‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల వసూలుపై నోరెత్తని బాబు సర్కారు
వసూలు చేసిన ఆ డిపాజిట్లు చెల్లించేశారని తెలంగాణ హైకోర్టుకు వెల్లడి
సెక్షన్ 45 ఎస్ గురించి ప్రస్తావించని వైనం
మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్నదానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్‌లో అభ్యర్థన
రామోజీ చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయాలన్న మార్గదర్శి
విచారణ జరపడం నిష్ప్రయోజనమంటూ అనుబంధ పిటిషన్..
పూర్తిస్థాయి వాదనలకు ముందు ఈ విషయాన్ని తేల్చాలని అభ్యర్థన
విచారణ నుంచి తప్పుకున్న న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్‌రావు
దీంతో ఈ వ్యాజ్యాలను సీజే ముందుంచాలని రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: తన రాజగురువు రామోజీరావు పట్ల టీడీపీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) మరోసారి భక్తిని చాటుకున్నారు. సాక్షాత్తూ సుప్రీం కోర్టు స్వయంగా జోక్యం చేసుకుని.. మార్గదర్శి, రామోజీ ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా? అనే అంశాన్ని తేల్చాలని హైకోర్టును ఆదేశించగా.. చంద్రబాబు సర్కార్ దాన్ని పూర్తిగా విస్మరిస్తూ అక్రమాలకు పాల్పడ్డ రామోజీ కుటుంబాన్ని రక్షించడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరించింది.
తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌లో మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా వసూలు చేసిన రూ.2,610 కోట్ల డిపాజిట్లు గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఆ అక్రమ డిపాజిట్ల గురించి వాస్తవాలను కోర్టుకు వెల్లడిస్తే మార్గదర్శి(Margadarsi), రామోజీ కుటుంబానికి ఇబ్బందులు తప్పవని గుర్తించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయం జోలికే వెళ్లలేదు.
పైగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో అక్రమంగా వసూలు చేసిన రూ.వేల కోట్లను తిరిగి వారికి చెల్లించేశామని, అందువల్ల తమను వదిలేయాలంటూ మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమాని రామోజీరావు(Ramoji Rao) ఇన్నేళ్లుగా కోర్టుల్లో చేస్తూ వస్తున్న వాదననే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం సైతం అందుకుంది. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్ల మొత్తంలో రూ.5.15 కోట్లు మినహా అత్యధిక భాగాన్ని తిరిగి చెల్లించేసిందని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.
రూ.5.15 కోట్ల డబ్బు 1,270 మంది డిపాజిటర్లకు సంబంధించిందని, అయితే వారెవరూ ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడం లేదని ఏపీ ప్రభుత్వం తన కౌంటర్ ద్వారా హైకోర్టుకు తెలిపింది. ఎస్క్రో ఖాతాలో ఉన్న ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు గానీ ఆర్‌బీఐకి గానీ బదలాయించాలంటూ వింత అభ్యర్థనను హైకోర్టు ముందుంచింది. ఎవరైనా డిపాజిటర్లు వస్తే వారికి ఆ మొత్తాలను తామే చెల్లిస్తామని ప్రతిపాదించింది.
తద్వారా అక్రమ డిపాజిట్ల వ్యవహారం నుంచి రామోజీ కుటుంబాన్ని బయటపడేసేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు యత్నించింది. రామోజీరావు గత ఏడాది జూన్ 8న చనిపోయారంటూ ఆయన మరణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అసలు మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరం ఉందా? అన్న దానిపై కూడా విచారణ జరపాలని కౌంటర్‌లో హైకోర్టుని కోరింది.
దాటవేత ధోరణే...
రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో పూర్తి దాటవేత ధోరణిని ప్రదర్శించింది. ఈ కౌంటర్‌లో ఎక్కడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 45ఎస్‌ను మార్గదర్శి, రామోజీరావు ఉల్లంఘించిన విషయం గురించి ప్రస్తావించనే లేదు. చట్ట విరుద్ధంగా రూ.వేల కోట్లను ప్రజల నుంచి డిపాజిట్లు రూపంలో మార్గదర్శి వసూలు చేసిందని స్వయంగా రిజర్వ్ బ్యాంకే చెప్పినా చంద్రబాబు సర్కారు ఆ అంశం జోలికి వెళ్లలేదు.
డిపాజిట్లను వెనక్కి ఇచ్చేసిందని మాత్రమే చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. రామోజీరావు చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారన్న విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో ఎవరు ఫిర్యాదు చేశారు? ఆ తరువాత కోర్టుల్లో ఏమైంది? తిరిగి తెలంగాణ హైకోర్టు ఎందుకు విచారణ జరుపుతోంది? లాంటి అందరికీ తెలిసిన విషయాలనే కౌంటర్‌లో పొందుపరిచింది.
అంతేకాక రామోజీ, మార్గదర్శి ఆర్థిక అవకతకవలపై అ«దీకృత అధికారిగా వ్యవహరిస్తున్న కృష్ణరాజు విచారణ జరపవచ్చో లేదో తేల్చాలని హైకోర్టును కోరింది. మార్గదర్శిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిన అవసరంపై కూడా విచారణ జరపాలని కౌంటర్‌లో కోరింది.
చనిపోయారు కాబట్టి కేసు కొట్టేయండి...
ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్‌కి విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినట్లు రుజువులు కూడా ఉండటం, విచారణ జరిగితే శిక్ష, భారీ జరిమానా ఖాయం కావడంతో రామోజీ మరణాన్ని అడ్డం పెట్టుకుని ఈ గండం నుంచి బయటపడాలని మార్గదర్శి ప్రస్తుత యాజమాన్యం భావిస్తోంది. అందులో భాగంగానే చంద్రబాబు ప్రభుత్వం చేత తమకు కావాల్సిన విధంగా కౌంటర్ దాఖలు చేయించింది.
రామోజీ మరణించారని ఏపీ ప్రభుత్వం చేత ప్రత్యేకంగా చెప్పించడమే కాకుండా ఇక ఈ కేసు విచారణను కొనసాగించాల్సిన అవసరం లేదన్న రీతిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పెద్దలు కౌంటర్‌లో రాయించారు. మరోవైపు మార్గదర్శి ఫైనానియర్స్ యాజమాన్యం కూడా ఇదే వాదనతో హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. రామోజీ మరణంతో ఇక ఈ కేసులో విచారించడానికి ఏమీ లేదని అందులో పేర్కొంది.
ఈ కేసుపై విచారణ జరపడం నిష్ప్రయోజనమని పేర్కొంది. పూర్తిస్థాయి వాదనలకు ముందే ఈ విషయాన్ని తేల్చాలని తెలంగాణ హైకోర్టును కోరింది. హెచ్‌యూఎఫ్ కర్తగా ఉన్న రామోజీ మరణించడంతో ఆ హెచ్‌యూఎఫ్‌లో సభ్యులుగా ఉన్న వారికి నేరాన్ని ఆపాదించడాన్ని వీల్లేదని నివేదించింది.
వసూలు చేశాం... వెనక్కి ఇచ్చేశాం
ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా తాము ప్రజల నుంచి రూ.2,596.98 కోట్లు అక్రమంగా వసూలు చేసిన మాట వాస్తవమేనని మార్గదర్శి ఫైనాన్షియర్స్ హైకోర్టు ముందు అంగీకరించింది. వసూలు చేసిన డిపాజిట్లలో అత్యధిక మొత్తాన్ని తిరిగి చెల్లించేశామని, మిగిలి ఉన్న మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో ఉంచామంది. ఈమేరకు ఆర్బీఐ కౌంటర్‌కు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తిరుగు సమాధానం ఇచి్చంది.
విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ నర్సింగ్‌రావు
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి జరుగుతున్న విచారణ నుంచి న్యాయమూర్తి జస్టిస్ నర్సింగ్‌రావు తప్పుకున్నారు. గతంలో తాను మార్గదర్శి తరఫున దాఖలైన కేసుల్లో న్యాయవాదిగా ఉన్నానని, అందువల్ల ఈ వ్యాజ్యంపై విచారణ జరపలేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యాజ్యాలను తగిన ధర్మాసనం ముందుంచేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందుంచాలని జస్టిస్ శ్యాంకోషి, జస్టిస్ నర్సింగరావు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో తదుపరి విచారణ తేదీని, విచారణ ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి నిర్ణయించనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి అక్రమ డిపాజిట్ల సేకరణపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలు శుక్రవారం జస్టిస్ శ్యామ్ కోషి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూద్రా, కోర్టు సహాయకుడిగా మాజీ ఎంపీ అరుణ్‌కుమార్, ఏపీ స్పెషల్ జీపీ రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ పీపీ పల్లె నాగేశ్వర్‌రావు విచారణకు హాజరయ్యారు.
రామోజీ మరణించిన నేపథ్యంలో ఈ కేసును కొట్టేయాలని, దీనిపై అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గీ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ముకుల్ రోహత్గీ చేసిన ఈ అభ్యర్థన పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారీ ఆరి్థక నేరానికి పాల్పడిన వ్యక్తి చనిపోయినంత మాత్రాన అతను నేరం చేయనట్లుగా భావించాల్సిన అవసరం లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కాగా హైకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ కౌంటర్ దాఖలు చేయగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఐడీ, ఆర్థిక నేరాల విభాగం ఎస్‌పీ కొల్లి వెంకట లక్ష్మీ కౌంటర్ దాఖలు చేశారు.
బాబు బాటలోనే రేవంత్...
ప్రజల నుంచి మార్గదర్శి చట్టవిరుద్ధంగా రూ.2,610 కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో రేవంత్‌రెడ్డి సర్కార్ సైతం చంద్రబాబు బాటనే ఎంచుకుంది. రామోజీరావు, మార్గదర్శి అక్రమ డిపాజిట్ల గురించి తెలంగాణ ప్రభుత్వం కూడా నోరు మెదప లేదు. రూ.2610 కోట్లను మార్గదర్శి వసూలు చేయడం చట్ట విరుద్ధమా? కాదా? అన్న విషయం గురించి కనీస స్థాయిలో కూడా మాట్లాడలేదు.
చట్టవిరుద్ధ డిపాజిట్ల గురించి మార్గదర్శి ఫైనాన్షియర్స్, దాని యజమానికి ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు కలగకుండా అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చాలా లౌక్యంగా, వాస్తవాల జోలికి వెళ్లకుండా కౌంటర్లు దాఖలు చేశాయి. అందరికీ తెలిసిన, కోర్టుల్లో ఇప్పటి వరకు జరిగిన విషయాలనే తెలంగాణ ప్రభుత్వం తన కౌంటర్‌లో వివరించింది.
వాస్తవానికి మార్గదర్శిపై నాంపల్లి కోర్టులో అ«దీకృత అధికారి కృష్ణరాజు ఫిర్యాదు ఎందుకు దాఖలు చేశారు? మార్గదర్శి, రామోజీపై ఉన్న ఆరోపణలు ఏంటి? ఆర్‌బీఐ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది? తదితర వివరాలను తమ కౌంటర్‌లలో పూర్తిస్థాయిలో పొందుపరిచే అవకాశం ఉన్నప్పటికీ గురుశిష్యుల ప్రభుత్వాలు రామోజీపై తమ భక్తిని చాటుకుంటూ కౌంటర్లు దాఖలు చేశాయి.
‘‘45 ఎస్’’ ఏం చెబుతోందంటే..?
నిర్దిష్ట వ్యక్తులు, సంస్థలు, ఇన్‌కార్పొరేటెడ్ సంఘాలు తమ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45 ఎస్ నిషేధిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment