సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారంతో రెండేళ్ల క్రితం చేసిన ప్రకటననే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించింది. దీంతో ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ ఆడుతున్నదంతా నాటకమేనని మరోసారి రుజువైంది. బీజేపీ–టీడీపీ కలిసి చేసిన ప్రకటననే ఇప్పుడు సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ రూపంలో ఇవ్వగా దానిపై రాద్ధాంతం చేస్తుండడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలతో పనిలేదంటూ టీడీపీ తన నైజాన్ని మళ్లీ బయటపెట్టుకుంది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని.. దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది.
నాడు తాను చేసిన ప్రకటన కాపీనే యథాతథంగా ఇప్పుడు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌కు అనుబంధంగా జోడించింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇచ్చిన హామీలను కేంద్రం అమలు చేయలేదని, వాటిని అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ప్రతివాదిగా ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నామని చెబుతూ సంబంధిత గణాంకాలను వివరించింది. ప్రత్యేక ప్యాకేజీపై 2016 సెప్టెంబరు 8న చేసిన ప్రకటనను ఈ అఫిడవిట్‌కు అనుబంధంగా ఆర్థిక శాఖ సమర్పించింది.
చంద్రబాబు ఆమోదించాకే జైట్లీ ప్రకటన
చంద్రబాబుతో రోజంతా మంతనాలు జరిపిన తర్వాతే ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే ప్రకటన చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016 సెప్టెంబర్ 8వ తేదీన స్పష్టం చేశారు. ఈ ప్రకటన చేసే సమయంలో చంద్రబాబు సన్నిహితుడు, అప్పటి కేంద్ర మంత్రి సుజనా చౌదరిని జైట్లీ పక్కనపెట్టుకున్నారు. ఆ ప్రకటన కాపీనే ఇప్పుడు కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది. జైట్లీ ప్రకటన చేసిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టిమరీ దాన్ని స్వాగతించారు.
ప్యాకేజీని స్వాగతిస్తూ 2016 సెప్టెంబర్ 9వ తేదీన అసెంబ్లీలో ప్రధాని మోదీకి, కేంద్రానికి ధన్యవాద తీర్మానం చేశారు. ఇప్పుడు దాన్నే అఫిడవిట్ రూపంలో కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ, ఏపీకి అన్యాయం జరిగిపోతోందంటూ రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్డీయేలో కలిసి ఉన్నప్పుడు రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ ఇస్తే సరిపోతోందని చెప్పిన చంద్రబాబు హోదా ముగిసిన అధ్యాయమని అరుణ్ జైట్లీ చెప్పడాన్ని కూడా సమర్థించారు. పైగా.. ప్రతిపక్షాల విమర్శలను లెక్కచేయక.. తాను సాధించిన ప్యాకేజీ దేశంలోనే అత్యుత్తమం అని చంద్రబాబు 2017 జనవరి 26న మీడియా సమావేశంలో గర్వంగా చెప్పుకున్నారు. అటు ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ చేస్తున్న పోరాటాన్ని అణచివేసేందుకు కుట్రలు పన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిర్వహించిన యువభేరి సదస్సులకు వెళ్లిన విద్యార్థులను బెదిరించారు.
జైట్లీ ప్రకటనను సమర్థిస్తూ సీఎం ప్రకటన
జగన్‌ది ఎప్పుడైనా ఒక్కటే మాట: రెండేళ్ల క్రితం జైట్లీ ప్రకటన చేసిన మరుసటి రోజే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. ప్యాకేజీకి ఒప్పుకోవడం, ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని తెలియజేశారు. ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో మోదీకి టీడీపీ ప్రభుత్వం ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు కూడా జగన్ ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం ఏవిధంగా నష్టపోతుందో సోదాహరణంగా వివరించారు. ధన్యవాద తీర్మానాన్ని వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఒకే మాటపై నిలబడి ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెబుతూ దాన్ని సాధించడం కోసం ధర్నాలు, దీక్షలు, బంద్‌లు జరిపారు.
హోదాపై సీఎం పలు సందర్భాల్లో మార్చిన మాటలు
‘అనుబంధం’లో ఏముంది?
2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ చేసిన ప్రకటనలో 6 అంశాలు ఉన్నాయని, ఇందులో 5 అంశాల విషయంలో ఏ సమస్యా లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. మొదటి అంశమైన ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని ఇచ్చిన హామీకి, తదుపరి 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుకు మధ్య భిన్నత్వం ఉందని తెలిపింది. హోదా కలిగిన రాష్ట్రాలకు, సాధారణ రాష్ట్రాలకు మధ్య ఎలాంటి వ్యత్యాసాన్ని 14వ ఆర్థిక సంఘం చూపలేదంటూ సదరు ఆర్థిక సంఘం చేసిన సిఫార్సును అఫిడవిట్‌లో పొందుపరిచింది. ‘రాష్ట్రాల వనరులపై అంచనా వేసి మా సిఫార్సులను, నియమాలను రూపకల్పన చేయడంలో మేం ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు, సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం చూపడం లేదు. ప్రతి రాష్ట్రానికి గల ఖర్చులను అంచనా వేయడంలో ఆయా రాష్ట్రాలకు గల ప్రత్యేక ప్రతికూలతలను పరిగణనలోకి తీసుకున్నాం. ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంత రాష్ట్రాలకు పలు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి.
వాటికి తక్కువ ఆర్థిక వనరులు ఉండడం, మారుమూలగా, అంతర్జాతీయ సరిహద్దులు ఉండ డం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్నాం. పన్ను ల కేటాయింపు ద్వారా ప్రతి రాష్ట్ర రెవెన్యూ లోటును భర్తీ చేయాలన్నదే మా ఉద్దేశం. పన్నుల కేటాయింపుల ద్వారా రెవెన్యూ లోటు భర్తీ కాని పక్షంలో అదనంగా రెవెన్యూ లోటు గ్రాంట్లను సిఫార్సు చేశాం. రాష్ట్రాల్లో అసమానత్వం అనేది ఆయా రాష్ట్రాల విధాన పరిధిలోనిది. మెరుగైన పన్నుల కేటాయింపులు ఆయా రాష్ట్రాల్లో అసమానత్వాన్ని మెరుగైన రీతిలో పరిష్కరించుకునేందుకు దోహదం చేస్తాయి’ అని 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు స్పెషల్ స్టేటస్ రాష్ట్రాలు అనేది ఇక ముగిసిన అంశం. అయినా కేంద్రం ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక సాయం చేసేందుకు అంగీకరించింది. అదనంగా కేంద్ర వాటా పొందేలా ఈ సాయం ఉంటుంది. నాటి ప్రధాని చేసిన ప్రకటన కూడా సాయాన్ని సూచించేదే. ఎక్స్‌టెర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టుల రూపంలో ఇది ఉంటుంది. ఆ రకంగా కేంద్రం ఏపీకి విభజన చట్టం ద్వారా, 14వ ఆర్థిక సంఘం ద్వారా, నాటి ప్రధాని రాజ్యసభలో చేసిన ప్రకటన ద్వారా ఇచ్చిన హామీలన్నింటినీ సమర్థవంతంగా పరిష్కరించగలిగింది’’ అని అఫిడవిట్‌కు జోడించిన అనుబంధం(సెప్టెంబరు 8, 2016 నాటి పీఐబీ పత్రికా ప్రకటన)లో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు లేవు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక సాయం చేసేందుకు అంగీకరించామంటూ సుప్రీం కోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్‌లోని ఒక భాగం.
బాబు నాటకం బట్టబయలు
Published Thu, Jul 5 2018 1:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment