మరోసారి ‘టెట్‌’తో డీఎస్సీ ఆలస్యం! | DSC delayed with Tet once again: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మరోసారి ‘టెట్‌’తో డీఎస్సీ ఆలస్యం!

Published Tue, Jun 25 2024 3:41 AM | Last Updated on Tue, Jun 25 2024 3:41 AM

DSC delayed with Tet once again: Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే డీఎస్సీ పోస్టులకు ప్రకటన

టెట్‌ కూడా నిర్వహణ

గ్రూప్‌–1, గ్రూప్‌–2, డీఎల్, జేఎల్‌ పోస్టులకూ నోటిఫికేషన్లు

వీటిలో కొన్నిటికి పరీక్షల నిర్వహణతోపాటు ఫలితాలూ వెల్లడి

ఎన్నికలు రావడంతో మరికొన్ని పరీక్షలకు అడ్డంకి

కొత్త చైర్మన్, సభ్యులు వచ్చాకే పోస్టుల భర్తీకి కొత్త ప్రభుత్వం మొగ్గు!

సాక్షి, అమరావతి: ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 6,100 టీచర్‌ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు సైతం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ నిర్వహించింది. అయి­తే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టెట్‌ నిర్వహించలేదని పేర్కొన్నారు. అంటే.. మరోసారి టెట్‌ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

గతంలో నిర్వహించిన టెట్‌కు సంబంధించి సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌ జీటీ) అర్హత పరీక్ష పేపర్‌–1ఏని 1,13,296 మంది, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల అర్హత పరీక్ష పేపర్‌–2ఏని 1,19,500 మంది, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్‌–1బి, పేపర్‌–2బిలను 3,111 మంది రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మంది టెట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి మార్చి∙20న టెట్‌ ఫలితాలు ప్రకటించాలని షెడ్యూల్‌లో ప్రకటించినా.. ఎన్ని­కల కోడ్‌ అమల్లో ఉండడంతో ఆలస్యమైంది.

అయితే, అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ టెట్‌ ఫలితాల ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, టీడీపీ వర్గాల ఒత్తిడితో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే నిర్వహించిన టెట్‌ ఫలితాలు ప్రకటించాల్సింది పోయి, మరోసారి టెట్‌ నిర్వహించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. డీఎస్సీ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

కొత్త ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రూప్‌–1, గ్రూప్‌–2, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, జూనియర్‌ కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్‌ కళాశాలల లెక్చరర్లు, తది­తర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పలు పోస్టులకు ప్రిలి­మ్స్‌ కూడా నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. మెయి­న్స్‌ పరీక్షలు జరిగే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొన్ని పరీ­క్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వ హయాంలో ఏపీపీఎస్సీలో నియమితులైన చైర్మన్, సభ్యులు ఉన్నంతకాలం ఈ పోస్టు­ల భర్తీ చేపట్టకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

తద్వారా ఆ పోస్టులను తా­మే భర్తీ చేశామన్న క్రెడిట్‌ను కొట్టేయడమే కొత్త ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ­పీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తప్పించేం­దుకు రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తోపాటు అవసరమైతే వారిపై కేసుల నమోదుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలి­సింది. ఇదే కోవలో మరోసారి టెట్‌ నిర్వహణ పే­రుతో డీ­ఎ­స్సీని ఆలస్యం చేసేందుకు కూడా ప్రభు­­త్వం ప్ర­యత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement