
వారసత్వ హక్కుల బదలాయింపుపై రెవెన్యూ శాఖ స్పష్టత
పాస్‌బుక్ ఉంటే తహసీల్దార్ స్థాయిలోనే పరిష్కారం
పాస్‌బుక్ లేకపోతే తొలుత దరఖాస్తు చేసుకునేందుకే అవకాశం
దరఖాస్తుపై తహసీల్దార్ నివేదిక మేరకు ఆర్డీవో అనుమతి
సాక్షి, హైదరాబాద్: భూభారతి చట్టం ద్వారా వారసత్వ హక్కుల బదలాయింపు (విరాసత్) విషయంలో రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చిoది. విరాసత్ ప్రక్రియ పూర్తి చేసే విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను పేర్కొంటూ అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీపీఎల్‌ఏ) కార్యాలయం సర్క్యులర్ పంపింది.
ఈ సర్క్యులర్ ప్రకారం.. వారసత్వ హక్కుల బదిలీ కోరే సమయంలో ఆ భూమికి పాసు పుస్తకం ఉన్నట్టైతే తహసీల్దార్ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. పాసు పుస్తకం లేని పక్షంలో తహసీల్దార్ నివేదిక మేరకు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సీసీఎల్‌ఏ పంపిన ఆర్‌వోఆర్/3069215/2025 సర్క్యులర్ ప్రకారం విరాసత్ ప్రక్రియను ఇలా పూర్తి చేయాల్సి ఉంటుంది.
పాసు పుస్తకం ఉంటే
» విరాసత్ ప్రక్రియ కోసం భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
»ఆపరేటర్ లాగిన్‌లో దరఖాస్తుదారుల బయోమెట్రిక్ తీసుకుని సదరు దరఖాస్తును తహశీల్దార్‌కు పంపుతారు.
»ఈ వారసత్వ హక్కుల బదిలీ కోసం సంబం«దీకులకు తహసీల్దార్ నోటీసులు జారీ చేస్తారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం ఆ దరఖాస్తును తహసీల్దార్ పరిశీలిస్తారు. సంబంధీకుల నుంచి అభ్యంతరాలు వచ్చి ఉంటే వాటిపై విచారణ జరుపుతారు. అన్నీ సక్రమంగా ఉంటే డిజిటల్ సిగ్నేచర్ అనంతరం మ్యుటేషన్ ప్రక్రియను తహసీల్దార్ పూర్తి చేస్తారు.
పాసు పుస్తకం లేకపోతే
»విరాసత్ ప్రక్రియ కోసం తొలుత భూభారతి పోర్టల్ ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
»భూభారతి పోర్టల్ ద్వారా వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆర్డీవో నోటీసులు ఇస్తారు. వీటిని తహసీల్దార్ ద్వారా సంబందీకులకు పంపి అభ్యంతరాలను కోరతారు.
»నోటీసు గడువు ముగిసిన తర్వాత తహసీల్దార్ విచారణ జరిపి తన నివేదికను ఆర్డీవోకు పంపుతారు. ఈ నివేదిక ఆధారంగా సదరు విజ్ఞప్తిని ఆర్డీవో ఆమోదిస్తారు. ఒకవేళ ఆధారాలు సక్రమంగా లేకపోతే తిరస్కరిస్తారు. సదరు విజ్ఞప్తిని ఆమోదించేందుకు లేదంటే తిరస్కరించేందుకు గల కారణాలను కూడా తన ఉత్తర్వుల్లో ఆర్డీవో పేర్కొనాల్సి ఉంటుంది.
»సదరు విజ్ఞప్తిని ఆర్డీవో ఆమోదించిన పక్షంలో దరఖాస్తుదారులు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
»అప్పుడు దరఖాస్తు ఆపరేటర్ లాగిన్‌కు వెళుతుంది. తర్వాత దరఖాస్తుదారుల బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు.
»అనంతరం మళ్లీ సంబం«దీకులకు నోటీసులు పంపి అభ్యంతరాలను కోరతారు. నోటీసు గడువు ముగిసిన అనంతరం ఈ అభ్యంతరాలను తహసీల్దార్ పరిశీలించి మరోమారు విచారిస్తారు.
»అప్పుడు అన్నీ సక్రమంగా ఉంటే డిజటల్ సిగ్నేచర్ చేసి తహసీల్దార్ మ్యుటేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.