకు అందజేసిన విషయాన్ని తహసీల్దార్ నిత్యానందరాజు గమనించి ఆశ్చర్యపోయాడు. 102 శాతం సరుకులు ఎలా వేస్తారని డీలర్ల మీటింగ్‌లో తహసీల్దార్ హెచ్చరించారు. చింతమాను సుజాత(డబ్ల్యూఏపీ131900300325) పేరు మీదనున్న బోగస్‌కార్డుకు కర్ణాటకలో ఉన్న చింతమాను బొర్ర భారతి ఆధార్‌కార్డు(473296591029)ను అనుసంధానం చేసి ఓ డీలర్ ప్రతినెలా సరుకులను ఏ విధంగా తీసుకుంటున్నాడో అధికారులకే తెలియాలి. కామార్తి లక్ష్మీదేవమ్మ పేరు మీదనున్న (డబ్ల్యూఏపీ131900300307) బియ్యంకార్డుకు కృష్ణానగర్‌లో నివాసముంటున్న చెన్నమ్మ ఆధార్‌కార్డు(397119521043) నంబర్ అనుసంధానం చేసి సరుకులను సదరు డీలర్ సొంతంగా వేలిముద్రలు వేసి తీసుకుంటున్నాడని ఆధారాలు బయటపడ్డాయి. కోడుమూరు పట్టణంలోని 8 మంది డీలర్లు 2015 డిసెంబర్ నుంచి 2016 మే నెల వరకు 100 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు చూపించి ఇ–పాస్ యంత్రాల ద్వారా వేలిముద్రలు వేసి సరుకులను స్వాహా చేశారు. బోగస్‌కార్డుల వ్యవహారం గుట్టురట్టు అవడంతో అక్రమాలకు పాల్పడిన డీలర్లు తమపేర్లు బయటికి రాకుండా ఉండేందుకు అన్నివిధాలా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది.
102 శాతం సరుకులెలా వేశారని మందలించా : నిత్యానందరాజు, తహసీల్దార్
కోడుమూరులో కొంతమంది డీలర్లు 100 శాతం సరుకులు వేసిన విషయం తెలియడంతో సమావేశం పెట్టి తీవ్రంగా మందలించా. ఇంకో డీలర్ 102 శాతం సరుకులెలా వేశాడో ఆశ్చర్యమేసి తీవ్రంగా హెచ్చరించా. ఈ సంఘటన 4 నెలల క్రితం జరిగింది. బోగస్‌కార్డుల వివరాల సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం.
Advertisement