
కూరగాయలు, పండ్లు, పూల నిల్వ కోసం ‘కృషి కవచ్’!
ఇందులో పెడితే 30 రోజుల పాటు దెబ్బతినవు
రైతులతోపాటు వినియోగదారులు, వ్యాపారులకూ ప్రయోజనం
ఉద్యాన ఉత్పత్తుల వృథాకు చెల్లు చీటీ
రక్షణశాఖ విశ్రాంత శాస్త్రవేత్త రామకృష్ణ ఆవిష్కరణ
(సాక్షి స్పెషల్ డెస్క్): రక్షణశాఖలో ఆహార శాస్త్రవేత్తగా 34 ఏళ్లు పనిచేసి రిటైరైన డాక్టర్ ఎ.రామకృష్ణ ఉద్యాన పంటలు సాగుచేసే రైతులు, వ్యాపారులతోపాటు వినియోగదారులకు మేలు కలిగించే అద్భుత ఆవిష్కరణను వెలువరించారు. భారతీయ రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)కు అనుబంధంగా కర్ణాటకలోని మైసూర్‌లో ఉన్న రక్షణ ఆహార పరిశోధన ప్రయోగశాల (డీఎఫ్‌ఆర్‌ఎల్)లోని ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ప్యాకేజింగ్ విభాగంలో ఆయన సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేసి రిటైర్ అయ్యారు. మూడేళ్లుగా సొంతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలు, పూలు ఎక్కువకాలం దెబ్బతినకుండా ఉండేలా, పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేందుకు దోహదపడేలా వినూత్న ప్యాకేజింగ్‌తో ‘కృషి కవచ్’కవర్లను అభివృద్ధి చేశారు.
పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో..
పోలియాక్టిక్ యాసిడ్, చెరుకు పిప్పి వంటి స్థానికంగా చవకగా లభించే సేంద్రియ పదార్థాలను ఉపయోగించి కృషి కవచ్ కవర్లను రూపొందించినట్టు రామకృష్ణ వెల్లడించారు. ‘‘కూరగాయలు, పండ్లు, పూలను కృషి కవచ్ కవర్లలో ఉంచితే చాలు. రిఫ్రిజిరేషన్ అవసరం లేదు. సాధారణ గది వాతావరణంలో ఉంచినా.. నెల రోజుల వరకు బాగుంటాయి.
వడలిపోవు. కుళ్లిపోవు. అర కిలో నుంచి వంద కిలోల వరకు అవసరం మేరకు కృషి కవర్లను తయారు చేసుకోవచ్చు. రైతులు తమ ఉత్పత్తులను కోసిన రోజే ఏదో ఒక ధరకు అమ్ముకోకుండా నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. రైతుల ఆదాయం పెరుగుతుంది. టోకు, చిల్లర వ్యాపారులతోపాటు విదేశాలకు ఎగుమతి చేసే వ్యాపారులకు కూడా కృషి కవచ్ కవర్లు ఉపయోగపడతాయి’’అని తెలిపారు. దీనిపై త్వరలో పేటెంట్ కోసం దరఖాస్తు చేస్తున్నట్టు చెప్పారు.
ఐఐహెచ్‌ఆర్‌తో త్వరలో ఒప్పందం..
ఐఐహెచ్‌ఆర్, యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్‌లోని గాంధీ కృషి విజ్ఞాన కేంద్రంలో ‘కృషి కవచ్’టెక్నాలజీని పరీక్షించి చూశారని రామకృష్ణ తెలిపారు. ఈ టెక్నాలజీని ప్రజలకు అందించే క్రమంలో ఐఐహెచ్‌ఆర్‌తో త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ టెక్నాలజీని ఐఐహెచ్‌ఆర్ అందిస్తుందని వెల్లడించారు.
ఇది అనవసరపు నష్టం..
రైతులు ఆరుగాలం కష్టించి పండిస్తున్న పండ్లు, కూరగాయలను తోటలో కోసినప్పటి నుంచి మన నోటికి చేరేసరికే సగటున 25–30% వరకు పాడైపోతున్నాయి. సరైన రవాణా, నిల్వ సదుపాయాలు లేకపోవడమే దీనికి కారణం. దీనివల్ల అనవసరంగా జరుగుతున్న నష్టం ఏటా రూ.1,52,790 కోట్లు అని అంచనా.
ఇది అమృతం లాంటి పరిష్కారం..
కూరగాయలు, పండ్లు, పూలను సాధారణ వాతావరణంలోనే 30 రోజులపాటు చెక్కు చెదరకుండా నిల్వ ఉంచే అద్భుత ఆవిష్కరణ అందుబాటులోకి వచ్చింది. మైసూరుకు చెందిన ఓ విశ్రాంత శాస్త్రవేత్త ఈమేరకు ప్రత్యేకమైన కవర్లను రూపొందించారు. పర్యావరణహిత పదార్థాలతో ఈ ‘మోడిఫైడ్ ఎటా్మస్ఫియర్ ప్యాకేజింగ్ (మాప్)’ కవర్ల తయారీ సాంకేతికతను ఆవిష్కరించటం విశేషం. బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ (ఐఐహెచ్‌ఆర్) ద్వారా ఈ సాంకేతికత త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.
వృథా అవుతున్న పండ్లు, కూరగాయలు: 25 30%
ఈ నష్టం విలువ సుమారు: రూ.1,52,790 కోట్లు
⇒ మన దేశంలో ఏటా 1,132 లక్షల టన్నుల పండ్లు, 2,146 లక్షల టన్నుల కూరగాయలు, 36 లక్షల టన్నుల పూలు ఉత్పత్తి అవుతున్నాయి.
⇒ కూరగాయల్లో.. బంగాళదుంపలు 30–40%, టమాటాలు 5–47%, ఉల్లిపాయలు 25–40%, వెల్లుల్లి 8–22%, క్యాబేజీ, కాలీఫ్లవర్ 7–25%, మిరపకాయలు 4–35%, క్యారట్ 5–9% శీతల సదుపాయాల్లేక పాడైపోతున్నాయి.
⇒ పండ్లలో.. ద్రాక్ష 27%, అరటి 20–28%, బత్తాయి, నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు 20–95%, యాపిల్స్ 14%, అవకాడోలు 43% దెబ్బతింటున్నాయి.
‘కృషి కవచ్’ పనిచేసేదిలా..
‘‘సాధారణంగా పండ్లు, కూరగాయలను చెట్ల నుంచి కోసిన తర్వాత ఆక్సిడేటివ్ మెటబాలిజం ద్వారా వాటిలో మార్పులు జరుగుతాయి. సేంద్రియ పదార్థాలు విచ్చిన్నమవుతూ ఉంటాయి. శీతల ప్రదేశంలో ఉంచకపోతే ఈ ప్రక్రియ వేగంగా సాగి.. అవి వడలి, కుళ్లి పాడైపోతాయి. ‘కృషి కవచ్’కవర్లలోకి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, ఇౖథెలిన్ వంటి వాయువులు కొంతమేర ఇటూ ఇటూ పారాడేందుకు వీలుంటుంది. ఇందులో నీటి ఆవిరి ఏర్పడదు.
దీనితో ఆహార ఉత్పత్తులు సెకండరీ ప్యాకేజింగ్ అవసరం లేకుండానే 30 రోజుల వరకు తాజాగా ఉంటాయి. సూక్ష్మజీవులు, ఫంగస్‌లు కూడా ఆశించవు. ఈ కవర్లను తిరిగి వాడొచ్చు, కంపోస్టు చేయవచ్చు. 25–30శాతంగా ఉన్న ఉద్యాన ఉత్పత్తుల వృథాను అరికట్టడం ద్వారా గణనీయమైన ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు చేకూరుతాయి.
కృషి కవచ్ కవర్ల ద్వారా ఆహార వృథాను అరికట్టడంతోపాటు వ్యాల్యూ యాడెడ్ చర్యల ద్వారా దేశ జీడీపీని 3శాతం మేరకు పెంచుకోవచ్చు. – డాక్టర్ ఎ.రామకృష్ణ, విశ్రాంత శాస్త్రవేత్త, ‘కృషి కవచ్’ ఆవిష్కర్త, మైసూరు
Comments
Please login to add a commentAdd a comment