
తెలంగాణ వాడకం 27.8 శాతమే
66:34 నిష్పత్తిలో పంపిణీ జరిపినా తెలంగాణకు 68 టీఎంసీల నష్టం
50:50 నిష్పత్తిలో పంపిణీ చేస్తే 235 టీఎంసీల నష్టం
కృష్ణా బోర్డు గణాంకాలతో నీటిపారుదల శాఖ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత నీటి సంవత్సరం (2024–25)లో ఏపీ, తెలంగాణ మొత్తం 990.38 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకోగా, అందులో ఏకంగా 72.2 శాతం (715.03 టీఎంసీలు) ఏపీ వాడుకుంది. తెలంగాణ 275.35 టీఎంసీల (27.8 శాతం)ను మాత్రమే వినియోగించుకోగలిగింది. రెండు రాష్ట్రాల వాడకంపోగా, ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో కనీస నిల్వ మట్టానికి(ఎండీడీఎల్) ఎగువన 9.17 టీఎంసీలతోపాటు ఇతర జలాశయాల్లో మరో 43.94 టీఎంసీలు కలిపి మొత్తం 53.12 టీఎంసీలే మిగిలి ఉన్నాయి.
ఈ లెక్కన ప్రస్తుత నీటి సంవత్సరంలో మొత్తం 1043.5 టీఎంసీల జలాల లభ్యత ఉందని కృష్ణా బోర్డు తేల్చింది. గత సోమవారం నాటికి రెండు రాష్ట్రాలు వాడిన కృష్ణా జలాలకు సంబంధించి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) రూపొందించిన గణాంకాలతో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈమేరకు ఓ నివేదిక తయారుచేసింది.
50:50 నిష్పత్తిలో అయితే..
ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పెండింగ్‌లో ఉంది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరుగుతుండగా, 50:50 నిష్పత్తిలో పంపకాలు జరపాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది.
అలా అయితే, 1043.5 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణకు చెరో 521.75 టీఎంసీల హక్కులుంటాయి. దీంతో కృష్ణా జలాల్లో తెలంగాణకు ఇంకా 246.4 టీఎంసీల వాటా మిగిలి ఉంటుంది. ఏపీ వాటికి మించి 235.01 టీఎంసీలను వాడుకోవడంతో ఆ మేరకు నీటి వాటాను తెలంగాణ నష్టపోయింది.
66:34 నిష్పత్తిలో తెలంగాణకి 68 టీఎంసీల నష్టం
తాత్కాలిక సర్దుబాటు ప్రకారం 66:34 నిష్పత్తిలో పంపకాలు జరిపినా 1043.5 టీఎంసీల్లో ఏపీకి 688.714 టీఎంసీలు, తెలంగాణకి 354.79 టీఎంసీల వాటా లభించాలి. ఈ లెక్కన తెలంగాణ ఈ ఏడాది వాడుకున్న జలాలు పోగా ఇంకా 77.22 టీఎంసీలను వాడుకోవడానికి హక్కు కలిగి ఉండనుంది.
ఏపీ వాటాకి మించి 68.05 టీఎంసీలను వాడుకోవడంతో తెలంగాణ ఆ మేరకు నీటి వాటాను కోల్పోయింది. ఉమ్మడి జలాశయాల్లో మిగిలి ఉన్న మొత్తం 9.17 టీఎంసీలను తెలంగాణకే కేటాయించినా హక్కుగా లభించాల్సిన వాటాల్లో మరో 68.05 టీఎంసీల లోటును రాష్ట్రం ఎదుర్కోనుంది.
పోతిరెడ్డిపాడు నుంచి 208 టీఎంసీల మళ్లింపు
శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 208.64 టీఎంసీలు, మల్యాల లిఫ్టు ద్వారా 28.36 టీఎంసీలు, మల్యాల నుంచి కేసీ కాల్వకి 1.19 టీఎంసీలు, ముచ్చుమర్రి లిఫ్టు ద్వారా 3.49 టీఎంసీలు, చెన్నైకి నీటి సరఫరాకి 1.88 టీఎంసీలు కలిపి ఏపీ మొత్తం 243.58 టీఎంసీలను వాడుకుంది.
ఇక నాగార్జునసాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 29.45 టీఎంసీలు, కుడి కాల్వ ద్వారా 188.16 టీఎంసీలు కలిపి మరో 217.62 టీఎంసీలను ఏపీ వాడుకుంది. ఇలా ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఏపీ మొత్తం 715.03 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకున్నట్టు బోర్డు లెక్క గట్టింది.
అరకొరగానే తెలంగాణ వాడకం
శ్రీశైలం నుంచి కల్వకుర్తి లిఫ్టు ద్వారా 46.75 టీఎంసీలు, చెన్నైకి నీటి సరఫరాకి 0.94 టీఎంసీలు కలిపి మొత్తం 47.69 టీఎంసీలను మాత్రమే తెలంగాణ వాడుకుంది. సాగర్ నుంచి ఏఎమ్మార్పీ ప్రాజెక్టు అవసరాలకు 41.42 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 115.48 టీఎంసీలు, తాగునీటి అవసరాలకు 14.37 టీఎంసీలు కలిపి మొత్తం 171.28 టీఎంసీలను రాష్ట్రం వాడుకుంది. జూరాల ప్రాజెక్టు నుంచి మరో 42.25 టీఎంసీలు, ఇతర ప్రాజెక్టుల నుంచి మరో 8.42 టీఎంసీలు కలిపి ఈ ఏడాది తెలంగాణ మొత్తం 275.35 టీఎంసీలను మాత్రమే వాడుకోగలిగింది.