ఉండవల్లి సీఎం నివాసం వద్ద జరిగిన ఎస్పీలు, కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు,చిత్రంలో డీజీపీ మాలకొండయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్
సాక్షి, అమరావతి: కేంద్రం ఆదుకోకుండా రాష్ట్రానికి అన్యాయం చేస్తే అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడంపై రాజకీయ వర్గాలలో విస్మయం వ్యక్తమౌ తోంది. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయా లపై వెనుకబడటం కంటే సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించుకుంటామని చంద్రబాబు వ్యాఖ్యా నించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ కేంద్రంపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ముఖ్యమంత్రి అన్నారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర ప్రదేశ్ అట్టడుగున ఉందని, దీనికి కారణం విభజనతో తలెత్తిన కష్టాలేనని చంద్రబాబు పేర్కొన్నారు.
మిగిలిన రాష్ట్రాలతో సమాన స్థాయికి చేరుకునే వరకు ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్లుగా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ముఖ్యమంత్రి ఇపుడే ఏదో అన్యాయం జరుగుతున్నట్లు, కేంద్రం సహాయం చేయక పోతే ఏదో చేసేస్తానన్నట్లు మాట్లాడడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన వైఫ ల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఇదో ఎత్తుగడ అని విమర్శకులంటున్నారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడడం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైన చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల ను అమలు చేయడంలోనూ విఫలమ య్యారు. అన్ని విధాలుగా పూర్తిగా విఫలమైన సీఎం ఇపుడు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని, ఇలా తన వైఫల్య గళాన్ని వినిపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆహా.. ఓహో అని కీర్తించిన నోటితోనే
ప్రత్యేక హోదాకు మంగళం పలికేసి విభజన చట్టంలోని హామీలతో అరుణ్‌జైట్లీ చేసిన ప్రకటనను అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి మరీ చంద్రబాబు స్వాగతించారు. ఆ ప్రకటననే ప్రత్యేక ప్యాకేజీగా ప్రచారం చేశారు. అంతటితో ఆయన ఆగలేదు. ఈ నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేస్తున్నట్లు కీర్తిస్తూనే వచ్చారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ఉత్తమమైనదని, అది ఇస్తున్న కేంద్రం ఇంకా గొప్పదన్నట్లు చంద్రబాబు, తెలుగుదేశం కేంద్ర మంత్రులు ప్రచారం చేశారు. ప్యాకేజీ వల్ల లక్షల కోట్లు రాబోతున్నట్లు లెక్కలు వేసి మరీ వివరించారు. సన్మాన సభలు జరిపారు. అరుణ్‌జైట్లీ ప్రకటన తర్వాత ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హోదా కన్నా ప్యాకేజీ మెరుగైనదని, కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలా కేంద్రంపై అనేక సందర్భాలలో ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు. కేంద్రం బాగా సహకరిస్తోందని కితాబులిచ్చారు.
16నెలలుగా ప్రధానిని కలవని సీఎం
విభజన వల్ల రాష్ట్రం నష్టపోయిందని, కేంద్రం ఆదుకుంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత కూడా చెప్పడం హాస్యాస్పదంగా ఉందని విశ్లేషకులంటున్నారు. ఎంతో అనుభవజ్ఞుడినని చెప్పుకునే ముఖ్యమంత్రి నాలుగేళ్లుగా ఏం చేస్తున్నట్లు అని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిగా, ఎన్డీయే భాగస్వామిగా ఉన్న చంద్రబాబు 16 నెలలుగా ప్రధానమంత్రిని కలుసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. ఈనెల 12న ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత కూడా ఏం జరిగిందనేది ప్రజలకు స్పష్టంగా వివరించనూ లేదు. అక్కడ ఏమీ మాట్లాడకుండా ఇపుడు అకస్మాత్తుగా కేంద్రంపై ధిక్కారాన్ని ప్రకటిస్తున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం ఆయన వైఫల్య స్వరాన్నే వినిపిస్తోందని విశ్లేషకులంటున్నారు.
వెక్కిరిస్తున్న వైఫల్యాలు
రాజధానికి ఒక్క ఇటుక కూడా వేయలేదు. డిజైన్లు ఖరారు చేయడానికే నాలుగేళ్లు పట్టింది. తాత్కాలిక సచివాలయం కట్టుకుంటే చిన్న వానకే బీటలిచ్చింది. రాజధాని సంగతి సరే.. విజయవాడలో కనీసం కనకదుర్గ ఫ్లైఓవర్‌నే పూర్తిచేయలేకపోవడం పెద్ద వైఫల్యం మాదిరిగా వెక్కిరిస్తోంది. కొత్త రాష్ట్రం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అభివృద్ధి కార్యక్రమాలు లేవు. సంక్షేమ పథకాలు లేవు. నిరుద్యోగం తాండవిస్తోంది. నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లు కనీసం భృతిని అందించలేకపోయారు. ఎన్నికల హామీలలో అతి ముఖ్యమైనదైన రైతు రుణమాఫీ మరో పెద్ద వైఫల్యంగా మిగిలిపోయింది. అందుకే ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఇపుడు చంద్రబాబు కేంద్రం సాయం చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళతానని బీరాలు పలుకుతున్నారని, ఇది వైఫల్య స్వరం కాక మరేమిటని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment