Agriculture
-
వ్యవసాయానికి పెద్ద పీట!
రైతుల ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఉన్న నరేంద్ర మోదీ సర్కారు రానున్న బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించనుంది. గత బడ్జెట్‌తో పోల్చితే కేటాయింపులు ఏకంగా 15 శాతం మేర పెరగనున్నట్టు విశ్వసనీయ వర్గాలు అందించిన సమాధారం ఆధారంగా తెలుస్తోంది. ఎరువుల సబ్సిడీల్లో ప్రధానంగా పోషకాధారిత సబ్సిడీకి ప్రాధాన్యం ఇవ్వనుంది. మరిన్ని దిగుబడిని ఇచ్చే వంగడాల అభివృద్ధి, ప్రకృతి అనుకూల వ్యవసాయానికి మరింత మద్దతు అందించనుంది. కేవలం వ్యవసాయమే కాకుండా, అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, ఫిషరీస్ (మత్స్య)కు సైతం ప్రోత్సాహాన్ని కల్పించనుంది. దేశంలో 45 శాతం ఉపాధికి వ్యవసాయం, అనుబంధ రంగాలే ఆధారంగా ఉండడం గమనార్హం. దేశ జీడీపీలో ఈ రంగం 15 శాతం వాటా సమకూరుస్తోంది. కనుక వ్యవసాయం, అనుబంధ రంగాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు సమాచారం. నానో, ఆర్గానిక్ ఎరువులకు ప్రోత్సాహం ఎరువుల సబ్సిడీలో పోషకాధారిత ఎరువులకు కేటాయింపులు పెరుగుతూ వస్తున్నాయి. నేలలోని పోషకాలను కాపాడడం, యూరియా వినియోగాన్ని తగ్గించడం మధ్య సమతుల్యతను తీసుకువచ్చే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా సాయిల్ హెల్త్ కార్డ్ (ఎస్‌హెచ్‌సీ/భూసారం వివరాలు)ను రైతులకు అందించనుంది. ప్రతి ప్రాంతంలోనూ నేల సారం ఎలా ఉంది, ఆ నేలకు తగ్గట్టు ఎలాంటి పోషకాలు అవసరం అన్న సమాచారం ఈ కార్డుల్లో ఉంటుంది. నానో, ఆర్గానిక్ ఎరువులకు ప్రోత్సాహం దిశగా మరిన్ని చర్యలు బడ్జెట్లో ఉండనున్నాయి. దీని ద్వారా పంటల దిగుబడిని పెంచడంతోపాటు, రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించొచ్చు. ఫలితంగా దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ప్రభుత్వానికి సబ్సిడీ భారం కూడా తగ్గిపోతుంది. అనుబంధ రంగాలకూ ప్రాధాన్యం 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధనలో మోదీ సర్కారు సఫలీకృతం కాలేదు. నాబార్డ్ నివేదిక ప్రకారం.. గ్రామీణ కుటుంబాల నెలవారీ సగటు ఆదాయం 2016–17 నుంచి 2021–22 మధ్య ఏటా 9.5% కాంపౌండెడ్ (సీఏజీఆర్) వృద్ధి చెందింది. అంటే మొత్తం మీద చూస్తే ఈ కాలంలో ఆదాయ వృద్ధి 57 శాతమే పెరిగినట్టు తెలుస్తోంది. ఈ దృష్ట్యా వ్యవసాయేతర రంగాలైన ఫిషరీస్, డైయిరీస్, తేనెటీగల పెంపకం తదితర విభాగాలకు మద్దతు ఇవ్వడం ద్వారా గ్రామీణ కుటుంబాల ఆదాయాన్ని పెంచే ప్రణాళికలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వ్యవసాయ సరఫరా వ్యవస్థను (కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ తదితర) పట్టిష్టం చేయడం, వ్యవసాయ ఉత్పాదక మార్కెట్ల బలోపేతంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.అంచనాలు..→ 2024–25 బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రభుత్వం 1.52 లక్షల కోట్లు కేటాయించింది. 2025–26 బడ్జెట్లో 1.75 లక్షల కోట్లకు కేటాయింపులు పెరగనున్నాయి. ఇందులో ఒక్క వ్యవసాయానికి రూ.1.23 లక్షల కోట్లు దక్కనున్నాయి. → సబ్సిడీ సాగు రుణం ఒక్కో రైతుకు రూ.3 లక్షల పరిమితి ఉండగా, దీన్ని రూ.5లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. దీనికి అదనంగా పంటల బీమాను సైతం పెంచనుంది. → నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫారి్మంగ్ పథకం కింద కోటి మంది రైతులను సహజ సిద్ధ సాగులోకి తీసుకురానున్నట్టు కేంద్ర ప్రభుత్వం గతేడాది లక్ష్యాన్ని ప్రకటించింది. వచ్చే బడ్జెట్లో ఈ దిశగా మరిన్ని ప్రోత్సాహకాలు ఉంటాయన్న అంచనా ఉంది. → దేశీయంగా దిగుబడిని పెంచడం ద్వారా ధరల పెరుగుదలను కట్టడి చేయడానికి కూడా ప్రాధాన్యం ఇవ్వనుంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రస్తుతమున్న 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 80 బిలియన్ డాలర్లకు (రూ.6.88 లక్షల కోట్లు) పెంచాలన్న లక్ష్యంతో కేంద్రం ఉంది. → 2030 నాటికి పప్పు ధాన్యాల ఉత్పత్తిని 30 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే దిశగా చర్యలు ప్రకటించనుంది. → వచ్చే ఐదేళ్లలో మత్స్యకార రంగానికి → 9 బిలియన్ డాలర్ల నిధుల సాయాన్ని అందించనుంది. → ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలకు 2027 నాటికి రూ.10,900 కోట్ల రాయితీలను కూడా అందించనుంది. → రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించే చర్యలు 5లక్షలు: ఒక్కో రైతుకు రాయితీతో కూడిన పంట రుణం2030నాటికి వ్యవసాయ ఎగుమతుల లక్ష్యం 80 బిలియన్ డాలర్లు10,900కోట్లు: ఫుడ్ ప్రాసెసింగ్‌కు రాయితీలు రైతులకు భూసారం కార్డులు – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘కనీస’ చట్టబద్ధతే సంజీవని!
కాలచక్రంలో నెలలు, సంవత్సరాలు పరిగెడుతున్నాయి. కొన్ని రంగాలు రూపు రేఖలు గుర్తుపట్టలేనంతగా మారుతున్నాయి. కానీ, మార్పు లేనిదల్లా వ్యవసాయం మీద ఆధారపడిన రైతుల జీవితాలే. దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు దాటిపోయినా, ఇంకా రైతులు తమ గోడు చెప్పు కోవడానికి రోడ్లపైకి వస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఉద్యమిస్తున్నారు. ఇంతా చేసి రైతులు కోరుతున్నదేమీ అన్యాయమైన డిమాండ్లు కావు. ప్రభుత్వాలు నెరవేర్చగల సహేతుక డిమాండ్లే! ఆత్మగౌరవంతో జీవించడం ప్రజల ప్రాథమిక హక్కు. అప్పుల ఊబిలో నుంచి బయటపడేంత వరకూ రైతులకు ఆత్మగౌరవం లభించదు. రైతాంగం ఆత్మగౌరవంతో బతకాలంటే వారికి కనీస మద్దతు ధరలు లభించాల్సిందే. వాటికి చట్టబద్ధత కల్పించాల్సిందే.2024 ఏడాది ప్రారంభంలో పంజాబ్ రైతులు మరో పోరాటానికి ఉద్యుక్తుల య్యారు. ఏడాది గడిచినా ఆ ఉద్యమాన్ని కొనసాగించడానికి గల కారణాలను విశ్లేషించి చూస్తే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అమా నుష వైఖరి బహిర్గతమవుతుంది. దాదాపు మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు నల్ల చట్టాలను తేవాలని ప్రతిపాదించడం, దానిపై అన్ని రాష్ట్రాల రైతాంగం ఢిల్లీలో చలికి, ఎండలకు, వానలకు తట్టుకొని చేసిన సుదీర్ఘ ఉద్యమం దరిమిలా కేంద్రం దిగొచ్చింది, ప్రతిపాదిత బిల్లుల్ని ఉప సంహరించుకుంది. అయితే, ఆ సందర్భంగా రైతులకు చేసిన వాగ్దానాలను మాత్రం కేంద్రం నెరవేర్చలేదు. ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనీ, రైతుల్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న పంట రుణాలను మాఫీ చేయాలనీ రైతాంగం చేసిన డిమాండ్లను పరిశీలించి నిర్ణయం తీసుకొంటామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయ లేదు. దాంతో 2024 ఫిబ్రవరి 14 నుంచి పంజాబ్ రైతులు హరి యాణా సరిహద్దుల్లోని శంభూ అంబాలా, అఖేరిజింద్ కూడళ్ల వద్ద బైఠాయించి ఉద్యమం నడుపుతున్నారు. రైతుల డిమాండ్ల పరిష్కా రానికి సహేతుక ముగింపు లభించాలన్న ఉద్దేశంతో రైతు నాయకుడు జగ్జీత్సింగ్ డల్లేవాల్ (నవంబర్ 26న) ఆమరణ దీక్ష మొదలు పెట్టాక, ఈ పోరాటానికి దేశ వ్యాప్త గుర్తింపు లభించింది. నిజానికి ఓ పోరాటాన్ని విరమింపజేసే సమయంలో ఇచ్చిన వాగ్దానాల్ని కేంద్రం నెరవేర్చకపోవడం, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్‌తో రైతాంగం మరో పోరాటానికి దిగడం బహుశా చరిత్రలో ఇదే ప్రథమం కావొచ్చు.కనీస మద్దతు ధర ప్రాథమిక హక్కు లాంటిదే!మూడేళ్ల క్రితం ఉపసంహరించుకున్న మూడు నల్ల చట్టాల్ని కేంద్రం మరో రూపంలో తీసుకురాబోతోందన్న సంకేతాలతోనే పంజాబ్ రైతులు ఆందోళనకు దిగారు. ‘‘దేశానికి స్వాతంత్య్రం లభించిన ఈ 75 సంవత్సరాలలో పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు లభించక, సాగు గిట్టుబాటు కాక, అప్పుల ఊబిలో చిక్కుకొని గత్యంతరం లేక, తమ జీవితం పట్ల తమకే విరక్తి కలిగి ఇప్పటికి 7 లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. నా ప్రాణం పోతే పోతుంది. కానీ ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల జాబితాలోకి మరికొన్ని పేర్లు చేరకూడదు’’ అన్న 70 ఏళ్ల డల్లేవాల్ మాటలు వ్యవసాయరంగ వాస్తవ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తాయి. దేశానికి ఆహార భద్రత అందించే రైతులు ఇంకా ఆత్మహత్యలు చేసుకొనే దుఃస్థితి ఎందుకు ఉన్నదో పాలకులు ఆలోచించడం లేదు. గతంలో ఎదుర్కొన్న సమస్యలతో పాటు తాజాగా తెస్తున్న వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ సంస్కరణలు రైతుల పాలిట ఉరి తాళ్లుగా మారనున్నాయి. పంట ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (అగ్రి కల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లను రద్దు చేసి కాంట్రాక్టు సాగుకు పట్టం కట్టాలన్న కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు ప్రతిపాదనకు రైతాంగం ససేమిరా ఇష్టపడటం లేదు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకురాదలిచిన సంస్కరణలకు సంబంధించి 2024లో విడుదల చేసిన ముసాయిదా పత్రంలో పేర్కొన్న అంశాలు దాదాపుగా అంతకుముందు విరమించుకొన్న వ్యవసాయ బిల్లుల్లోని అంశాలకు నకలుగా ఉన్నాయని రైతు సంఘాల నేతలు ఆరోపిస్తు న్నారు. అవి: 1. జాతీయ వ్యవసాయ మార్కెట్లను అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం; 2. ఒకే లైసెన్సు, ఒకే రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీసుకు రావటం; 3. ఫీజు ఏకమొత్తంలో ఒకేసారి చెల్లింపు చేయటం;4. గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీలను ప్రత్యేక మార్కెట్లుగా గుర్తించడం; 5. ప్రైవేట్ ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వేదికల ఏర్పాటు... ఇలా పలు ప్రతిపా దనలను ముసాయిదా బిల్లులో చేర్చి, వాటిని రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం జరుగుతోందని రైతులు అనుమానిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ రంగంలో కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు రైతాంగ ప్రతినిధులతో చర్చించడం, వారిని భాగస్వాముల్ని చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ, కేంద్రం ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడాన్ని రైతు సంఘాలు తప్పు పడుతున్నాయి. తమకు అంగీకార యోగ్యం కాని నిర్ణయాలు చేయడం కోసమే కేంద్రం ఏక పక్షంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధరలు ఆశించడం రాజ్యాంగంలో ప్రజలకు దఖలు పడిన ప్రాథమిక హక్కు లాంటిదేనని డల్లేవాల్ పేర్కొనడం దేశవ్యాప్త చర్చకు ఆస్కారం కల్పించింది. దేశవ్యాప్త డిమాండ్ కూడా అదే!తాము పండించే పంటకు ఎంత ధర ఉండాలో నిర్ణయించుకొనే హక్కు ఎలాగూ రైతాంగానికి లేదు. కనీసం పండించే పంటకు ఎంత మొత్తం కనీస మద్దతు ధర (ఎంఎస్íపీ)గా ఇస్తారో ముందుగా తెలుసుకోవాలను కోవడం అత్యాశేమీ కాదు కదా? కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం అంటే పంట ఉత్పత్తికి అయ్యే ఖర్చుతోపాటు లెక్క గట్టి ధరల్ని ప్రకటించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో కొందరు సామాజిక కార్యకర్తలు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించి కేంద్రానికి తగిన సూచనలు చేయాలని అభ్యర్థించారు. అయితే, ప్రజల జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని... కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించలేమనీ, అలా చేస్తే నిత్యావసర వస్తువుల ధరలు అదుపు తప్పుతాయనీ సాకులు చెప్పి కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానాలను తప్పుదారి పట్టించిందన్నది నిర్వివాదాంశం.నిజానికి ఈ సమస్యను న్యాయస్థానాలు పరిష్కరించాలని ఆశించడం కూడా సముచితం కాదు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్ని నిర్ణయించే సీఏసీపీ (కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్)లో చైర్మన్ నుంచి సభ్యుల వరకూ అందరూ బ్యూరోక్రాట్లే. రైతాంగ ప్రతినిధులు ఉండరు. పేరుకు ‘సీఏసీపీ’ స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థగా కనిపిస్తుంది గానీ, దానిపై రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయన్నది బహిరంగ రహస్యమే. సీఏసీపీ నిర్ణయించే కనీస మద్దతు ధరల విధానం ఆమోదయోగ్యం కాదని దశాబ్దాలుగా రైతాంగ సంస్థలు మొత్తుకొంటున్నా, కేంద్రంలో ఎవరు అధికారంలో వున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులే శిరోధార్యం అని ఎందరు చెప్పినా దానికి మొగ్గుచూపడం లేదు. పైగా, తాము అనుసరించే విధానాన్నే స్వామినాథన్ కమిషన్ సూచించిందనీ, ఆ ప్రకారం సాగు వ్యయంపై 50 శాతం జోడించి ఇస్తున్నా మనీ దాదాపు ఐదారేళ్ల నుంచి కేంద్రం బుకాయిస్తూనే ఉంది.దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కేంద్రంలో అనేక పార్టీల ప్రభుత్వాలు వచ్చాయి. ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడ్డం జాతీయ రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిన నేపథ్యంలోనే రైతాంగ సమస్యలు నేటికీ రావణ కాష్టంగా రగులుతూనే ఉన్నాయి. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే అన్న దాతలతో తక్షణం చర్చలు జరపాలి (ఎట్టకేలకు ఫిబ్రవరి 14న చర్చలకు ఆహ్వానించింది). ‘మార్కెటింగ్ ఫ్రేవ్ువర్క్’ పేరుతో తెచ్చిన ముసాయిదాను ఉపసంహరించుకోవాలి. రైతాంగం కోరు తున్నట్లు పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించటం ఒక్కటే దేశ రైతాంగానికి సంజీవనిగా పని చేయగలుగుతుంది.డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, శాసన మండలి సభ్యులు -
పోరాడితేనే కాపాడుకోగలం!
మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి రైతాంగం, వ్యవసాయ రంగం పరిస్థితి మరింత వేగంగా క్షీణించడం ప్రారంభమైంది. 2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, స్వామినాథన్ సిఫారసుల ప్రకారం వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని నమ్మబలికిన ఎన్డీయే పాలనలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గెలిచే వరకు మద్దతు ధర గురించి ఊదరగొట్టి, గెలిచిన తర్వాత సి2 + 50 సూత్రం (ఉత్పత్తికి అయ్యే ఖర్చుకు అదనంగా అందులో సగభాగం కలిపి ఆ మొత్తంపై లెక్కగట్టటం) ప్రకారం తాము కనీస మద్దతు ధర ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు ఎన్డీఏ ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించడం ద్వారా తన రైతు వ్యతిరేక విధానాన్ని బయట పెట్టుకొన్నది.ఇప్పటికే దేశంలోని 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయని, వారి నెత్తిపై సగ టున 74,121 రూపాయల అప్పు ఉందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మార్కెట్లో పంటల ధరలు గిట్టుబాటు కాక, పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక అప్పుల సుడి గుండంలో చిక్కుకుంటున్న రైతు కుటుంబాల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్నది. 2013 నుండి 2022 వరకు అధికారిక లెక్కల (ఎన్సీఆర్బీ) ప్రకారమే గత పదేళ్లలో లక్షా ఇరవై వేల మందికి పైగా రైతులు ఆత్మ హత్య చేసుకున్నారంటే రైతాంగం పరిస్థితి ఎంత దయ నీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యవసాయ పంటలపై కార్పొరేట్ శక్తులకు అధి కారాన్ని కట్టబెట్టే విధంగా మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఉరితాళ్ల వంటి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 13 నెలల పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు వీరోచితంగా పోరాడారు. ఫలితంగా ప్రభుత్వం కనీస మద్దతు ధర చట్టబద్ధత అవకాశాల పరిశీలన కోసం ఉద్యమ నాయ కత్వానికి రాతపూర్వక హామీ ఇచ్చింది. అయితే మూడు సంవత్సరాలు దాటినా దీనిపై ఎలాంటి పురోగతి లేకపోగా తిరిగి దొడ్డి దారిన ఆ మూడు నల్ల చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దానిలో భాగంగానే కొత్త వ్యవసాయ మార్కెట్ విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. అటవీ సంరక్షణ నియమాల పేరుతో 2006 అటవీ హక్కుల చట్టానికి పాతరేయటానికి పూనుకున్నది. అటవీ సంరక్షణ నియమాల బిల్లు ఆమోదం పొందితే అడవులకు, అడవుల్లో నివసించే జన సమూహాల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని పార్లమెంట్ సభ్యులకు కాన్స్టిట్యూషనల్ కండక్ట్ గ్రూపు తరపున 155 మంది మాజీ ఐఏఎస్ అధికారులు తమ సంతకాలతో లేఖ రాశారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ఆ బిల్లును ఆమోదింప చేసు కుంది. మరోవైపు విద్యుత్ బిల్లు–2020ని చట్టం చేయడా నికి మార్గం సుగమం చేసుకుంది. కచ్చితంగా ఇది వ్యవ సాయ రంగంపై పెను భారం మోపే బిల్లు అనొచ్చు.వ్యవసాయ రంగంలో పని చేసే వారంతా రైతులే. వీరిలో కౌలు రైతులు, మహిళా రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దారుణంగా వుంది. రైతును, వ్యవసాయ రంగాన్ని రక్షించుకోలేక పోతే దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం వుంది. ఇప్పటికైనా రైతులు, రైతు సంఘాలు మేల్కొనాలి. ప్రమాదంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలి. ఉద్యమ శక్తుల ఐక్యత ద్వారానే రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్నీ కాపాడుకోగలుగుతాం. ‘అఖిలభారత రైతుకూలీ సంఘం’ అనే పేరుతో కొనసాగుతూ వస్తున్న రెండు వేర్వేరు నిర్మాణాలు ఈ నేపథ్యంలోనే ‘ఆలిండియా కిసాన్ మజ్దూర్ సభ’ (ఏఐకేఎంఎస్)గా ఒకటి అవుతున్నాయి. ఆదివారం మహబూబాబాద్‌లో విలీన సభ జరుపుకొంటున్నాయి.– గౌని ఐలయ్య,ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
బడ్జెట్లో అన్నదాత వాటా పెరుగుతుందా..?
భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా నిలుస్తోంది. లక్షలాది మందికి ఈ రంగం జీవనోపాధిని అందిస్తోంది. అయితే వాతావరణ మార్పుల వల్ల పంటనష్టం పెరుగుతోంది. దాంతో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025)లో సుస్థిర వ్యవసాయం దిశగా ప్రభుత్వం కేటాయింపులు పెంచాలి. వీటితో వ్యవసాయ రంగంలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు. అధిక విలువలు కలిగిన పంటల్లో ప్రైవేట్ పెట్టుబడులు పెరిగేలా ప్రోత్సాహకాలు అందించవచ్చు. అన్నదాతలకు అనుకూలంగా ఉన్న సాంకేతికతలను అభివృద్ధి చేసేందుకు డిజిటల్ ఇంటిగ్రేషన్‌ను ప్రవేశపెట్టవచ్చు.స్థితిస్థాపక వ్యవసాయంవాతావరణ స్థితిస్థాపక వ్యవసాయంలో కరవు, వరదలు, వడగాలులు వంటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా కొత్త పద్ధతులపై ప్రభుత్వం రైతులను ప్రోత్సహించాలి. కరవును తట్టుకునే విత్తనాలు, సమర్థవంతమైన నీటి యాజమాన్య వ్యవస్థలు, భూసార పరిరక్షణ పద్ధతుల వాడకంపై అవగాహన అందించాలి. పంట మార్పిడి, సేంద్రియ వ్యవసాయం వంటి కార్యక్రమాలు భూసారాన్ని పెంచడంతో పాటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. సబ్సిడీలు, సాంకేతిక మద్దతును అందించడం ద్వారా ప్రభుత్వం స్థిరమైన పద్ధతులను అవలంబించేలా రైతులను ప్రోత్సహించాలి.ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (PPP) వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు నమ్ముతున్నారు. ప్రైవేటు సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరింత సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు, పీపీపీల సాయంతో అధునాతన వ్యవసాయ సాంకేతికతలు సృష్టించి వ్యవసాయ పరికరాలు, అధిక నాణ్యత విత్తనాల అభివృద్ధి, వాటి వ్యాప్తిని సులభతరం చేసేలా చూడాలి. ప్రైవేట్ కంపెనీలు కోల్డ్ స్టోరేజీ(Cold Storage) సౌకర్యాలు, రవాణా నెట్‌వర్క్‌లు వంటి గ్రామీణ మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టేలా ప్రభుత్వం సహకారం అందించాలి. ఈ విధానాలు వ్యవసాయ రంగం సామర్థ్యాన్ని, లాభదాయకతను పెంచుతాయి.అధిక విలువ కలిగిన పంటలువ్యవసాయ ఆదాయాన్ని మరింత వైవిధ్యంగా మార్చడానికి పండ్లు, కూరగాయలు(Vegetables), సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలు వంటి అధిక విలువ కలిగిన పంటలపై ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. సాంప్రదాయ ప్రధాన పంటలతో పోలిస్తే ఈ పంటలకు తక్కువ నీరు, భూమి అవసరం అవుతుంది. దాంతోపాటు అధిక రాబడిని పొందే వీలుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఈ పంటల సాగు పెంచేందుకు రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, శిక్షణ అందించాలి. వాతావరణ మార్పులను తట్టుకునే పంట రకాలపై పరిశోధనలు జరగాలి.ఇదీ చదవండి: భారత పారిశ్రామికవేత్తలకు మస్క్ ఆతిథ్యండిజిటల్ ఇంటిగ్రేషన్డిజిటల్ ఇంటిగ్రేషన్ వ్యవసాయ రంగానికి ఎంతో తోడ్పడుతుంది. డిజిటల్ సాధనాల ద్వారా ప్రభుత్వం రైతులకు రియల్ టైమ్ సమాచారాన్ని అందించే వీలుంది. ఉదాహరణకు, మొబైల్ యాప్‌ల ద్వారా వాతావరణ సూచనలు, తెగుళ్ల నియంత్రణ సలహాలు, మార్కెట్ ధరలను అందించవచ్చు. రైతులు ఈ సమాచారంతో అనువైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇవి సహాయపడుతాయి. ఇప్పటికీ చాలామంది రైతులు సాంకేతికతకు దూరంగా ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన పెంచాలి. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల్లో రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానించే అవకాశం ఉంటుంది. దళారులను తొలగించి రైతులకు మద్దతుగా నిలవాలి. -
వ్యవసాయ రంగమే దేశాభివృద్ధికి కీలకం
సాధారణంగా దేశాభి వృద్ధికి పారిశ్రామిక రంగం, సేవల రంగం కీలక మైనవి. దీనికి భిన్నంగా మన దేశంలో వ్యవ సాయ రంగమే కీలక రంగంగా మారింది. మూల ధన సాంద్రత, సాంకే తిక పరమైన వనరుల ఉపయోగంతో పారిశ్రామిక రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. ఇక సేవల రంగంలోనైతే మానవ వనరుల నైపుణ్యం అంతంత మాత్రంగా ఉండడం వలన ఆ రంగ పురోగ మనం స్వల్పంగానే ఉంది. ఫలితంగా దేశ ప్రగ తికి వ్యవసాయ రంగమే నేడు ఆధారంగాఉంది. మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతు. 1950లలో 70 శాతం దేశ ప్రజలు వ్యవ సాయ రంగం పైనే ఆధారపడి ఉండేవారు. ఆ శాతం 2024 నాటికి 54.6 శాతంగా ఉంది.అంటే ఇంకా ఎక్కువగా ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడే జీవిస్తున్నారన్నమాట! సాగు భూమి విస్తీర్ణం కూడా అమెరికా, చైనా తరువాత మన దేశంలోనే ఎక్కువ. అయితే రైతులకు ఇచ్చిన హామీలను మన పాలకులు నెరవేర్చనందు వలన పెట్టుబడికి చేసిన అప్పుకు వడ్డీ కూడా చెల్లించలేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. గత 30 ఏళ్లలో రైతులు, రైతు కూలీలు నాలుగు లక్షల మంది ఆత్మహత్య చేసుకున్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా తెలియజేస్తోంది. రైతులు పండించిన పంటలకు ప్రభుత్వాలు సరైన గిట్టుబాటు ధరను కల్పించి, వాటిని కొనుగోలు చేసినప్పుడే రైతులు సుభిక్షంగా ఉంటారు. అలాగే దేశం కూడా! పొరుగు దేశమైన చైనాతో పోల్చుకుంటే మన రైతుల పరిస్థితి కడు దయనీయంగాఉంది. 1980లో మనదేశంలో రైతుల తలసరి ఆదాయం 582 డాలర్లు కాగా, చైనాలో 307 డాలర్లు మాత్రమే! 2024 వచ్చేటప్పటికి చైనాలో రైతుల తలసరి ఆదాయం 25,015 డాలర్లకు పెరగగా మన రైతులు 10,123 డాలర్లు మాత్రమే పొందగలిగారు.రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర లభించ కపోవడంతో 1990–91లో వ్యవసాయ రంగ వాటా జీడీపీలో 35 శాతం కాగా... 2022–23 లో 15 శాతానికి పడిపోయింది. వ్యవసాయరంగంపై ఆధారపడిన శ్రామిక జనాభా మాత్రం 60 శాతం వరకు ఉంది. కొన్ని అధ్యయనాలు చెబుతున్నట్టుగా భారతీయ రైతులు అభివృద్ధి నిచ్చెనలో అట్టడుగున ఉండటమే కాకుండా... దాదాపు పాతికేళ్లుగా ఏటా నష్టాలను చవి చూస్తున్నారు. శాశ్వత పేదరికం నుండి రైతు లను బయట పడేయడానికి ఏకైక మార్గం వ్యవ సాయ ధరలకు హామీ ఇవ్వడం కోసం ఒక చట్ట బద్ధమైన ఫ్రేమ్ వర్క్‌ను రూపొందించడం. కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం మార్కె ట్లను అస్తవ్యస్తం చేస్తుందని కేంద్రం కొన్నేళ్ల క్రితం సుప్రీంకోర్టుకు తెలపడం గమనార్హం.1991లో నూతన ఆర్థిక విధానాన్ని చేపట్టిన తరువాత వ్యవసాయ రంగం నుండి శ్రామి కులు పారిశ్రామిక రంగానికి బదిలీ అవుతారని భావించడం జరిగింది. అలాగే గ్లోబలైజేషన్ వలన వ్యవసాయ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లోకి వెళ్లడం వలన రైతులు లాభపడతారని అను కున్నారు. ఈ విధానం వచ్చి 30 ఏళ్లు గడిచి పోయాయి. అయినా అనుకున్నవేవీ జరగలేదు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆశయాలలో ముఖ్యమైనవి–విదేశీ వాణిజ్యం ద్వారా ప్రపంచ దేశాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం, ఉద్యోగ కల్పన చేయడం, ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అమ్ముకుని లాభాలను ఆర్జించేటట్లు చేయడం! ఈ నేపథ్యంలో మన పాలకులప్రపంచ దేశాల ఆకలి తీర్చుతున్న భారత రైతుల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లో అమ్మి లాభాలు పొందే విధంగా కార్యాచరణ చేప ట్టాలి. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు సమ కూర్చిన వనరులకు సమానంగా రైతులకు కూడా ఇచ్చినప్పుడే దేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయిలో ఉంటుంది.డా. ఎనుగొండ నాగరాజ నాయుడు వ్యాసకర్త రిటైర్డ్ ప్రిన్సిపాల్మొబైల్: 98663 22172 -
Kanuma Importance: కనుమ పండుగ ఈ విశేషాలు తెలుసా?
సంక్రాంతి పండగ సంబరాలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముచ్చటగా మూడు రోజుల వేడుకలో తొలి రోజు భోగి. భోగి మంటల వెచ్చటి వెలుగులతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తారు. రెండో రోజు మకర సంక్రాంతి కాంతులతో , సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని కోరుకుంటారు. కొత్తబియ్యంతో పొంగలి తయారు చేసుకుంటారు. మూడో రోజు కనుమ. పల్లెసీమలు పశుసంపద, వ్యవసాయ, పంటలతో సుభిక్షంగా కలకళలాడాలని ఆకాంక్షిస్తారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి, మొక్కుకుంటారు. అసలు ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు? ప్రయాణాలు చెయ్యరు ఎందుకు? తెలుసుకుందామా.!పశువులకు పూజలు, అందంగా ముస్తాబుసంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండగ. వ్యవసాయంలో ప్రధాన భూమిక పశువులదే. రైతులు ఎల్లవేళలా అండగా ఉంటాయి.అందుకే వాటిని దైవంతో సమానంగా భావిస్తున్నారు. పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నలు కనుమ రోజున పశువులను ఈ రోజున అందంగా అలంకరించి పూజిస్తారు. కనుమ రోజున పశువులను శుభ్రంగా కడిగి, వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్లకు మువ్వలుతొడిగి అలంకరించి కన్నబిడ్డల్ని చూసినట్టు మురిసిపోతారు. ఇలాఅలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా గ్రామ దేవత గుడిలో నైవేద్యం సమర్పిస్తారు. ఏడాదంతా సమృద్ధిగా పంటలు పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. మాంసాహారంతో విందు చేసుకుంటారు.అంతేకాదు గతంలో ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు సేకరించి, ఉప్పువేసి దంచి పొడి చేసి తినిపించేవారట. తద్వారా వాటిలో సంవత్సరానికి సరిపడా రోగనిరోధక శక్తి వస్తుందని నమ్మేవారు.ప్రయాణాలు ఎందుకు వద్దనేవారురవాణా సౌకర్యాలు బాగా లేని రోజుల్లో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించే ఆరాధించేవారు. అందుకే ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంలో ఈ రోజు ప్రయాణాలను మానుకునేవారట మన పెద్దలు. కనుమ రోజు ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే ఒక నానుడి ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవనే విశ్వాసం బాగా ఉంది. మరోవైపు సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతీ ఇల్లూ బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండువగా ఉంటుంది. కొత్త అల్లుళ్లు, పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లి తిరిగి పుట్టింటికి ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంతో వస్తారు. మరి వారితో సమయం గడిపేలా, కొత్త అల్లుడికి సకల మర్యాదలు చేసేలా బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దనే నియమం పెట్టారేమో! ఏది ఏమైనా ఈ నియమాలు కట్టుబాట్లు, ఎవరి ఇష్టాఇష్టాలు, నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి. -
మన నగరంలోనే అరుదైన పంటలు..రుద్రాక్ష, కుంకుమ పువ్వు..
హైదరాబాద్ నగరం కేవలం ఐటీ, పారిశ్రామిక స్టార్టప్‌లకు మాత్రమే కాదు.. అరుదైన పంటల ఆవిష్కర్తలకు నగరంలోని శివారు ప్రాంతాలు వేదికగా నిలుస్తున్నాయి.. బీటెక్ కోర్సులు పూర్తి చేసి, ఐటీ, ఇతర సాంకేతిక సాగులో ఆరితేరాల్సిన జిల్లా యువత.. అరుదైన పంటల పరిశోధనలు, సాగుపై దృష్టిసారించింది. అందమైన కాశ్మీర్ లోయల్లో మాత్రమే సాగయ్యే అరుదైన కుంకుమ పువ్వు బాలాపూర్ మండలం గుర్రంగూడలో సాగవుతుండగా, కేరళ తీరం వెంట మాత్రమే సాగయ్యే వక్క తోటలు శంకర్పల్లిలోనూ సాగవుతున్నాయి. ఇక సిమ్లా, ఇతర శీతల ప్రదేశాల్లో మాత్రమే కనిపించే యాపిల్ ప్రస్తుతం కందుకూరు మండలం పులిమామిడిలోనూ దర్శనమిస్తున్నాయి. సౌదీ అరేబియా దేశాల్లో విరివిగా పండే ఖర్జూర సరస్వతి గూడలో నోరూరిస్తుంది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న అవకాడో ప్రస్తుతం దెబ్బగూడలోనూ లభిస్తుంది. నేపాల్ సరిహద్దులో అరుదుగా లభించే రుద్రాక్ష.. ప్రస్తుతం మేడ్చల్ మండలం రాయిలాపూర్‌లో సాగవుతుండటం గమనార్హం.. ఎస్బీఐలో ఉద్యోగం చేస్తూ.. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో వ్యవసాయ కుటుంబం. నల్లగొండ ఎన్జీకాలేజీలో డిగ్రీ, ఉస్మానియాలో ఎంబీఏ పూర్తి చేశాను. ప్రస్తుతం కోఠి ఎస్బీఐలో పని చేస్తున్నా. అచ్చంపేటలో పదెకరాలు, సరస్వతి గూడలో ఏడెకరాలు ఉంది. యూట్యూబ్ ద్వారా అనంతపూర్‌లో ఖర్జూర సాగు చేస్తున్న విషయం తెలుసుకున్నా. ఆ మేరకు ఆరేళ్ల క్రితం మొత్తం 17 ఎకరాల్లో 1260 మొక్కలు నాటాను. ఎకరాకు రూ.5 లక్షల వరకూ వచి్చంది. మూడేళ్ల క్రితం దిగుబడి ప్రారంభమైంది. తొలిసారిగా 1.50 టన్నుల దిగుబడి వచి్చంది. ఆ తర్వాత 55 నుంచి 60 టన్నుల దిగుబడి వచ్చింది. – ఏమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అచ్చంపేట (ఖర్జూర) విదేశాల నుంచి తిరిగొచ్చి.. బీటెక్ పూర్తి చేసి, ఎంబీఏ కోసం పదేళ్ల క్రితం లండన్ వెళ్లాను. అక్కడ సరైన ఉపాధి అవకాశాలు లేక వెనక్కి తిరిగొచ్చా. అవకాడోపై అవగాహన ఉండటంతో అటువైపు చూశా.. మూడేళ్ల క్రితం 1.10 ఎకరాల విస్త్రీర్ణంలో 220 అవకాడో మొక్కలు నాటాను. సాధారణంగా 25 డిగ్రీల వాతావరణంలో మాత్రమే పెరిగే అవకాడో 40 డిగ్రీలకుపైగా నమోదైన ఉష్ణోగ్రతలను సైతం తట్టుకొని నిలబడింది. డ్రిప్ సాయంతో మొక్కలకు నీరు అందించా. చీడపీడల సమస్యే కాదు.. పెట్టుబడికి పైసా ఖర్చు కూడా కాలేదు. ఒక్కో చెట్టు నుంచి 150 నుంచి 200 కాయలు దిగుబడి వచ్చింది. ఆన్లైన్లో చూసి, స్వయంగా తోట వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. – రమావత్ జైపాల్, దెబ్బడిగూడ (అవకాడో) బీటెక్ చదువుతూనే.. బాలాపూర్ మండలం గుర్రంగూడ మాది. ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నా. వ్యవసాయ కుంటుంబం కావడంతో నాన్నతో పాటు తరచూ పొలానికి వెళ్తుంటా. కాశ్మీర్లో ప్యాంపూర్, పుల్వొమా జిల్లాల్లో అరుదుగా పండే కుంకుమ పువ్వు పంటను ఎంచుకున్నా. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కల్తీని నివారించి, నాణ్యమైన పువ్వును అందివ్వాలనుకున్నా. ఇంటిపై ఖాళీగా ఉన్న ఓ గదిలో 2024 సెప్టెంబర్‌లో సాగు ప్రారంభించాను. రూ.5 లక్షలు ఖర్చు అయ్యింది. ఇప్పటి వరకూ 20 గ్రాముల వరకూ సేకరించాం. ఒక గ్రాము రూ.800 నుంచి రూ.1000 వరకూ పలుకుతోంది. – లోహిత్‌రెడ్డి, గుర్రంగూడ (కుంకుమ పువ్వు) వక్కసాగులో విశ్రాంత వైద్యుడు.. ఐడీపీఎల్ బాలానగర్‌లో ఫ్యామిలి ఫిజీషియన్‌గా నాలుగు దశాబ్దాల పాటు సేవలు అందించా. శంకర్పల్లి మాసానిగూడలోని భూమిలో ఏదైనా చేయాలని భావించా. ఏలూరులో నా స్నేహితుడు విజయసారధి సూచనలతో 2015లో నాలుగు ఎకరాల్లో.. ఎకరాకు 300 చొప్పున వక్క మొక్కలు నాటాను. 2023లో తొలిసారిగా పంట దిగుబడి 1500 కేజీలు వచ్చింది. కేజీ రూ.350 నుంచి రూ.400 పలుకుతుంది. వక్కతోటలోనే అంతరపంటలుగా మిరియాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి, లవంగాలు, అల్లం, యాపిల్, ద్రాక్ష, బ్లూ బెర్రీ, బ్లాక్ బెర్రీ, అవకాడో, మ్యాంగో, జామ వంటి పండ్ల మొక్కలను సాగు చేస్తున్నా. మరో ఏడాదిలో పండ్ల దిగుబడి ప్రారంభమవుతుంది. – డాక్టర్ విజయ్‌కుమార్ కొడాలి, బోధన్ (వక్కసాగు)రాయలాపూర్లో రుద్రాక్ష.. ఫిన్లాండ్కు చెందిన మహిళను వివాహం చేసుకుని మేడ్చల్ మండలం రాయలాపూర్ గ్రామ శివారులో స్థిరపడ్డారు. ఇంటి చుట్టూ వివిధ రకాల చెట్లు నాటారు. దక్షిణ భారతదేశంలో అత్యంత అరుదుగా కనిపించే రుద్రక్ష మొక్కలను ఇంటి ముందు నాటారు. ప్రస్తుతం దిగుబడి ప్రారంభమైంది. జనవరి, ఫిబ్రవరిలో కాయలు తెంపి, ఆరబెడుతుంటారు. ప్రదీప్ ఇటీవల వెయ్యి రుద్రాక్షలతో పూజ చేయడం కొసమెరుపు. – ప్రదీప్, మేడ్చల్ (రుద్రాక్ష) (చదవండి: గట్ బయోమ్ 'పవర్ హోమ్'..!) -
అక్కడి ఆచారం.. సంక్రాంతికి దూరం
గుర్రంకొండ: సంక్రాంతి విశిష్టత.. ఆ పండుగ సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే అలాంటి పర్వదినానికి కొన్ని గ్రామాలు కొన్నేళ్ల నుంచి దూరంగా ఉంటున్నాయి. ఇది అక్కడి ఆచారంగా కొనసాగుతుండటం గమనార్హం. ఇలాంటి పల్లె సీమలు అన్నమయ్య జిల్లా గుర్రకొండ మండలంలో 18 ఉన్నాయి. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని.. ఆ గ్రామాల వాసులు ఆధునిక కాలంలో కూడా పాటిస్తుండటం విశేషం. ఎప్పుడో పెద్దలు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లను కలసికట్టుగా అమలు చేస్తుండటం వారి ప్రత్యేకత. మార్చిలో ఉత్సవాలే వారికి సంక్రాంతి మండలంలోని మారుమూల టి.పసలవాండ్లపల్లె పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల వాసులందరూ కలిసి టి.పసలవాండ్లపల్లెలో ఉన్న శ్రీ పల్లావలమ్మ అమ్మవారిని గ్రామ దేవతగా కొలుస్తారు. ఏటా మార్చిలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ. శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం ఈ పర్వదినం జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. వారి ఆదేశాలనే నేటికీ పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. వాటిలో ఆవులను అమ్మవారి ఉత్సవాల రోజున అందంగా అలంకరించి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో అందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదే వారికి సంక్రాంతి పండుగ. పాడి ఆవులతో వ్యవసాయం నిషేధంపాడి ఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో.. పాడి ఆవులతో వ్యవసాయం చేయడం నిషేధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. అయితే ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ ఎప్పటి నుంచో కొనసాగుతుండటం విశేషం. పూర్వపు తమ పెద్దల ఆచారం ప్రకారమే ఈ సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. ఆచారాలను మరువబోం మా పూరీ్వకులు ఆచరించిన ఆచారాలను మరవబోము. గ్రామ దేవత శ్రీపల్లావలమ్మ ఉత్సవాల రోజున అమ్మవారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొచ్చి పూజలు నిర్వహిస్తాం. అదే మాకు సంక్రాంతి. –బ్రహ్మయ్య, ఆలయ పూజారి, బత్తినగారిపల్లె పూర్వీకుల అడుగుజాడల్లో.. పూర్వీకుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ నేటికీ వారి అడుగుజాడల్లోనే నడుస్తున్నాం. మా ప్రాంతంలోని 18 గ్రామా ల ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకోబోము. మా పెద్దోళ్ల కాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. ఈ సంస్కృతిని ముందు తరాల వారు కూడా పాటిస్తారని నమ్ముతున్నాం. – కరుణాకర్, టి.గొల్లపల్లె, టి.పసలవాండ్లపల్లె పంచాయతీ -
రైతుల సేవలో కేవీకే
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ మండలం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రాన్ని (Krishi Vigyan Kendra) 1989లో ఏర్పాటు చేశారు. 36 ఏళ్లుగా ఈ కేంద్రం రైతులకు సేవలందిస్తోంది. జెన్నారెడ్డి రఘోత్తంరెడ్డి తన తండ్రి వెంకటరెడ్డి పేరు మీద మల్యాల గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రానికి 46.6 ఎకరాల భూమిని కేటాయించారు. మల్యాల కేవీకేలో సమన్వయకర్తగా డాక్టర్ ఎస్.మాలతి, విస్తరణ విభాగ అధిపతిగా డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, పంట సేద్యం ఉత్పత్తి శాస్త్రవేత్తగా బి.క్రాంతికుమార్, ఉద్యాన శాస్త్రవేత్తగా డాక్టర్ ఈ.రాంబాబు పనిచేస్తున్నారు. సస్యరక్షణ విభాగం, వెటర్నరీ, గృహ విజ్ఞాన విభాగాల శాస్త్రవేత్తల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైతులకు అవగాహన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనలపై మల్యాల కేవీకే ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. స్థానిక భూముల నాణ్యతను బట్టి వాటికి అనువుగా ఉంటే ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాలుగా ఎంపిక చేసి పరీక్షలు నిర్వహిస్తారు. మళ్లీ వాటిని పరిశోధనకు తీసుకువెళ్లి ఇతర రైతులకు ఉపయోగపడే విధంగా తెలియజేస్తున్నారు. రైతు దినోత్సవాలు, కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉన్న ప్రధాన పంటలపైన రైతులకు శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలను సమన్వయం చేస్తూ సీజన్లో రైతులు సాగుచేస్తున్న పంట క్షేత్రాలను సందర్శించి పురుగులు, తెగుళ్ల నివారణ విషయంలో రైతులను చైతన్యపరుస్తున్నారు. చిరు సంచుల్లో వంగడాలు.. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన వంగడాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేస్తున్నారు. రైతులు చిరు సంచుల ధాన్యం అభివృద్ధి బాగా ఉందని చెబితే కొత్తగా మరింత మంది రైతులకు ఇస్తున్నారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, యాంత్రీకరణ, చీడపీడల నివారణ, పురుగుమందుల వాడకంపై మల్యాల కేవీకే శాస్త్రవేత్తలు క్షేత్ర దినోత్సవాలు, ప్రదర్శనలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల క్షేత్రాల్లో వరి, పత్తి, మిరప, మొక్కజొన్న పంటలతోపాటు ఆరుతడి పంటలపై క్షేత్ర ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. మట్టి పరీక్షలు.. భూసార పరీక్ష కేంద్రం ద్వారా రైతులకు మట్టి, నీళ్ల పరీక్షలు నిర్వహించి ఫలితాలు తెలియజేస్తున్నారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడంతోపాటు సేంద్రియ సాగుపై ఆసక్తి పెరిగే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పెట్టుబడులు తగ్గించి అధిక దిగుబడులు పొందడం కోసం రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ వ్యవసాయంలో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నారు. వరి విత్తన ఉత్పత్తి.. మల్యాల కేవీకేలోని ఫాంలో వరి విత్తన ఉత్పత్తిలో భాగంగా సిద్ధి సన్న రకం, ఆర్ఎన్ఆర్ 15048 (తెలంగాణ సోనా), కునారం 118 సన్నాలు, డబ్ల్యూజీఎల్ 962 సన్నాలు తయారు చేస్తున్నారు. వరిలో విత్తన ఉత్పత్తి ద్వారా జిల్లాలోని రైతాంగానికి నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నారు. గిరిజన ఉప ప్రణాళిక, ఎస్సీ ఉప ప్రణాళిక పథకంలో భాగంగా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు పంటల సాగులో మెళకువలపై శిక్షణ ఇస్తున్నారు. అదే విధంగా స్కిల్ ట్రైనింగ్‌లు, ఒకేషనల్ ట్రైనింగ్‌లు, గుర్తించబడిన అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆర్య (అట్రాక్టింగ్ అండ్ రిటైనింగ్ రూరల్ యూత్ ఇన్ అగ్రికల్చర్) పథకంలో భాగంగా గ్రామాలను దత్తత తీసుకుని 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారిని ఎంపిక చేసి పురుష, మహిళా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కూరగాయల సాగు, పెరటికోళ్ల పెంపకం.. కేవీకేలోని షేడ్ నెట్లలో కూరగాయల సాగు పెంపకం, వర్మి కంపోస్టు తయారీ, పెరటి కోళ్ల పెంపకం, చిరుధాన్యాలతో వంటకాలు తయారు చేయడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. గిరిజనులు, దళితులు ఎక్కువగా ఉండే గ్రామాలను ఎంపిక చేసి, దత్తత తీసుకొని అక్కడి స్థానికులకు కుట్టు మెషీన్లపై శిక్షణ ఇచ్చారు. మూడు నుంచి నాలుగు సంవత్సరాలకుగాను జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని శిక్షణ ఇస్తున్నారు. కాటన్ స్పెషల్ ప్రాజెక్టులో భాగంగా నాగ్‌పూర్ అఖిల భారత పత్తి పరిశోధన సంస్థ (సీఐసీఆర్) సహకారంతో అధిక సాంద్రత పత్తి సాగు వల్ల జరిగే మేలుపై రైతులకు శిక్షణ ఇచ్చారు. తద్వారా రోజురోజుకూ రైతులు అధిక సాంద్రత పత్తి సాగుపై మక్కువ కనబరుస్తున్నారు. దీంతో మొక్కల సంఖ్య పెరిగి పంట దిగుబడి పెరగటంతో పాటుగా ఆర్థికంగా చేయూత వచ్చే విధంగా కృషి చేస్తున్నారు.మరిన్ని విశేషాలు.. » పెసర, మినుము, కందిలో కొత్త రకాలను చిరు సంచుల రూపంలో రైతులకు అందజేసి పంటల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. » కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,12,124 మంది రైతులను అందులో సభ్యులుగా చేర్చారు. పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలను కిసాన్ సారథి మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని రైతులకు చేరవేస్తున్నారు. » డిస్ట్రిక్ట్ ఆగ్రో మెటరాలజీ యూనిట్ (దాము) వాట్సాప్ గ్రూపు ద్వారా 2023–24 సంవత్సరంలో రైతులకు వాతావరణ సూచనలు చేరవేశారు. »మల్యాల కేవీకే అనుసంధానంలో రైతులకు మిరపలో సాగు జాగ్రత్త చర్యలో భాగంగా నీలిరంగు, పసుపు రంగు జిగురు అట్టలను మిరప పంట చేలలో ఏర్పాటు చేసుకుని పంటను కాపాడుకునే విధానాలపై తెలియజేస్తున్నారు. మిరపలో సమగ్ర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మల్చింగ్ విధానం వల్ల కలిగే లాభాలు, మిరప పంట చేనుల చుట్టూ బంతి పూల చెట్లు, మొక్కజొన్న వేసుకుంటే మేలుదాయకమని అవగాహన కల్పిస్తున్నారు. » వరిలో నేరుగా వెదజల్లే పద్ధతి ద్వారా రైతులకు లాభాలు చేకూరుస్తున్నారు. » మొక్కజొన్నలో జంటసాళ్ల పద్ధతిపై అవగాహన కల్పిస్తున్నారు. » యాసంగిలో జీరో టిల్లేట్ పద్ధతిలో మొక్కజొన్న సాగు లాభదాయకంపై తెలియజేస్తున్నారు. » వరి, మిరప పంటలకు ముందుగా పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని అవగాహన కల్పించటం వల్ల 40 శాతం వరకు రైతులు వృద్ధి సాధిస్తుండగా సూడోమోనోస్ జీవ నియంత్రికల వాడకాన్ని పెంచారు.మందుల వాడకం తగ్గించాలి రైతులు పంటల సాగు సమయంలో పురుగు మందులు, తెగుళ్ల మందులు అధికంగా వాడటం వల్ల భూసారం దెబ్బతింటుంది. పురుగు మందులు, తెగుళ్ల మందుల వాడకం తగ్గించడం శుభసూచకం. తద్వారా మనం సాగుచేసే నేల పాడైపోకుండా భావితరాల వారికి అందించే విధంగా ఉంటుంది. విచక్షణారహితంగా మందుల వాడకాన్ని తగ్గించాలి. సమీకృత వ్యవసాయాన్ని ఆచరించాలి. భావితరాల పురోగతికి నాంది పలకాలి. – డాక్టర్ ఎస్.మాలతి, మల్యాల కేవీకే సమన్వయకర్త గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తున్నాం... మల్యాల కేవీకే ద్వారా నిర్వహించే వివిధ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలతో గ్రామీణ యువతకు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై అవగాహన కల్పిస్తున్నాం. తద్వారా వారు ఉపాధి అవకాశాలు పొందే విధంగా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలోని రైతులకు సమగ్ర ఎరువులు, పురుగు మందుల వాడకంపై తెలియజేస్తూ వారు సమగ్ర వ్యవసాయం చేసే విధంగా అవగాహన కల్పిస్తున్నాం. - డాక్టర్ ఎన్.కిషోర్ కుమార్, మల్యాల కేవీకే శాస్త్రవేత్త కొత్త రకాల విత్తనాలతో దిగుబడి సాధించా.. మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నేను కొత్త రకాలైన వరి, పెసర విత్తనాలను తీసుకున్నాను. వాటి ద్వారా అధిక దిగుబడి సాధిస్తూ నాతోటి రైతులకు కొత్త రకం వరి, పెసర రకాలను పరిచయం చేస్తున్నాను. కేవీకే ద్వారా ఏర్పాటు చేస్తున్న అనేక శిక్షణ కార్యక్రమాలు, రైతు సదస్సులకు హాజరవుతున్నాను. తద్వారా రైతులు కొత్త విషయాలను తెలుసుకునే విధంగా సాయం చేస్తున్నాను. ముఖ్యంగా నేరుగా వరిలో విత్తేపద్ధతి, సమగ్ర వ్యవసాయం, కొత్త రకాలు, వివిధ పంటల్లో జంటసాళ్ల పద్ధతి మొక్కజొన్నలో అవలంబిస్తూ ఆర్థిక లబ్ధి పొందుతున్నాను. –గండ్రాతి భాస్కర్‌రెడ్డి, రైతు, బయ్యారం అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను మల్యాల కేవీకే ద్వారా గత మూడు సంవత్సరాలుగా నేను అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేస్తున్నాను. దీని ద్వారా ఎకరాకు పది నుంచి 11 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తుండగా ఆర్థికంగా అభివృద్ధి ఉంటోంది. పత్తి తర్వాత జొన్న, బొబ్బెర పంటలను సాగుచేసి ఆదాయాన్ని పొందుతున్నాను. మల్యాల కేవీకే ద్వారా ముఖ్యంగా సమగ్ర ఎరువులు, పురుగు మందుల యాజమాన్యం, అధిక సాంద్రత పత్తిసాగు, కొత్త రకాలైన విత్తనాలు, సమగ్ర వ్యవసాయంపై విషయాలు తెలుసుకుని తోటి రైతులు అవలంబించే విధంగా ప్రోత్సహిస్తున్నాను. –మాలోతు బాలాజీ, రైతు, చంద్రుతండా -
కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..
గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.నీడలోనూ పెరుగుతుందిగులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్డోర్ బొకేల్లో పెట్టినా, గార్డెన్లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్), మగ (స్టేమెన్స్) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్ నుంచి డబుల్ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి. పూల రంగులు... ప్రతీకలుపూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.2 నుంచి 12 మీటర్ల ఎత్తు కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.పూలు.. అనేక వారాలు! కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.ఆమ్ల నేలల్లో పెరుగుతుందిగులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఆకులతో టీ, గింజలతో నూనెకామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది. -
బడ్జెట్‌కు ముందు వ్యవసాయ మంత్రులతో సమీక్ష
కేంద్ర బడ్జెట్(Union Budget) ప్రవేశ పెట్టడానికి ముందు చేపడుతున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర వ్యవసాయ మంత్రులతో వివిధ పథకాల గురించి చర్చించారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి వారి సలహాలను కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు 3.5-4 శాతం వృద్ధి రేటును సాధించడంపై వర్చువల్ సమావేశంలో చౌహాన్ సంతృప్తి వ్యక్తం చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో 7.2 శాతంగా ఉన్న గ్రామీణ పేదరిక రేటు 2024 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా 5 శాతం కంటే తక్కువకు పడిపోయిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదికను ఆయన స్వాగతించారు. ప్రభుత్వ సంస్థ ఐసీఏఆర్ పరిశోధనల ద్వారా హెక్టార్‌కు ప్రస్తుతం నమోదవుతున్న ఉత్పత్తిని పెంచడం, కొత్త విత్తన వంగడాలను తయారు చేయడంతోపాటు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఆరు సూత్రాల వ్యూహాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, సూక్ష్మ సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం, నూతన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాపీఎం కిసాన్, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, డీఏపీ ఎరువుల సబ్సిడీ, కిసాన్ క్రెడిట్ కార్డు(Credit Card), ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్ (పీఎంఏఏఎస్ఏ) సహా కీలక పథకాల్లో పురోగతి ఉందని చౌహాన్ వివరించారు. వ్యవసాయ రంగంలో నిరంతరం పురోగతి నమోదువుతుందని, దాని కోసం అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. సమావేశంలో వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అగ్రిసెట్ ద్వారా స్పోర్ట్స్ కోటా, మిగిలిన సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అగ్రిసెట్ 2024 ర్యాంకు ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలకు మిగిలిన సీట్ల భర్తీకి, స్పోర్ట్స్ కోటాలో సీట్ల భర్తీకి ఫైనల్ మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని రిజిస్ట్రేషన్ డాక్టర్ రామచంద్రరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి లాంఫాంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. -
అగ్రిటెక్ రంగంలో భారీగా కొలువులు
ముంబై: అగ్రిటెక్ రంగంలో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 60–80 వేల పైచిలుకు కొలువులు రాగలవని టీమ్‌లీజ్ సర్విసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ (సీఎస్‌వో) సుబ్బురత్నం తెలిపారు. ఏఐ డెవలప్మెంట్, టెక్నాలజీ, పర్యావరణహిత వ్యవసాయ సొల్యూషన్స్, సప్లై చెయిన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉండగలవని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా అగ్రిటెక్ రంగంలో సాంకేతిక నిపుణులు, ఆపరేషన్స్ సిబ్బంది, మేనేజర్లు మొదలైన హోదాల్లో 1 లక్ష పైగా ఉద్యోగులు ఉన్నట్లు సుబ్బురత్నం వివరించారు. వ్యవసాయం ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు అత్యధికంగా ఉండగలవన్నారు. ఇక హైదరాబాద్, బెంగళూరు, పుణె, గురుగ్రామ్లాంటి నగరాలు అగ్రిటెక్ స్టార్టప్‌లకు కీలక కేంద్రాలుగా మారగలవని సుబ్బురత్నం చెప్పారు. హైబ్రిడ్ ఉద్యోగాలు.. అగ్రిటెక్ రంగం ప్రధానంగా సాంకేతిక ఆవిష్కరణలు, అనలిటిక్స్ వంటి అంశాలపై దృష్టి పెడుతుంది కాబట్టి ఈ ఉద్యోగాలు సీజనల్‌గా ఉండవని పేర్కొన్నారు. సీజన్లో నాట్లు వేయడం నుంచి కోతల వరకు వివిధ రకాల పర్యవేక్షణ కార్యకలాపాల్లో పాలుపంచుకునే సిబ్బంది .. ఆఫ్–సీజన్లో డేటా విశ్లేషణ, పరికరాల నిర్వహణ మొదలైన వాటిపై పని చేస్తారని చెప్పారు. సాధారణంగా అగ్రిటెక్ ఉద్యోగాలు హైబ్రిడ్ విధానంలో ఉంటాయన్నారు. సాఫ్ట్వేర్ అభివృద్ధి, డేటా అనలిటిక్స్, పర్యవేక్షణ బాధ్యతలను ఎక్కడి నుంచైనా నిర్వర్తించవచ్చని .. కానీ మెషిన్ ఆపరేటర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వారు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుందని సుబ్బురత్నం చెప్పారు. కన్సల్టెన్సీ సంస్థ ఈవై నివేదిక ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా వ్యవసాయంలో కేవలం 1.5 శాతమే టెక్నాలజీ వినియోగం ఉంటోందని, ఈ నేపథ్యంలో అగ్రిటెక్ కంపెనీలకు 24 బిలియన్ డాలర్ల వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రకారం 2022 నాటికి భారత్‌లో సుమారు 450 అగ్రిటెక్ స్టార్టప్‌లు ఉన్నట్లు వివరించారు. -
శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అంటే..!
రిసైలియన్స్(Resilience) అనే పదానికి ఖచ్చితమైన అనువాదం స్థితిస్థాపకత. మామూలు మాటల్లో చెప్పాలంటే.. వాతావరణ మార్పుల్ని దీటుగా తట్టుకునే సామర్థ్యం. శీతోష్ణస్థితి స్థితిస్థాపకత అనేది వాతావరణ ప్రతికూల ప్రభావాలను అంచనా వేయడానికి, వాటి నష్టాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. భూతాపోన్నతి(Global Warming) వల్ల కలిగే తుపాన్లు, తీవ్ర వడగాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక జనసమూహం లేదా పర్యావరణ వ్యవస్థ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి, మార్పు చెందడానికి గల సామర్ధ్యం ఎంత అనేది ముఖ్యం. వాతావరణ మార్పుల వల్ల అనివార్యంగా ఎదురయ్యే కష్టనష్టాలను ఎదుర్కొని పర్యావరణాన్ని(Environment), ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి ప్రజలు, సమూహాలు, ప్రభుత్వాలు సన్నద్ధం కావాలి. కొత్త నైపుణ్యాలను పొందడానికి, కొత్త రకాల ఆదాయ వనరులను అందిపుచ్చుకోవటానికి ప్రజలకు శిక్షణ ఇవ్వడం.. విపత్తులకు మరింత బలంగా ప్రతిస్పందించే, పునరుద్ధరణ సామర్థ్యాలను పెంపొందించటం.. వాతావరణ సమాచారం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మెరుగుపరచడం, దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయడం ద్వారా వాతావరణ మార్పుల్ని దీటుగా ఎదుర్కునే సామర్థ్యాలను పెంపొందించుకోవచ్చు. నిజానికి సమాజం వాతావరణపరంగా స్థిరత్వాన్ని పొందాలంటే శిలాజ ఇంధనాల వినియోగం తగ్గించటం ముఖ్యమైనది. కర్బన ఉద్గారాలను విడుదల చేసే పనులను భారీగా తగ్గించటమే భవిష్యత్తులో వాతావరణ ప్రభావాలను(climate changes) తగ్గించే ఉత్తమ మార్గం. ఎక్కువ కాలుష్యానికి కారణమయ్యే దేశాలు వాతావరణ మార్పుల ప్రభావాలకు ఎక్కువగా గురయ్యే సమాజాలకు, వ్యక్తులకు మద్దతుగా నిలవటంలోనే వాటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయి. (చదవండి: ఇంటి పంటల సాగుకు ఏడు సూత్రాలు!) -
నేలమ్మకు కొత్త శక్తి.. చీడపీడల విముక్తి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మన ఆహారం ఆరోగ్యానికి మేలు చేసేదిగా ఉండాలంటే ఆహార ఉత్పత్తులు పండే నేల కూడా ఆరోగ్యంగా ఉండాలి. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడిన నేలల్లో పండే పంటలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అలాంటిది ఆరోగ్యానికి మేలు చేసే, అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల అభివృద్ధికి మెట్ట ప్రాంత పంటల అంతర్జాతీయ పరిశోధన కేంద్రం (ఇక్రిసాట్) కొత్త దారిలో పరిశోధనలు చేస్తోంది. ఇందుకోసం పునరుత్పాదక వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తోంది. ఈ దిశగా ముందడుగు సైతం వేసింది. భారత్‌తోపాటు వివిధ దేశాల్లో ఎక్కువగా సాగయ్యే వేరుశనగ, కంది, సజ్జ, పొద్దుతిరుగుడు, శనగ వంటి మెట్ట పంటల్లో మెరుగైన వంగడాల కోసం ఈ విధానంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఏడాదంతా ఏదో పంట.. ఈ పునరుత్పత్తి వ్యవసాయం పద్ధతిలో.. ఒకే కమతంలో పక్కపక్కనే వివిధ రకాల పంటలు వి త్తుకుంటారు. ఒక్కో పంట ఒక్కో దశలో ఉంటుంది. ఏడాదంతా వాటి అనుకూల కాలానికి తగ్గట్లుగా ఈ పంటలు వేసుకుంటున్నారు. ఒక పంట కొతకొచ్చే దశలో మరో పంట కాయ దశలో ఉంటుంది. ఇంకో పంట పూత దశకు వస్తుంది. రెండు బ్లాకుల్లో సాగు.. ఇక్రిసాట్‌లో మొత్తం నాలుగు రకాల నేలలు ఉండగా అందులో ఎర్ర, నల్లరేగడి నేలల్లోని రెండు బ్లాకుల్లో పునరుత్పత్తి వ్యవసాయ విధానంపై పరిశోదనలు సాగుతున్నాయి. ఎర్ర నేలతో కూడిన బ్లాకులో వేరుశనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలను ఒకే కమతంలో సాగు చేస్తున్నారు. నల్లరేగడి నేలతో కూడిన మరో బ్లాక్‌లో శనగ, పొద్దుతిరుగుడు, సజ్జ, కంది పంటలు వేశారు. ఇవీ ప్రయోజనాలు.. రీజనరేటివ్ అగ్రికల్చర్ విధానంలో అనేక ప్రయోజనాలున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాగవుతున్న పంటల్లో దేనికైనా చీడపీడలు ఆశిస్తే ఆ ప్రభావం పక్కనే ఉన్న మరో పంటకు వ్యాపించేందుకు వీలుండదు. ఆ పంటకే పరిమితమవుతుంది. అదే ఒకే పంట పూర్తి విస్తీర్ణం వేస్తే చీడపీడలు పూర్తి విస్తీర్ణంలో పంటలను ఆశించే ప్రమాదం ఉంటుంది. దీన్ని ఈ విధానం ద్వారా అధిగమించేలా పరిశోధనల ప్రక్రియ కొనసాగుతోంది. అలాగే ఆరోగ్యవంతమైన బ్యాక్టీరియా, పంటలకు ఉపయోగకరమైన ఫంగస్‌ను నాశనం కాకుండా కాపాడుకోవచ్చు. హానికరమైన రసాయనాలు, కలుపు మందులు, పురుగు మందులపై ఆధార పడాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యకరమైన నేలపై పర్యావరణానికి అనుకూలమైన రీతిలో ఈ వ్యవసాయం ఉంటుంది. విలువైన ప్రకృతి వనరులు క్షీణించకుండా, వనరులు మరింత బలోపేతం అయ్యేందుకు ఈ విధానం దోహదపడుతుంది.సాధారణంగా ఏటా అధిక మోతాదుల్లో ఎరువుల వాడకం వల్ల నేల స్వభా వాన్ని కోల్పోతూ ఉంటుంది. కానీ పునరుత్పాదక వ్యవసాయ విధానం ద్వారా నేల పునరుజ్జీవం చెందుతుంది. డీగ్రేడ్ అయిన నేల రీస్టోర్ అవుతుందని రీసెర్చ్ స్కాలర్ కల్పన పేర్కొన్నారు. -
యాంత్రీకరణతోనే రైతులకు ఆదాయం
సాక్షి, మచిలీపట్నం/పెనమలూరు: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను అందుబాటులోకి తెచ్చి రైతులు మంచి ఆదాయం పొందేలా చూస్తామని, పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి పూర్తిన్యాయం చేస్తామని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు, కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. గంగూరు రైతు సేవాకేంద్రంలో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించి రైతులతో మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పులు జరగకూడదన్నారు. తేమ శాతంలో కచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. తేమ శాతం సమస్య పరిష్కరించేందుకు డ్రైయ్యర్లను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే మొబైల్ డ్రైయర్లను పొలాల వద్దే అందుబాటులో ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు. ఎరువులు, పురుగు మందులు అధిక మోతాదులో వాడొద్దన్నారు. డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయని, మొబైల్ యాప్ ద్వారా పంటలో పురుగుల మందు, ఎరువులు ఎక్కడ వాడాలో తెలుసుకుని డ్రోన్ టెక్నాలజీతో తక్కువ ఖర్చుతో సమస్య అధిగమించే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ధాన్యం డబ్బును 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. మిల్లర్లు నాణ్యమైన గోనె సంచులు ఇవ్వాలన్నారు. దళారులు లేకుండా రైతులకు న్యాయం చేస్తామని, అవసరమైతే దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా.. సాగునీటి కాలువలు మురుగుతో పూడుకుపోయాయని, పంటలకు నీళ్లందటం లేదని రైతులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, టార్పాలిన్లు ఇవ్వాలని కోరారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని, గోనె సంచుల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం రవాణాకు వాహనాలు జాప్యం లేకుండా ఏర్పాటు చేయాలని, తమలపాకు తోటలకు సబ్సిడీపై కర్రలు ఇవ్వాలని కోరారు. సెంటు భూమి పోయినా ఇప్పిస్తాం అన్ని హక్కులు ఉండి సెంటు భూమి పోయినా ఇప్పించే బాధ్యత తమదని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈడుపుగల్లులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భూకబ్జాలతో మొదలుపెట్టి వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేసిందన్నారు. ఇప్పటివరకు 1.57 లక్షల అర్జీలు తనకు వచ్చాయని, రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 దరఖాస్తులు, ఇంటి జాగా కోసం 9,830, ల్యాండ్ గ్రాబింగ్ ఫిర్యాదులు 9,528, ప్రభుత్వ భూమి కోసం 8,366 ఆక్రమణలకు సంబంధించి 8,227, అధికారులపై 8 వేలు ఫిర్యాదులు వచ్చాయని సీఎం వివరించారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి, రాజముద్ర ఉండాల్సిన చోట వైఎస్ జగన్ సొంత బొమ్మ వేసుకున్నారన్నారు. ప్రజల్లో ఆందోళన కారణంగా తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసినట్టు చెప్పారు. గతంలో భూమిని కబ్జా చేసినా, 22ఏలో పెట్టినా, భూమి మీది కాదని చెప్పినా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. 6,698 గ్రామాల్లో రీసర్వే చేయగా తప్పుడు సర్వే జరిగిందంటూ దాదాపు 2,79,148 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. -
మళ్లీ పొలంబాట..!
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయ కుటుంబాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కరువు, వరదలు వంటి వాతావరణ ప్రతికూలతలు వ్యవసాయ కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నప్పటికీ... గ్రామాల్లో అత్యధిక కుటుంబాలకు వ్యవసాయమే ప్రధాన జీవనోపాధిగా మారింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పొలంబాట పట్టే కుటుంబాలు పెరుగుతూనే ఉన్నాయి. నాబార్డు 2016–17 సంవత్సరంలో నిర్వహించిన రూరల్ ఫైనాన్సియల్ సర్వే ప్రకారం దేశంలో వ్యవసాయ కుటుంబాలు 48 శాతం ఉండగా... 2021–22లో నిర్వహించిన సర్వే ప్రకారం వ్యవసాయ కుటుంబాలు 57 శాతానికి పెరిగాయి.దేశంలో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు 9 శాతం పెరిగినట్లు ఈ సర్వే స్పష్టంచేసింది. ఇటీవల నాబార్డు ఆ సర్వే వివరాలను వెల్లడించింది. ఏపీతో సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నట్లు సర్వేలో తేలింది.2016–17లో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కుటుంబాలు 34 శాతం ఉండగా... 2021–22లో ఏకంగా 53 శాతానికి పెరిగాయి. మన రాష్ట్రంలో వ్యవసాయ కుటుంబాలు 19 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. కేరళ, గోవా రాష్ట్రాల్లో కేవలం 18 శాతం కుటుంబాలు మాత్రమే వ్యవసాయంపై ఆధారపడ్డాయి. ఈ రెండు రాష్ట్రాలతోపాటు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, బిహార్, సిక్కిం, త్రిపుర, పంజాబ్, మిజోరాం, మణిపూర్లలోను వ్యవసాయేతర కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలన్న సంకల్పంతో దేశవ్యాప్తంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ తయారీకి రాష్ట్రంలోనూ రంగం సిద్ధమైంది. ఇందులో ఆధార్ తరహాలోనే ప్రతి రైతుకు 14 నంబర్లతో విశిష్ట గుర్తింపు సంఖ్య (యూనిక్ కోడ్) కేటాయించనున్నారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది భూ యజమానులకు యూసీ జారీ చేయనున్నారు. ఏపీలో మాత్రం భూ యజమానులతో పాటు కౌలుదారులకు కూడా యూసీలు జారీ చేస్తారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రీ తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్రి సెన్సస్–2019 ప్రకారం రాష్ట్రంలో 76.07 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులు 41.84 లక్షల మంది ఉన్నారు. కౌలు రైతులు 16.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో సెంటు భూమి కూడా లేని కౌలుదారులు 8 నుంచి 10 లక్షల మంది ఉండగా, దేవాదాయ, అటవీ భూముల సాగుదారులు 1.50 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికీ ఫార్మర్ రిజిస్ట్రీలో యూసీలు జారీ చేస్తారు.ప్రాజెక్టు నిర్వహణ, స్టీరింగ్, అమలు కమిటీలు ఏర్పాటుజాతీయ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్– అగ్రిస్టాక్ ప్రాజెక్టు పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు నేతృత్వంలో స్టేట్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ యూనిట్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ నేతృత్వంలో అమలు కమిటీ గురువారం ఏర్పాటయ్యాయి. మాస్టర్ ట్రైనీస్‌కు గురువారం నుంచి 3 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.26న నుంచి నమోదుఈ నెల 23న రాష్ట్ర స్థాయిలో అధికారికంగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. రైతు సేవా కేంద్రాల ద్వారా 24న ప్రాజెక్టు పోస్టర్లు, కరపత్రాలు పంపిణీ చేస్తారు. 26 నుంచి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు విశిష్ట గుర్తింపు సంఖ్య జారీ ప్రారంభమవుతుంది. ముందుగా జనవరి 21వ తేదీలోగా పీఎం కిసాన్ లబ్ధిదారులకు వీటిని జారీ చేస్తారు. ఆ తర్వాత మిగిలిన రైతులు, కౌలు రైతులకు ఇస్తారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూపొందించిన అప్లికేషన్ ద్వారా తొలుత ఆర్ఎస్కే సిబ్బంది వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా రైతుల వివరాలను ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసి యూసీలు కేటాయిస్తారు. వాటిని తహసీల్దార్లు అప్రూవ్ చేస్తారు. రైతులు లేవనెత్తే అభ్యంతరాలను మండల వ్యవసాయ శాఖాధికారులు పరిష్కరిస్తారు. జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా రైతుల రిజిస్ట్రీని రూపొందిస్తారు.ఎన్నో ప్రయోజనాలు..యూనిక్ కోడ్‌తో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. సబ్సిడీలు, రుణాలు, పంటల బీమా వంటి పథకాలను ఈ కోడ్‌తో అనుసంధానం చేస్తారు. ఫార్మర్ రిజిస్ట్రీని యూనిఫైడ్ ల్యాండ్ ఏపీఐ, ఆధార్ బేస్డ్ అథంటికేషన్, పీఏం కిసాన్ వంటి డిజిటల్ అగ్రికల్చర్ ప్లాట్‌ఫామ్స్‌కు సైతం అనుసంధానం చేస్తారు. కౌలు రైతులతో పాటు భూమి లేని కూలీలకు సైతం ఆధార్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఐడీలను ఉపయోగించి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా బ్యాంక్ లింకేజ్‌తో కూడిన ఆర్ధిక సేవలు పొందవచ్చు. పంటలకు కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఈ ఐడీ ఉపకరిస్తుంది. ఈ ఐడీ సాయంతో దేశంలో ఎక్కడి నుంచైనా రైతుల రుణ అర్హత, రుణ బకాయిలు, ప్రభుత్వ పథకాల జమ వంటి వివరాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు.పారదర్శకంగా రైతు విశిష్ట సంఖ్య నమోదు: ఢిల్లీరావురైతు విశిష్ట సంఖ్య నమోదు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ సేనాపతి ఢిల్లీరావు వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు రైతు సేవా కేంద్రంలో నమోదు ప్రక్రియను ఆయన గురువారం పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ బ్లూ ప్రింట్‌తో క్షేత్ర స్థాయిలో సమాచార సేకరణ, విశిష్ట సంఖ్య నమోదులో వ్యత్యాసాలను పరిశీలించారు. ఈ ప్రక్రియలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, లోటుపాట్లపై డిజిటల్ సిబ్బంది, ఆర్ఎస్కే సహాయకులను ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఎరువుల సరఫరా, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లోన్ లింకేజ్లు ఇతర సౌకర్యాలకు రైతు విశిష్ట సంఖ్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. -
వ్యవ‘సాయ’ వర్సిటీ.. వజ్రోత్సవ శోభ
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయంలో నిత్య పరిశోధనలు..వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, శాస్త్రవేత్తలను అందించడం.. ఇలా అనేక రకాలుగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 20, 21 తేదీల్లో వజ్రోత్సవాలు జరగనున్నాయి. వ్యవసాయ కళాశాల నుంచి జయశంకర్ వర్సిటీ దాకా.. దేశ తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మార్గదర్శకంలో వ్యవసాయ విద్య ఆలోచనలకు తొలిబీజం పడింది. 1955 జనవరి 6న అప్పటి భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజేంద్రనగర్‌లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 1964 జూన్ 12న వ్యవసాయ కళాశాల ప్రారంభం కాగా, 1965 మార్చి 20న అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీదుగా వర్సిటీని రైతులకు అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రారంభమై..1996లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు మార్చుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెపె్టంబర్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. » ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 11 కళాశాలలు, 12 వ్యవసాయ పాలిటెక్నిక్, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, 12 వ్యవసాయ పరిశోధన స్థానాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు , 9 ఏరువాక కేంద్రాలు కొనసాగుతున్నాయి. » అరవై ఏళ్ల వర్సిటీ ప్రస్థానంలో వ్యవసాయవిద్యలో సుమారు 32,300 మంది విద్యార్థులు డిగ్రీలు, 12,300 మంది పాలిటెక్నిక్ పట్టాలు సాధించారు. ఇంకా 9,500 మంది విద్యార్థులు వ్యవసాయశాస్త్రంలో పీజీ, 1500 మంది విద్యార్థులు పీహెచ్డీ పూర్తి చేశారు. నూతన వంగడాల సృష్టి.. పరిశోధనలు వరి, మొక్కజొన్నతోపాటు 50కిపైగా పంటల్లో దాదాపు 500 నూతన రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. 1968లో వర్సిటీ భాగస్వామ్యంతో అఖిల భారత వరి సమన్వయ పరిశోధన సంస్థ ద్వారా తొలిసారిగా వరిలో అధిక దిగుబడి ఇచ్చే ‘జయ’అనే సంకర జాతి తొలి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు. నాటి నుంచి స్వర్ణ, బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, తెలంగాణ సోనా ఇలా వరి ఎన్నో రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ ఏడాది అధిక దిగుబడి ఇచ్చే ఎక్స్ట్రా ఎర్లీ రకం కంపసాగర్ వరి 6251 (కేపీఎస్ 6251)ని విడుదల చేసింది. » దేశవ్యాప్తంగా వరిసాగులో ఈ వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు 25 శాతం దాకా ఉన్నాయి. 12 రాష్ట్రాలలో 12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడి వరి వంగడాలే సాగవుతున్నాయి. » దేశవ్యాప్తంగా మొక్కజొన్న విస్తీర్ణంలో 10–12శాతం వరకూ ఇక్కడి సంకర రకాలే సాగవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధి చేసిన దాంట్లో హైబ్రిడ్ రకాలైన డీహెచ్ఎం–115, 117, 121 ఉన్నాయి. » వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో చేసిన 23 ఆవిష్కరణలకు పేటెంట్లు సైతం సొంతం చేసుకుంది. వజ్రోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వజ్రోత్సవాల ఏర్పాట్లలోగురువారం రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ రైతుమేళా ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తోపాటు ఆడిటోరియంను తుమ్మల పరిశీలించారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు. -
విద్యుత్ లేకుండా వాగు నీటిని ఎత్తిపోసే హైడ్రో లిఫ్ట్!
కొండ్ర ప్రాంత వాగుల్లో ఎత్తయిన ప్రాంతం నుంచి వాలుకు ఉరకలెత్తుతూ ప్రవహించే సెలయేళ్లు సందర్శకులకు కనువిందు చేస్తూ మనోల్లాసం కలిగిస్తుంటాయి. అయితే, ఆయా కొండల్లో వ్యవసాయమే జీవనాధారంగా బతికే రైతులకు మాత్రం ఈ సెలయేళ్లలో నీరు ఏ మాత్రం ఉపయోగపడదు. పొలాలు ఎత్తులో ఉండటమే కారణం. విద్యుత్ మోటార్లతో వాగుల్లో నిటిని రైతులు తోడుకోవచ్చు. అయితే, చాలా కొండ ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం ఉండదు. డీజిల్ ఇంజన్లు పెట్టుకునే స్థోమత రెక్కాడితే గాని డొక్కడని అక్కడి చిన్న, సన్నకారు రైతులకు అసలే ఉండదు. కళ్ల ముందు నీరున్నా ఆ పక్కనే కొద్ది ఎత్తులో ఉన్న తమ పొలాల్లో పంటలకు పెట్టుకోలేని అశక్తత ఆ రైతుల పేదరికాన్ని పరిహసిస్తూ ఉంటుంది. ఏజన్సీవాసులకు శాశ్వతంగా మేలు జరిగేలా వాగుల్లో పారే నీటిని విద్యుత్తు అవసరం లేకుండా ఎత్తిపోసేందుకు తన శక్తిమేరకు ఏదైనా ఉపాయం ఆలోచించాలని గ్రామీణ ఆవిష్కర్త పంపన శ్రీనివాస్(47) లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ జిల్లా కైకవోలు ఆయన స్వగ్రామం. చదివింది ఐటిఐ మాత్రమే అయినా, లక్ష్యసాధన కోసం అనేక ఏళ్ల పాటు అనేక ప్రయోగాలు చేస్తూ చివరికి విజయం సాధించారు. వాగుల్లో నుంచి నీటిని విద్యుత్ లేకుండా పరిసర పొలాల్లోకి ఎత్తిపోయటంలో ఆయన సాధించిన విజయాలు రెండు: 1. పాతకాలపు ర్యాం పంపు సాంకేతికతను మెరుగుపరచి వాగుల్లో ర్యాం పంపులను ఏర్పాటు చేయటం. 2. హైడ్రో లిఫ్ట్ అనే కొత్త యంత్రాన్ని ఆవిష్కరించటం.హైడ్రో లిఫ్ట్ ఆవిష్కరణవాగులో 4–5 అడుగుల ఎత్తు నుంచి చెంగు చెంగున కిందికి దూకే నీటిని ఒడిసిపట్టి పరిసర పంట పొలాల్లోకి ఎత్తి΄ోసే ‘హైడ్రో లిఫ్ట్’ అనే వినూత్న యంత్రాన్ని శ్రీనివాస్ సొంత ఆలోచనతో, సొంత ఖర్చుతో ఆవిష్కరించారు. ఈ గ్రామీణ ఆవిష్కర్త రూపొందించిన చిన్న నమూనా ప్రొటోటైప్) యంత్రాన్ని ఉమ్మడి తూ.గో. జిల్లా దివిలికి సమీపంలోని ముక్కోలు చెక్‌డ్యామ్ వద్ద విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. దీని పనితీరును నిపుణులు ప్రశంసించారు. ఇది మూడు అడుగుల పొడవు, ఒక డయామీటర్‌తో ఉంది. దీని చుట్టూతా అంగుళం బ్లేడ్లు వాలుగా అమర్చి వుంటాయి. నీటి ఉధృతికి లేదా వరదకు దుంగలు, రాళ్లు కొట్టుకొచ్చినా కదిలి΄ోకుండా ఉండేలా ఇనుప చట్రంలో ఈ చక్రాన్ని అమర్చారు. హైడ్రో లిఫ్ట్‌తో కూడిన ఈ చట్రాన్ని చెక్‌డ్యామ్ కింది భాగాన ఏర్పాటు చేశారు. సెకనుకు 20 లీటర్ల చొప్పున ఈ చక్రంపై పడేలా నీటి ప్రవాహం ఉంటే సెకనుకు 1 లీటరు నీటిని పొలంలోకి ఎత్తి΄ోయటానికి వీలవుతుందని శ్రీనివాస్ తెలి΄ారు. నీటి ప్రవాహ వేగం తక్కువగా వున్నా నిమిషానికి 40 సార్లు (ఆర్పిఎం) ఇది శక్తివంతంగా తిరుగుతోంది. ఈ బాక్స్ షాఫ్ట్నకు అమర్చిన పిస్టన్ 300 ఆర్పిఎంతో నడుస్తుంది. చిన్న హైడ్రో లిఫ్ట్‌తో ఎకరానికి నీరునిమిషానికి 60 లీటర్ల నీటిని వాగులో నుంచి 20 అడుగుల ఎత్తుకు (40 అడుగుల ఎత్తుకైతే నిమిషానికి 40 లీటర్లు) తోడే శక్తి ఈ ప్రోటోటైప్ హైడ్రో లిఫ్ట్‌కు ఉంది. ఈ నీరు పారగడితే ఎకరంలో కూరగాయల సాగుకు సరిపోతుందని, డ్రిప్ ఏర్పాటు చేసుకుంటే ఎకరానికి సరిపోతుందని శ్రీనివాస్ తెలిపారు. దీని తయారీకి రూ. 35 వేలు ఖర్చవుతుందని, వాగులో ఇన్స్టాల్ చేయటానికి అదనంగా ఖర్చవుతుందన్నారు. వాగు నీటి ఉధృతిని బట్టి, అధిక విస్తీర్ణంలో సాగు భూమి నీటి అవసరాలను బట్టి హైడ్రో లిఫ్ట్ పొడవు 9–16 అడుగుల పొడవు, 2–4 అడుగుల డయామీటర్ సైజులో తయారు చేసుకుంటే అధిక పరిమాణంలో నీటిని ఎత్తిపోయవచ్చునని శ్రీనివాస్ వివరించారు. గత అక్టోబర్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శోధాయాత్రలో భాగంగా పల్లెసృజన అధ్యక్షులు పోగుల గణేశం బృందం ఈ హైడ్రో లిఫ్ట్ పనితీరును పరిశీలించి మెచ్చుకున్నారన్నారు. పల్లెసృజన తోడ్పాటుతో పేటెంట్ కోసం దరఖాస్తు చేయబోతున్నాన్నారు. ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటునందించి పెద్ద హైడ్రో లిఫ్టులను తయారు చేసి పెడితే కొండ ప్రాంతవాసుల సాగు నీటి కష్టాలు కొంతైనా తీరుతాయి. ర్యాం పంపుతో పదెకరాలకు నీరుఎత్తు నుంచి లోతట్టు ప్రాంతాలకు పారే వాగు నీటిని ఒడిసిపట్టే ర్యాం పంపు సాంకేతికత ఇప్పటికే అందుబాటులో ఉంది. ఏజన్సీవాసుల నీటి కష్టాలు తీర్చేందుకు విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే ఈ ర్యాం పంపును మెరుగైన రీతిలో వినియోగంపై శ్రీనివాస్ తొలుత కృషి చేశారు. వివిధ సంస్థల తోడ్పాటుతో కొన్ని చోట్ల ర్యాం పంపులు ఏర్పాటు చేశారు. అయితే, ర్యాం పంపు సాంకేతికతకు ఉన్న పరిమితులు కూడా ఎక్కువేనని శ్రీనివాస్ గ్రహించారు. ర్యాం పంపు అమర్చాలి అంటే.. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి పారే చిన్నసైజు జలపాతం ఉండాలి. ఆ నీటిని ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి, ఆ గొట్టం ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు చేస్తారు. ఒక్కో ర్యాం పంపు బెడ్‌పైన రెండు పిస్టన్లు అమర్చుతారు. ఒక పిస్టన్ను కాలితో లేదా చేతితో రెండు మూడు సార్లు కిందికి నొక్కితే చాలా ఇక వాటంతట అవే రెండు పిస్టన్లు ఒకదాని తర్వాత మరొకటి, పైకి కిందకు లేచి పడుతూ ఉంటాయి. అలా పిస్టన్లు పనిచేయటం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన ఒక నాన్ రిటర్న్ వాల్వ్‌కు అమర్చిన పైపు ద్వారా పంట పొలాలకు నీరు ఎత్తి΄ోస్తారు. రెండున్నర అంగుళాల పైపు ద్వారా నీరు వెళ్తుంది. ర్యాం పంపు నెలకొల్పడానికి రూ. 2.5–3.5 లక్షలు ఖర్చవుతుంది. ఒకసారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 10 ఎకరాలకు నీటిని పారించవచ్చు. విద్యుత్తు అవసరం లేదు. పిస్టన్లకు ఆయిల్ సీల్స్ లాంటి విడి భాగాలు ఏవీ ఉండవు కాబట్టి, నిర్వహణ ఖర్చేమీ ఉండదు. ర్యాం పంప్‌ల తయారీకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ (సీడీఆర్), టాటా ట్రస్టు విసిఎఫ్, సిసిఎల్ తదితర సంస్థలు ఆర్థిక సహాయాన్నందించాయి. ర్యాం పంపుల పరిమితులు అయితే, కనీసం 8–10 అడుగుల ఎత్తు నుంచి కిందికి నీరు పారే చోట్ల మాత్రమే ర్యాం పంపును నిర్మించగలం. ఇందుకు అనుకూలమైన చోట్లు చాలా తక్కువే ఉంటాయి. దీన్ని నెలకొల్పడానికి సిమెంటు కాంక్రీటుతో పునాదిని నిర్మించాలి. బండ రాళ్లు అనువైన రీతిలో ఉంటేనే సివిల్ వర్క్ చేయడానికి అనుకూలం. అందువల్ల కాంక్రీట్ వర్క్ కొన్నిచోట్ల విఫలమవుతూ ఉంటుంది. ర్యాం పంపులకు ఉన్న ఈ పరిమితుల దృష్ట్యా తక్కువ ఎత్తు నుంచి నీరు పారే చోట్ల నుంచి నీటిని ఎత్తిపోసే కొత్త యంత్రాన్ని తయారు చేస్తే ఎక్కువ భూములకు సాగు నీరందించవచ్చన్న ఆలోచన శ్రీనివాస్ మదిలో మెదిలింది. అలా పుట్టిన ఆవిష్కరణే ‘హైడ్రో లిఫ్ట్’. ఇటు పొలాలకు నీరు.. అటు ఇళ్లకు విద్యుత్తు!రంపచోడవరం, చింతూరు, పాడేరు ఐటిడిఏల పరిధిలో కొండలపై నుంచి వాగులు, వంకలు నిత్యం ప్రవహిస్తున్నాయి. వాగు నీటి ప్రవాహ శక్తిని బట్టి వాగు ఇరువైపులా ఉన్నటు భూమి ఎత్తు, స్వభావాన్ని బట్టి తగినంత రూ. 15–20 లక్షల ఖర్చుతో 9–16 అడుగుల వరకు పొడవైన హైడ్రో లిఫ్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా 6 అంగుళాల పంపుతో విద్యుత్ లేకుండానే వాగు ఇరువైపులా 50 నుంచి 100 ఎకరాల భూమికి సాగు నీరు అందించవచ్చు. అంతేకాకుండా, ఒక్కో వాటర్ వీల్ ద్వారా 15 కెవి విద్యుత్‌ను తయారు చేసి సుమారు 20–30 కుటుంబాలకు అందించవచ్చు. ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, గిరిజనాభివృద్ధి శాఖలు, స్వచ్ఛంద సేవా సంస్థలు హైడ్రో లిఫ్ట్ పద్ధతిని ప్రోత్సహిస్తే నా వంతు కృషి చేస్తా. – పంపన శ్రీనివాస్ (79895 99512), గ్రామీణ ఆవిష్కర్త, కైకవోలు, పెదపూడి మండలం, కాకినాడ జిల్లా – లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, ప్రతినిధి కాకినాడ -
వ్యవసాయానికి ఉజ్వల భవిష్యత్
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగం వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయని ఐటీసీ చైర్మన్ సంజీవ్‌పురి అన్నారు. సుస్థిర సాగు విధానాలు, టెక్నాలజీ సాయంతో ఇందుకు అనుకూలమైన పరిష్కారాలు అవసరమన్నారు. ఈ రంగంలో ఉత్పాదకత, నాణ్యత పెరగాలంటూ, అదే సమయంలో వాతావరణ మార్పుల వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ పురి ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా ఆహార, పోషకాహార భద్రతపై తీవ్ర ఆందోళన నెలకొందంటూ.. ఆహార ద్రవ్యోల్బణం కొండెక్కి కూర్చోవడానికి ఇలాంటి అంశాలే కారణమని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌లో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు రైతులున్నారు. వారితో మనం ఏ విధంగా కలసి పనిచేయగలం? వారిని ఉత్పాదకత దిశగా, భవిష్యత్‌కు అనుగుణంగా ఎలా సన్నద్ధులను చేయగలం? ఈ దిశగా వృద్ధికి గొప్ప అవకాశాలున్నాయి’’అని సంజీవ్‌పురి చెప్పారు. సాగు విధానాలు పర్యావరణ అనుకూలంగా ఉండేలా చూడాలన్నారు. ఈ తరహా సుస్థిర సాగు విధానాలు అవసరమన్నారు. నూతన తరం టెక్నాలజీల సాయంతో, వినూత్నమైన, సమగ్రమైన పరిష్కారాలను రైతులకు అందించాలన్నారు. ఈ దిశగా కొంత పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నట్టు పేర్కొన్నారు. -
ఈ సైంటిస్ట్ జంట రూటే సెపరేటు! వెడ్డింగ్ కార్డు వేరేలెవెల్..!
శాస్త్రవేత్తలంటేనే అందరిలా కాకుండా విభిన్నంగా ఆలోచిస్తారు. అయితే వారి పరిశోధన వృత్తి వరకే పరిమితం కాకుండా అంతకు మించి ఉంటే.. ఈ సైంటిస్ట్ జంటలానే ఉంటుందేమో..!. ఇద్దరూ అగ్రికల్చర్ పరిశోధకులే..ఆ ఇష్టాన్నే తమ వివాహా ఆహ్వాన పత్రికలో కూడా చూపించి ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి కార్డో, లేక రీసెర్చ్ పేపరో అర్థంకాకుండా భలే గందరగోళానికి గురి చేశారు. ఆలపాటి నిమిషా, ప్రేమ్ కుమార్ అనే వ్యవసాయ శాస్త్రవేత్తలిద్దరూ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. అయితే వారిద్దరి అభిరుచి పరిశోధనే. ఐతే నిమిషా ఐసీఏఆర్-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IARI)లో రీసెర్చ్ స్కాలర్ కాగా, ప్రేమ్ కుమార్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో అసిస్టెంట్ మేనేజర్. ఈ నేపథ్యంలోన వారిద్దరూ తమ రీసెర్చ్‌పై ఉన్న ప్రేమతో పరిశోధనా పత్రం స్టైల్లో వివాహ కార్డుని డిజైన్ చేశారు. చూసేవాళ్లకు ఇది ఆహ్వాన పత్రిక.. రీసెర్చ్పేపరో అర్థం కాదు. క్షుణ్ణంగా చదివితేనే తెలుస్తుంది. అందులో వివరాలు కూడా రీసెర్చ్ పేపర్ తరహాలో ఉన్నాయి. అయితే వారి వివాహ బంధాన్ని కూడా కెమిస్ట్రీలోని స్థిర సమయోజనీయ బంధంతో వివరించడం అదుర్స్. అవసరానికి ఉపయోగ పడని ఆస్తి, ఆపదల నుంచి గట్టేకించుకోలేని విజ్ఞానం రెండూ వ్యర్థమే అంటారు పెద్దలు. కానీ వీళ్లిద్దరూ తమ వ్యవసాయ పరిజ్ఞానాన్ని అన్ని విధాలుగా ఉపయోగిస్తూ ఆదర్శంగా నిలవడమే గాక తమకు వ్యవసాయ పరిశోధనా రంగం పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సైంటిస్ట్‌ల రూటే సెపరేటు అన్నట్లుగా ఆహ్వానపత్రిక వేరేలెవెల్లో ఉంది. మరో విశేషమేమిటంటే ఆ శాస్తవేత్తల జంట తమ వివాహ తేదిని కూడా ప్రపంచ మృత్తికా దినోత్సవం రోజునే ఎంచుకోవడమే. (చదవండి: డిప్రెషన్‌తో పోరాడుతూనే.. ఐఏఎస్ సాధించిన అలంకృత!) -
చౌడు పీడ రబీలోనే ఎక్కువ!
చౌడు సమస్య ఖరీఫ్‌లో కన్నా రబీలోనే ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చౌడు వల్ల ధాన్యం దిగుబడి తగ్గడం కూడా రబీలోనే ఎక్కువని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చౌడును తట్టుకొని 20–25 బస్తాల దిగుబడినిచ్చే డి.ఆర్.ఆర్. ధన్ 39, జరవ, వికాస్ అనే వరి వంగడాలు ఉన్నాయి. ఇవి 120–130 రోజుల్లో కోతకొస్తాయి. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో సుమారు 3 లక్షల ఎకరాల్లో చౌడు సమస్య ఉంది. మట్టిలో లవణ సూచిక (ఇ. సి.) 4 వరకు ఉంటే కొంత ఫర్వాలేదు. కానీ, మా క్షేత్రంలో ఈ ఏడాది 10.9 ఉంది. ఎక్స్ఛేంజబుల్ సోడియం పర్సంటేజ్ (ఈ.ఎస్.పి.) 15% కన్నా పెరిగితే చౌడు సమస్య తలెత్తుతుంది. చౌడు భూముల్లో కాలువ నీటితో సాగు చేయడానికి అనువైన మూడు వరి వంగడాలను శాస్త్రవేత్తలు గతంలోనే రూపొందించారు. ఎం.సి.ఎం. 100 అనేది రబీకి అనుకూలం. 125 రోజులు. 28–30 బస్తాల దిగుబడి వచ్చింది. ఎం.సి.ఎం. 101 రకం 140 రోజుల పంట. ఖరీఫ్‌కు అనుకూలం. 35 బస్తాల దిగుబడి. అగ్గి తెగులును, దోమను తట్టుకుంది. ఎం.సి.ఎం. 103 ఖరీఫ్ రకం. ఇది రాయలసీమ జిల్లాల్లోనూ మంచి దిగుబడులనిస్తోంది. చౌడు భూముల్లో నాట్లకు ముందు జీలుగ సాగు చేసి కలియదున్నాలి. ఇతర పచ్చిరొట్ట పైర్లు వేస్తే ఉపయోగం ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైపైనే దమ్ము చేయాలి. సమతూకంగా ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. రబీలో పొలాన్ని ఖాళీగా ఉంచితే, ఖరీఫ్‌లో చౌడు సమస్య ఎక్కువ అవుతుందట. (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
నల్ల తామరకు డిజిటల్ కట్టడి!
మిరప కాయల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతిలో మన దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. మన మిరప కాయ ఘాటైన రుచికి, రంగుకు ప్రసిద్ధి చెందింది. మన దేశం ఎగుమతి చేసే సుగంధ ద్రవ్యాల్లో 42% వాటా మిరపదే! మిరప ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్. ఇది దేశీయ, అంతర్జాతీయ ధరలను ప్రభావితం చేయగలదు. 2021లో ఆంధ్రప్రదేశ్‌లో మిరప పంటను తీవ్రంగా నష్టపరిచే కొత్త రకం నల్ల తామర (త్రిప్స్ పార్విస్పినస్ – బ్లాక్ త్రిప్స్) జాతి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఇది ఆగ్నేయాసియా నుంచి మన దేశంలోకి వచ్చింది. ఇది 2015లో బొప్పాయి పంటపై కూడా మన దేశంలో మొదటిసారిగా కనిపించింది. ఈ పురుగులు ఆకుల కణజాలాన్ని తినే ముందు లేత ఆకులు, పువ్వులను చీల్చివేస్తాయి. పూరేకుల చీలికల వల్ల పండ్లు సెట్కావటం కష్టతరంగా మారుతుంది. ఇది మిరప ఆశించే నల్ల తామర పత్తి, మిర్చి, కంది, మినుము, మామిడి, పుచ్చ, తదితర పంటలను కూడా దెబ్బతీస్తుంది. 2022లో ఆరు దక్షిణాది రాష్ట్రాల్లో మిరప పంటను బాగా దెబ్బతీసింది. కొన్ని ప్రాంతాల్లో 85 నుంచి 100% వరకు పంట నష్టం చేకూరింది. పంటలను రక్షించుకోవడానికి రసాయన పురుగుమందులను విపరీతంగా వాడటం తప్ప రైతులకు వేరే మార్గం లేకుండాపోయింది. ఖర్చు పెరిగిందే తప్ప ఉపయోగం లేకుండా ΄ోయింది. దీనికితోడు, నల్ల తామర సోకిన మిర్చికి మార్కెట్లో తక్కువ ధర పలకటంతో రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు.148 దేశాల్లో రైతులకు ఉచిత సేవలుచిన్న కమతాల రైతులు ఆచరణాత్మక సలహా సమాచారాన్ని పొందడానికి విస్తరణ సేవలు, ఇతర వ్యవసాయ సేవలను అందించే వారిపై ఆధారపడతారు. ఈ రైతుల విస్తృత అవసరాలను తీర్చే సలహాదారులు సరైన నిర్ణయం తీసుకోవాలంటే వారు తగిన సమాచారం పొందాలి. గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయంలో డిజిటల్ సేవల సాధనాలు గణనీయంగా పెరిగాయి. అయినప్పటికీ, ఇవి రైతు సలహాదారులకు చాలా వరకు చేరువ కాలేకపోతున్నాయి. ఈ డిజిటల్ యుగంలో అనేక సంస్థలు డిజిటల్ సలహాలను, సమాచారాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నాయి. వీటివల్ల రైతులకు సరైన సలహాలు, సరైన సమయంలో మొబైల్ ఫోన్లోనే అందుబాటులో ఉండటం వల్ల తన దైనందిన కార్యక్రమాలకు అంతరాయం లేకుండా రైతు సమాచారాన్ని పొందుతున్నారు. ఇటువంటి డిజిటల్ సాధనాల్లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బయోసైన్సెస్ ఇంటర్నేషనల్ (సిఎబిఐ – కాబి) డిజిటల్ సాధనాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచాయి. 148 దేశాలలో ఈ సంస్థ రైతులకు ఉచితంగా డిజిటల్ సేవలు అందిస్తోంది. ఇది లాభాపేక్ష లేని సంస్థ. వంద సంవత్సరాలకు పైగా చీడపీడల యాజమాన్యంలో అనుభవమున్న సంస్థ. ఈ డిజిటల్ సాధనాలు మనదేశంలో కూడా తెలుగు సహా అనేక భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది హైదరాబాద్‌లో గల సుస్థిర వ్యవసాయ కేంద్రంతోపాటు అనేక ఐసిఎఆర్ అనుబంధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ జ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం కాబి కృషి చేస్తోంది. ఈ డిజిటల్ సాధనాలు ఉచితంగా అందించటం విశేషం. విజ్ఞానపరంగా పరీక్షించి, నిరూపితమైన, స్థానికంగా లభ్యమౌతున్న ఉత్పత్తుల వివరాలు ఇందులో పొందుపరిచారు. ‘కాబి’ భాగస్వాములతో కలిసి ‘పెస్ట్ మేనేజ్మెంట్ డెసిషన్ గైడ్’ (పిఎండిజి)ని అభివృద్ధి చేసింది. పంటలను ఆశించిన నల్ల తామర పురుగులను గుర్తించడం, సేంద్రియ/ సురక్షితమైన యాజమాన్య పద్ధతులపై ఈ గైడ్ సలహాలను అందిస్తుంది. మన దేశంలో వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్న అనేక జీవ రసాయనాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చాయి. మిర్చి సహా అనేక పంటలను ఆశిస్తున్న నల్ల తామర యాజమాన్యంపై రైతులు, విస్తరణ అధికారులు, విద్యార్ధులు, శిక్షకులు, పరిశోధకులు ఈ క్రింద పేర్కొన్న డిజిటల్ సాధనాలు ఉపకరిస్తాయి. ‘కాబి’ ఉచితంగా అందిస్తున్న డిజిటల్ సాధనాలను మరింత సమర్థవంతంగా, త్వరగా ఉపయోగించడం ద్వారా నల్ల తామరకు సంబంధించి, యాజమాన్య మెలకువల గురించిన మరింత సమాచారం కోసం ఈ క్రింద పేర్కొన్న వెబ్సైట్, మొబైల్ యాప్‌లు ఉపయోగపడతాయి. 1. బయో ప్రొటెక్షన్ పోర్టల్ : చీడపీడల నియంత్రణ, యాజమాన్యానికి స్థానిక బయోపెస్టిసైడ్స్ సమాచారం కోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి.2. క్రాప్ స్ప్రేయర్ యాప్ : పురుగుమందు/ బయోపెస్టిసైడ్ మోతాదు ఎంత వాడాలి అన్నది తెలుసుకోవడం కోసం ఈ క్యూ.ఆర్.కోడ్‌ను స్కాన్ చేయండి.3. ఫ్యాక్ట్‌షీట్ యాప్/నాలెడ్జ్ బ్యాంక్ : చీడపీడలకు సంబంధించి విస్తృతమైన సమాచారం కోసం ఈ క్యూ.ఆర్. కోడ్‌ను స్కాన్ చేయండి. తామర పురుగులు.. ఏడాదికి 8 తరాలు! తామర పురుగులు (త్రిప్స్) రెక్కలు కలిగిన చిన్న కీటకాలు. వీటిలో అనేక జాతులున్నాయి. ఇవి ఉల్లిపాయలు, టమోటాలు, స్ట్రాబెర్రీలు, ద్రాక్ష సహా వివిధ పంటలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తాయి. మరికొన్ని వ్యవసాయానికి ప్రయోజనం చేకూరుస్తాయి కూడా. ఎలాగంటే.. అవి పంటలకు హాని చేసే పురుగులను తింటాయి!తామర పురుగులు మొక్కల బయటి పొరను చీల్చుకుని అందులోని పదార్థాలను తినడం ద్వారా మొక్కలను దెబ్బతీస్తాయి. జాతులను బట్టి, జీవిత దశను బట్టి వివిధ రంగుల్లో ఉంటాయి. పిల్ల పురుగు (లార్వా) సాధారణంగా పారదర్శకంగా ఉంటాయి. చాలావరకు పెరిగిన తామర పురుగులు పొడవాటి సన్నని రెక్కలతో, అంచుల్లో చిన్న వెంట్రుకలను కలిగి ఉంటాయి. గుడ్లు సాధారణంగా పొడుగ్గా ఉంటాయి. మూత్రపిండాల ఆకారంలో కనిపిస్తాయి. ఉష్ణమండలంలో నివసించే తామర పురుగులు సమశీతోష్ణ వాతావరణంలో కంటే పెద్దవిగా పెరుగుతాయి. తామరపురుగుల జీవిత కాలం సాధారణంగా నెలన్నర. జాతులను, వాతావరణాన్ని బట్టి సంవత్సరానికి ఎనిమిది తరాల వరకు సంతతిని పెంచుకుంటూ ఉంటాయి. ఆడ పురుగులు అతిథేయ (హోస్ట్) మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. లార్వా పొదిగిన తర్వాత ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తుంది. లార్వా నాలుగు దశల్లో (రెండు ఫీడింగ్, రెండు నాన్–ఫీడింగ్) పెరిగి పెద్దది అవుతుంది. వెచ్చని వాతావరణంలో యుక్తవయస్సులో దీని పెరుగుదల వేగంగా ఉంటుంది. శీతాకాలంలో జీవించగలవు. అయితే ఈ సీజన్లో వాటి సంఖ్య సాధారణంగా తగ్గుతుంది. తామర పురుగులు మొక్కల లోపల ద్రవాలను పీల్చుకొని బతుకుతాయి. పండ్లు, ఆకులు, రెమ్మలను ఆశించి.. బయటి పొర లోపలికి చొచ్చుకుపోయి తింటాయి. త్రిప్స్ పెద్ద మొత్తంలో పంటని ఆశించినప్పుడు, పంట పెరుగుదల, దిగుబడిని కోల్పోవడానికి కారణమవుతాయి. ఇవి చాలా పెద్ద చెట్ల జాతులపై కూడా దాడి చేయగలవు. ఐతే సాధారణంగా పండ్లు, కూరగాయల కంటే పెద్ద చెట్లు ఎక్కువ వీటి దాడికి తట్టుకోగలుగుతాయి. తామర పురుగులు మొక్కల వైరస్‌లను కూడా వ్యాప్తి చేస్తాయి. వేరుశనగలో మొవ్వు కుళ్ళు (బడ్ నెక్రోసిస్ ), టొమాటో–స్పాటెడ్ విల్ట్ వైరస్.. ఇలా వ్యాపించేవే.తామర పురుగుల యాజమాన్యం 1. తామర పురుగులు నేలపై పడ్డ వ్యర్ధపదార్ధాలలో జీవిస్తూ పంటలను ఆశిస్తుంటాయి. కాబట్టి, పంట వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. 2. ఎండను పరావర్తనం చెందించే మల్చింగ్ షీట్లను లేదా ఇతర ఆచ్ఛాదన పదార్థాలను బెడ్స్ మీద పరచాలి. 3. నీలం రంగు జిగురు అట్టలను ఏకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఇవి పురుగులతో నిండగానే మార్చుకోవాలి. 4. సహజ శత్రువులైన అల్లిక రెక్కల పురుగు (లేస్ వింగ్ బగ్స్) అతిచిన్న పైరేట్ బగ్స్, పరాన్న భుక్కు నల్లులు (ప్రిడేటరీ మైట్స్)ను రక్షించుకోవాలి.5. వేప నూనె 3% చల్లితే పంటలను తామర పురుగులు ఆశించవు. వీటి సంతానోత్పత్తి ప్రక్రియకు వేప నూనె అంతరాయం కలిగిస్తుంది. 6. బవేరియా బాసియానా, మెటార్హిజియం అనిసోప్లియె అనే శిలీంద్రాలు తామర పురుగులకు రోగాన్ని కలిగించి నశింపజేస్తాయి. ఇవి రైతులకు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ జి. చంద్రశేఖర్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త,సుస్థిర వ్యవసాయ కేంద్రం, సికింద్రాబాద్. మొబైల్: 94404 50994 (చదవండి: నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) -
నౌకాయానంలో వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త
నౌకాయాన పరిశ్రమ సొంత ఆహార అవసరాల కోసం అధునాతన సేద్య సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నది. కృత్రిమ మేధతో నడిచే కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను నౌకల్లోనే సాగు చేయటం ప్రారంభమైంది. సిబ్బందికి మెరుగైన ఆహారాన్ని అందించటంతోపాటు వారి మనోబలాన్ని పెంపొందించేందుకు కొన్ని షిప్పింగ్ కంపెనీలు డిజిటల్ సేద్య పద్ధతులను అనుసరిస్తున్నాయి. ఈ సంస్థల జాబితాలో సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న సినర్జీ మెరైన్ గ్రూప్ ముందంజలో ఉంది. ‘అగ్వా’ సంస్థ రూపొందించిన అటానమస్ వెజిటబుల్ గ్రోయింగ్ టెక్నాలజీ నావికులకు అనుదినం పోషకాలతో నిండిన తాజా శాకాహారం అందించడానికి ఉపయోగపడుతోంది. గతంలో తీర్రప్రాంతాలకు చేరినప్పుడు మాత్రమే తాజా కూరగాయలు, ఆకుకూరలు వీరికి అందుబాటులో ఉండేవి. ఇప్పుడు రోజూ అందుబాటులోకి రావటం వల్ల నౌకా సంస్థల సిబ్బంది సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉంటూ మెరుగైన సేవలందించగలుగుతున్నారట. సినర్జీ మెరైన్ గ్రూప్ బాటలో ఈస్ట్రన్ పసిఫిక్ షిప్పింగ్, సీస్పాన్ కార్ప్, కాపిటల్ షిప్పింగ్, కూల్కొ నడుస్తూ సముద్ర యానంలో తాజా ఆహారాన్ని పండిస్తూ, వండి వార్చుతున్నాయి. సినర్జీ మెరైన్ గ్రూప్‌నకు చెందిన సూయెజ్‌మాక్స్ ఎఫ్ఫీ మెర్స్క్ ఓడలో సిబ్బంది సెప్టెంబర్ నుండి మూడు ప్రత్యేక అగ్వా యూనిట్లను ఉపయోగించి ఆకుకూరలు, ఔషధ మొక్కలు, దుంప కూరలు, టొమాటోలు, స్ట్రాబెర్రీలను నడి సముద్రంలో ప్రయాణం చేస్తూనే సాగు చేసుకుంటూ ఆనందంగా ఆరగిస్తున్నారు.స్వయంచాలిత సేద్యంఆకర్షణీయమైన వేతనాలకు మించి సముద్రయాన సంస్థ సిబ్బంది సమగ్ర సంక్షేమం, జీవనశైలి ప్రయోజనాలను అందించడంలో అగ్వా సంస్థ రూపొందించిన అత్యాధునిక ఇన్డోర్ సాగు పరికరాలు ఉపయోగపడుతున్నాయి. సిబ్బంది శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. తాజా కూరగాయలను స్థిరంగా సరఫరా చేయడం ఒక కీలకమైన ఆవిష్కరణ. పూర్తి స్వయంప్రతిపత్తి కలిగిన అగ్వా ఆన్ బోర్డ్ కూరగాయల పెంపక యూనిట్లు అత్యాధునిక సాంకేతికతతో వినియోగదారుల అవసరాలకు, ఆసక్తులకు తగిన రీతిలో తాజా ఉత్పత్తులను అందిస్తున్నాయి. అధునాతన కృత్రిమ మేధ, ఇమేజ్ ఎనలైజర్, సెన్సరీ డేటా ద్వారా వినియోగదారు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా అగ్వా యూనిట్లు పనిచేస్తాయి. ఇవి చూడటానికి ఒక ఫ్రిజ్ మాదిరిగా ఉంటాయి. ఇవి పూర్తిస్థాయిలో ‘వర్చువల్ అగ్రానామిస్ట్’ (వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త) పాత్రను పోషిస్తాయి. వెల్తురు, తేమ, మొక్కలకు పోషకాల సరఫరా.. వంటి పనులన్నిటినీ వాతావరణాన్ని బట్టి ఇవే మార్పులు చేసేసుకుంటాయి. అగ్వా యాప్ సాగులో ఉన్న కూరగాయల స్థితిగతులు, పెరుగుదల తీరుతెన్నులపై ఎప్పటికప్పుడు మెసేజ్‌లు పంపుతూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా నౌకా సిబ్బంది శ్రేయస్సు కోసం మెరుగైన ప్రయోజనాలు కల్పించటం, ప్రతికూల పరిస్థితుల్లోనూ నావికా సిబ్బందికి మెరుగైన ఆహారాన్ని అందించడానికి ఈ అధునాతన హైడ్రో΄ోనిక్ సాంకేతికత ఉపయోగపడుతోంది. వాతావరణంలో మార్పులకు తగిన రీతిలో పంట మొక్కల అవసరాలను అగ్వా 2.0 యూనిట్లు స్వయంచాలకంగా, రిమోట్‌గా సర్దుబాటు చేసుకుంటాయి. ఇది ఏకకాలంలో వివిధ కూరగాయలను పండించగలదు. ‘వర్చువల్ వ్యవసాయ శాస్త్రవేత్త’ అగ్వా యూనిట్లో పెరిగే ప్రతి మొక్కను నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరైన నాణ్యత, మెరుగైన దిగుబడి సాధనకు అనుగుణంగా సర్దుబాటు చేస్తుంది. (చదవండి: ఒరిజినల్ దస్తావేజులు పోతే ప్రాపర్టీని అమ్మడం కష్టమా..?)