ఎస్సీ నియోజకవర్గమైనందుకే దౌర్జన్యాలు
- మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఎస్సీ నియోజకవర్గమైన కోడుమూరులో అధికార పార్టీ ఇన్‌చార్జ్ దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోందని వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక టీజే షాపింగ్ మాల్‌లోని కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మండల నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు, మాసామసీదు, సుంకేసుల, గార్గేయపురం మద్యంషాపుదారులు లైసెన్సులు పొందినా అధికార పార్టీ నాయకుడు గుడ్‌విల్ చెల్లించాలంటూ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆయన నుంచి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లకే బెదిరింపులు ఎదురవుతుతుండటం దారుణమన్నారు.
నగరపాలక సంస్థ కమిషనర్, ఆర్డీవోలు ఆయా షాపులను సందర్శించాల్సిన అవసరమేమిటన్నారు. కాంట్రాక్టుపైన డబ్బు ఇవ్వలేదని రామిరెడ్డి అనే వ్యక్తిపై హరిజన సర్పంచ్‌తో కేసు పెట్టించాడని ఆరోపించారు. తుంగభద్ర నది పరీవాహక ప్రాంతంలోని నాలుగు మండలాల రైతుల నుంచి ఎకరానికి రూ. 2 వేలు వసూలు చేయడం ఆ నేతకే చెల్లిందని విమర్శించారు. కర్నూలు మండలంలో రైల్వే కాంట్రాక్టు పనులు రూ. 60 లక్షలకు కుదుర్చుకుని, దేవమడ గట్టును తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు.
ఆర్‌టీఐ యాక్టు ప్రకారం సమాచారం సేకరించి తహసీల్దార్, ఆర్డీఓ, మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, జిల్లా కార్యదర్శి సుభాకర్, మండల కన్వీనర్ వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శి సయ్యద్, సి.బెళగల్ మండల నాయకుడు ఈర్లదిన్నె నాగేశ్వరరావు, పార్టీ నాయకులు ధనుంజయాచారి, విజయుడు, ఎస్.హుసేన్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.