హంద్రీ నదిని దాటుకుంటూ వెళ్తున్న ప్రజలు (ఫైల్)
సాక్షి, కర్నూలు: దశాబ్దాల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చింది. కోడుమూరు మండలం గోరంట్ల గ్రామం దగ్గర హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి రూ.24 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులను ఓఎంఆర్ కన్‌స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుంది. ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. నిర్మాణ పనులను ఈనెల 24న ప్రారంభించనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నిర్వహించారు.
ఈ యాత్రలో భాగంగా కృష్ణగిరి మండలంలోని ఎస్‌హెచ్ ఎర్రగుడి నుంచి హంద్రీనది మీదుగా కోడుమూరు మండలంలోని గోరంట్ల గ్రామానికి 2017 నవంబర్ 27వ తేదీన నడుచుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఆ ప్రాంత ప్రజలు హంద్రీనదిపై కాజ్‌వే నిర్మించాలని కోరారు. మన ప్రభుత్వం వస్తే కాజ్‌వే నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని అప్పట్లో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు నిధులను మంజూరు చేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించింది.
ప్రయాణం సులువు
గోరంట్ల నుంచి కొత్తపల్లె, ఎస్‌హెచ్‌ఎర్రగుడి గ్రామాలకు రెండు కిలోమీటర్లు దూరం ఉంది. హంద్రీ నదికి వరద వస్తే 15 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆయా గ్రామాలకు చేరుకోవలసిన దుస్థితి ఉండేది. హంద్రీకి వరద వచ్చే సమయాల్లో విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళలేని పరిస్థితి. కాజ్‌వే నిర్మాణం చేపడితే కష్టాలు తొలగనున్నాయి. అలాగే కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని కొత్తపల్లె, రామకృష్ణాపురం, ఎస్‌హెచ్ ఎర్రగుడి, ఎర్రబాడు, చుంచు ఎర్రగుడి, మన్నేగుంట, కృష్ణగిరి, బాపనదొడ్డి, కంబాలపాడు, జి.మల్లాపురం, ఆగవెలి, పి.కోటకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణం సులువు కానుంది.
ఇవీ కష్టాలు..
►గోరంట్ల గ్రామం దగ్గర ఉన్న హంద్రీనది ప్రతి ఏటా వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది.
► ఈ నది దాటి వెళ్లేందుకు కృష్ణగిరి, కోడుమూరు మండలంలోని 12 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
►కొన్ని సందర్భాల్లో రోజులు తరబడి రాకపోకలు నిలిచిపోయేవి.
► అత్యవసర సమయాల్లో కర్నూలు నగరానికి, కోడుమూరు పట్టణానికి చేరుకోవాలంటే కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది.
► పాఠశాలలకు వెళ్లే ఉపాధ్యాయులు, విద్యార్థులకు ప్రతిరోజూ హంద్రీ నది పరీక్ష పెట్టేది.
►కాన్పుల కోసం గర్భిణులను అసుపత్రికి తీసుకెళ్లాలంటే తలప్రాణం తోకకు వచ్చేది.
దశాబ్దాల సమస్యకు పరిష్కారం
హంద్రీ నదిపై కాజ్‌వే లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. బాల్యంలో మా ఊరు ఎన్‌హెచ్‌ఎర్రగుడి నుంచి నేను లద్దగిరికి చదువుకోవడానికి వెళ్లేవాడిని. హంద్రీపై కాజ్‌వే లేక చాలా ఆవస్థపడ్డా. హంద్రీ నదికి వరద వచ్చిన రోజుల్లో స్కూల్‌కు వెళ్లలేని పరిస్థితి. దశబ్దాల కాలంగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు కాజ్‌వే నిర్మాణంతో పరిష్కారం దొరికింది. చాలా ఆనందంగా ఉంది.
– సుధాకర్, కోడుమూరు ఎమ్మెల్యే
చాలా సంతోషం
ఈ కష్టం ఇప్పటిది కాదు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. భారీ వర్షం వస్తే హంద్రీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడతాయి. పంటలు అమ్ముకోవాలంటే మేం నది దాటి వెళ్లాలి. కాజ్‌వే లేకపోవడంతో చాలా అవస్థలు పడుతున్నాం. మా ఊరి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోడుమూరుకు వెళ్లి అక్కడి నుంచి కర్నూలు మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకెళ్తున్నాం.
లేదంటే కృష్ణగిరికి వెళ్లి వెల్దుర్తి నుంచి కర్నూలుకు వెళ్లాల్సి వస్తోంది. గోరంట్ల వద్ద హంద్రీ నదిపై బ్రిడ్జి నిర్మిస్తే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణంతో కర్నూలుకు చేరుకుంటాం. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉంది. నిర్మాణం పూర్తయితే రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి. మా ఊరితోపాటు చాలా గ్రామాలకు ప్రయాణ సౌకర్యాలు మెరుగు పడతాయి.
– సుంకన్న, ఎస్‌హెచ్ ఎర్రగుడి
24న నిర్మాణ పనులకు శంకుస్థాపన
గోరంట్ల సమీపంలోని హంద్రీ నదిపై కాజ్‌వే నిర్మాణానికి ఈ నెల 24వ తేదీన శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. జిల్లా మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూర్ జయరాం, ఎమ్మెల్యేలు కంగాటి శ్రీదేవి, సుధాకర్, కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, హాజరుకానున్నారు.
– చౌడేశ్వరరావు, డీఈఈ, పీయూఐ
Comments
Please login to add a commentAdd a comment