
సాగర్ నుంచి తీసుకుంటున్న నీటిని 7వేల క్యూసెక్కులకు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ కుడి ప్రధాన కాల్వ ద్వారా ఏపీ తీసుకుంటున్న జలాలను తక్షణమే 7 వేల క్యూసెక్కులకు తగ్గించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. అలాగే శ్రీశైలం జలాశయం నుంచి తీసుకుంటున్న జలాలను కూడా ఆ రాష్ట్రం తక్షణమే తగ్గించాలని, కేవలం తాగునీటికి అవసరమైన కనీస జలాలను మాత్రమే తీసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రస్తుత సంవత్సరంలో ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలు వాడుకుందని, ఇకపై శ్రీశైలం, సాగర్ నుంచి ఆ రాష్ట్రం నీళ్లు తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. బోర్డు ఈ మేరకు ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్ నీటి వినియోగానికి సంబంధించి ఓ రాష్ట్రంపై కృష్ణా బోర్డు ఆంక్షలు విధించడం ఇదే తొలిసారి అని అధికారవర్గాలు తెలిపాయి.
గతంలో కేవలం జల విద్యుత్‌ను నియంత్రించాలని కోరుతూ మాత్రమే కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు లేఖలు రాసిందని వెల్లడించాయి. శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలను రెండు రాష్ట్రాలకు కేటాయించే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు.
ఈ నెల 24న జలసౌధలో నిర్వహించిన అత్యవసర సమావేశంలో పై ఆదేశాలకు సంబంధించి కేఆర్‌ఎంబీ కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్, ఏపీ తరఫున ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే..
ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 834 అడుగులకు ఎగువన కేవలం 24 టీఎంసీల నీటి లభ్యత ఉండగా, సాగర్ ఎండీడీఎల్ 510 అడుగులకు ఎగువన 42.3 టీఎంసీలే లభ్యతగా ఉన్నాయని కృష్ణా బోర్డు తెలిపింది. ప్రస్తుతం తీవ్ర నీటి కొరత ఉన్న నేపథ్యంలో తాగునీటి అవసరాల కోసం రెండు జలాశయాల్లో నిల్వలను వచ్చే వేసవి ముగిసే వరకు లేదా జూలై 31 వరకు సంరక్షించాలని నిర్ణయించింది. తాగునీటి అవసరాలు తీరిన తర్వాతే మిగిలే జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సాగునీటి అవసరాలకు కేటాయిస్తామని స్పష్టం చేసింది.
నేడు కేటాయింపులపై కీలక సమావేశం
తెలంగాణ నీటిపారుదల శాఖ నల్లగొండ సీఈ, ఏపీ జలవనరుల శాఖ ఒంగోలు సీఈలు.. శ్రీశైలం, సాగర్ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసి ఈ నెల 25లోగా సమర్పించాలని కృష్ణా బోర్డు ఆదేశించింది. ప్రస్తుత ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఉండనున్న సాగునీటి, జూలై 31 వరకు ఉండనున్న తాగునీటి అవసరాల వివరాలు ఈ ప్రణాళికలో ఉండాలని కోరింది. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు జలసౌధలో సమావేశమై, సదరు ప్రణాళిక ఆధారంగా శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment