చేనేత సభలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
చీరాల(ప్రకాశం): కేంద్రం నాపై కక్ష కట్టింది. నాలుగేళ్లు ఎటువంటి సహాయం చేయకపోగా నిరాకరిస్తూ మోసం చేసింది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ విధించి వారి పొట్టకొట్టి చేనేత రంగాన్ని దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంగళవారం చీరాలలోని సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పరిశ్రమలు ద్వారా ఉపాధికల్పన, రాష్ట్ర అభివృద్ధి వేగవంతంగా జరిగేదని, ప్రజల కష్టాలు పూర్తిగా తీరేవన్నారు. కానీ కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కేంద్రంతో చివరివరకు పోరాడతామన్నారు.
1905లో ఆగస్టు 7న విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని జాతిపిత మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపు మేరకు నాలుగేళ్లుగా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి వివిధ రాష్ట్రాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు 50 శాతం సెల్‌ఫోన్‌లు వెళతాయన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 111 కోట్లుతో రుణమాఫీ చేశామన్నారు. మంగళగిరిలో హ్యాండ్‌లూమ్ పార్కు మంజూరు చేశామన్నారు. కార్మికులందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి సహకరించాలన్నారు.
చేనేతలకు సీఎం హామీలు...
చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వద్ద డబ్బులు లేవు గాని మనస్సుందన్నారు. అందుకే ప్రతి మగ్గానికి వంద యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తామన్నారు. వర్షాకాల సమయంలో మగ్గం గుంటలోకి నీరు వెళ్లి అవస్థలు పడుతున్న దృష్ట్యా నెలకు రూ. 4 వేలు చొప్పున రెండు నెలలు పాటు రూ. 8 వేలు ఇస్తామన్నారు. హెల్త్ స్కీం కింద ప్రభుత్వం రూ. 1000 కట్టి మరలా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. త్రిఫ్ట్ పథకం 8 శాతం నుంచి 16 శాతానికి పెంచుతామన్నారు. సహకార సొసైటిలకు 30 శాతం సబ్సిడీలు అందించడంతో పాటు స్పెషల్ రిబేటును 20 నుంచి 30 శాతానికి పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత సొసైటీలు ఇవ్వాల్సిన రూ. 75 కోట్లును రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. అమరావతిలో చేనేతలకు పది ఎకరాలు కేటాయించడంతో పాటు ఆప్కోకు వివిధ సంక్షేమ శాఖలు ఇవ్వాల్సిన అప్పు రూ. 48 కోట్లును ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. హౌస్‌కం వర్క్ షెడ్లు కింద రూ. 1.50 వేలు చెల్లిస్తున్నామని, ప్రస్తుతం దానిని రూ. 2.50 లక్షలుకు పెంచి ఇస్తామన్నారు.
అమరావతి కేంద్రంగా నిఫ్ట్ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి త్వరలో పూర్తయ్యేలా చేస్తామన్నారు. సిల్కు కొనుగోలు కేంద్రాన్ని కూడా చీరాలలో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న ఏడీ కార్యాలయాన్ని చీరాలకు తరలిస్తామన్నారు. అలానే వేటపాలెం మండలంలో షాదీఖానా నిర్మాణానికి రూ. 55 లక్షలు ఇస్తానన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వాడరేవులో ఫిషింగ్ హార్బర్‌ను నిర్మిస్తామన్నారు. రెండేళ్లులోగా కుందేరు ఆధునికీకరణకు, పాలేరు–అప్పేరు మధ్యలో ఉన్న సాగునీటి కాలువ ఆధునికీకరణకు రూ. 60 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలానే చీరాల ప్రాంతానికి జీఐ రిజిస్ట్రేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. వేటపాలెంలో హ్యాండ్‌లూమ్ ప్రాజెక్టుకు చెందిన 20 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఇళ్ళ స్థలాలు, అందులో చేనేత కోసం డిజైన్ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రత్యేక కార్పొరేషన్ కుదరదన్న సీఎం...
చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్న చేనేత ప్రత్యేక కార్పొరేషన్‌పై కుదరదని స్పష్టం చేశారు. అన్ని కులాలు ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయని, చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్ కాకుండా బీసీ సబ్‌ప్లాన్‌లో జనాభా శాతం బట్టి ఎక్కవ నిధులు కేటాయింపులు చేస్తామన్నారు. కార్యక్రమంలో చేనేత, జౌళిశాఖామంత్రి కె.అచ్చన్నాయుడు, స్త్రీ, శిశుసంక్షేమ శాఖా మంత్రి పరిటాల సునీత, మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణ, అటవీశాఖామంత్రి శిద్దా రాఘవరావు, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయస్వామి, పాలపర్తి డేవిడ్ రాజు, పోతుల రామారావు, ఏలూరి సాంబశివరావు, ఎమ్మెల్సీలు కరణం బలరాం, పోతుల సునీత, హ్యాండ్‌లూమ్ కమిషనర్ శ్రీనరేషన్, మాజీ ఎమ్మెల్యేలు బీఎన్ విజయకుమార్, దివి శివరాం, ఆప్కో చైర్మన్ జి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటనలో సైడ్ లైట్స్
- కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం దూబగుంటలో సీఎం చంద్రబాబు పర్యటన అనుకున్న సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది.
- 11 గంటలకు వచ్చి 11.09 నిమిషాల వరకు శంకుస్థాపనలో పాల్గొన్నారు. 11.23కు సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంట 8 నిమిషాలకు సభ ముగిసింది.
- సీఎం చంద్రబాబు తన ప్రసంగంలో చేతులెత్తి.. చప్పట్ల ద్వారా ఆమోదం తెల్పాలని కోరడంతో అప్పుడు విద్యార్థులు చప్పట్లు కొట్టారు.
- సభలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని సాహితి ఉపన్యాసం ఆకట్టుకుంది.
- తొలిసారి చీరాల నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 గంటల వ్యవధిలోనే తన పర్యటనను ముగించారు.
- రామన్నపేటలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి సీఎం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తన బస్సు ద్వారా 2.30కి పందిళ్లపల్లికి చేరుకున్నారు. అక్కడ పైలాన్‌ను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆవిష్కరించారు.
- పందిళ్లపల్లిలో చేనేతశాఖ ఏర్పాటు చేసిన మగ్గం, నూలు, రంగుల అద్దకం, అల్లు సందర్శించి రాట్నం తిప్పారు. అనంతరం ఆప్కో ఏర్పాటు చేసిన ప్రత్యేక మగ్గం, చేనేత వస్త్రాల ప్రదర్శనను తిలకించారు.
- పందిళ్లపల్లిలో డిగ్రీ చదువుతున్న తనకు ఉపకార వేతనం రాక ఇబ్బందులు పడుతున్నానని పి.సాయివరలక్ష్మీ సీఎంకు ఫిర్యాదు చేయగా ఉపకార వేతనంతో పాటు చదువుకు ఆటంకం లేకుండా రూ. 50 వేలు బహుమతిని అందిస్తానని ప్రకటించారు.
- అలానే పందిళ్లపల్లిలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో భాగంగా యారాసు విజయలక్ష్మీ నిర్మించిన నూతన గృహాన్ని చంద్రబాబు ప్రారంభించారు.
- బీసీ మహిళలకు కార్పొరేషన్ రుణాలను సీఎం అందించారు.
- వేటపాలెం స్ట్రయిట్‌కట్ కాలువ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ హోర్డింగ్ గాలులకు పడిపోవడంతో ఇద్దరు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.
- సీఎం కాన్వాయ్ రోడ్డు మార్గాన 3.30 గంటలకు సెయింటాన్స్ కళాశాలకు చేరుకుని జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు, బహిరంగ సభలో పాల్గొన్నారు.
- రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని చేనేత కార్మికులు, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వివిధ చేనేత వస్త్రాల ఉత్పత్తులు, తయారీ విధానం, చేనేత మగ్గాలు, పరికరాలు, హస్త కళల ప్రదర్శన స్టాళ్లను సీఎం సందర్శించారు.
- జాతీయ చేనేత దినోత్సవ సభకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, చేనేతశాఖ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
- సీఎం తన బహిరంగ సభలో చెప్పిన దానికంటే అధనంగానే అభివృద్ధి చేస్తున్నా చప్పట్లు కొట్టండి... చేతులు పైకెత్తండంటూ పలుమార్లు చెప్పడంతో సభకు హారైన వారు నవ్వుకోవడం కనిపించింది.
- సీఎం చీరాల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అన్నీ ప్రైవేటు స్కూళ్లకు శెలవులు ప్రకటించి స్కూల్ బస్సులను సీఎం సభకు ప్రజలను తరలించేందుకు వినియోగించారు.
- సీఎం సభకు వచ్చిన వారికి అందించే మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు.
- చంద్రబాబు 49 నిమిషాల ప్రసంగం అనంతరం 5.18 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా విజయవాడకు పయనమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment