సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమంటూ లా కమిషన్‌కు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ మరోసారి ఆ పార్టీ నైజాన్ని తేటతెల్లం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అక్టోబర్ 5, 2017న ఒక జాతీయ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఇంటర్వ్యూలో తాను మొదటి నుంచి జమిలి ఎన్నికలనే కోరుకుంటున్నానని చెప్పిన చంద్రబాబు మాటలకు, తాజాగా జూలై 8న ఆ పార్టీ ఎంపీలు తోట నరసింహం, కనకమేడల రవీంద్రకుమార్ లా కమిషన్‌కు ఇచ్చిన లేఖ విరుద్ధంగా ఉండడం గమనార్హం. దీంతో సోషల్ మీడియా చంద్రబాబు యూటర్న్‌ను ఎండగడుతోంది. ఆ ఇంటర్వ్యూలో కేంద్ర ప్రభుత్వం 2018, సెప్టెంబర్ తర్వాత దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉందని, ఎన్డీయే భాగస్వామిగా మీ వైఖరి ఏంటని అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఇలా సమాధానం ఇచ్చారు..
‘మొదటి నుంచి నేను ఒకేసారి ఎన్నికలు జరగడాన్నే కోరుకున్నాను. లోక్‌సభకు, అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగాలి. ఆరు నెలల్లోపు, లేదా గరిష్టంగా 9 నెలల్లోపు ఈ ప్రక్రియ ముగియాలి. మిగిలిన సమయంలో పాలనపై దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఎన్నికల వ్యయం, అవినీతిని తగ్గించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారా? అనే మరో ప్రశ్నకు జవాబుగా ‘మనం సమయం ఆదా చేయొచ్చు..అవినీతిని అరికట్టవచ్చు’ అని పేర్కొన్నారు. తాజాగా దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై లా కమిషన్ అన్ని పార్టీల అభిప్రాయాలు సేకరిస్తోంది. టీడీపీ కూడా లా కమిషన్‌కు తన అభిప్రాయాన్ని ఈ నెల 8న తెలిపింది.
టీడీపీ ఎంపీలు లా కమిషన్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలను అస్థిరపరిచేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందులో భాగమే జమిలి ఎన్నికల ఎత్తుగడ అని ఆరోపించారు. జమిలి ఎన్నికల యోచనను తాము వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ఖర్చు చూపి జమిలి ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. గత అక్టోబర్‌లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఒకరకంగా, ఇప్పుడు యూటర్న్ తీసుకుని మరో రకంగా టీడీపీ తన అభిప్రాయాలు వ్యక్తం చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ముందస్తు ఎన్నికలకు ఆ పార్టీ భయపడుతోందని నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనను నేను స్వాగతిస్తున్నాను. మూడు నెలలకు, ఆరు నెలలకు ఎన్నికలు ఏమిటి? ‘ఒక దేశం– ఒక ఎన్నిక ’ అంటూ ప్రధాని మోదీ చేసిన ప్రతిపాదనను నేను బలపరుస్తున్నాను.
– 2017, ఏప్రిల్ 27న సచివాలయంలో మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు
లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నేను మొదటి నుంచి కోరుకుంటున్నాను. ఒకేసారి అన్ని ఎన్నికలు అయిపోతే మిగిలిన సమయమంతా ప్రభుత్వ విధానాల రూపకల్పన, వాటి అమలుపై పూర్తిగా దృష్టి సారించడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధికి ఇది మంచిది.
– 2017 అక్టోబర్ 5న ఒక ఆంగ్ల టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు
పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం కుదరదు. రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి ముగియకముందే పార్లమెంటుతోపాటు శాసనసభ ఎన్నికలు కూడా నిర్వహించాలనడం రాజ్యాంగ విరుద్ధం. దీనికి టీడీపీ వ్యతిరేకం.
– చంద్రబాబు ఆదేశాలపై లా కమిషన్‌కు టీడీపీ ఎంపీలు ఇచ్చిన లేఖ సారాంశం
Comments
Please login to add a commentAdd a comment