మెగా అగచాట్ల డీఎస్సీ! | Website not open for some school assistant posts | Sakshi
Sakshi News home page

మెగా అగచాట్ల డీఎస్సీ!

Published Fri, Apr 25 2025 4:16 AM | Last Updated on Fri, Apr 25 2025 4:16 AM

Website not open for some school assistant posts

పది, ఇంటర్‌లోనూ కనీస మార్కులంటూ కొర్రీ  

45, 50 శాతం మార్కులు వచ్చి ఉంటేనే ముందుకు..

కొన్ని స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఓపెన్‌ కాని వెబ్‌సైట్‌

కంప్యూటర్‌ సైన్స్, అరబిక్‌ సబ్జెక్టులకు కనిపించని ఆప్షన్‌

తప్పిదాలను సరిచేసుకునేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ కరువు

పలు సాంకేతిక సమస్యలతో అభ్యర్థులకు చుక్కలు

కనీస మార్కుల పెంపుతో పలువురిలో ఆందోళన

ఇప్పటికే కోచింగ్‌ తీసుకుంటున్న తాము నష్టపోతామని ఆవేదన

టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా..

అలా కాదన్నప్పుడు టెట్‌ ఎందుకు పెట్టారని నిలదీత

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 16,347 ఉపా­ధ్యాయ ఖాళీల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అభ్యర్థు­లకు చుక్క­లు చూపిస్తోంది. దరఖాస్తు చేసుకో­వ­డానికి వెబ్‌సైట్‌­ను ఓపెన్‌ చేసిన నిరుద్యోగ ఉపా­ధ్యాయ అభ్య­ర్థులకు సాంకేతిక సమ­స్యలు ఎదు­రవుతు­న్నాయి. ఇప్పటికే కొన్ని నిబ­ంధనలు అడ్డంకి కాగా, ఆన్‌లైన్‌లోనూ సాంకేతిక కార­ణా­లతో దరఖా­స్తుకు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతు­న్నాయి. హెల్ప్‌ లైన్‌ నెంబర్లు కూడా సకాలంలో పని చేయడం లేదని నిరు­ద్యోగులు వాపోతు­న్నారు. కఠిన నియ­­మాలతో నిరుద్యో­గులు ఇబ్బందు­లు పడు­తు­న్నారు. 

స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు ఆన్‌లైన్‌­లో దరఖాస్తు చేసు­కు­ంటున్న అభ్యర్థుల­ కు పదవ తరగతి, ఇంటర్మీడియట్‌లో కూడా కనీస మార్కులు 45–­50 శాతం లేకుంటే ఇన్‌ వ్యాలి­డ్‌గా చూపి­స్తోంది. ఆ మేరకు మార్కులు లేకుంటే కనీస విద్యా­ర్హత అయిన డిగ్రీలో సగటు మా­ర్కులు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నా కూడా దర­ఖాస్తు సబ్మిట్‌ అవ్వడం లేదు. ఓపెన్‌లో ఇంటర్మీడియట్‌ కోర్సు పూర్తి చేసిన వారికి వరుసగా 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీఈడీ వరుస క్రమంలో విద్యార్హతలు నమోదు చేసేందుకు వీలు పడటం లేదు. దీనికితోడు కొన్ని ఆప్షన్లు లేకపోవడంతో ఇబ్బందికి గురవుతు­న్నా­రు. 

ఉ­దా­హ­ర­ణకు.. ఓ డీఎస్సీ అభ్యర్థి ఇంటర్మీడి­యట్‌లో అరబిక్‌ను ద్వితీయ భాషగా తీసుకుంటే.. మెగా డీఎస్సీ అప్లికేషన్‌లో రెండవ భాష సెలెక్ట్‌ చెస్తే డ్రాప్‌–డౌన్‌ మెనూలో అరబిక్‌ ఆప్షన్‌ కనిపించట్లేదు. 2024లో అప్లై చేసేటప్పుడు ‘ఏదైనా ఇతర భాష’ అనే ఆప్షన్‌ ఉండేది. ఈసారి అది ఎత్తేశారు. మరోవైపు ఓపెన్‌ స్కూల్లో చదివిన కోర్సుల నమోదుకు ప్రత్యేక ఆప్షన్‌ ఇవ్వలేదు.

డిగ్రీలో కంప్యూటర్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా చదివిన వారు అప్లై చేసేందుకు ఆ సబ్జెక్ట్‌ ఆప్షన్‌ కనిపించడం లేదని అభ్యర్థులు వాపోతు­న్నారు. ఇలాంటి వాటిని సరిదిద్దకుంటే నష్టపోతామని, పరీక్ష కేంద్రం ఎక్కువ దూరం వచ్చే అవకాశం ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలి
మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు 47 ఏళ్లకు పెంచాలని పలువురు అభ్య­ర్థులు కోరుతున్నారు. కొంత మంది నిరుద్యో­గులు డీఎస్సీ ఆన్‌లైన్‌ దరఖాస్తు పూరించడంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు దొర్లడంతో చూసుకోకుండానే దరఖాస్తును సబ్మిట్‌ చేశారు. దీంతో హాల్‌ టికెట్‌ రాదేమోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి తప్పిదాలు చేసిన వారికి కరెక్షన్‌ చేసుకునే అవకాశం ఇవ్వా­లని కోరుతున్నారు. నిరుద్యోగుల అభ్యసనానికి తగిన సమయం దొరికేలా డీఎస్సీ షెడ్యూల్‌లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పోటీ పరీక్షలకు కనీస మార్కులేంటి?
» విద్యార్హతల్లో కనీస మార్కులు పెట్టడం ఏమిటని రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ అభ్య­ర్థులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి డీఎస్సీ రాసే అర్హత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గతంలో టెట్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెగా డీఎస్సీలో నిబంధనల ప్రకారం ఉద్యో­గా­లకు దరఖాస్తు చేసుకునేందుకు కుదరట్లేదు. 
»    ఎస్‌జీటీకి ఇంటర్మీడియట్‌లో 50 శాతం, స్కూల్‌ అసిస్టెంట్‌కు డిగ్రీలో 50 శాతం కనీస మార్కులు ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రిజర్వేషన్‌ అభ్య­ర్థు­లకు ఐదు శాతం మినహాయింపు ఉంది. కానీ, అనేక మంది నిరుద్యోగులు టెట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన క్రమంలో అప్పట్లో 40 శాతం కనీస అర్హత మార్కులుగా తీసుకు­న్నట్లు సమాచా­రం. ఇప్పుడు వారంతా అనర్హులుగా మారిపోతున్నారు. 
»    పీజీ ఇంగ్లిష్‌లో 42.5 శాతం మార్కులు కలిగిన ఓ మహిళ కొన్ని నెలలుగా డీఎస్సీ కోసం శిక్షణ పొందుతోంది. ఇలాగే ఇంటర్మీడియట్లో 47.5 శాతం మా­ర్కులున్న ఓ జనరల్‌ అభ్యర్థి దర­ఖాస్తు చేయడం కోసం ఎదురు చూస్తు­న్నాడు. ఇలా వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ రాసేందుకు వేచిచూ­స్తున్న తరుణంలో కనీస మార్కులు 50 శాతం నిర్దేశించడంతో దిక్కు తోచక కొట్టుమిట్టాడుతున్నారు.
»   టెట్‌లో ఉత్తీర్ణత సాధించినా ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కనీస మార్కు­లతో సంబంధం లేకుండా మెగా డీఎస్సీకి అర్హత కల్పించాలని కోరుతున్నారు. టెట్‌ ఉత్తీర్ణులయ్యామంటే డీఎస్సీకి అర్హత ఉన్నట్లే కదా.. అని ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు టెట్‌ ఎందుకు రాయించారని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి కనీస మార్కులు 40 శాతానికి తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement