అన్నకు కాంక్రీటు మేడ.. చెల్లికి కంపచెట్టు నీడ!
పుట్టినప్పుడే అన్నదమ్ములు.. పెరిగితే దాయాదులన్న పెద్దల మాట అక్షరసత్యమే. పెళ్లి వరకు ఈ అనుబంధాలు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కుటుంబ స్వరూపం మారిపోతోంది. నేను.. భార్య.. పిల్లలు అనే భావన ముందు రక్తసంబంధం చిన్నబోతోంది. ఆస్తుల గొడవలు.. పంపకాల్లో తేడాలు.. అమ్మానాన్నల పోషణ.. ఇలాంటి కారణాలతో దూరం పెరిగిపోతోంది.
అక్కా చెల్లెళ్ల విషయానికొస్తే.. వీరిని ఓ ఇంటికి పంపేయడంతో తమ పని పూర్తయిందని భావించే అన్నదమ్ములే అధికం. ఈ కోవలోనే ఓ అన్న తన చెల్లి బాగోగులను గాలికొదిలేశాడు. ఇంటి ఎదుట.. కంపచెట్ల మధ్య దుర్భర జీవనం గడుపుతున్నా ఆ పాషాణం కరగని దయనీయం.
కోడుమూరు టౌన్ పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన నాగేంద్రప్ప, ఈశ్వరీబాయి దంపతులకు ఐదుగురు ఆడ పిల్లలు, ఓ కుమారుడు సంతానం. భర్త మరణానంతరం కుటుంబ పోషణ తన భుజానికెత్తుకుంది. ముగ్గురు కుమార్తెలు చిన్న వయస్సులోనే చనిపోగా.. మిగిలిన ఇద్దరితో పాటు కుమారుని వివాహాలు చేయించింది. కుమారుడు వెంకటేశ్వర్లు స్థానికంగా హోటళ్లలో పని చేస్తూ భార్య, ముగ్గురు పిల్లలను పోషిస్తున్నాడు. ఓ చెల్లెలు గంగూబాయి(35)ని పదేళ్ల క్రితం కర్నూలుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా.. ఏడాదికే విడిపోయారు. అప్పటి నుంచి తల్లి వద్దే ఉంటోంది.
నాలుగేళ్ల క్రితం తల్లి మరణించడంతో ఈమెకు కష్టాలు మొదలయ్యాయి. మతిస్థిమితం సరిగా లేని ఈమెకు అన్నా వదినలు ఆదరణ కూడా కరువైంది. నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారు. మాట బాగానే ఉన్నా.. చేతలు కాస్త అటుఇటుగా ఉన్న ఈ మహిళ జీవితం అప్పటి నుంచి వీధినపడింది. కొంతకాలం మెయిన్‌బజారులోని శ్రీనీలకంఠేశ్వరస్వామి గుడి మెట్లపై బతుకీడ్చింది. ఆ తర్వాత తన అన్న ఇంటి ఎదుటనున్న కంపచెట్ల నీడను ఆవాసంగా మార్చుకుంది. కటిక నేలను పాన్పుగా చేసుకొని.. దుర్గంధం మధ్య పందులు, కుక్కల సావాసంతో దుర్భర జీవనం గడుపుతోంది.
వీధిలో ఎవరైనా పెడితే నాలుగు మెతుకులు తినడం.. లేదంటే కాళ్లు కడుపులోకి ముడుచుకొని పడుకుంటోంది. సరైన తిండి లేక.. అలనాపాలన కరువైన ఈమె జీవచ్ఛవంలా మారింది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు నెలకోసారి స్నానం చేయిస్తుండగా.. చుట్టుపక్క నివాసితులు అప్పుడప్పుడు జాలితో కాస్తంత ఎంగిలి పట్టిస్తున్నారు. ఆకలేసినా బాధను బయటకు చెప్పుకోలేని అమాయకత్వం.. ఎవరైనా పలకరిస్తే నవ్వే సమాధానం.. ఇదీ అమాయక చెల్లి జీవనం. అండగా నిలిచే తోడు లేక.. రక్త సంబంధం కనికరించక.. ఈ గంగ బతుకు ఎలాంటి మలుపు తిరుగుతుందోననే బెంగ స్థానికులను కలచివేస్తోంది