సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంపై పోరాడుతున్నానంటూ పైకి కలరింగ్ ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు లోపల మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నత విద్యామండలితో సహా పదో షెడ్యూల్‌లోని 142 సంస్థల ఉదంతమే ఇందుకు నిదర్శనం. పదో షెడ్యూల్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు నోరుమెదపడం లేదు. ఏపీ ఉన్నత విద్యామండలికి సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. దీంతో కోర్టు ధిక్కరణ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫలితంగా పదో షెడ్యూల్‌లోని సంస్థలకు సంబంధించి రాష్ట్రానికి దక్కాల్సిన రూ.30,000 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను కోల్పోవాల్సిన ప్రమాదం తలెత్తుతోంది.
రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో వివిధ కార్పొరేషన్లు, మండళ్లు, మరికొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు 105ను కేంద్ర ప్రభుత్వం తొలుత చేర్చింది. తరువాత మరో 37 సంస్థలను జతచేసింది. మొత్తం 142 సంస్థలను ఎలా విభజించుకోవాలో చట్టంలో పేర్కొంది. ఈ 142 సంస్థల్లో ఏపీ ఉన్నత విద్యామండలి కూడా ఒకటి. మండలి బ్యాంకు ఖాతాలను తెలంగాణ ప్రభుత్వం స్తంభింపజేసింది. దీనిపై మండలి హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానంలో జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేయాల్సిన ఏపీ ప్రభుత్వం మౌనం దాల్చింది. ఫలితంగా ఉన్నత విద్యామండలితోపాటు తెలంగాణ భూభాగంలోని పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని హైకోర్టు తేల్చిచెప్పింది. దీనిపై ఏపీ ఉన్నత విద్యామండలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు 2016 మార్చి 18న తీర్పు వెలువరించింది. ఉన్నత విద్యా మండలితో పాటు పదో షెడ్యూల్‌లోని సంస్థల్లోని స్థిర, చరాస్తులను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సూచించింది. రెండు నెలల్లో ఏకాభిప్రాయానికి రాలేకపోతే కేంద్ర ప్రభుత్వమే తాము చెప్పిన నిష్పత్తిలో పంపిణీ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
నోరెత్తే సాహసం చేయని బాబు
ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారు. అప్పుడు కేంద్రం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ తీర్పు అమలు గురించి పట్టించుకోలేదు. పైగా తమ అనుమతి లేకుండా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారంటూ ఉన్నత విద్యామండలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు నెలల్లో తేల్చాల్సిన పదో షెడ్యూల్ సంస్థల విభజన వ్యవహారాన్ని కేంద్రం ఏడాదైనా పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురాకపోవడమే ఇందుకు కారణం. చివరకు 2017 ఏప్రిల్ 18న సుప్రీంకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ భూభాగంలో ఉన్న పదో షెడ్యూల్ సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని, ఇందులో ఏపీకి ఎలాంటి వాటా ఉండదని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు భిన్నంగా కేంద్రం ఆదేశాలు ఇచ్చినా చంద్రబాబు నోరెత్తే సాహసం చేయలేదు.
కోర్టు ధిక్కరణ పిటిషన్ డిస్మిస్
142 సంస్థల విభజనపై కేంద్రం ఏపీకి వ్యతిరేకంగా ఆదేశాలు ఇచ్చినా వాటిపై కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయింది. చివరకు మళ్లీ స్పష్టత ఇస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ ‘మిస్‌లేనియస్ అప్లికేషన్’ను 2017 ఆగస్టులో సుప్రీంకోర్టులో దాఖలు చేయించారు. తాను ఇచ్చిన ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నా అమలు చేయించకోలేక తనను తిరిగి స్పష్టత ఇవ్వాలంటూ కోరడంపై సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకుంటే వేరే ఫారంలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయాలని సూచిస్తూ 2017 నవంబర్ 27న ఎంఏ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. చంద్రబాబు అప్పటికింకా కేంద్రంలోనే భాగస్వామిగా ఉన్నారు. సుప్రీంకోర్టు సూచనల మేరకైనా కేంద్రంపై ఒత్తిడి చేసి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడలేదు. పైగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయించకుండా కాలయాపన చేయించారు. దీనిపై విమర్శలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉన్నత విద్యామండలి ద్వారా సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయించారు. దానిపై సరైన రీతిలో న్యాయస్థానానికి ఆధారాలు సమర్పించలేకపోయారు. గట్టిగా వాదనలు వినిపించకుండా కేసును నీరుగార్చారు. ఫలితంగా మార్చి 12న కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
హైకోర్టులో పోరాడుతారట!
కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని తాజాగా ఉన్నత విద్యాశాఖ ద్వారా ఉన్నత విద్యామండలికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయించలేకపోగా, కనీసం కోర్టు« ధిక్కరణ వ్యాజ్యంలోనూ సరైన వాదనలు వినిపించకుండా నీరుగార్చి, ఇప్పుడు హైకోర్టులో పోరాటం అంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసుల భయంతో ఆస్తులు తాకట్టు!
Published Wed, Jul 11 2018 2:20 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment