ఆన్‌లైన్ పరీక్షతో సమస్యలుంటాయని అభ్యర్థుల అభ్యంతరం
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇదిగో డీఎస్సీ.. అదిగో డీఎస్సీ అంటూ ఆరు నెలలుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డీఎస్సీ సిలబస్‌ను మాత్రమే విడుదల చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సిలబస్‌తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పరీక్షకు ఎప్పుడూ లేని రీతిలో ఇంటరీ్మడియెట్ వరకు సిలబస్‌ను ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ అభ్యర్థులు 3–10 తరగతుల సిలబస్‌ను మాత్రమే చదవాలని చెబుతూనే.. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్‌ను ఇవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది. 2018 డీఎస్సీలోనూ ఇలాగే చెప్పిందొకటి, పరీక్షకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు.
2014 డీఎస్సీలోనూ ఇదే విధానం అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైనా నాటి టీడీï³ సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్‌పై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు, విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. హైసూ్కల్ బోధనకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం సరికాదన్నారు. అలాగే పరీక్షల నిర్వహణపైనా విజ్ఞప్తులు చేశారు.
బోధించే తరగతులకు మించి సిలబస్..
టెట్ సిలబస్సే డీఎస్సీ పరీక్షలకు కూడా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఉంటుందని తాజాగా డీఎస్సీ సిలబస్‌లో ప్రకటించారు. కానీ, సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియెట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలిక పెట్టారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధన చేస్తుండగా, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. బోధించే తరగతులకు అనుగుణంగా అంతవరకే గతంలో డీఎస్సీ సిలబస్ ఉండేది.
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టులకు మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) పోస్టులకు 6 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది. దీన్ని ఆధారం చేసుకునే ప్రశ్నపత్రాలను రూపొందించేవారు. కానీ, 2014, 2018 డీఎస్సీల్లో మాత్రం సిలబస్‌ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు, విద్యా రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎస్‌ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఊస్టింగేనా?
ఎస్‌జీటీ, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పాఠశాల విద్యా శాఖ సిలబస్‌ను ప్రకటించింది. కానీ హైసూ్కళ్లల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ) స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్‌ను ప్రకటించలేదు. అంటే ఈ విభాగంలో పోస్టులు లేవని ప్రభుత్వం చెబుతున్నట్టుగానే భావించాల్సి వస్తోంది. 2018 ఫిబ్రవరి స్పెషల్ డీఎస్సీలో ఎస్‌ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాదాపు 852 పోస్టులను గుర్తించి సుమారు 602 పోస్టులు భర్తీ చేశారు.
కానీ ఈసారి వారికి అవకాశం లేకపోవడంతో డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ విద్యావిధానం–2020 నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది.
ఆన్‌లైన్ పరీక్షపైనా అభ్యంతరాలు..
జూలైలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మాదిరిగానే డీఎస్సీని కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు నష్టం చేస్తుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సెషన్లలో రోజుల తరబడి ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డీఎస్సీ.. జిల్లా స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టే పరీక్ష కాబట్టి పరీక్షను కూడా ఉమ్మడి జిల్లాలవారీగా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై గతంలో అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను అభ్యర్థించారు. నాడు సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పుడు మాత్రం ఆన్‌లైన్‌లో అది కూడా టెట్ మాదిరిగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పది రోజులు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment