
భూ భారతి పోర్టల్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
యూజర్లు అడిగే ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానం
ధరణిలో ముందుగానే సిద్ధంచేసిన ప్రశ్నలు, జవాబులు
కొత్త పోర్టల్‌లో ప్రతి ప్రశ్నకు కొత్తగా జవాబివ్వనున్న భూమిత్ర
గోప్యతకు చెక్.. భూ వివరాలన్నీ బహిరంగమే
ధరణి రికార్డులే భూభారతిలోకి బదిలీ.. త్వరలో కొత్త పోర్టల్
కొత్త పోర్టల్ రూపకల్పనపై సీఎం రేవంత్ సమీక్ష
రాష్ట్రంలో భూ లావాదేవీలకు సంబంధించి ధరణి స్థానంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్‌లో కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించనున్నారు. ఏఐ సహకారంతో ఈ పోర్టల్‌లోని ఒక విభాగాన్ని నిర్వహించనున్నారు. ధరణిలో యూజర్ల సందేహాలను నివృత్తి చేసేలా ముందుగానే రూపొందించిన ప్రశ్నలు, సమాధానాలు అందుబాటులో ఉండేవి.
భూ భారతిలో యూజర్ల ప్రశ్నలకు అప్పటికప్పుడు సమాధానమిచ్చేలా చాట్ బాట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. హెల్ప్ డెస్క్ కింద ఈ చాట్‌బాట్‌ను వినియోగించనున్నారని తెలుస్తోంది. యూజర్ ఏ ప్రశ్న అడిగినా సరైన సమాధానమిచ్చేలా ‘భూమిత్ర’పేరుతో హెల్ప్ డెస్క్‌ను రూపొందిస్తున్నారు. భూముల వివరాలు, లావాదేవీల నిర్వహణలో వచ్చే సందేహాలను నివృత్తి చేసేలా ఏఐని వినియోగించనున్నట్టు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. – సాక్షి, హైదరాబాద్
కొత్త పోర్టల్‌లో పాత రికార్డులే..
ధరణి పోర్టల్‌లో నమోదైన భూ రికార్డులను యథాతథంగా భూభారతి పోర్టల్‌లోకి బదిలీ చేస్తున్నట్లు అధికారులు తెలిపా రు. కొత్త రికార్డులేవీ రాయడం లేదని చెబుతున్నారు. ఇప్ప టికే పాత రికార్డుల్లో సరిగ్గా ఉన్న వివరాలు అలాగే ఉంటాయ ని, తప్పుగా నమోదైన వివరాలను సరిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందు కోసం ధరణిలో ఉన్న 35 మాడ్యూళ్ల స్థానంలో 6 మాడ్యూళ్లను మాత్రమే భూభారతిలో అందుబాటులోకి తేనున్నారు. ధరణిలో చాలా మాడ్యూళ్లు ఉండడంతో రైతులకు దేని ద్వారా దరఖాస్తు చేసుకోవాలో అర్థమయ్యేది కాదని, ఇప్పుడు సులభంగా దరఖాస్తు చేసుకు నేలా అన్ని సమస్యలను ఆరు మాడ్యూళ్ల ద్వారానే పరిష్కరించే ఏర్పాట్లు చేశామని రెవెన్యూ వర్గాలంటున్నాయి.
ఆటంకం లేకుండా రిజిస్ట్రేషన్లు
ధరణి నుంచి భూభారతి పోర్టల్‌కు మారుతున్న సందర్భంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రి యకు ఎలాంటి ఆటంకం ఉండదని, యథాతథంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతా యని రెవెన్యూ శాఖ వర్గాలు తెలిపాయి. గతంలో ధరణి పోర్టల్ అందుబాటు లోకి తెచ్చే సమయంలో 100 రోజులకు పైగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ను నిలిపివేశారు. ఇప్పుడు ఓ వైపు క్రయవిక్రయ లావాదేవీలను కొనసాగిస్తూనే మరోవైపు పోర్టల్‌ను బలోపేతం చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు వెల్లడించాయి.
ఇప్పటివరకు ప్రైవసీ ఆప్షన్ కింద కొన్ని భూముల వివరాలను ప్రజలందరికీ అందుబాటులో ఉండకుండా దాచారు. అలా కాకుండా భూభారతిలో రాష్ట్రంలోని ప్రతి ఎకరా భూమికి సంబంధించిన వివరాలను నమోదు చేశారు. భూమి పట్టాదారు ఎవరు? ఎవరి నుంచి, ఎంత భూమిని, ఎవరు కొనుగోలు చేశారు? ఆ భూమిపై హక్కులు ఏ విధంగా సంక్రమించాయి? అనే పూర్తి వివరాలు ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్రస్తుత పోర్టల్ తాత్కాలికమే
ప్రస్తుతం అమల్లోకి తెస్తున్న భూభారతి పోర్టల్ తాత్కాలికమేనని అధికారులు తెలిపారు. ధరణి ఆనవాళ్లు లేకుండా కొత్త పోర్టల్‌ను రూపొందించనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం అవసర మైన చర్యలు తీసు కోవాలని ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత అధికా రులను ఆదేశించినట్టు తెలసింది. నేటి నుంచి అమల్లోకి రానున్న భూభారతి పోర్టల్ లోగో, డిజైన్‌పై ఆదివారం తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు.
ఈ సమీక్షలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ కె. రఘువీర్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివా సులు, సీసీఎల్‌ఏ నవీన్ మిత్తల్, సీసీఎల్‌ఏ కార్యదర్శి మకరంద్, భూచట్టాల నిపుణుడు భూమి సునీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సామాన్య రైతుకు కూడా అర్థమయ్యే భాషలో భూభారతి వెబ్‌సైట్ ఉండాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని, భూ రికార్డులకు ఎలాంటి సమస్యలు రాకుండా పకడ్బందీ ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
కొత్త పోర్టల్‌ను డిజైన్ చేసి నిర్వహించే బాధ్యతను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని అన్నారు. కనీసం వందేళ్లపాటు వినియోగంలో ఉండేలా పోర్టల్‌ను రూపొందించాలని ఆదేశించారు. కాగా, సోమవారం సాయంత్రం శిల్పారా మంలో జరిగే కార్యక్రమంలో భూభారతి పోర్టల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. అంతకుముందు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమవుతారు.