అరవై ఏళ్లుగా రైతులకు సేవలందిస్తూ...
అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాల సృష్టి
కళాశాల నుంచి వ్యవసాయ పరిశోధనల వరకూ..
నేడు, రేపు కార్యక్రమాలు.. హాజరుకానున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయంలో నిత్య పరిశోధనలు..వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, శాస్త్రవేత్తలను అందించడం.. ఇలా అనేక రకాలుగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 20, 21 తేదీల్లో వజ్రోత్సవాలు జరగనున్నాయి.
వ్యవసాయ కళాశాల నుంచి జయశంకర్ వర్సిటీ దాకా..
దేశ తొలిప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ మార్గదర్శకంలో వ్యవసాయ విద్య ఆలోచనలకు తొలిబీజం పడింది. 1955 జనవరి 6న అప్పటి భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజేంద్రనగర్‌లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 1964 జూన్ 12న వ్యవసాయ కళాశాల ప్రారంభం కాగా, 1965 మార్చి 20న అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీదుగా వర్సిటీని రైతులకు అంకితం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రారంభమై..1996లో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు మార్చుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెపె్టంబర్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అవతరించింది.
» ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 11 కళాశాలలు, 12 వ్యవసాయ పాలిటెక్నిక్, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, 12 వ్యవసాయ పరిశోధన స్థానాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు , 9 ఏరువాక కేంద్రాలు కొనసాగుతున్నాయి.
» అరవై ఏళ్ల వర్సిటీ ప్రస్థానంలో వ్యవసాయవిద్యలో సుమారు 32,300 మంది విద్యార్థులు డిగ్రీలు, 12,300 మంది పాలిటెక్నిక్ పట్టాలు సాధించారు. ఇంకా 9,500 మంది విద్యార్థులు వ్యవసాయశాస్త్రంలో పీజీ, 1500 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పూర్తి చేశారు.
నూతన వంగడాల సృష్టి.. పరిశోధనలు
వరి, మొక్కజొన్నతోపాటు 50కిపైగా పంటల్లో దాదాపు 500 నూతన రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. 1968లో వర్సిటీ భాగస్వామ్యంతో అఖిల భారత వరి సమన్వయ పరిశోధన సంస్థ ద్వారా తొలిసారిగా వరిలో అధిక దిగుబడి ఇచ్చే ‘జయ’అనే సంకర జాతి తొలి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు.
నాటి నుంచి స్వర్ణ, బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, తెలంగాణ సోనా ఇలా వరి ఎన్నో రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ ఏడాది అధిక దిగుబడి ఇచ్చే ఎక్స్‌ట్రా ఎర్లీ రకం కంపసాగర్ వరి 6251 (కేపీఎస్ 6251)ని విడుదల చేసింది.
» దేశవ్యాప్తంగా వరిసాగులో ఈ వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు 25 శాతం దాకా ఉన్నాయి. 12 రాష్ట్రాలలో 12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడి వరి వంగడాలే సాగవుతున్నాయి.
» దేశవ్యాప్తంగా మొక్కజొన్న విస్తీర్ణంలో 10–12శాతం వరకూ ఇక్కడి సంకర రకాలే సాగవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధి చేసిన దాంట్లో హైబ్రిడ్ రకాలైన డీహెచ్‌ఎం–115, 117, 121 ఉన్నాయి.
» వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో చేసిన 23 ఆవిష్కరణలకు పేటెంట్లు సైతం సొంతం చేసుకుంది.
వజ్రోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
వజ్రోత్సవాల ఏర్పాట్లలోగురువారం రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీ రైతుమేళా ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌తోపాటు ఆడిటోరియంను తుమ్మల పరిశీలించారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment