పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర దిన వేడుకల్లో ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ. కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి
అభివృద్ధి, సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు
మహిళలు తెలంగాణ అభివృద్ధిలో గుండెకాయ
తెలంగాణ గీతం అద్భుతంగా ఉంది
పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఏడాది కాలంలోనే రైతాంగానికి అండగా నిలిచే ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆయన జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు, రక్షణ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉద్యోగాలు, విద్య తదితర రంగాల్లో ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనులను వివరించారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటున్నట్టు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో ఉండేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కింద రాష్ట్రంలోని 25.34 లక్షల మందికి రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. సన్నరకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్ రూ. 500 చొప్పున రూ.1206.44 కోట్లు బోనస్ కింద అందించినట్టు చెప్పారు.
2024 వానాకాలం సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా నిరంతరం రైతుల సేవలో ప్రభుత్వం ఉంటుందన్నారు. రైతు వేదికలను మరింత అభివృద్ధి చేసి, రైతునేస్తం కార్యక్రమాన్ని 532 గ్రామీణ మండలాల్లో అమలు చేస్తున్నట్టు వివరించారు. రైతుబీమా పథకం కింద 42.16 లక్షల మంది రైతులకు రూ.1433 కోట్ల బీమా చెల్లించినట్టు చెప్పారు. కృష్ణా జలాల ట్రిబ్యునల్–2 ముందు ప్రభుత్వం తన వాదనను బలంగా వినిపించడంతో కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడంలో విజయం సాధించినట్టు చెప్పారు. దావోస్ ఒప్పందాల్లో 1.70 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహన కుదిరిందని, ఐటీ, పునరుత్పాదక శక్తి, ఫార్మా కంపెనీల ద్వారా 49,500 ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు.
మహిళా సాధికారత కోసం
తెలంగాణ అభివృద్ధి ఎజెండాలో మహిళలు గుండె వంటి వారని గవర్నర్ పేర్కొన్నారు. ఉచితబస్సు సౌకర్యం ద్వారా 133.91 కోట్లసార్లు ప్రయాణించిన మహిళలకు రూ.4,501 కోట్లు ప్రభుత్వం ఆదా చేసిందన్నారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్ అందించామని, రాయితీ గ్యాస్ సిలిండర్ల ద్వారా 43 లక్షల కుటుంబాలకు రూ.433.2 కోట్లు సబ్సిడీ అందించినట్టు చెప్పారు. ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా కోటిమంది మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా మార్చి కోటీశ్వరులను చేయాలని సంకల్పించినట్టు చెప్పారు. స్త్రీనిధి పథకం ద్వారా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేస్తున్నామని, సామాజిక న్యాయం దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తాం
తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని గవర్నర్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజాప్రభుత్వం బాగుందని, తెలంగాణ గీతం అద్భుతంగా ఉందని కొనియాడారు. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులను స్మరించుకున్నారు. జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించామని, తెలంగాణ ఉద్యమకారులను గౌరవించుకున్నామని తెలిపారు. యువత సాధికారత కోసం యంగ్‌ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.
రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం ద్వారా సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే ఔత్సాహికులకు లక్ష రూపాయల ఆర్థిక సహకారాన్ని కూడా అందిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే 55 వేల యువతీయువకులకు ఉద్యోగాలు కల్పించినట్టు చెప్పారు. క్రీడలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని, క్రీడాకారుల కోసం యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. విద్య, ఆరోగ్య సంరక్షణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని, గురుకులాల్లో సమగ్ర విద్యాబోధనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment