
అమరావతి, సాక్షి: ఆరోగ్యశ్రీ పథకం(Aarogyasri Scheme) కొనసాగింపుపై కూటమి ప్రభుత్వం దాదాపుగా చేతులెత్తేసింది. సోమవారం మీడియాతో పలు అంశాలపై మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(74).. ఆరోగ్యశ్రీ కొనసాగింపు కష్టమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నలకు తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన.
‘‘ఆరోగ్య శ్రీ నిలిపేస్తాం అని ఆస్పత్రుల యజమానులు చెప్పారు. వాళ్లకి డబ్బులు ఇవ్వాలి. వాళ్లకి డబ్బులు ఇమ్మంటే మా ఆర్థిక శాఖ సెక్రెటరీ డబ్బులు ఎక్కడున్నాయని అంటున్నారు?’’ అని సీఎం చంద్రబాబు(CM Chandrababu) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలో.. పీ 4 బాగా సక్సెస్ అయ్యింది అని ఆయన అనగానే.. పీ 4 లో మంత్రులు భాగస్వాములయ్యారా..? అని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీంతో.. మీడియాపై ఎదురుదాడికి దిగారారాయన.
మీరు భాగస్వామి అయ్యారా..? మీరు ముఖ్యమంత్రే చెయ్యాలి...మంత్రులే చెయ్యాలి అంటే ఎలా..?. మీ ఆలోచనా విధానం మారాలి. మీరు భాగస్వాములయ్యారా..? మీరు క్రిటిక్స్ గానే మిగిలిపోతారా..? అంటూ ఆవేశంతో సీఎం చంద్రబాబు ఊగిపోయారు. అదే సమయంలో ఆక్వా రంగ సంక్షోభం(Aqua Crisis)పైనా వింత వ్యాఖ్యలు చేశారు. ఈ సంక్షోభానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమన్న సీఎం చంద్రబాబు.. తనకేం చేయాలో అర్థం కావడం లేదని, కేంద్రానికి లేఖ రాయడం మాత్రమే తాను చేయగలిగిందంటూ వ్యాఖ్యానించారు.
విజయవాడ: నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఈ ఉదయం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. రూ.3,500 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగాయి. 26 సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని ఆ ఆస్పత్రులు చెబుతున్నాయి. మరోవైపు.. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.