చంద్రబాబు.. మడత నాలుక
'చంద్రబాబు నాయుడికి ముని శాపం ఉంది. ఎప్పుడైనా నిజం చెబితే తల వెయ్యి ముక్కలైపోతుందని ఓ ముని ఆయనకు శాపం పెట్టారు. అందుకే చంద్రబాబు నోటి నుంచి నిజం అన్నది మాత్రం రాదు'
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పలు సందర్భాలలో చెప్పిన విషయమిది. ఇప్పుడు అదే మరోసారి రుజువైంది. రైతులకు రుణమాఫీ విషయంలో ఎన్ని సందర్భాలలో ఎన్ని మాటలు చెప్పారో ఆయనకే గుర్తు ఉండకపోవచ్చు. కానీ, ఒకే సందర్భంలో.. ఒకే సమావేశంలో వేర్వేరు మాటలు చెప్పడం కూడా చంద్రబాబుకే చెల్లు. ప్రతి ఇంటికీ ఒక రుణాన్ని మాఫీ చేస్తామంటూ గొప్పగా ప్రకటించిన ముఖ్యమంత్రి.. అంతలోనే మళ్లీ తాను రుణాల రీషెడ్యూలింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, బుధవారం కూడా రిజర్వు బ్యాంకు గవర్నర్తో మాట్లాడానని, ఆయనను ఎలాగైనా అందుకు ఒప్పిస్తానని అన్నారు.
వాస్తవానికి పాదయాత్ర చేసిన సమయంలో చంద్రబాబు నాయుడు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని పెద్ద హామీ ఇచ్చిపారేశారు. తర్వాత ఎన్నికల ప్రచారం సమయంలో కూడా ఆయన ఇదే అస్త్రాన్ని ప్రధానంగా ప్రయోగించారు. అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం తాను రైతుల రుణమాఫీ అంశంపైనే పెడతానని కూడా ఘనంగా ప్రకటించారు. భారీ మొత్తంలో ఉన్న రుణాలను మాఫీ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదని, దానివల్ల బ్యాంకుల ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింటుందని ఎంతమంది చెప్పినా ఆయన పట్టించుకోలేదు సరికదా.. అలా చెప్పేవాళ్లను ప్రజాద్రోహులుగా, రైతుద్రోహులుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
కానీ ఇప్పుడు మాత్రం రైతుల రుణాలు మాఫీ చేసే అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. రుణాలను రీషెడ్యూలు చేయిస్తే రైతులే నష్టపోతారని స్వయంగా రైతు అయిన ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి లాంటివాళ్లు కూడా చెబుతున్నా, చంద్రబాబు మాత్రం రీషెడ్యూలింగ్ మంత్రమే పదేపదే జపిస్తున్నారు. రిజర్వు బ్యాంకు వర్గాలతో దాని గురించే మాట్లాడుతున్నారు తప్ప, రుణమాఫీకి నిధులు ఎలా సమకూరుద్దామన్న ఆలోచన కూడా చేయడంలేదు. కేంద్రం నుంచి భారీగా సాయం వస్తుందని, దాంతో రుణమాఫీ చేసేయొచ్చని భావించినా, అది కాస్తా తుస్సుమంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మడత నాలుకతో నోటికి వచ్చినట్లల్లా మాట్లాడుతున్నారు.