Kodumur
-
ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్.. 12 గ్రామాలకు తీరనున్న కష్టాలు
సాక్షి, కర్నూలు: దశాబ్దాల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం దగ్గర హంద్రీ నదిపై కాజ్వే నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులను ఓఎంఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ పనులను ఈనెల 24న ప్రారంభించనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో భాగంగా కృష్ణగిరి మండలంలోని ఎస్‌హెచ్ ఎర్రగుడి నుంచి హంద్రీనది మీదుగా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామానికి 2017 నవంబర్ 27వ తేదీన నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు హంద్రీనదిపై కాజ్వే నిర్మించాలని కోరారు. మన ప్రభుత్వం వస్తే కాజ్వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అప్పట్లో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు నిధులను మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది. ప్రయాణం సులువు గోరంట్ల నుంచి కొత్తపల్లె, ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామాలకు రెండు కిలోమీటర్లు దూరం ఉంది. హంద్రీ నదికి వరద వస్తే 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయా గ్రామాలకు చేరుకోవలసిన దుస్థితి ఉండేది. హంద్రీకి వరద వచ్చే సమయాల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళలేని పరిస్థితి. కాజ్వే నిర్మాణం చేపడితే కష్టాలు తొలగనున్నాయి. అలాగే కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని కొత్తపల్లె, రామకృష్ణాపురం, ఎస్‌హెచ్ ఎర్రగుడి, ఎర్రబాడు, చుంచు ఎర్రగుడి, మన్నేగుంట, కృష్ణగిరి, బాపనదొడ్డి, కంబాలపాడు, జి.మల్లాపురం, ఆగవెలి, పి.కోటకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణం సులువు కానుంది. ఇవీ కష్టాలు.. ►గోరంట్ల గ్రామం దగ్గర ఉన్న హంద్రీనది ప్రతి ఏటా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ► ఈ నది దాటి వెళ్లేందుకు కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ►కొన్ని సందర్భాల్లో రోజులు తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. ► అత్యవసర సమయాల్లో కర్నూలు నగరానికి, కోడుమూరు పట్టణానికి చేరుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ► పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిరోజూ హంద్రీ నది పరీక్ష పెట్టేది. ►కాన్పుల కోసం గర్భిణులను అసుపత్రికి తీసుకెళ్లాలంటే తలప్రాణం తోకకు వచ్చేది. దశాబ్దాల సమస్యకు పరిష్కారం హంద్రీ నదిపై కాజ్వే లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బాల్యంలో మా ఊరు ఎన్హెచ్ఎర్రగుడి నుంచి నేను లద్దగిరికి చదువుకోవడానికి వెళ్లేవాడిని. హంద్రీపై కాజ్వే లేక చాలా ఆవస్థపడ్డా. హంద్రీ నదికి వరద వచ్చిన రోజుల్లో స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి. దశబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు కాజ్వే నిర్మాణంతో పరిష్కారం దొరికింది. చాలా ఆనందంగా ఉంది. – సుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే చాలా సంతోషం ఈ కష్టం ఇప్పటిది కాదు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. భారీ వర్షం వస్తే హంద్రీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయి. పంటలు అమ్ముకోవాలంటే మేం నది దాటి వెళ్లాలి. కాజ్వే లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నాం. మా ఊరి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరుకు వెళ్లి అక్కడి నుంచి కర్నూలు మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకెళ్తున్నాం. లేదంటే కృష్ణగిరికి వెళ్లి వెల్దుర్తి నుంచి కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. గోరంట్ల వద్ద హంద్రీ నదిపై బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణంతో కర్నూలుకు చేరుకుంటాం. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాణం పూర్తయితే రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి. మా ఊరితోపాటు చాలా గ్రామాలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగు పడతాయి. – సుంకన్న, ఎస్‌హెచ్ ఎర్రగుడి 24న నిర్మాణ పనులకు శంకుస్థాపన గోరంట్ల సమీపంలోని హంద్రీ నదిపై కాజ్వే నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూర్ జయరాం, ఎమ్మెల్యేలు కంగాటి శ్రీదేవి, సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, హాజరుకానున్నారు. – చౌడేశ్వరరావు, డీఈఈ, పీయూఐ -
కోడికూర కిలో రూ.30; ఎగబడి కొంటున్న ప్రజలు
సాక్షి, కోడుమూరు: వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీ కారణంగా చికెన్ ధరలు అమాంతం తగ్గించేశారు. గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో కిలో రూ.30లకే చికెన్ అమ్ముతున్న విషయం సంచలనమైంది. మంగళవారం కె.నాగలాపురంలో సుంకులమ్మ దేవర జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. చికెన్ కిలో రూ.30లకే అమ్ముతున్న విషయం తెలియడంతో కోడి కూర కోసం చికెన్ అంగళ్ల దగ్గర క్యూ కట్టారు. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ100లు పలుకుతోంది. హోల్‌సెల్ చికెన్ ధర వ్యాపారస్తులు రూ.46లకు వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. వాహిద్ అనే హోల్‌సెల్ వ్యాపారికి గూడూరులో కోళ్లఫారం ఉంది. సదరు వ్యక్తి దగ్గర వ్యాపారస్తులు కోళ్లను తీసుకోకపోతే ఆ గ్రామాల్లో పోటీగా వ్యాపారం పెట్టి ఇతరులను దెబ్బతీసే పనులు చేస్తున్నాడు. గతంలో ప్యాలకుర్తి గ్రామంలో కూడా ఇదే విధంగా చికెన్ వ్యాపారస్తుల మధ్య పోటీ పెట్టాడు. నాలుగైదు రోజులుగా కె.నాగలాపురంలో కిలో రూ.40లకే చికెన్ అమ్మేందుకు దుకాణం తెరిచాడు. సదరు పోటీదారుడిని దెబ్బతీసేందుకు గ్రామంలో చికెన్ వ్యాపారస్తులు కిలో రూ.30లకే చికెన్ అమ్మడం మొదలు పెట్టడంతో చికెన్ ప్రియుల పంట పండింది. పప్పన్నం మానేసి చికెన్ కూర తినేందుకు చికెన్ అంగళ్ల దగ్గర జనం క్యూ కడుతున్నారు. కిలో కూరగాయలు బీన్స్ రూ.60, బీరకాయలు రూ.30 ధర పలుకుతుండగా, కూరగాయలు తినడం మానేసి ఓ పూట కోడి కూర తినడం జనాలు అలవాటు చేసుకుంటున్నారు. కోడి గ్రుడ్ల ద్వారా డజను రూ.60లుండగా, అంతకంటే తక్కువగా కిలో చికెన్ రూ.30లకే వస్తోందని జనం కోడి కూర కోసం ఎగబడుతున్నారు. కె.నాగలాపురంలో మహమ్మద్‌బాషా అనే చికెన్ వ్యాపారి మంగళవారం నాడు దాదాపు 500కిలోలకు పైగా చికెన్ అమ్మినట్లు తెలిపాడు. పోటీ వ్యాపారంలో నిలదొక్కునేందుకు నష్టానికైనా వ్యాపారం చేస్తున్నామంటూ మహమ్మద్‌బాషా తెలిపారు. ఇద్దరు వ్యాపారుల మధ్య పెరిగిన పోటీ కారణంగా చికెన్ ప్రియులు కోడి కూరకు రుచి మరిగారు. -
వైఎస్సార్సీపీలోకి కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి
కోడుమూరు: అందరం జగనన్నకే జై కొడదామని, వైఎస్సార్సీపీలో చేరదామని కోట్ల వర్గీయులు ముక్తకంఠంతో ప్రకటించారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోదరుడు, కోడుమూరు మాజీ ఎంపీపీ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునేందుకు శనివారం కోడుమూరు పట్టణంలోని స్నేహవినాయక కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశానికి కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ మండలాల పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. జై జగన్..జై హర్ష నినాదాలతో కల్యాణ మండపం మార్మోగింది. ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. టీడీపీ దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలను ఎదుర్కొవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే సరైనదని స్పష్టం చేశారు. నా రాజకీయ శత్రువు టీడీపీనే రాజకీయంగా శాశ్వత శత్రువుగా ఉన్న టీడీపీతో పొత్తు పెట్టుకొని అనైతిక రాజకీయాలు చేసేందుకు ఆత్మాభిమానం అడ్డురావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. జవసత్వాలు లేని కాంగ్రెస్ పార్టీలో మనుగడ సాధించలేనని తెలుసుకొని, తనను నమ్ముకున్న కార్యకర్తలు, కోట్ల అభిమానులను కాపాడుకోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే సరైన వేదిక అని ఆ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ఆలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన అనంతరం ఫిబ్రవరి 6వతేదీన వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుదామన్నారు. తన సోదరుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఇతర పార్టీలతో జతకట్టి రాజకీయాలు చేద్దామన్న విషయాలు తన మనసును నొప్పించాయన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమవుతుందని, అందువల్లే వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి, ప్యాలకుర్తి హర్షవర్దన్‌రెడ్డి, మాజీ సర్పంచు సీబీ లత, సింగిల్‌విండో అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, ఫైనాన్సియర్ వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచులు ఈశ్వరరెడ్డి, రామేశ్వరరెడ్డి గంగాధర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నక్క పరమేష్, మల్లారెడ్డి, తేనేశ్వరరెడ్డి, మాదులు, బోరెల్లి సోమన్న, టెలిఫోన్ రాముడు, పుట్టపాశం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ నియోజకవర్గమైనందుకే దౌర్జన్యాలు
- మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎస్సీ నియోజకవర్గమైన కోడుమూరులో అధికార పార్టీ ఇన్చార్జ్ దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని వైఎస్ఆర్సీపీ సీఈసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక టీజే షాపింగ్ మాల్లోని కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మండల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు, మాసామసీదు, సుంకేసుల, గార్గేయపురం మద్యంషాపుదారులు లైసెన్సులు పొందినా అధికార పార్టీ నాయకుడు గుడ్‌విల్ చెల్లించాలంటూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆయన నుంచి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లకే బెదిరింపులు ఎదురవుతుతుండటం దారుణమన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్, ఆర్డీవోలు ఆయా షాపులను సందర్శించాల్సిన అవసరమేమిటన్నారు. కాంట్రాక్టుపైన డబ్బు ఇవ్వలేదని రామిరెడ్డి అనే వ్యక్తిపై హరిజన సర్పంచ్‌తో కేసు పెట్టించాడని ఆరోపించారు. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలోని నాలుగు మండలాల రైతుల నుంచి ఎకరానికి రూ. 2 వేలు వసూలు చేయడం ఆ నేతకే చెల్లిందని విమర్శించారు. కర్నూలు మండలంలో రైల్వే కాంట్రాక్టు పనులు రూ. 60 లక్షలకు కుదుర్చుకుని, దేవమడ గట్టును తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీఐ యాక్టు ప్రకారం సమాచారం సేకరించి తహసీల్దార్, ఆర్డీఓ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, జిల్లా కార్యదర్శి సుభాకర్, మండల కన్వీనర్ వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి సయ్యద్, సి.బెళగల్ మండల నాయకుడు ఈర్లదిన్నె నాగేశ్వరరావు, పార్టీ నాయకులు ధనుంజయాచారి, విజయుడు, ఎస్.హుసేన్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి కార్డు చూపించినా కనికరించలేదు..
ఈ చిత్రంలో పెళ్లికార్డు చూపిస్తున్న వ్యక్తి పేరు మధుభూపాల్. కల్లూరు మండలం కె.మార్కపురం గ్రామానికి చెందిన ఇతనికి గూడూరు ఎస్బీఐలో ఖాతా ఉంది. పెద్ద నోట్ల రద్దుతో తన దగ్గరున్న రూ. 30 వేలను బ్యాంక్ ఖాతాలో పది రోజుల కిందట జమ చేసుకున్నాడు. తమ్ముడి పెళ్లి శనివారం ఉండడంతో.. శుభలేఖ చేత పట్టుకుని గురువారం బ్యాంక్‌కు వచ్చాడు. సిబ్బంది డబ్బులు లేవని వెనక్కి పంపారని.. ఏటీఎం వద్దన్నా రూ.2వేలు వస్తాయనకుంటే అవీ రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. - గూడూరు -
కోడుమూరు కేంద్రంగా బోగస్ కార్డులు
– 8 మంది డీలర్లపై నిఘా వేసిన సీసీఎస్ పోలీసులు – డీలర్లను రక్షించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నం – తమ పేర్లు బయటపడకుండా ఉండేందుకు లాబీయిగ్ చేస్తున్న డీలర్లు – బోగస్ కార్డులున్నాయని ఆనాడే హెచ్చరించిన సాక్షి కోడుమూరు: ఇపాస్ యంత్రాలను బైపాస్ చేసి క్లోజింగ్ బ్యాలెన్స్ సరుకులను దోచుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్న కోడుమూరు పట్టణంలోని 8 మంది డీలర్లపై సీసీఎస్ పోలీసులు నిఘా వేశారు. డేటాబేస్ ఆధారంగా గతంలో 100 శాతం సరుకులు డెలివరీ చేసిన డీలర్ల వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరిస్తున్నట్లు తెలిసింది. శ్రీశైలానికి చెందిన డీలర్ ద్వారా ఆర్డీఓ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా బోగస్ కార్డులపై డీలర్లే వేలిముద్రలు వేసుకుని సరుకులు తీసుకునే వెసులుబాటును అమర్చి భారీ ఎత్తున బోగస్ కార్డులు పొందినట్లు ఈ ఏడాది జులై 15న సాక్షిలో ‘బోగస్‌కార్డులు కుప్పలుతెప్పలు’ కథనం సాక్షాధారాలతో ప్రచురితమైంది. బ్యాక్లాగ్ సరుకులను డీలర్లు ఏ విధంగా స్వాహా చేస్తున్నారన్న విషయంపై సీసీఎస్ అధికారులు గుట్టు రట్టు చేసి అక్రమార్కులను అరెస్ట్ చేయడంతో డీలర్ల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి. తమ పేర్లు బయటపడకుండా రక్షించాలని ఎమ్మెల్యే మణిగాంధీని కొంతమంది డీలర్లు కలిసినట్లు తెలిసింది. విచిత్రమేమిటంటే 4 నెలల క్రితం కోడుమూరు పట్టణంలో ఓ డీలర్ 102 శాతం సరుకులను కార్డుదారులకు అందజేసిన విషయాన్ని తహసీల్దార్ నిత్యానందరాజు గమనించి ఆశ్చర్యపోయాడు. 102 శాతం సరుకులు ఎలా వేస్తారని డీలర్ల మీటింగ్‌లో తహసీల్దార్ హెచ్చరించారు. చింతమాను సుజాత(డబ్ల్యూఏపీ131900300325) పేరు మీదనున్న బోగస్కార్డుకు కర్ణాటకలో ఉన్న చింతమాను బొర్ర భారతి ఆధార్‌కార్డు(473296591029)ను అనుసంధానం చేసి ఓ డీలర్ ప్రతినెలా సరుకులను ఏ విధంగా తీసుకుంటున్నాడో అధికారులకే తెలియాలి. కామార్తి లక్ష్మీదేవమ్మ పేరు మీదనున్న (డబ్ల్యూఏపీ131900300307) బియ్యంకార్డుకు కృష్ణానగర్‌లో నివాసముంటున్న చెన్నమ్మ ఆధార్‌కార్డు(397119521043) నంబర్ అనుసంధానం చేసి సరుకులను సదరు డీలర్ సొంతంగా వేలిముద్రలు వేసి తీసుకుంటున్నాడని ఆధారాలు బయటపడ్డాయి. కోడుమూరు పట్టణంలోని 8 మంది డీలర్లు 2015 డిసెంబర్ నుంచి 2016 మే నెల వరకు 100 శాతం సరుకులు పంపిణీ చేసినట్లు చూపించి ఇ–పాస్ యంత్రాల ద్వారా వేలిముద్రలు వేసి సరుకులను స్వాహా చేశారు. బోగస్‌కార్డుల వ్యవహారం గుట్టురట్టు అవడంతో అక్రమాలకు పాల్పడిన డీలర్లు తమపేర్లు బయటికి రాకుండా ఉండేందుకు అన్నివిధాలా లాబీయింగ్ చేస్తున్నట్లు తెలిసింది. 102 శాతం సరుకులెలా వేశారని మందలించా : నిత్యానందరాజు, తహసీల్దార్ కోడుమూరులో కొంతమంది డీలర్లు 100 శాతం సరుకులు వేసిన విషయం తెలియడంతో సమావేశం పెట్టి తీవ్రంగా మందలించా. ఇంకో డీలర్ 102 శాతం సరుకులెలా వేశాడో ఆశ్చర్యమేసి తీవ్రంగా హెచ్చరించా. ఈ సంఘటన 4 నెలల క్రితం జరిగింది. బోగస్‌కార్డుల వివరాల సమాచారమిస్తే చర్యలు తీసుకుంటాం. -
ముల్లె సర్దిన పల్లె
పల్లెలో కరువు దరువేస్తోంది. వ్యవసాయ పనులు లేకపోవడంతో ప్రజలు వలసబాట పడుతున్నారు. గురువారం కోడుమూరు మండలంలోని కృష్ణాపురం, గోనెగండ్ల మండలంలోని పుట్టపాశం, వెల్దుర్తిలకు చెందిన 90 కుటుంబాలు మూడు లారీల్లో వలస వెళ్లాయి. ఉపాధి లేకపోవడంతో తాము హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు వారు తెలిపారు. - కోడుమూరు రూరల్ -
ఆర్టీసీ బస్సు ఢీకొని బాలిక మృతి
కొడుమూరు: కర్నూలు జిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. కొడుమూరు తహశీల్దార్ కార్యాలయం ముందు ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో కొడుమూరుకు చెందిన కీర్తి (15) మృతి చెందగా, ఆమె సోదరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన బాలికను చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికు తరలించారు. తండ్రితో కలసి ఇద్దరు బాలికలు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎమ్మినగూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో చేరిన కోడుమూరు మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: కర్నూలు జిల్లా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ ఆదివారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరస్వాగతం పలికారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీపై 2009లో ఎమ్మెల్యేగా మురళీకృష్ణ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, పలువురు జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని మురళీకృష్ణ చెప్పారు. -
పత్తిచేనులో వ్యక్తి దారుణహత్య
కోడుమూరు (కర్నూలు) : పత్తిచేనులో పని చేసుకుంటున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ చినరామన్న(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం పత్తి చేనులో పని చేసుకుంటుండగా.. కొందరు దుండగులు రాళ్లతో, కత్తులతో వెంబడించి దారుణంగా హతమార్చారు. గ్రామానికి చెందిన ఓ మహిళతో చినరామన్నకు వివాహేతర సంబంధం ఉందని.. ఆ మహిళకు చెందినవారే హతమార్చి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీ చేసిందంటూ చిన్నారిని చితకబాదిన ట్యూటర్
కొడుమూరు (కర్నూలు) : నాలుగవ తరగతి చదువుతున్న విద్యార్థినిని ట్యూషన్ టీచర్ చితకబాదగా ఆ చిన్నారి తీవ్రంగా గాయపడిన ఘటన కర్నూలు జిల్లా కొడమూరు బాలికల బీసీ హాస్టల్లో గురువారం ఉదయం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తల్లిదండ్రులు పనుల కోసం వలస వెళుతూ భార్గవి అనే బాలికను స్థానిక బీసీ హాస్టల్లో చేర్పించారు. కాగా గురువారం ఉదయం హాస్టల్లో 20 రూపాయలు దొంగిలించిందనే నెపంతో ట్యూషన్ టీచర్ భాగ్య ఆ చిన్నారిని వాతలు తేలేటట్లు చితకబాదింది. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. చిన్నారిని చితకబాదిన ట్యూటర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఆ చిన్నారి తల్లిదండ్రులు వలస వెళ్లిన ప్రాంతం నుంచి తిరిగి రావాల్సి ఉంది. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ బలవన్మరణం
కోడుమూరు: కర్నూలు జిల్లా కోడుమూరు ఎక్సైజ్ కానిస్టేబుల్ వెంకటరత్నం(27) ఆదివారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్నూలులోని క్రిష్ణానగర్‌కు చెందిన దాసు, సరోజమ్మ దంపతుల రెండో కుమారుడైన వెంకటరత్నం రెండు నెలల క్రితం ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. కోడుమూరు ఎక్సైజ్ కార్యాలయంలో సెంట్రీ డ్యూటీలో ఉన్న అతను శనివారంరాత్రి 11.30 గంటల సమయంలో తోటి కానిస్టేబుళ్లతో ఎప్పటిలానే మాట్లాడాడు. ఉదయం శవమై కనిపించాడు. కాగా, తమ కుమారుడు చాలా ధైర్యవంతుడని.. ఆత్మహత్యకు పాల్పడేంత సమస్యలు లేవని వెంకటరత్నం తల్లి సరోజమ్మ తెలిపారు. అయితే సీఐ హిమబిందు తరచూ వేధిస్తున్నట్లు చెప్పేవాడని.. బయట చంపేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సృష్టించినట్లు ఆమె ఆరోపించారు. ఘటనస్థలంలో మరొకరి సెల్‌ఫోన్ ఉం డటం.. ఎడమవైపు గడ్డం వద్ద రక్తపు మరకలు ఉండ టం హత్య చేశారనేందుకు బలం చేకూరుస్తోందన్నా రు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
బరి నుంచి తప్పుకోనున్న మురళీకృష్ణ?
గూడూరు, న్యూస్‌లైన్: కోడుమూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి పి.మురళీకృష్ణ ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. మొదటి నుంచి ఆయన పోటీకి విముఖత చూపుతున్నా.. ఎంపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఒత్తిళ్ల నేపథ్యంలో అయిష్టంగానే బరిలో నిలిచినట్లు తెలిసింది. ఈ నెల 15న ఆయన నామినేషన్ దాఖలు చేసినా.. ప్రచారపర్వంలో అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉండటంతో పోటీ చేసి ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని సన్నిహితుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. ఆయా మండలాల నాయకులు ప్రచారంలో భాగంగా డబ్బులు ఇవ్వమని మురళిని కోరగా.. తాను పైసా కూడా ఇవ్వనని, పెద్దాయననే అడగాలంటూ గద్దించారని వినికిడి. నామినేషన్ల ఉపసంహరణ రోజున ఆయన పోటీ నుంచి తప్పుకోవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలాఉండగా మొదటి నుంచి మురళిపై అనుమానం ఉండటంతోనే మాజీ ఎమ్మెల్యే ఎం.మదనగోపాల్చే కాంగ్రెస్ ముఖ్య నేతలు నామినేషన్ వేయించినట్లు చర్చ జరుగుతోంది. ఈ నెల 23వ తేదీన ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. -
అన్నకు కాంక్రీటు మేడ.. చెల్లికి కంపచెట్టు నీడ!
పుట్టినప్పుడే అన్నదమ్ములు.. పెరిగితే దాయాదులన్న పెద్దల మాట అక్షరసత్యమే. పెళ్లి వరకు ఈ అనుబంధాలు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కుటుంబ స్వరూపం మారిపోతోంది. నేను.. భార్య.. పిల్లలు అనే భావన ముందు రక్తసంబంధం చిన్నబోతోంది. ఆస్తుల గొడవలు.. పంపకాల్లో తేడాలు.. అమ్మానాన్నల పోషణ.. ఇలాంటి కారణాలతో దూరం పెరిగిపోతోంది. అక్కా చెల్లెళ్ల విషయానికొస్తే.. వీరిని ఓ ఇంటికి పంపేయడంతో తమ పని పూర్తయిందని భావించే అన్నదమ్ములే అధికం. ఈ కోవలోనే ఓ అన్న తన చెల్లి బాగోగులను గాలికొదిలేశాడు. ఇంటి ఎదుట.. కంపచెట్ల మధ్య దుర్భర జీవనం గడుపుతున్నా ఆ పాషాణం కరగని దయనీయం. కోడుమూరు టౌన్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన నాగేంద్రప్ప, ఈశ్వరీబాయి దంపతులకు ఐదుగురు ఆడ పిల్లలు, ఓ కుమారుడు సంతానం. భర్త మరణానంతరం కుటుంబ పోషణ తన భుజానికెత్తుకుంది. ముగ్గురు కుమార్తెలు చిన్న వయస్సులోనే చనిపోగా.. మిగిలిన ఇద్దరితో పాటు కుమారుని వివాహాలు చేయించింది. కుమారుడు వెంకటేశ్వర్లు స్థానికంగా హోటళ్లలో పని చేస్తూ భార్య, ముగ్గురు పిల్లలను పోషిస్తున్నాడు. ఓ చెల్లెలు గంగూబాయి(35)ని పదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా.. ఏడాదికే విడిపోయారు. అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటోంది. నాలుగేళ్ల క్రితం తల్లి మరణించడంతో ఈమెకు కష్టాలు మొదలయ్యాయి. మతిస్థిమితం సరిగా లేని ఈమెకు అన్నా వదినలు ఆదరణ కూడా కరువైంది. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారు. మాట బాగానే ఉన్నా.. చేతలు కాస్త అటుఇటుగా ఉన్న ఈ మహిళ జీవితం అప్పటి నుంచి వీధినపడింది. కొంతకాలం మెయిన్బజారులోని శ్రీనీలకంఠేశ్వరస్వామి గుడి మెట్లపై బతుకీడ్చింది. ఆ తర్వాత తన అన్న ఇంటి ఎదుటనున్న కంపచెట్ల నీడను ఆవాసంగా మార్చుకుంది. కటిక నేలను పాన్పుగా చేసుకొని.. దుర్గంధం మధ్య పందులు, కుక్కల సావాసంతో దుర్భర జీవనం గడుపుతోంది. వీధిలో ఎవరైనా పెడితే నాలుగు మెతుకులు తినడం.. లేదంటే కాళ్లు కడుపులోకి ముడుచుకొని పడుకుంటోంది. సరైన తిండి లేక.. అలనాపాలన కరువైన ఈమె జీవచ్ఛవంలా మారింది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు నెలకోసారి స్నానం చేయిస్తుండగా.. చుట్టుపక్క నివాసితులు అప్పుడప్పుడు జాలితో కాస్తంత ఎంగిలి పట్టిస్తున్నారు. ఆకలేసినా బాధను బయటకు చెప్పుకోలేని అమాయకత్వం.. ఎవరైనా పలకరిస్తే నవ్వే సమాధానం.. ఇదీ అమాయక చెల్లి జీవనం. అండగా నిలిచే తోడు లేక.. రక్త సంబంధం కనికరించక.. ఈ గంగ బతుకు ఎలాంటి మలుపు తిరుగుతుందోననే బెంగ స్థానికులను కలచివేస్తోంది