రుణమాఫీపై బ్యాంకర్లతో సాయంత్రం బాబు భేటీ
రుణమాఫీ అంశంపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు బ్యాంకర్లతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. రుణమాఫీ లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. వాస్తవానికి నవంబర్ 15 లోగానే రుణమాఫీ గురించి నిర్ణయం తీసుకోవాలి. అయితే, ఎంతమందికి రుణమాఫీ చేయొచ్చన్న జాబితా ఇంకా ఎస్బీఐ నుంచి రాలేదు. దాంతో కొంత ఆలస్యం జరుగుతోంది. ఈ జాబితా కూడా అందిన తర్వాత ప్రభుత్వం ఎలా ఎంపిక చేయాలో చూసుకుంటుంది.
లక్షన్నర పరిమితి అయితే ఎంతమంది లబ్ధిదారులు ఉంటారు, ఎంత మొత్తం ఇవ్వాలో లెక్క తేల్చాలి. ఒకే కుటుంబంలో ఒకటికి మించి రుణాలు ఉంటే అవేవీ కవర్ కాకుండా సాఫ్ట్వేర్ రూపొందించినట్లు చెబుతున్నారు. అలాగే, పంటకు ఎంత రుణాన్ని బ్యాంకర్లు ఇస్తారో అంత మొత్తాన్ని మాత్రమే మాఫీ చేస్తామంటున్నారు. వీటన్నింటికి సంబంధించి ఇంకా లెక్కలు తేల్చాల్సి ఉంది. రుణమాఫీ కోసం ఇప్పటికి 5వేల కోట్లు డిపాజిట్ చేశారు. నవంబర్ నెల మొదటి వారంలో మలివిడత జన్మభూమి జరగాల్సి ఉంది. మొదటి విడతలోనే రైతు రుణమాఫీ గురించి నిలదీశారు కాబట్టి, ఆలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకుని కొంత అమలుచేయాలని భావిస్తున్నారు.