'బ్యాంకులు రుణమాఫీకి సానుకూలంగా లేవు'
ఏ బ్యాంకులూ రుణమాఫీకి సానుకూలంగా లేవని, పరపతి విధానం దెబ్బతింటున్న భావనతో బ్యాంకులు మాఫీని వ్యతిరేకిస్తున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేసేందుకు రిజర్వు బ్యాంకు వ్యతిరేకంగా ఉందని చెప్పారు. రుణాలు రీషెడ్యూల్ చేస్తే కాస్త వెసులుబాటు వస్తుందని భావించామని, అయితే ఇప్పటికీ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని పుల్లారావు చెప్పారు.
రుణమాఫీ అమలుకు రెండు నెలల సమయం పడుతుందని, ఈలోపు వనరుల సమీకరణపై తీవ్ర కసరత్తు చేస్తున్నామని తెలిపారు. బ్యాంకులకు రూ.45 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ఎఫ్‌ఆర్‌బీఎమ్ ప్రకారం 15 వేల కోట్లకు మించి రుణాలు తెచ్చుకోలేమని వివరించారు. ఎర్రచందనం అమ్మకం ద్వారా కూడా 2 వేల కోట్ల రూపాయలకు కు మించి ఆదాయం రాదని, ఇతర వనరుల కోసం కమిటీ కసరత్తు చేస్తోందని పుల్లారావు చెప్పారు.