
ఉపాధి యూనిట్లతో గుజరాత్‌లోని అమూల్ స్థాయికి వెళ్లాలి
అటవీ గ్రామంలో డిజిటల్ తరగతుల ప్రారంభం సంతోషంగా ఉంది : గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
మేడారంలో సమ్మక్క–సారలమ్మలకు నిలువెత్తు మొక్కుల సమర్పణ
తెలంగాణలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నట్టు వెల్లడి
సాక్షిప్రతినిధి, వరంగల్/ములుగు/ఎస్‌ఎస్ తాడ్వాయి: మారుమూలన ఉన్న ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామం అభివృద్ధిలో దేశానికి రోల్‌మోడల్ కావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆకాంక్షించారు. కొండపర్తిలో 70 గృహాలు 285 మంది ప్రజలు ఉన్నారని, చిన్న గ్రామమైన అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలని చెప్పారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామంలో డిజిటల్ తరగతులు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, విద్యార్థులు ఇంగ్లిష్ బాగా మాట్లాడుతున్నారంటూ, వారిని అభినందించారు.
మంగళవారం ఎస్‌ఎస్ తాడ్వాయి మండల పరిధిలోని కొండపర్తిలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గాన కొండపర్తికి చేరుకున్న ఆయన.. తొలుత కొమురంభీం, బిర్సాముండ విగ్రహాలను, పాఠశాలలో డిజిటల్ తరగతులు, అంగన్‌వాడీ కేంద్రం, మసాలా, కుట్టు మెషీన్ యూనిట్‌లను ప్రారంభించారు. అనంతరం రిమోట్‌తో వ్యవసాయ మోటార్లు ప్రారంభించి కొండపర్తి గ్రామస్తులతో మాట్లాడారు.
అక్కడి నుంచి నేరుగా మేడారం చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మక్క–సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అంతకుముందు కొండపర్తి, మేడారం ఆలయ ప్రాంగణంలో గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నానని అందులో, కొండపర్తి కూడా ఉందని చెప్పారు. కొండపర్తిలో మహిళల ఆర్థికాభివృద్ధికి ఇంకా చిన్నచిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు.
స్వయం ఉపాధి యూనిట్ల ద్వారా ఆర్థికాభివృద్ధి సాధన జరుగుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో అమూల్ ఏవిధంగా ప్రసిద్ధిగాంచిందో, అదే తరహాలో కొండపర్తి కారం, పసుపు, మసాలా యూనిట్లకు అంతటి పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆకాంక్షించారు. ములుగు ప్రాంతంలో మిర్చి సాగు బాగుందని.. ఇక్కడి మిర్చి పౌడర్‌కు మంచి ఇమేజ్ రావాలని, తెలంగాణ వ్యాప్తంగా మిర్చి పౌడర్ బాగా ఫేమస్ కావాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ సంకల్పానికి ఈ గ్రామం ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు.
తాను, రాష్ట్రపతి, రాష్ట్రమంత్రి సీతక్క అందరూ ఆదివాసీ బిడ్డలమని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో పర్యటించిన గవర్నర్‌కు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ డాక్టర్ పి.శబరిశ్, ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, డీఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో గవర్నర్ కార్యాలయ ప్రధాన కార్యదర్శి దానకిషోర్, సంయుక్త కార్యదర్శి భవానిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment