రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే | IT fines Margadarshi Financiers for illegal deposit collections | Sakshi
Sakshi News home page

రూ.1,500 కోట్ల పెనాల్టీ వసూలు చేయాల్సిందే

Published Fri, Mar 7 2025 5:29 AM | Last Updated on Fri, Mar 7 2025 8:15 AM

IT fines Margadarshi Financiers for illegal deposit collections

‘మార్గదర్శి’ రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల వసూళ్లపై ‘ఐటీ’ జరిమానా 

16 ఏళ్లుగా పెండింగ్‌లోనే రూ.1,500 కోట్ల పెనాల్టీ.. రామోజీ మరణించినందున గతంలో విధించిన ‘స్టే’ తొలిగిపోయినట్లే 

ఆదాయపన్ను శాఖకు మాజీ ఎంపీ ఉండవల్లి లేఖ.. సెక్షన్‌ 45 ఎస్‌ నుంచి తమకు మినహాయింపుఉందన్న రామోజీ వాదనను కొట్టి పారేసిన ఆర్బీఐ 

డిపాజిట్ల సేకరణ చట్ట విరుద్ధమే హెచ్‌యూఎఫ్‌ కర్త మరణించినా విచారణ ఎదుర్కోవాల్సిందే 

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాలని కౌంటర్‌లో నివేదన  

డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?.. అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం

తుది విచారణలో తేలుస్తామన్న తెలంగాణ హైకోర్టు   

సాక్షి, అమరావతి: రిజర్వ్‌బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కేంద్ర ఆదాయ పన్ను శాఖను కోరారు. ఇప్పటికే 16 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఈ విషయాన్ని సత్వరం పరిష్కరించి పెనాల్టీని వసూలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ సంస్థను నిర్వహించిన హిందూ అవిభాజ్య కుటుంబ (హెచ్‌యూఎఫ్‌) కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు విధించిన స్టే కూడా తొలగిపోయినట్లేనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనర్‌కు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఇటీవల రెండు వేర్వేరు లేఖలు రాశారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ సంస్థ ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన అక్రమ డిపాజిట్ల ఉదంతాన్ని అందులో సవివరంగా ప్రస్తావించారు. 

అక్రమంగా డిపాజిట్లు వసూలు నిర్ధారించిన ఆర్బీఐ
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ సంస్థ పేరిట రామోజీరావు ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన విషయాన్ని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ తొలిసారి 2006లో ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. రిజర్వ్‌ బ్యాంకు చట్టం ప్రకారం బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ రెండు లక్షల మందికిపైగా డిపాజిటర్ల నుంచి అక్రమంగా రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లు వసూలు చేసింది. 

ఇదే విషయాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం, ఆర్బీఐలకు లేఖల ద్వారా తెలియచేశారు. ఈ క్రమంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ కేసు నమోదు చేసింది. ఆర్బీఐ సెక్షన్‌ 45 ఎస్‌ నుంచి తమకు మినహాయింపు ఉందని రామోజీ అప్పట్లో అడ్డగోలుగా వాదించారు. అయితే ఆ వాదనను ఆర్బీఐ కొట్టిపారేసింది. 

45 ఎస్‌ కింద రామోజీరావుకు మినహాయింపు వర్తించదని.. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట వసూలు చేసినవి ముమ్మాటికీ అక్రమ డిపాజిట్లేనని స్పష్టం చేసింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో రామోజీరావు తన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ సంస్థను మూసివేస్తున్నామని.. సేకరించిన అక్రమ డిపాజిట్లను తిరిగి చెల్లించేస్తామని ఆర్బీఐ, న్యాయస్థానాలకు  విన్నవించారు.

రూ.1,500 కోట్లు పెనాల్టీ విధించిన ఐటీ శాఖ
స్టే తెచ్చుకున్న రామోజీ
నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల ద్వారా రామోజీ సముపార్జించిన అక్రమ ఆదాయంపై ఆదాయపన్ను శాఖ 2008లో రూ.1,500 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ మేరకు ఆదాయపన్ను చట్టం సెక్షన్‌ 271 డి ప్రకారం మార్గదర్శి ఫైనా­న్సియర్స్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులపై రామోజీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. స్టే విధించి 16 ఏళ్లు దాటినప్పటికీ దాన్ని తొలగించేందుకు ఇప్పటికీ ఆదా­యపన్ను శాఖ సరైన చర్యలు తీసుకోలేదు. దాంతో రూ.1,500 కోట్ల పెనాల్టీ చెల్లింపు అంశం దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉంది. 

‘మార్గదర్శి’పై చర్యలు తీసుకోవాల్సిందేనన్న ‘సుప్రీం’
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ తమ డిపాజిటర్లకు డిపాజిట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించేసినందున ఇక ఎలాంటి చర్యలు అవసరం లేదని ఏపీ – తెలంగాణ ఉమ్మడి హైకోర్టు విభజనకు ముందు రోజు అంటే 2018 డిసెంబర్‌ 31న తీర్పునిచ్చింది. ఆ తీర్పును అప్పటి టీడీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయకుండా రామోజీరావుకు సహకరించింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

అక్రమ డిపాజిట్లు ఎవరెవరికి తిరిగి చెల్లించారో వివరాలు వెల్లడించాలని.. అక్రమాలకు పాల్పడిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అనంతరం 2019 మేలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఈ కేసులో ఇంప్లీడ్‌ అయ్యింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు.. గతంలో ఉమ్మడి ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం క్రిమినల్‌ చర్యలు చేపట్టాల్సిందేనని స్పష్టం చేసింది. 

ఈ క్రమంలో కేసును తిరిగి విచారించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. ఈ విషయంలో తెలంగాణ హైకోర్టుకు సహకరించాలని ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు సూచించింది. ప్రస్తుతం ఈ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణలో ఉంది. హెచ్‌యూఎఫ్‌ కర్త రామోజీరావు మరణించినా సరే... అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పెనాల్టీ వసూలుకు చర్యలు చేపట్టండి
ఈ పరిణామాల నేపథ్యంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కేంద్ర ఆదాయపన్ను శాఖకు లేఖ రాశారు. హెచ్‌యూఎఫ్‌ కర్త చెరుకూరి రామోజీరావు మరణించినందున ఆ సంస్థపై ఐటీ శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించి గతంలో న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు తొలగిపోయినట్లేనని వివరించారు. రామోజీరావు మరణించిన తరువాత ఆయన కుటుంబ సభ్యులను ఈ కేసు రికార్డుల్లో నమోదు చేయనందున గతంలో ఇచ్చిన స్టే ఉత్తర్వులు మనుగడలో లేనట్లుగానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. 

రామోజీ స్థానంలో తనను హెచ్‌యూఎఫ్‌ కర్తగా పరిగణించాలని ఆయన కుమారుడు సీహెచ్‌.కిరణ్‌ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కేసును విచారిస్తున్న తెలంగాణ హైకోర్టును కోరారు. కానీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి సంబంధించిన కేసులో మాత్రం రామోజీరావు వారసుల పేర్లు రికార్డుల్లో నమోదు కాలేదు. కాబట్టి గతంలో ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీపై న్యాయస్థానం ఇచ్చిన స్టే తొలగిపోయినట్లుగానే పరిగణించాలని కూడా ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ నివేదించారు. 

ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు విధించిన రూ.1,500 కోట్ల పెనాల్టీని వసూలు చేసేందుకు ఆదాయపన్ను శాఖ న్యాయపరంగా అన్ని చర్యలూ చేపట్టాలని కోరారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమాలపై తానే ఫిర్యాదుదారుడిని కాబట్టి పెనాల్టీ అంశంపై ప్రస్తుత పరిస్థితిని తనకు వివరిస్తే అవసరమైతే తాను కూడా తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలిపారు.

తొక్కిపెడుతున్న బాబు సర్కారు
మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆర్బీఐ ఆధారాలతో సహా న్యాయస్థానానికి నివేదించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తొక్కిపెడుతూ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తు­న్నాయి. 

అందులో భాగంగానే.. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ కర్త రామోజీరావు మరణించినందున ఈ వ్యాజ్యాలపై విచారణే అవసరం లేదంటూ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇటీవల తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. అనవసరమైన విచారణ జరిపి సమయాన్ని వృథా చేసుకోవద్దని ఏకంగా న్యాయస్థానానికే సూచించింది. 

చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా?
‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చే శారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరు­ద్ధమని ఆర్బీఐ చెబు­తోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’   – మార్గదర్శినుద్దేశించి గతంలో తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య

డిపాజిట్ల సేకరణచట్ట విరుద్ధమే:ఆర్బీఐ
మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావు ఆర్బీఐ చట్టం సెక్షన్‌ 45 (ఎస్‌)కి విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇప్పటికే పలు దఫాలు న్యాయస్థానానికి నివేదించింది. ఇది సెక్షన్‌ 58 బీ (5ఏ) ప్రకారం అత్యంత శిక్షార్హమైన నేరమని స్పష్టం చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని కర్త రామోజీరావుల చట్ట ఉల్లంఘనలకు సంబంధించి ఆర్బీఐ తన కౌంటర్‌లో పలు కీలక విషయాలను తెలంగాణ హైకోర్టు ముందుంచింది. 

మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ చట్ట విరుద్ధంగా వసూలు చేసిన డిపాజిట్లపై తమకు ప్రజల నుంచి, డిపాజిటర్ల నుంచి ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. డిపాజిట్ల వసూలు విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్న మార్గదర్శి, రామోజీ వాదన శుద్ధ అబద్ధమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో... చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి రూ.వేల కోట్లు వసూలు చేసిన మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) కర్త చెరుకూరి రామోజీరావు మరణించిన నేపథ్యంలో, తమపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను కొనసాగించడం నిష్ప్రయోజనమంటూ మార్గ దర్శి ఫైనాన్సియర్స్‌ చేసిన వాదనను ఆర్‌బీఐ నిర్ధ్వందంగా తోసిపుచ్చింది. 

మార్గదర్శి ఫైనాన్సియర్స్, రామోజీరావు ప్రజల నుంచి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో వసూలు చేశారని, ఇది ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 45ఎస్‌కి విరుద్ధమని పునరుద్ఘాటించింది. అంతేకాక ఇలా అక్రమంగా డిపాజిట్లు వసూలు చేయడం ఆర్‌బీఐ చట్టం సెక్షన్‌ 58 బీ (5ఏ) ప్రకారం శిక్షార్హమని హైకోర్టు దృష్టికి తెచ్చింది. రామోజీరావు మరణించినప్పటికీ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై ప్రొసీడింగ్స్‌ను కొనసాగించాల్సిందేనని స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement