
ఏప్రిల్ నెలలోనే రెవెన్యూశాఖలో కీలక మార్పులు
ధరణి స్థానంలో అమల్లోకి రానున్న భూభారతి
రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు ఈ నెలలోనే శ్రీకారం
ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తేనున్న ప్రభుత్వం
హైదరాబాద్ పరిసర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తొలుత పైలట్ పద్ధతిలో అమలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల..రాష్ట్ర రెవెన్యూ శాఖలో కీలక మార్పులకు వేదిక కాబోతోంది. రాష్ట్రంలో అధికార మార్పిడికి కారణమైందని భావిస్తున్న ధరణి చట్టం ఏప్రిల్‌లోనే చరిత్రగా మిగిలిపోనుంది. వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ధరణి స్థానంలో ‘భూభారతి’చట్టం అమల్లోకి రానుంది. ఉగాది నుంచే భూభారతి చట్టాన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం భావించినా, ఏప్రిల్ రెండో వారం తర్వాత అమల్లోకి రానుందని సమాచారం. ఇప్పటికే న్యాయశాఖ నుంచి కూడా భూభారతి మార్గదర్శకాలకు క్లియరెన్స్ వచి్చందని, సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలన అనంతరం ఈసారి జరగబోయే కేబినెట్‌లో ఆమోదం తీసుకొని అమల్లోకి తెస్తామని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.
భూభారతి పైలట్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా
భూభారతి చట్టంలో పొందుపరిచే మార్గదర్శకాలకు అనుగుణంగా జరగాల్సిన అన్ని కార్యకలాపాలను నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పైలట్‌గా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చేపట్టిన భూభారతి ప్రాజెక్టు ద్వారా ఆ జిల్లాలోని 922 గ్రామాల్లో ఉన్న దాదాపు 14 లక్షల ఎకరాల భూమి వివరాలను డిజిటలైజ్ చేసే ప్రయత్నం జరిగింది. జిల్లాలోని 914 గ్రామాల్లో భూముల సర్వే కూడా పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో కొత్తగా అమల్లోకి రానున్న భూభారతి చట్టం మార్గదర్శకాలను కూడా పూర్తిస్థాయిలో ఈ జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పైలట్ పద్ధతిలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే సర్వే మ్యాపింగ్, అవసరమైన మేరకు సర్వేయర్ల నియామకం లాంటి కీలక చర్యలు కూడా ఈ పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని రెవెన్యూ శాఖ యోచిస్తోంది. అయితే, కేబినెట్ ఆమోదం పొందిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా చట్టం అమల్లోకి వస్తుందని, చట్టం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అమలు చేసే ప్రక్రియ మాత్రం పైలట్ పద్ధతిలో నిజామాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో చేపడతామని, అక్కడి అనుభవాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతిని పకడ్బందీగా అమలు చేసేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
రిజిస్ట్రేషన్లు ఇక ఈజీ
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలోనూ ఏప్రిల్ నెలలోనే కీలక మార్పులు జరగనున్నాయి. వ్యవసాయేతర భూముల క్రయవిక్రయ లావాదేవీల కోసం ఇప్పటికే ఆన్‌లైన్ విధానం అమల్లో ఉన్నా, ఎక్కువగా మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను సులభతరం చేసేందుకుగాను ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని విస్తృతంగా అమల్లోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనతోపాటు ఈజీ రిజిస్ట్రేషన్లు జరిగేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు ఆయన శ్రీకారం చుడుతున్నారు.
ఈ క్రమంలోనే ఏప్రిల్ నెలలో హైదరాబాద్ పరిసర సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టు కింద అమల్లోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 90 శాతం లావాదేవీలు ఆన్‌లైన్ స్లాట్స్ ద్వారా, 10 శాతం మాత్రమే మాన్యువల్ పద్ధతిలో జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా 10 నిమిషాల్లో పూర్తయ్యేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ మార్పులు కూడా జరుగుతున్నాయి. ఇక, వీలును బట్టి ఈ నెలలో రాష్ట్రంలో భూముల విలువల సవరణ ప్రక్రియ కూడా చేపట్టే అవకాశాలున్నాయని, ధరణి పోర్టల్‌ను ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయడం కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుందని, ఇందుకోసం పలు ఐటీ కంపెనీలతో రెవెన్యూ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నాయని తెలుస్తోంది.