Reserve Bank
-
భారత్ అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర
పుణె: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఇన్ఫ్రా రంగానికి బ్యాంకులు దన్నుగా నిలవాలని, చిన్న–మధ్యతరహా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా రుణ లభ్యత ఉండేలా చూడాలని ఆమె చెప్పారు. అలాగే, ఆర్థిక సేవలు అందుబాటులో లేని వర్గాలను బ్యాంకింగ్ పరిధిలోకి తేవాలని, బీమా విస్తృతిని మరింత పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 90వ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. టెక్నాలజీతో కొత్త మార్పులు.. ఖాతాదారులకు డిజిటల్ బ్యాంకింగ్‌ను సులభతరం చేసేందుకు ఉపయోగపడుతున్న టెక్నాలజీతో పరిశ్రమలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ ప్రాధాన్యం పెరుగుతోందని, ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్ తదితర ఏడు దేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉందని ఆమె తెలిపారు. అంతర్జాతీయంగా జరిగే రియల్–టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో 45 శాతం వాటా భారత్‌దే ఉంటోందన్నారు.అయితే, టెక్నాలజీతో పాటు పెరుగుతున్న హ్యాకింగ్ రిస్కులను నివారించేందుకు, అలాంటి వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు బ్యాంకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. బ్యాంకుల్లో మొండిబాకీలు తగ్గుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ జూన్ ఆర్థిక స్థిరత్వ నివేదిక సూచిస్తోందని మంత్రి చెప్పారు. లాభదాయకతతో పాటు ఆదాయాలను పెంచుకునే దిశగా బ్యాంకులు తగు విధానాలను పాటించాలని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు సూచించారు. -
ముందస్తు విత్‌డ్రాకు ఆర్బీఐ నిబంధనలు
ముంబై: ఎన్బీఎఫ్సీల్లో డిపాజిట్ చేసిన మూణ్నెల్ల వ్యవధిలోనే డిపాజిటర్లు అత్యవసర పరిస్థితుల కోసం మొత్తం డబ్బును వెనక్కి తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ప్రిమెచ్యూర్ విత్డ్రాయల్స్పై వడ్డీ లభించదని పేర్కొంది. నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల (ఎన్బీఎఫ్సీ) నిబంధనలను సమీక్షించిన సందర్భంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. వైద్యం, ప్రకృతి వైపరీత్యాలతో పాటు ప్రభుత్వం ప్రకటించే విపత్తులను అత్యవసర పరిస్థితులుగా పరిగణిస్తారు. మరోవైపు, డిపాజిట్లు స్వీకరించే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీ) పాటించాల్సిన లిక్విడ్ అసెట్స్ పరిమాణాన్ని అవి ప్రజల నుంచి సేకరించిన డిపాజిట్లలో 13 శాతం నుంచి 15 శాతానికి ఆర్బీఐ పెంచింది. అలాగే, పబ్లిక్ డిపాజిట్లకు అన్ని వేళలా పూర్తి కవరేజీ ఉండేలా చూసుకోవాలని, ఏడాదికి ఒకసారైనా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుంచి ’ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్’ రేటింగ్ పొందాలని హెచ్ఎఫ్సీలకు సూచించింది. పబ్లిక్ డిపాజిట్లను 12 నెలల నుంచి 60 నెలల్లోపు తిరిగి చెల్లించేయాల్సి ఉంటుంది. -
విదేశీ విద్యపైనే మోజు!
విదేశాల్లో చదువుకునేందకు ఇష్టపడే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలుండటంతో పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. అదే సమయంలో విదేశాల నుంచి మనదేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. అయితే భారతీయ విద్యార్థులు విదేశాలకు భారీగా తరలిపోవడం, వారి ఆదాయ, వ్యయాలు అన్నీ ఇతర దేశాల్లోనే జరుగుతుండటంతో దేశీయ కరెంట్ అకౌంట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.సాక్షి, అమరావతి: విదేశాల్లో ఉన్నత విద్య చదువుకునేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి మరింత పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ విశ్వవిద్యాలయాల్లో అంతర్జాతీయ విద్యార్థుల నమోదు తగ్గుతోంది. దీని కారణంగా భారతదేశ కరెంట్ అకౌంట్ బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం పడుతోంది. విదేశాల్లో చదువుకుంటూ.. అక్కడే పని చేసుకుంటున్న వారు డబ్బును తిరిగి భారతదేశానికి పంపడం లేదు. ఫలితంగా సుమారు రూ.50 వేల కోట్ల కరెంట్ అకౌంట్ లోటును తెచ్చిపెట్టినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు రిజర్వ్ బ్యాంకు చెబుతున్నదాని ప్రకారం గత పదేళ్లలో భారతీయుల విద్యా ప్రయాణానికి సంబంధించిన వ్యయం రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2014–15లో రూ.20,597 కోట్ల నుంచి 2023–24లో రూ.52 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 2025 నాటికి దేశం నుంచి విదేశాలకు వేళ్లే విద్యార్థుల మొత్తం ఖర్చు రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా. మన విద్యార్థులు ఇష్టపడుతున్న దేశాలు యునైటెడ్ స్టేట్స్(అమెరికా), కెనడా, యునైటెడ్ కింగ్డమ్(యూకే), ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అధిక ఫీజులు, అత్యధిక జీవన వ్యయాలున్నా భారతీయ విద్యార్థుల విదేశీ విద్యకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే, దేశానికి వచ్చే విదేశీ విద్యార్థుల్లో ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాలకు చెందినవారే. నేపాల్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులను భారతదేశానికి పంపుతోంది. 2014–15లో 21 శాతం నుంచి 2021–22లో 28శాతానికి పెరిగింది. 2014–15తో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మలేషియా, సూడాన్, నైజీరియా విద్యార్థుల శాతం తగ్గింది. భారత్‌కు ఎక్కువ మంది విద్యార్థులను పంపుతున్న దేశాల వరుసలో ఆఫ్ఘనిస్తాన్ 6.72 శాతంతో రెండో, భూటాన్ 3.33 శాతంతో ఆరో దేశంగా నిలుస్తోంది. 2021–22లో అమెరికా విద్యార్థులు 6.71 శాతంతో మూడో స్థానాన్ని, బంగ్లాదేశ్ 5.55 శాతం, యూఏఈ 4.87 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎన్ని చేసినా ప్రయోజనం స్వల్పమే..అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య క్షీణిస్తున్న క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) 2020ను తెచ్చింది. ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించే లక్ష్యంతో ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అనేక ప్రతిపాదనలను రూపొందించింది. ఈ క్రమంలోనే యూజీసీ సైతం ద్వంద్వ, ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌లను అనుమతించేలా మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. 2018లో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుగా స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా అత్యుత్తమ స్కాలర్షిప్లు, ఫీజు మినహాయింపులను అందించేలా రూపొందించింది. అయితే భాగస్వామ్య దేశాలతో ఒప్పందాల ద్వారా విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలు ప్రారంభించారు. కానీ, తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో విదేశీ విద్యార్థులను దేశానికి ఆకర్షించడంలో ఈ కార్యక్రమం నత్తనడకన సాగడంతో విఫలమైంది. ప్రభుత్వం తీసుకున్న చొరవతో 2014–15 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరాల వరకు విదేశీ విద్యార్థుల నమోదు కేవలం 16.68శాతం మాత్రమే పెరిగిందని ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ డేటా చెబుతోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ఎఫెక్ట్‌తో విదేశీ విద్యార్థుల సంఖ్య 48,035కు, 2021–22లో 46,878కి తగ్గింది. విదేశీ విద్యకు రుణాలు పెరిగాయి..దేశంలో ఉన్నత విద్య కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్లిపోతుండటంతో డెమోగ్రాఫిక్ సమతౌల్యం దెబ్బతింటోంది. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతిలో ఆదాయం పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లు వంటివి లాభాలను సృష్టిస్తున్నాయి. నాన్ బ్యాంక్ ఫైనాన్సియల్ కంపెనీలు సైతం విద్యా రుణాలను గణనీయంగా పెంచాయి. ఫలితంగా విదేశాల్లో ఫీజులు చెల్లించే సామర్థ్యం పెద్ద సమస్య కాకుండాపోయింది. – మహేశ్వర్ పెరి, ఛైర్మన్,కెరీర్స్ 360 సీఈవో దేశంలో అంతర్జాతీయ విద్యార్థుల క్షీణత..భారతీయ విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థుల నమోదులో గణనీయమైన క్షీణతను నమోదు చేస్తున్నాయి. ఆర్బీఐ నివేదిక ప్రకారం భారత్‌లో విద్యా సంబంధిత అంశాల ద్వారా వచ్చే ఆదాయం సగానికి సగం తగ్గింది. 2014–15లో రూ.4,345 కోట్ల నుంచి 2023–24కు రూ.2,068 కోట్లకు పడిపోయింది. అయితే 2022–23తో పోలిస్తే కేవలం విదేశీ మారకపు ఆదాయం స్వల్పంగా పెరిగింది. కోవిడ్ తర్వాత 2021–22లో రూ.912 కోట్ల కనిష్ట స్థాయి నుంచి పుంజుకుంది. అయినప్పటికీ 2014–15తో పోలిస్తే చాలా తక్కువగానే నమోదైంది. -
RBI: బ్యాంకింగ్‌లో కార్పొరేట్లకు నో ఎంట్రీ
ముంబై: బ్యాంకులను ప్రమోట్ చేయడానికి వ్యాపార సంస్థలను అనుమతించే ఆలోచన ఏదీ ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ చేయడం లేదని గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్యాంకుల ప్రమోట్‌కు కార్పొరేట్ సంస్థలను అనుమతించడం వల్ల వడ్డీ రిస్‌్కలు, సంబంధిత లావాదేవీల్లో పారదర్శకత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందన్నారు. భారతదేశానికి ఇప్పుడు కావలసింది బ్యాంకుల సంఖ్య పెరగడం కాదని పేర్కొంటూ. మంచి, పటిష్ట, సుపరిపాలన ఉన్న బ్యాంకులు ఇప్పు డు కీలకమైన అంశమని వివరించారు. సాంకేతికత ద్వారా దేశవ్యాప్తంగా పొదుపులను సమీకరిస్తుందన్నారు.రుణాలకన్నా... డిపాజిట్ల వెనుకడుగు సరికాదు... డిపాజిట్ల పురోగతికన్నా.. రుణ వృద్ధి పెరగడం సరైంది కాదని పేర్కొంటూ ఇది లిక్విడిటీ సమస్యలకు దారితీస్తుందన్నారు. గృహ పొదుపులు గతం తరహాలోకి కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి ఇన్‌స్ట్రమెంట్ల వైపు మళ్లడం బ్యాంకింగ్ డిపాజిట్లపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడ్డారు. డిపాజిట్లు–రుణాల మధ్య సమతౌల్యత ఉండాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇక దేశంలో ఆర్థికాభివృద్ధి ఊపందుకుందని పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం ఆందోళనలు ఇంకా పొంచి ఉన్నాయని స్పష్టం చేశారు. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి సారిస్తుందని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం సుస్థిర ప్రాతిపదికన 4 శాతం వైపునకు దిగివస్తేనే రుణ రేటు వ్యవస్థ మార్పు గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేశారు.స్పెక్యులేషన్‌లోకి గృహ పొదుపులుఎఫ్అండ్వో ట్రేడ్ చాలా పెద్ద అంశం సెబీ చైర్పర్సన్ మాధవిపురిఇంటి పొదుపులు స్పెక్యులేషన్ వ్యాపారంలోకి వెళుతున్నాయని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థపై విస్తృత ప్రభావం చూపుతున్నందున ఎఫ్‌అండ్‌వోలో స్పెక్యులేటివ్ ట్రేడ్లకు వ్యతిరేకంగా ఇన్వెస్టర్లకు గట్టి హెచ్చరిక పంపుతున్నట్టు చెప్పారు. మూలధన ఆస్తి కల్పనకు ఉపయోగపడుతుందన్న అంచనాలను తుంగలో తొక్కుతున్నారని.. యువత పెద్ద మొత్తంలో ఈ ట్రేడ్లపై నష్టపోతున్నట్టు తెలిపారు. ‘‘ఓ చిన్న అంశం కాస్తా.. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ దిశగా ఇన్వెస్టర్లను ఒత్తిడి చేయాల్సి వస్తోంది’’అని సెబీ చైర్పర్సన్ చెప్పారు. ప్రతి 10 మంది ఇన్వెస్టర్లలో తొమ్మిది మంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) విభాగంలో నష్టపోతున్నట్టు సెబీ నిర్వహించిన సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. ట్రేడింగ్ పరిమాణం పెద్ద ఎత్తున పెరగడంతో, ప్రతి ఒక్కరినీ ఈ దిశగా అప్రమ్తతం చేయడం నియంత్రణ సంస్థ బాధ్యతగా ఆమె పేర్కొన్నారు. ఫిన్ఫ్లూయెన్సర్లు (ఆర్థిక అంశాలు, పెట్టుబడులను ప్రభావితం చేసేవారు) పెట్టుబడుల సలహాదారులుగా సెబీ వద్ద నమోదు చేసుకుని, నియంత్రణల లోపాలను వినియోగించుకుంటున్నారని, దీనిపై త్వరలోనే చర్చా పత్రాన్ని విడుదుల చేస్తామన్నారు. -
కోటక్ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్..
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు రిజర్వ్ బ్యాంక్ షాకిచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మాధ్యమాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని ఆదేశించింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయి. బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్లో ‘తీవ్రమైన లోపాలు’ బయటపడటం ఇందుకు కారణమని ఆర్బీఐ పేర్కొంది.అయితే, క్రెడిట్ కార్డు కస్టమర్లు సహా ప్రస్తుతమున్న ఖాతాదారులందరికీ బ్యాంకు యథాప్రకారం సేవలు అందించడాన్ని కొనసాగించవచ్చని తెలిపింది. మే 4న కోటక్ మహీంద్రా బ్యాంకు ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకు ఎక్స్టర్నల్ ఆడిట్‌ను నిర్వహించి, అందులో బయటపడే సమస్యలను, తాము గు ర్తించిన లోపాలను పరిష్కరిస్తే ఆంక్షలను సమీక్షిస్తామని ఆర్బీఐ పేర్కొంది. పదే పదే సాంకేతిక అంతరాయాలు తలెత్తుతున్న కారణంగా 2020 డిసెంబర్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై కూడా ఆర్బీఐ దాదాపు ఇదే తరహా ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఐటీ సంబంధ తనిఖీలో కీలకాంశాలు2022, 2023 సంవత్సరాల్లో నిర్వహించిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధ తనిఖీల్లో తీవ్ర ఆందోళనకరమైన అంశాలను గుర్తించినట్లు రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘ఐటీ ఇన్వెంటరీ నిర్వహణ, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండార్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ వంటి అంశాల్లో తీవ్రమైన లోపాలు, నిబంధనలను పాటించకపోవడం మొదలైన వాటిని గుర్తించాం‘ అని వివరించింది. వాటిని సమగ్రంగా, సకాలంలో పరిష్కరించడంలో బ్యాంకు నిరంతరం వైఫల్యం చెందుతున్న కారణంగా తాజా చర్యలు తీసుకోవాల్సి వచి్చందని ఆర్బీఐ తెలిపింది. పటిష్టమైన ఐటీ మౌలిక సదుపాయాలు, రిస్క్ మేనేజ్మెంట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కోర్ బ్యాంకింగ్ సిస్టం (సీబీఎస్), ఆన్లైన్ .. డిజిటల్ బ్యాంకింగ్ మాధ్యమాలు గత రెండేళ్లుగా తరచూ మొరాయిస్తూ, కస్టమర్లను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తున్నాయని వివరించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకుకు సంబంధించిన నిర్దిష్ట వ్యాపార విభాగాలపై ఆంక్షలు విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. -
Duvvuri Subbarao: వృద్ధి, వడ్డీ రేటు మార్పులకు ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు. సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్బీఐ చీర్లీడరుగా ఉండాలన్న డిమాండ్‌కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు. చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ అంబుడ్స్‌మన్ స్కీములకు ఫిర్యాదుల వెల్లువ
ముంబై: రిజర్వ్ బ్యాంక్ అంబుడ్స్‌మన్ స్కీముల కింద వివిధ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. 2022–23లో ఇవి 68 శాతం పెరిగి 7.03 లక్షలుగా నమోదయ్యాయి. మొబైల్/ఎల్రక్టానిక్ బ్యాంకింగ్, రుణాలు, ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, పింఛను చెల్లింపులు, రెమిటెన్సులు మొదలైన వాటికి సంబంధించిన ఫిర్యాదులు వీటిలో ఉన్నాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకోవడం, ఆర్బీఐ–సమీకృత అంబుడ్స్‌మన్ స్కీము (ఆర్బీ–ఐవోఎస్) కింద దాఖలు చేసే ప్రక్రియను సరళతరం చేయడం తదితర అంశాలు ఫిర్యాదుల నమోదుకు దోహదపడ్డాయని అంబుడ్స్‌మన్ స్కీము వార్షిక నివేదిక పేర్కొంది. అత్యధికంగా 83.78 శాతం ఫిర్యాదులు (1,93,635) బ్యాంకులపై వచ్చాయి. అంబుడ్స్‌మన్ ఆఫీసులు 2,34,690 ఫిర్యాదులను హ్యాండిల్ చేశాయి. సమస్య పరిష్కారానికి పట్టే సమయం సగటున 33 రోజులకు మెరుగుపడింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇది 44 రోజులుగా ఉంది. -
ఏఐఎఫ్‌ల పెట్టుబడుల రికవరీపై పిరమల్ ధీమా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలతో ప్రభావితమయ్యే ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల (ఏఐఎఫ్) నుంచి పెట్టుబడులను సజావుగా రాబట్టుకోగలమని పిరమల్ ఎంటర్ప్రైజెస్ (పీఈఎల్) ధీమా వ్యక్తం చేసింది. ఈ ఏడాది నవంబర్ 30 నాటికి ఏఐఎఫ్ యూనిట్లలో పీఈఎల్, పిరమల్ క్యాపిటల్ అండ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు రూ. 3,817 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో రుణగ్రస్త కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయని మొత్తం .. రూ. 653 కోట్లుగా ఉంది. మిగతా రూ. 3,164 కోట్లలో రూ. 1,737 కోట్ల నిధులను గత 12 నెలల వ్యవధిలో మూడు రుణగ్రస్త కంపెనీల్లో ఏఐఎఫ్‌లు ఇన్వెస్ట్ చేశాయి. అయితే, నిబంధనలకు అనుగుణంగా మొత్తం రూ. 3,164 కోట్లకు పీఈఎల్ ప్రొవిజనింగ్ చేయొచ్చని, ఫలితంగా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల మేర నష్టాలను చూపించే అవకాశం ఉందని బ్రోకరేజి సంస్థ ఎమ్కే ఒక నివేదికలో తెలిపింది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు తమ దగ్గర రుణాలు తీసుకున్న సంస్థల్లో ఏఐఎఫ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయరాదని, ఒకవేళ చేసి ఉంటే నెలరోజుల్లోగా వాటిని ఉపసంహరించుకోవాలని లేదా ఆ మొత్తానికి ప్రొవిజనింగ్ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఇటీవల సూచించిన సంగతి తెలిసిందే. -
దుబారా తగ్గాలి..పన్నేతర ఆదాయం పెంచాలి
సాక్షి, హైదరాబాద్: ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో క్రమశిక్షణ, నిశిత పరిశీలన, వ్యూహాత్మక వినియోగం కీలకమని.. ఆర్థిక నిర్వహణను బట్టే ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు సాధ్యమవుతాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం కూడా ఆ దిశలో పనిచేయాలని.. దుబారా తగ్గించుకుని, ప్రజలపై పన్ను భారం మోపకుండా ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యూహాన్ని రూపొందించుకోవాలని సలహా ఇచ్చారు. రఘురాం రాజన్ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వచ్చారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో.. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థికాభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, దేశంలో ఇతర రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు రఘురాం రాజన్ పలు సూచనలు చేశారు. ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లండి రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ ఆర్థిక పరిస్థితిని బట్టి ముందుకెళ్లాలని, ఆర్థిక మూలాలను బలోపేతం చేసుకోవడం దృష్టి పెట్టాలని రఘురాం రాజన్ సూచించినట్టు తెలిసింది. మైనింగ్‌తోపాటు నాలా చార్జీల్లాంటి పన్నేతర ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పినట్టు సమాచారం. కొత్త వాహనాలు కొనడం, కొత్త నిర్మాణాలు చేపట్టడం వంటి దుబారా ఖర్చుల జోలికి వెళ్లవద్దని.. సంక్షేమ పథకాల అమలు కారణంగా అభివృద్ధిపై తిరోగమన ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. పథకాల కోసం అవసరమయ్యే నిధులను సమకూర్చుకోవడంలో క్రమశిక్షణను కచ్చితంగా పాటించాలని పేర్కొన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా రఘురాం రాజన్ తన అనుభవాలను సీఎం బృందంతో పంచుకున్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. -
అలాంటి సంస్థలతో తస్మాత్ జాగ్రత్త: ఆర్బీఐ
న్యూఢిల్లీ: ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ‘రుణమాఫీ’ ఆఫర్లకు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనల బారిన పడవద్దని రిజర్వ్ బ్యాంక్ ప్రజలను హెచ్చరించింది. రుణమాఫీని ఆఫర్ చేస్తూ రుణగ్రహీతలను ప్రలోభపెట్టే కొన్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలను గమనించినట్లు బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని సంస్థలు, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇలాంటి పలు ప్రచారాలు చురుకుగా చేస్తున్నట్లు కనిపిస్తోందని పేర్కొంది. అటువంటి సంస్థలు ఎలాంటి అధికారం లేకుండా ‘రుణ మాఫీ సర్టిఫికెట్లు’ జారీ చేయడానికి సేవా/చట్టపరమైన రుసుమును వసూలు చేస్తున్నాయని కూడా వార్తలు వస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కొంతమంది వ్యక్తులు రుణ గ్రహీతలను తప్పుదారిపట్టించే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. అలాంటి సంస్థలతో లావాదేవీలు జరిపితే ఆర్థిక నష్టాలు తప్పవని వినియోగదారులకు హెచ్చరించింది. ‘‘బ్యాంకులతోసహా ఆర్థిక సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని అటువంటి సంస్థలు లేదా వ్యక్తులు తప్పుగా సూచిస్తున్నారు. తద్వారా బ్యాంకింగ్ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని ముఖ్యంగా డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తాయి‘ అని ఆర్బీఐ ప్రకటన వివరించింది. ఇటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మి నష్టపోవద్దని, ఈ తరహా తప్పుడు ప్రచారం తమ దృష్టికి వస్తే, విచారణా సంస్థల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది. -
ఎన్బీఎఫ్సీ వృద్ధి అంతంతే..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఇటీవల అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం చేయడంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ)పై ప్రభావం చూపనుంది. కఠిన నిబంధనల వల్ల రుణాల మంజూరు నెమ్మదించి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్బీఎఫ్సీ రంగ వృద్ధి ఒక మోస్తరుగానే ఉండనుంది. 16–18 శాతం కన్నా తక్కువే ఉండొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో ఉత్పత్తుల్లో వైవిధ్యం, రుణాల ప్రొఫైల్ వంటివి వృద్ధి వ్యూహాల్లో కీలకంగా ఉండగలవని ఒక ప్రకటనలో తెలిపింది. పటిష్టమైన స్థూల, సూక్ష్మ ఆర్థిక పరిస్థితులు .. రిటైల్ రుణాల వృద్ధికి ఊతమివ్వగలవని వివరించింది. రిటైల్‌గా గృహాలు, వాహనాలు, కన్జూమర్ డ్యూరబుల్స్ మొదలైన వాటిపై చేసే వ్యయాలు పటిష్టంగా ఉండటంతో ప్రైవేట్ వినియోగమనేది దీర్ఘకాలిక సగటుకు పైన కొనసాగుతోందని క్రిసిల్ రేటింగ్స్ ఎండీ గుర్ప్రీత్ చత్వాల్ తెలిపారు. అసురక్షిత రిటైల్ రుణాల నిబంధనలు కఠినతరం అయినప్పటికీ హామీతో కూడుకున్న రుణాలపై ప్రభావం ఉండబోదని పేర్కొన్నారు. ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై (హెచ్ఎఫ్సీ) ప్రభావం ఉండదని తెలిపారు. పటిష్టమైన అమ్మకాల దన్నుతో వాహన రుణాల విభాగం ఈ ఆర్థిక సంవత్సరం 18–19 శాతం వృద్ధి చెందగలదని వివరించారు. వచ్చే ఏడాది గృహ రుణాలు 14 శాతం అప్.. ఎన్‌బీఎఫ్‌సీల నిర్వహణలో ఉన్న ఆస్తుల్లో (ఏయూఎం) ప్రస్తుతం గృహ, వాహన రుణాలకు చెరో 25–27 శాతం వాటా ఉన్నట్లు క్రిసిల్ తెలిపింది. ఈ రెండూ స్థిరంగా వృద్ధి చెందగలవని వివరించింది. అఫోర్డబుల్ గృహ రుణాలపై (రూ. 25 లక్షల కన్నా లోపు) హెచ్ఎఫ్సీలు ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం హోమ్ లోన్ సెగ్మెంట్ 12–14 శాతం వృద్ధి చెందగలదని క్రిసిల్ తెలిపింది. వాహన రుణాల విభాగం 2024–25 మధ్యకాలంలో స్థిరంగా 17–18 శాతం వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. ఎన్బీఎఫ్సీ ఏయూఎంలో అసురక్షిత రుణాల సెగ్మెంట్ మూడో అతి పెద్ద విభాగంగా ఉంది. మరోవైపు, బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల నిధుల సమీకరణ వ్యయాలు 25–50 బేసిస్ పాయింట్ల మేర పెరగవచ్చని క్రిసిల్ అంచనా వేసింది. అయితే, అవి ఎంత మేర బ్యాంకు రుణాలపై ఆధారపడి ఉన్నాయనే అంశంపై వాటి ఆర్థిక పనితీరు మీద ప్రభావం ఉంటుందని వివరించింది. -
‘స్టార్’ గుర్తున్న కరెన్సీ మంచిదే
అమలాపురం టౌన్: కొన్ని కరెన్సీ నోట్లపై నోటు క్రమ సంఖ్యతో పాటు స్టార్ గుర్తు ఉంటుంది. కొన్ని నోట్లపై మాత్రమే ఈ స్టార్ గుర్తు ఎందుకు ఉంటుందనే అంశంపై ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. ఎందుకంటే ఇటీవల కాలంలో స్టార్ ఉన్న నోట్లు నకిలీవి అంటూ కొంత మంది సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి స్టార్ గుర్తుతో ఉన్న నోట్లు అనేకం సేకరించిన అమలాపురానికి చెందిన కరెన్సీ నోట్ల సేకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ నోట్లపై ఈ స్టార్‌ను రిజర్వు బ్యాంకు ఎందుకు ముద్రిస్తుందో, అందుకు అనుసరించే సాంకేతిక, శాసీ్త్రయ అంశాలేమిటో వివరించారు. స్టార్ నోట్లు ఇలా.. దేశంలోని ప్రతి కరెన్సీ నోటుపై మొదటి రెండు అంకెల తర్వాత ఒక ఆంగ్ల అక్షరం (ఒక రూపాయి నుంచి రూ.20 వరకూ), లేదా ఒక అంకె తర్వాత రెండు ఆంగ్ల అక్షరాలు (రూ.50 విలువ పైబడిన నోట్లన్నిటి మీద) ఉంటాయి. దీనిని ప్రిఫిక్స్ అంటారు. ఇలా ముద్రించిన రెండంకెలు, ఆంగ్ల అక్షరం తర్వాత కొంత ఖాళీ ఉండి.. తర్వాత ఆరంకెల క్రమ సంఖ్య ఉంటుంది. కొన్ని నోట్ల మీద ఇలా ఖాళీ ఉన్న భాగంలో స్టార్ గుర్తు ఉంటుంది. వీటిని స్టార్ నోట్లు లేదా రీ ప్లేస్మెంట్ నోట్లు అని అంటారు. పాడైన నోట్ల పైనే స్టార్లు సాధారణంగా చిరిగిపోయిన లేదా బాగా పాడైపోయిన నోట్లను బ్యాంకుల్లో జమ చేస్తాం. అవన్నీ రిజర్వు బ్యాంక్‌కు చేరతాయి. వాటిని ఒకచోట భద్రపరచి మళ్లీ అవే నంబర్లతో నోట్లు విడుదల చేస్తారు. పాత నోట్ల మీద అప్పటి గవర్నర్ సంతకం ఉంటుంది కాబట్టి వాటి మీద కొత్త గవర్నర్ సంతకం ముద్రించేందుకు వీలుగా ఈ స్టార్‌ను ముద్రిస్తారు. పాత లేదా పాడైపోయిన నోట్ల రీ ప్లేస్మెంట్ కోసం ఓ గుర్తుగా స్టార్‌ను ముద్రిస్తారు. ఇంత వరకూ ఎన్ని స్టార్ నోట్లు ముద్రించామన్నది రిజర్వు బ్యాంక్ వద్ద ఉంటుంది. భారతీయ రిజర్వు బ్యాంక్ 2006 ఆగస్టు 31న ఈ స్టార్ నోట్ల విడుదల గురించి ప్రత్యేక ప్రకటన చేసింది. ఈ స్టార్ నోట్లు కలిగి ఉన్న బండిల్స్ మీద కూడా ప్రత్యేక గుర్తు ముద్రించి ఉంటుందని కృష్ణకామేశ్వర్ తెలిపారు. ఈ స్టార్ నోట్లు కూడా సాధారణ నోట్ల మాదిరిగానే చలామణీ అవుతాయని స్పష్టం చేశారు. -
చెలామణిలో రూ.10 నాణేలు
కర్ణాటక: రిజర్వు బ్యాంకు ముద్రించిన రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని, ప్రజలు వాటిని ఎలాంటి సంకోచం లేకుండా ఉపయోగించవచ్చని జిల్లాధికారి అక్రం పాషా తెలిపారు. శనివారం నగరంలోని కలెక్టరేట్ సభాంగణంలో జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడారు. పలు చోట్ల రూ.10 నాణేన్ని ఆర్బీఐ నిషేధించిందని తప్పుడు వదంతులు సృష్టించారన్నారు. దీనిపై ప్రజల్లో గందరగోళం ఏర్పడిందన్నారు. అయితే ఈ విషయంలో ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. రూ.10 నాణేన్ని ఆర్బీఐ నిషేధించలేదన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురికావద్దన్నారు. బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయవచ్చన్నారు. రూ.10 నాణేలను స్వీకరించకపోతే 2011 సెక్షన్ 6(1) ప్రకారం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. రూ.10 నాణేలను ఉపయోగించడం వల్ల చిల్లర సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. -
ఆర్బీఐ షాక్.. త్వరలో వడ్డీరేట్లను పెంచనుందా?
పెరిగిపోతున్న రీటైల్ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3,5,6 తేదీలలో ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలకమైన బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్లు పెంచేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని విడుదల చేయడానికి ముందు వివిధ జాతీయ,అంతర్జాతీయ అంశాలను పరిగణనలోకి తీసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) ఏప్రిల్ 3, 5, 6 తేదీలలో మూడు రోజుల పాటు సమావేశం కానుంది. కాగా, ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో మే నుండి ఇప్పటికే రెపో రేటును మొత్తం 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. -
International Womens Day: అవగాహన ఉన్నా వినియోగం కొంతే..
ముంబై: ఆర్థిక సేవలపై మహిళలకు అవగాహన పెరుగుతున్నప్పటికీ వారు వాటిని వినియోగించుకోవడం తక్కువగానే ఉంటోంది. బీమా తదితర సాధనాల గురించి మూడో వంతు మందికి తెలిసినా కూడా డిజిటల్ విధానంలో కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్క శాతం కూడా ఉండటం లేదు. రిజర్వ్ బ్యాంక్‌లో భాగమైన రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్, డిజిటల్ చెల్లింపుల నెట్వర్క్ పేనియర్‌బై నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం మహిళల్లో .. ముఖ్యంగా 18–35 ఏళ్ల వారిలో బీమాపై అవగాహన గతేడాది 29 శాతం మేర పెరిగింది. కానీ పాలసీల వినియోగం 1 శాతానికి లోపే ఉంది. మహిళలు ఎక్కువగా జీవిత బీమా, ఆరోగ్య బీమా వైపు మొగ్గు చూపుతున్నారు. 5,000 రిటైల్ స్టోర్స్‌లో ఆర్థిక సేవలను వినియోగించుకున్న ఈ వయస్సు గ్రూప్ మహిళలపై నిర్వహించిన సర్వే ద్వారా అధ్యయన నివేదిక రూపొందింది. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు.. ► రిటైల్ స్టోర్స్‌లో మహిళలు ఎక్కువగా నగదు విత్‌డ్రాయల్, మొబైల్ రీచార్జీలు, బిల్లుల చెల్లింపుల సర్వీసులను వినియోగించుకుంటున్నారు. ఇతర త్రా పాన్ కార్డు దరఖాస్తులు, వినోదం, ప్రయాణాలు, ఈ–కామర్స్ మొదలైన వాటి సంబంధిత లావాదేవీలూ చేస్తున్నారు. ► తమ పిల్లలకు మంచి చదువు ఇవ్వడానికి అత్యధిక శాతం మహిళలు ప్రాధాన్యమిస్తున్నారు. ఇందుకు పొదుపే లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు 68% మంది తెలిపారు. ఇక అత్యవసర వైద్యం, ఎలక్ట్రానిక్ గృహోపకరణాల కొనుగోలు కోసం పొదుపు చేసుకోవడమూ యవారికి ప్రాధాన్యతాంశాలు. ► నగదు లావాదేవీలను తగ్గించడానికి ప్రభుత్వం, ఆర్బీఐ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా చాలా మంది మహిళలు నగదు రూపంలో లావాదేవీలు జరపడానికే ప్రాధాన్యమిస్తున్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 48 శాతం మంది నగదువైపే మొగ్గు చూపారు. నగదు విత్‌డ్రాయల్ సర్వీసుల కోసమే రిటైల్ స్టోర్‌ను సందర్శిస్తామంటూ 78 శాతం మంది తెలిపారు. ► అయితే, అదే సమయంలో డిజిటల్ చెల్లింపుల కోసం యూపీఐ వినియోగమూ పెరుగుతోంది. 5–20% మంది మహిళలు దీనిని ఎంచుకుంటున్నారు. క్రెడిట్ కార్డుల వినియోగం దాదాపు శూన్యమే. ► డిజిటల్ మాధ్యమం వినియోగం.. 18–40 ఏళ్ల గ్రూప్ మహిళల్లో ఎక్కువగా ఉంటోంది. వారిలో 60%మందికి పైగా మహిళలకు స్మార్ట్ఫోన్లు, వాటి ద్వారా డిజిటల్ కంటెంట్ అందుబాటులో ఉంటోంది. -
గోల్డ్ బాండ్ గ్రాము @ రూ. 5,611
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ పథకం 2022–23.. తదుపరి దశలో భాగంగా రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గ్రాముకి రూ. 5,611 ధరను నిర్ణయించింది. ఐదు రోజులపాటు కొనసాగనున్న ఇష్యూ సోమవారం(6న) ప్రారంభంకానుంది. ఈ నెల 10న ముగియనున్న ఇష్యూలో భాగంగా గ్రాముకి ముందస్తు(నామినల్) ధర రూ. 5,611ను ఆర్బీఐ నిర్ణయించింది. కాగా.. ఆర్బీఐతో సంప్రదింపుల తదుపరి కేంద్ర ప్రభుత్వం గ్రాముకి నామినల్ విలువకు రూ. 50 డిస్కౌంట్‌ను ప్రకటించింది. అయితే ఇందుకు ఇన్వెస్టర్లు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని డిజిటల్ విధానంలో చెల్లింపులు చేపట్టవలసి ఉంటుంది.వెరసి గ్రాము గోల్డ్ బాండ్ ధర రూ. 5,561కు లభించనుంది. ప్రభుత్వం తరఫున ఆర్బీఐ సావరిన్ గోల్డ్ బాండ్లను జారీ చేసే సంగతి తెలిసిందే. వీటిని స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్(ఎస్‌హెచ్‌సీఐఎల్), కొన్ని పోస్టాఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా విక్రయిస్తారు. వీటి కాలపరిమితి ఎనిమిదేళ్లుకాగా.. ఐదేళ్ల తదుపరి రిడెంప్షన్‌ను అనుమతిస్తారు. ఫిజికల్ గోల్డ్‌కు డిమాండును తగ్గించే బాటలో 2015 నవంబర్‌లో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దేశీ పొదుపు సొమ్మును ఫిజికల్ గోల్డ్‌కు కాకుండా సావరిన్ గోల్డ్ కొనుగోలువైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. పూర్తి స్వచ్చత(999)గల బంగారం సగటు ధరను బాండ్లకు నిర్ణయిస్తారు. ఒక గ్రామును ఒక యూనిట్‌గా కేటాయిస్తారు. వ్యక్తిగత ఇన్వెస్టర్లను కనిష్టంగా 1 గ్రాము, గరిష్టంగా 4 కేజీలవరకూ కొనుగోలుకి అనుమతిస్తారు. హెచ్‌యూఎఫ్‌లకు 4 కేజీలు, ట్రస్ట్‌లకు 20 కేజీల వరకూ యూనిట్ల కొనుగోలుకి వీలుంటుంది. -
ఉద్యోగులకు చెల్లింపుల్లో రెండంచెల భద్రత
సాక్షి, అమరావతి: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులకు ఆన్లైన్ చెల్లింపుల్లో రెండంచెల భద్రతా వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్/హెర్బ్ అప్లికేషన్స్ ద్వారా చేసే లావాదేవీలకు రెండంచెల భద్రతను తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సేవలు పూర్తి సురక్షితంగా అందించేలా సీఎఫ్ఎంఎస్ ఐడీ ఉన్న ప్రతి ఉద్యోగి, పెన్షనర్లు, వ్యక్తులు తమ సీఎఫ్ఎంఎస్ ఐడీని ఆధార్, మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎఫ్ఎంఎస్ /హెర్బ్ అప్లికేషన్స్‌లో సురక్షితంగా లాగిన్ అవడానికి ఆధార్‌తో అనుసంధానం అయిన మొబైల్ ఫోన్‌కు వచ్చే వన్ టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) నమోదును తప్పనిసరి చేసింది. దీనికి అనుగుణంగా ప్రతి ఉద్యోగి ఈకేవైసీ, ఆధార్, మొబైల్ నంబర్ల పరిశీలనను జనవరి 20 నాటికి పూర్తి చేయాలని సంబంధిత శాఖల డీటీఏలు, పీఏవో, ఏపీసీఎఫ్ఎస్ఎస్ సీఈవో చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
గుట్టుచప్పుడు కాకుండా రూ. కోట్ల నగదు, బంగారం తరలింపు
జగ్గంపేట: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలోకి తొక్కి, పన్నులను ఎగ్గొడుతూ రూ.కోట్ల నగదు, బంగారాన్ని ప్రైవేటు బస్సులలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఘటనలపై కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగు చూసిన సంగతి విదితమే. దీనిపై కస్టమ్స్, జీఎస్టీ, ఐటీ అధికారులు జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావును శనివారం కలిసి వివరాలు సేకరించారు. అనంతరం 10 కేజీల బంగారాన్ని విజయవాడ నుంచి విశాఖ తరలిస్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావును, టెక్కలి నుంచి విజయవాడ వైపు రూ.5.65 కోట్ల నగదు తరలింపులో పట్టుబడిన బస్సు డ్రైవర్ సుదర్శనరావును విచారించారు. విజయవాడలో రామవరప్పాడు వద్ద బంగారం ఎవరిచ్చారు, విశాఖలో ఎవరికి అందజేయమన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా బంగారం, నగదు అక్రమ రవాణా పద్మావతి ట్రావెల్స్‌లోనే జరుగుతోందా, ఇతర ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా జరుగుతోందా అనే అంశంపైనా దృష్టి సారించారు. కాగా, కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద పట్టుబడిన రూ.5.65 కోట్ల నగదు, సుమారు 10 కేజీల బంగారాన్ని రాజమహేంద్రవరంలోని ట్రెజరీలో జమ చేసినట్లు సీఐ చెప్పారు. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
ఫీచర్ ఫోన్లలో యూపీఐ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫీచర్ ఫోన్లలోనూ ఏకీకృత చెల్లింపుల విధానాన్ని (యూపీఐ) అందుబాటులోకి తెస్తూ కొత్త సర్వీసును రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ఆవిష్కరించారు. దీనితో దాదాపు 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సాధారణ మొబైల్ ఫోన్ల ద్వారా కూడా డిజిటల్ ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు వీలు లభిస్తుంది. బహుళ ప్రయోజనకరమైన యూపీఐ విధానం 2016లోనే ప్రవేశపెట్టినా.. ఇప్పటివరకూ ఇది స్మార్ట్ఫోన్లకు మాత్రమే పరిమితమైందని దాస్ తెలిపారు. అట్టడుగు వర్గాలకు, గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి రాలేదని ఆయన పేర్కొన్నారు. ‘ఇప్పటివరకూ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు దూరంగా ఉన్న వర్గాలకు యూపీఐ 123పే ప్రయోజనకరంగా ఉంటుంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు ఇది తోడ్పడుతుంది‘ అని ఫీచర్ ఫోన్లకు యూపీఐ సర్వీసుల ఆవిష్కరణ కార్యక్రమంలో దాస్ చెప్పారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), బ్యాంకుల అధికారులు ఇందులో పాల్గొన్నారు. 2016లోనే ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం కూడా యూఎస్ఎస్డీ కోడ్ ద్వారా పనిచేసే యూపీఐ సర్వీసును అందుబాటులోకి తెచ్చినప్పటికీ అది కష్టతరంగా ఉండటంతో ప్రాచుర్యం పొందలేదు. దీనితో ఎన్పీసీఐ దాన్ని సరికొత్తగా తీర్చిదిద్దింది. ప్రారంభించడం నుంచి ముగించే వరకూ లావాదేవీ ప్రక్రియ మూడు అంచెల్లో జరుగుతుంది కాబట్టి యూపీఐ 123పే అని బ్రాండ్ పేరు పెట్టినట్లు దాస్ తెలిపారు. యూపీఐ లావాదేవీలు వేగంగా వృద్ధి చెందుతున్నాయని, గత ఆర్థిక సంవత్సరంలో వీటి పరిమాణం రూ. 41 లక్షల కోట్లుగా ఉండగా ఈసారి ఇప్పటిదాకా రూ. 76 లక్షల కోట్ల స్థాయికి చేరాయని చెప్పారు. ఫిబ్రవరిలోనే రూ. 8.26 లక్షల కోట్ల విలువ చేసే 453 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ‘యూపీఐ ద్వారా లావాదేవీల పరిమాణం రూ. 100 లక్షల కోట్లకు చేరే రోజు ఎంతో దూరంలో లేదు‘ అని దాస్ చెప్పారు. నాలుగు ప్రత్యామ్నాయాలు.. యూపీఐ కింద.. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ (ఐవీఆర్) నంబర్, ఫీచర్ ఫోన్లలో యాప్‌లు, మిస్డ్ కాల్, శబ్ద ఆధారిత చెల్లింపుల విధానాల ద్వారా ఫీచర్ ఫోన్ యూజర్లు పలు లావాదేవీలు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది. కుటుంబ సభ్యులు .. స్నేహితులకు చెల్లింపులు జరిపేందుకు, కరెంటు..నీటి బిల్లులు కట్టేందుకు, వాహనాల కోసం ఫాస్ట్ ట్యాగ్ల రీచార్జి, మొబైల్ బిల్లుల చెల్లింపులు, ఖాతాల్లో బ్యాలెన్స్‌లను తెలుసుకోవడం మొదలైన అవసరాలకు యూపీఐ 123పే ఉపయోగపడుతుంది. మరోవైపు, డిజిటల్ చెల్లింపులకు సంబంధించి ’డిజిసాథీ’ పేరిట ఎన్పీసీఐ ఏర్పాటు చేసిన 24 గీ7 హెల్ప్‌లైన్‌ను కూడా ఆర్బీఐ గవర్నర్ దాస్ ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులపై తమ సందేహాల నివృత్తి, ఫిర్యాదుల పరిష్కారం కోసం యూజర్లు.. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డిజిసాథీ.కామ్ని సందర్శించవచ్చు లేదా తమ ఫోన్ల నుంచి 14431, 1800 891 3333కి ఫోన్ చేయవచ్చు. -
ఏఆర్‌సీల క్రమబద్ధీకరణకు ఆర్బీఐ కమిటీ సిఫార్సులు
ముంబై: అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీల (ఏఆర్సీ) పనితీరును క్రమబద్ధీకరించే దిశగా రిజర్వ్ బ్యాంక్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. మొండి అసెట్స్‌ను విక్రయించేందుకు ఆన్లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయడం, దివాలా కోడ్ ప్రక్రియలో పరిష్కార నిపుణులుగా వ్యవహరించేందుకు ఏఆర్‌సీలను కూడా అనుమతించడం తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ. 500 కోట్లు పైబడిన ఖాతాల విషయంలో వాటిని విక్రయిస్తే వచ్చే విలువ, సముచిత మార్కెట్ ధరను బ్యాంకులు ఆమోదించిన ఇద్దరు వేల్యుయర్లతో లెక్క గట్టించాలని కమిటీ సూచించింది. రూ. 100 కోట్లు –500 కోట్ల మధ్య అకౌంట్లకు ఒక్క వేల్యుయర్‌ను నియమించవచ్చని పేర్కొంది. రుణాన్ని రైటాఫ్ చేయగలిగే అధికారాలు ఉన్న అత్యున్నత స్థాయి కమిటికే.. రిజర్వ్ ధరపై తుది నిర్ణయాధికారం ఉండాలని తెలిపింది. సంబంధిత వర్గాలు డిసెంబర్ 15లోగా ఆర్బీఐకి తమ అభిప్రాయాలు పంపాల్సి ఉంటుంది. ఇటు బాకీల రికవరీ, అటు వ్యాపారాలను పునరుద్ధరణ అంశాల్లో ఏఆర్‌సీల పనితీరు అంత ఆశావహంగా లేకపోతున్న నేపథ్యంలో వాటి పనితీరును మెరుగుపర్చేందుకు తీసుకోతగిన చర్యలపై ఆర్బీఐ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుదర్శన్ సేన్ సారథ్యంలో కమిటీ ఏర్పడింది. -
ఎస్పీఎఫ్... డీజీపీ పరిధిలోకి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: హోంశాఖ పరిధిలో పనిచేస్తున్నా ఆ విభాగం పోలీస్ శాఖకు దూరంగా ఉంటుంది. వాళ్లూ ఆయుధాలతో గస్తీ కాస్తున్నా రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలోకి రారు. అంతే కాదు... వాళ్లకు జోన్ల నియామకాలు, జిల్లాలవారీ బదిలీలు ఉండవు. కుటుంబాలకు దూరంగా రాష్ట్ర రాజధానితో పాటు దేవాలయాలు, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, రిజర్వ్ బ్యాంక్ తదితర కీలక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలకు ఆయుధాలతో భద్రత కల్పిస్తారు. అయితే ఇప్పుడు ఆ విభాగాన్ని డీజీపీ పరిధిలోకి తేవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్.. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగం పోలీస్ శాఖకు సంబంధం లేకుండా ఓ అదనపు డీజీపీ నేతృత్వంలో కార్యాలయాల భద్రతను పర్యవేక్షిస్తుంది. సుమారు 2 వేల మంది సిబ్బంది ఉన్న ఈ విభాగంలో నియామకాలు పోలీస్ రిక్రూట్మెంట్ నుంచే జరిగినా అవి జిల్లా, రేంజ్‌లు కాకుండా స్టేట్ కేడర్ (రాష్ట్ర స్థాయి) పోస్టుగా పరిగణనలోకి వస్తుంది. దీంతో ఏ జిల్లా నుంచి సెలక్ట్ అయినా రాష్ట్ర స్థాయిలో ఎక్కడకు పోస్టింగ్ వేస్తే అక్కడికి వెళ్లాల్సిందే. డీజీపీ పరిధిలోకి తీసుకురావాలని... నూతన జిల్లాలు, రేంజ్‌లు, జోన్ల ఏర్పాటు జరిగినా ఈ విభాగానికి అవి వర్తించే అవకాశాలు కనిపించడంలేదు. అయితే సిబ్బంది మాత్రం 2014లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో డీజీపీ పరిధిలోకి తెచ్చేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొత్త జోన్ల నిబంధనలు ఎస్పీఎఫ్లో అమలుకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం (హోంశాఖ) చర్యలు చేపట్టలేదు. కొత్త జోన్ల అమలు వల్ల సిబ్బంది తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది. దానివల్ల మానసిక ఆందోళనలు తొలగడంతోపాటు వారి పిల్లల స్థానికత సమస్య కూడా తీరుతుందని భావించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఇకపై రాష్ట్ర స్థాయి నియామకాలు ఉండవని ఉత్తర్వుల్లో ఉన్నా తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విషయంలో మాత్రం అధికారులు దీనిపై క్లారిటీ ఇవ్వడంలేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే డీజీపీ పరిధిలోకి ఈ విభాగాన్ని తేవడం వల్ల సిబ్బందితోపాటు వారి తల్లిదండ్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందేలా ఆరోగ్య భద్రత, లోన్లు కూడా అందే అవకాశం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ కోటాలో సిబ్బంది పిల్లలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇతర శాఖల్లో డెప్యుటేషన్‌పై పనిచేసే సౌలభ్యం దొరుకుతుంది. జోన్ల ప్రకారం కేడర్ విభజన జరిగితే సిబ్బంది పిల్లలు వారి సొంత స్థానికతను పొందిన వారవుతారని ఎస్పీఎఫ్ సిబ్బంది వేడుకుంటున్నారు. మెడపై కత్తిలా కేంద్ర బలగాల డిప్యూటేషన్... ప్రాజెక్టులు, కీలకమైన కార్యాలయాలు, భవనాల భద్రతను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బలగాలను ఎస్పీఎఫ్ పరిధిలోకి శాశ్వత డెప్యుటేషన్‌పై తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఆ విభాగంలోని సిబ్బంది పదోన్నతులతోపాటు నిరుద్యోగులకు సైతం తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బలగాల నుంచి వచ్చే సిబ్బందిని వారివారి నియామక తేదీలను బట్టి సీనియారిటీ ఖరారు చేసి రాష్ట్ర కేడర్లోనే ప్రమోషన్లు కల్పించాల్సి ఉంటుంది. ఇది అధికారులతోపాటు సిబ్బంది మెడపై కత్తిలా వేలాడే ప్రమాదముంటుందనే చర్చ జరుగుతోంది. అందుకే రాష్ట్రస్థాయి నియామకాలైన పోలీస్ కమ్యూనికేషన్, జైళ్ల శాఖల్లాగానే తమకూ రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేసేలా చూడాలని సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. -
ఈక్విటీ ఫండ్స్‌కు భారీ డిమాండ్..
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్ల ర్యాలీ నేపథ్యంలో ఈక్విటీ మ్యుచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. న్యూ ఫండ్ ఆఫర్ల (ఎన్ఎఫ్వో) ఊతంతో జులైలో నికరంగా రూ. 22,583 కోట్ల నిధులు వచ్చాయి. దీంతో వరుసగా అయిదో నెలా ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్మెంట్లు వచ్చినట్లయింది. జూన్‌తో పోలిస్తే జులైలో రూ. 5,988 కోట్లు అధికంగా పెట్టుబడులు వచ్చాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యుచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం ఈ ఏడాది మార్చిలో రూ. 9,115 కోట్లు, ఏప్రిల్‌లో రూ. 3,437 కోట్లు, మే నెలలో రూ. 10,083 కోట్ల మేర ఈక్విటీ స్కీముల్లోకి పెట్టుబడులు వచ్చాయి. అంతకన్నా ముందు 2020 జులై నుంచి 2021 ఫిబ్రవరి దాకా వరుసగా ఎనిమిది నెలల పాటు నిధుల ఉపసంహరణ కొనసాగింది. తాజా పరిణామాలతో జూన్ ఆఖరున రూ. 33.67 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్ పరిశ్రమ నిర్వహణలోని అసెట్స్ (ఏయూఎం) విలువ జులై ఆఖరుకు రూ. 35.32 లక్షల కోట్లకు చేరింది. లిక్విడిటీ.. విధానాల ఊతం.. రిజర్వ్ బ్యాంక్ ఉదార విధానాలు, కార్పొరేట్ల ఆదాయాల వృద్ధి మెరుగ్గా ఉండటం, టీకాల ప్రక్రియతో కోవిడ్ మహమ్మారిని స్థిరంగా కట్టడి చేయగలుగుతుండటం, దేశ..విదేశాల నుంచి వచ్చే నిధుల (లిక్విడిటీ)ఊతంతో ఈక్విటీ మార్కెట్లు చారిత్రక గరిష్టాలను తాకుతున్నాయని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేష్ తెలిపారు. దీనితో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా మ్యుచువల్ ఫండ్ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)ల ద్వారా ఈక్విటీ ర్యాలీలో పాలుపంచుకుంటున్నారని ఆయన వివరించారు. సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, ఈక్విటీలు ఇటీవల మెరుగైన రాబడులు ఇవ్వడం, కోవిడ్ రెండో విడతలోనూ మార్కెట్లు స్థిరంగా నిలదొక్కుకోవడం వంటి అంశాలు ఇన్వెస్టర్లకు భరోసా కల్పిస్తున్నాయని ఫండ్స్ఇండియా సంస్థ రీసెర్చి విభాగం హెడ్ అరుణ్ కుమార్ తెలిపారు. ఈక్విటీల్లోకి ప్రవహించిన నిధుల్లో 50 శాతం భాగం ఎన్‌ఎఫ్‌వోల ద్వారా వచ్చినవేనని వైట్ ఓక్ క్యాపిటల్ సీఈవో ఆశీష్ సోమయ్య పేర్కొన్నారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్దేశించిన స్కీమ్ కేటగిరీ నిబంధనలకు అనుగుణంగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) నిధులను కేటాయించడం ఇందుకు ఓ కారణమని వివరించారు. మరిన్ని విశేషాలు.. ►ఈక్విటీ ఫండ్స్‌లో విభాగాలవారీగా చూస్తే ఫ్లెక్సీ క్యాప్ సెగ్మెంట్లోకి అత్యధికంగా రూ. 11,508 కోట్లు వచ్చాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్, ఇతర ఎన్‌ఎఫ్‌వోలు దాదాపు ఏకంగా రూ. 13,709 కోట్లు సమీకరించడం ఇందుకు దోహదపడింది. ►గత నెలలో హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు రూ. 19,481 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇందులో రూ. 14,924 కోట్లను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో పెట్టారు. ►ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల (ఈఎల్ఎస్ఎస్) నుంచి మాత్రం రూ. 512 కోట్లు, వేల్యూ ఫండ్స్ నుంచి రూ. 462 కోట్లు మేర పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. ►గోల్డ్ ఎక్సే్చంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లోకి నికరంగా రూ. 257 కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవి రూ. 360 కోట్లు. ►డెట్ మ్యుచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్లు నికరంగా రూ. 73,964 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అత్యధికంగా లిక్విడ్ ఫండ్స్‌లోకి రూ. 31,740 కోట్లు రాగా, మనీ మార్కెట్ ఫండ్స్‌లోకి రూ. 20,910 కోట్లు, తక్కువ వ్యవధి ఉండే ఫండ్స్‌లోకి రూ. 8,161 కోట్లు, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్‌లోకి రూ. 6,656 కోట్లు వచ్చాయి. ►వివిధ విభాగాలవారీగా చూస్తే మ్యుచువల్ ఫండ్స్ పరిశ్రమలోకి నికరంగా రూ. 1.14 లక్షల కోట్లు వచ్చాయి. జూన్‌లో ఇవి రూ. 15,320 కోట్లు. -
నిత్యానంద: సొంతంగా రిజర్వ్ బ్యాంక్!
న్యూఢిల్లీ: అత్యాచారం, కిడ్నాప్ కేసులు ఎదుర్కొంటున్న వివాదాస్పద గురువు నిత్యానంద మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన నిత్యానందా తనకంటూ ప్రత్యేకంగా ఒక దేశాన్నే ఏర్పారుచుకున్నారు. దానికి కైలాసదేశం అని కూడా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే వినాయక చవితి రోజు కైలాసం దేశానికి కొత్త రిజర్వు బ్యాంకు, కొత్త కరెన్సీ, కొత్త చట్టాలు ప్రారంభిస్తున్నట్లు మరోసారి నిత్యానంద సంచలన ప్రకటనలు చేశారు. దేశం విడిచి పారిపోయిన నిత్యానందకు కొత్త రిజర్వ్ బ్యాంక్, కొత్త కరెన్సీ సృష్టించడం ఎలా సాధ్యమయ్యిందో తెలియడం లేదు. అంతే కాకుండా ఆ కరెన్సీ వేరే దేశాలలో కూడా చలామణి అవుతుందని నిత్యానంద ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఆ దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. అయితే ఆ దేశాలు ఏంటి అని మాత్రం ఆయన ప్రకటించలేదు. 300 పేజీలతో కూడా ఆర్థిక విధానాలను ఆయన తయారు చేశారు. వాటికన్ బ్యాంకు తరహాలోనే కైలాసా రిజర్వు బ్యాంకు కార్యకలాపాలు ఉంటాయని, అందులో ఎలాంటి తేడాలు ఉండవని చెప్పారు. భారతదేశానికి చాలా దూరంలో ఉన్న ఈక్విడార్ సమీపంలోని ఒక చిన్నదీపంలో నిత్యానంద ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ దేశం ఎక్కడ ఉందో ఇప్పటి వరకు ఆయనకు, ఆయన అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదు. భారతదేశానికి వేల కిలోమీటర్ల దూరంలోని ఈక్విడార్ సమీపంలోని ఓ చిన్న ద్వీపంలో మకాం వేసిన నిత్యానందస్వామి వినాయక చవితి రోజు ప్రపంచానికి షాక్ ఇచ్చారు. నిత్యానందస్వామితో పాటు ఆయన అనుచరులు శనివారం వినాయక చవితి సందర్బంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసాని నిత్యానందస్వామి స్థాపించారు. అందులో కైలాసదేశం ప్రధాన మంత్రి పదవి గురించి ప్రస్తావించిన నిత్యానంద అందర్నీ ఆచ్చర్యానికి గురిచేస్తున్నారు.ఇక ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో నిత్యానంద తాను తాను హిందూ సంస్కర్తను కానని, పునర్జీవిని అంటూ చెప్పారు. హిందూ మతాన్ని పాటించే వారు హక్కులు కోల్పోవడం వలనే కైలాసదేశం స్థాపించానని, అక్కడ మానవత్వం ఉన్న ఎవరికైనా చోటు ఉంటుందని, ఆ దేశంలో ప్రతిఒక్కరికి జ్ఞానోదయం అవుతోందని నిత్యానంద చెప్పారు. చదవండి: ఇంతకూ నిత్యానంద కథేంటి? -
అలా ఎలా రుణాలిచ్చేశారు?
ముంబై: క్లయింట్ల షేర్లను సొంతానికి వాడుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్‌బీఎల్) వివాదం... తాజాగా బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మెడకు కూడా చుట్టుకుంటోంది. తనఖా పెట్టిన షేర్ల గురించి పూర్తిగా మదింపు చేయకుండా అవి కార్వీకి ఎలా రుణాలిచ్చాయన్న అంశంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలపై విచారణ జరపాలంటూ రిజర్వ్ బ్యాంక్‌కు సెబీ లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అక్రమంగా క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణాలు తీసుకున్నప్పుడే బ్యాంకులు అప్రమత్తం కావాల్సిందని సెబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కార్వీ తనఖా పెట్టిన షేర్లను క్లయింట్ల ఖాతాల్లోకి మళ్లించాలంటూ డిసెంబర్ 2న సెబీ ఆదేశించటంతో నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) దాదాపు 90 శాతం మంది క్లయింట్లకు షేర్లను బదలాయించడం తెలిసిందే. అయితే, తమకు పూచీకత్తుగా ఉంచిన షేర్లను క్లయింట్లకెలా బదలాయిస్తారంటూ బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ‘ఆ షేర్లపై కార్వీకే అధికారాల్లేనప్పుడు.. వాటిని తనఖా పెట్టుకుని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు రుణాలెలా ఇచ్చాయి? వాటిని క్లయింట్ల ఖాతాల్లోకి బదలాయించొద్దంటూ ఎలా చెబుతాయి?‘ అని సెబీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. షేర్లన్నింటికీ రిస్కు.. భారీ ఆస్తులను తనఖా పెట్టి స్వల్ప మొత్తంలో రుణాలు తీసుకుంటున్నప్పుడే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుమానం రావాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. దాదాపు రూ.5,000 కోట్ల విలువ చేసే ప్రమోటర్ అసెట్స్‌కు ప్రతిగా కార్వీకి బ్యాంకులు రూ.1,200 కోట్లు రుణమిచ్చాయి. అలాగే రూ. 2,300 కోట్ల విలువ చేసే క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి కార్వీ మరో రూ.600 కోట్లు రుణం తీసుకుంది. కార్వీ తీసుకున్న రుణాల్లో ఏ కొంచెం ఎగ్గొట్టినా.. ఇంత భారీ స్థాయిలో తనఖా పెట్టిన షేర్లన్నింటినీ బ్యాంకులు అమ్మేసే ప్రమాదం ఉంటుంది. పైపెచ్చు కార్వీ సొంత బ్యాలెన్స్ షీట్లో రూ.27 లక్షల విలువ చేసే షేర్లు మాత్రమే ఉండటం చూసైనా.. ఏదో పొరపాటు జరుగుతోందని బ్యాంకులు మేల్కొని ఉండాల్సిందని సంబంధిత వర్గాలు వ్యాఖ్యానించాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు కచ్చితంగా తప్పు చేశాయని ఇలాంటి ఉదంతాలు రుజువు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకులతో పాటు బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలు షేర్లను తనఖా పెట్టుకుని కార్వీకి దాదాపు రూ.1,800 కోట్ల మేర రుణాలిచ్చాయి. ఈవోడబ్ల్యూకీ సెబీ ఫిర్యాదు..? కార్వీ కేసుకు సంబంధించి ముంబై పోలీస్‌లో భాగమైన ఆర్థిక నేరాల విభాగానికి (ఈవోడబ్ల్యూ) కూడా సెబీ ఫిర్యాదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ‘కార్వీ కేసు కేవలం సెక్యూరిటీస్ చట్టానికి మాత్రమే పరిమితమైనది కాదు. ఇది సివిల్ కేసు కూడా కనక సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌కు (శాట్) ఆదేశాలిచ్చే అధికారాల్లేవు. కాబట్టి క్లయింట్ల షేర్లను దొంగిలించిందంటూ కార్వీపై ఈవోడబ్ల్యూకి సెబీ ఫిర్యాదు చేయొచ్చు‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్లయింట్ల షేర్లను తనఖా పెట్టి రుణాలు తీసుకుంటున్న ఇతర బ్రోకరేజీ సంస్థలపైనా సెబీ దృష్టి సారించింది. సెక్యూరిటీలను తనఖా పెట్టి రూ.50 కోట్ల పైగా రుణాలు తీసుకున్న సంస్థలు నాలుగే ఉన్నాయని, మిగతా సంస్థలన్నీ సొంత షేర్లనే పూచీకత్తుగా పెట్టాయని తేలినట్లు సమాచారం. -
ఆర్టీజీఎస్ వేళలు మార్పు
ముంబై: భారీ పరిమాణంలో నగదు బదిలీకి ఉపయోగించే ఆర్టీజీఎస్ సిస్టమ్ వేళలను రిజర్వ్ బ్యాంక్ సవరించింది. ప్రస్తుతం ఆర్టీజీఎస్ ఉదయం 8 గం.ల నుంచి అందుబాటులో ఉంటుండగా.. ఇకపై ఉదయం 7 గం.ల నుంచి అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 26 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్) విధానంలో రూ. 2 లక్షల పైబడిన మొత్తాన్ని ఆన్లైన్లో బదిలీ చేయొచ్చు. దీని వేళలు ఇప్పుడు కస్టమర్ల లావాదేవీలకు సంబంధించి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 దాకా, ఇంటర్‌బ్యాంక్ లావాదేవీల కోసం రాత్రి 7.45 దాకా ఉం టున్నాయి. ప్రస్తుతం రూ. 2 లక్షల లోపు నిధుల బదిలీ కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) ఉపయోగిస్తున్నారు. దీని వేళలు ఉదయం 8 నుంచి రాత్రి 7 దాకా ఉంటున్నాయి. కార్డు చెల్లింపులకూ ఈ–మాండేట్... వర్తకులు, వ్యాపార సంస్థలకు క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్స్ వంటివాటిద్వారా తరచూ చేసే చెల్లింపులకు కూడా ఈ–మాన్డేట్ విధానాన్ని వర్తింపచేసేందుకు ఆర్బీఐ అనుమతినిచ్చింది. దీనికి రూ. 2,000 దాకా లావాదేవీ పరిమితి ఉంటుంది. ప్రస్తుత విధానం ప్రకారం కార్డుల ద్వారా చిన్న మొత్తాలు చెల్లించినా కూడా ప్రత్యేకంగా వన్ టైమ్ పాస్వర్డ్ వంటివి ఉపయోగించాల్సి వస్తున్నందువల్ల లావాదేవీకి ఎక్కువ సమయం పడుతోంది. తాజా వెసులుబాటుతో చిన్న మొత్తాల చెల్లింపు సులభతరమవుతుంది. ఈ–మాన్డేట్కు నమోదు చేసుకున్నందుకు కార్డ్‌హోల్డరు నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరాదని బ్యాంకులు/ఆర్థిక సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది.